గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, ఏప్రిల్ 2018, శనివారం

శ్రీమన్నారాయణ శతకము. 2/20వ భాగము. 6 నుండి 10 రచన చింతా రామకృష్ణారావు

జైశ్రీరామ్
శ్రీమన్నారాయణ శతకము.
రచన. చింతా రామకృష్ణారావు
6. శా. నిన్నుం గాంచిరి ధీనిధుల్ జగమునన్ నిత్యాత్ముఁగా నేర్పుతోన్
గన్నుల్ వేయిగ, కాళ్ళు వేయి, శిరముల్ గాంచంగ వేయుండుటన్,
సున్నాయౌ పరి పూర్ణమందు నిను దాసుల్గాంచినారయ్య! శ్రీ
మన్నారాయణ! చూతునన్నిట నినున్ మన్నించి నిన్ గాంచనీ.  
భావము.   శ్రీమన్నారాయణా! ధీ నిధులు నిన్ను నిత్యాత్మునిగా లోకములో వేయి కన్నులుగ,
పాదములు వేయిగా వేయి శిరములుగా నీకు ఉండుట. శూన్యమయిన ఆకారములో పరిపూర్ణ
స్వరూపుడుగా నీ దాసులు నిన్ను నైపుణ్యముతో చూడఁగలిగిరి. నిన్ను నేను
అన్నింటియందును చూతును. నన్ను మన్నించి నిన్ను చూడనిమ్ము.

7. శా. మన్నున్ దింటివటంచు తల్లి నిను ప్రేమన్ వీడి చూపించు మో
యన్నా యంచును తిట్టినంతటనె మోహబ్రాంతులన్ బాపుచున్
నిన్నున్నట్టిజగమ్ము చూపితివిగా! కృష్ణుండుగా నీవు. శ్రీ
మన్నారాయణ! మేము కూడ కనలే మా చూపరావేలరా?    
భావము.   శ్రీమన్నారాయణా! నేవు కృష్ణుఁడుగా ఉన్నప్పుడు నీ తల్లి నీవు మన్ను తింటివని ప్రేమనుకూడా విడిచిపెట్టి నిన్ను ఏదీ నీ నోరు చూపించు అని కోపగించి పలుకగా ఆమెలో ఉన్న
మోహభ్రాంతులను పోగొట్టుచు నీలో ఉన్న సమస్త విశ్వమును చూపితివికదా. మేము
మాత్రము నీవు ఆవిధముగా చూపినచో చూడలేమా యేమి. మై మాకు చూపుటకు
నీవేలరాకుంటివి?

8. శా. మున్నే నిన్ను మనమ్మునన్ మననమున్ మన్నించి మున్నుంచినన్
నన్నున్, నానిను నెన్నునాన్ననుననూనా! మున్నె రక్షించు నీ
కన్నా రక్షకు లెవ్వరయ్య. మనమున్ కాచేటి మా దేవ! శ్రీ
మన్నారాయణ! పాహిపాహి జగతిన్ మన్నించి రక్షింపుమా!   భావము.  అనూనమైన శ్రీమన్నారాయణాఇతః పూర్వమే నిన్ను మనసులో మన్నించి ముందుగా నిలిపిన నన్ను నాకు సంబంధించిన నిన్ను, గుర్తించెడి నా యొక్క అన్నను ముందుగానన్ను రక్షించునటువంటి నీకన్నారక్షకులింకెవరు? మనసుపెట్టి కాపాడేటువంటి మా దేవా! లోకమునుమన్ననఁ జేయుచు బాగుగా రక్షింపుము.

9. శా. ఉన్నావీవు హృదంతరాళమున స్నేహోదార సంపత్ప్రభన్,
పిన్నన్, నేఁ నఁ జాలుదెట్లు నిను? గోపీనాథ! యంతర్ముఖుం
డెన్జాలు నినున్, శుభాస్పదుఁ! నీవే నన్ను దర్శించు. శ్రీ
మన్నారాయణ! పూజ్య పాద జలజా! మాం పాహి సర్వేశ్వరా! 
భావము.    శ్రీమన్నారాయణా! నీవు నా హృదంతరాళమున స్నేహోదార సంపత్ప్రభతో కొలువై  యున్నావు. నేను చిన్నవాడిని. నిన్ను విధముగ చూడఁగలనుఅంతర్ముఖుఁడైనవాఁడు నిన్ను గుర్తించగలడు. శుభాస్పదుఁడా! నీవే నన్ను దర్శించుకొనుము. పూజ్య పాదపద్మములు కలవాడా! సర్వేశ్వరా! నన్ను రక్షించుము.

10. శా. మిన్నున్ గాంచిన నీవె నిండితివటన్ కృష్ణా! జగత్ కారకా!
మన్నున్ గాంచిననుంటివీవె యచటన్  మాదేవరా! యెట్లు నీ
వున్నావన్నిట నెల్ల వేళలను ? నేనున్నా నిటన్ జూడు శ్రీ
మన్నారాయణ! నీదు పాద యుగళిం భావింపఁగా చేయరా!  
భావము.   శ్రీమన్నారాయణా! జగత్కారకుడవైన శ్రీకృష్ణా! ఆకాశమును చూచినచో అక్కడ నీవే  నిండియున్నావు. భూమిని చూచినను అక్కడ కూడా నీవే నిండియున్నావు. మా దైవమాఅన్ని సమయములందును అన్ని ప్రదేశములయందునుఏ విధముగా నీవుంటివి? ఇక్కడనేనుంటిని. నన్ను చూడుము. నీ పాదద్వయమును నా మనమున భావించునట్లు చేయుము
                                                                  జైహింద్
  
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.