గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, ఏప్రిల్ 2018, సోమవారం

కవులు-పొగడ్తలు - చాటు పద్యము .. .. .. వివరణ. బ్రహ్మశ్రీ చొప్పకట్లత్యనారాయణ.

 జైశ్రీరామ్.
ఆర్యులారా!
కవులు-పొగడ్తలు  బ్రహ్మశ్రీ చొప్పకట్లత్యనారాయణ గారి వివరణ నాస్వాదించండి.
కవులు చిత్రమైనవారు.వారుఒకరినొకరుగౌరవించుకోవటంగూడావిచిత్రం!
ఒక మహా కవి మరో మహాకవిని పొగిడితే ?వినండియెలాఉంటుందో!
చ: మతి , ప్రభ , నీగి, పేర్మి , సిరి , మానము పెంపున ;భీమునిన్ ;బృహ
స్పతి , రవి ,కర్ణు , నర్జును , కపర్ది , సుయోధను , బోల్పఁబూన ; నా
మతకరి , తైక్ష్ణు , దుష్కులు , నమానుషు , భిక్షు , ఖలాత్ము నెంచ; వా
క్సతిపు , శశిన్ , శిబిన్ , గొమరుసామిని , మేరువు , నబ్ధి , బోల్చెదన్ !
----- చాటు పద్యము;

ఈపద్యంతో ఒకమహాకవి మరియొక మహాకవిగారికి వాక్సన్మానం జేస్తున్నారు. ఎంత గొప్పగా చెప్పారో గమనించండి. అర్ధం గావటం కొద్దిగా కష్టం. మనసు జేసికొని చదవాలి.
"ఈమహాకవి మతిలో బృహస్పతి, కాంతికి సూర్యుడు , దానంలో కర్ణుడు ,పేర్మి (గొప్పతనం) లో అర్జునుడు, సంపదలతో శంకరునివంటివాడు , అభిమానపుపెంపున సుయోధనుడు'- అని (యీభీమకవిని ) నేను చెప్పదలచుటలేదు. ఎందుకంటే?
ఆబృహస్పతి మొదలగువారిలో కొన్ని దోషాలున్నాయి. ఎలాగంటారా?
బుధ్ధికి బృహస్పతి యందామంటే అతడు వట్టి మాటకారిమాత్రమే తెలివి సున్న.తెలివైన వాడైతే పెళ్ళాన్ని చంద్రున కప్పగిస్తాడా? అందుచేత సాక్షాత్తు బ్రహ్మకు సమానుడనేయంటాను. తేజస్సులో సూర్యుని వంటివాడని నేను చెప్పను.సూర్యనికాంతిలో వేడిమి ఉంటుంది. అందుచేత యితనిని చల్లని వెన్నెలగురిసే చంద్రుడనే యంటాను. దానంలో యితనిని
కర్ణుడని నేననను. కర్ణుడు హీనకులజుడు. అందుచేత యితనిని శిబిగా భావిస్తాను. పరాక్రమంలో యితనిని క్రీడితో నేపోల్చను. ఎందుకంటే , అతడు నపుంసకుడు. కాబట్టి కుమారస్వామితో నే పోలిక చెపుతాను. సంపదల పెంపులో నితనిని శంకరునితో పోల్చను.ఎందుకంటే యెంతున్నా అతడు బిచ్చగాడే! అందువలన నేనితనిని మేరుపర్వతముతో సమానుడంటాను. అభిమానాధిక్యంలో నేనితనిని సుయోధనునకు సరియనను. ఎందుకంటే అతడు దుశ్చింతనాపరుడు(ఖలుడు) అందువలన నేనితనిని మహా గంభీరుడైన సముద్రునితో సమానుడంటాను.
' అని నన్నయ భట్టుగారు తనకు సమకాలికుడైన వేములవాడ భీమకవిని పొగడినారట! నిజమెంతో తెలియదుగాని, పద్యము మాత్రము పసందుగ నున్నది.
" క్రమాలంకారము" స్వస్తి!
సుహృజ్జన సమ్మాన్యులు శ్రీమాన్ సత్యనారాయణగారికి హృదయ పూర్వక అభినందనపూర్వక ధన్యవాదములు.
 జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ఒకవైపు పొగుడుతూనే మరొకవైపు నింద . అంటే బృహస్పతి ఎంత తెలివిగల వాడైనా , భార్యని చంద్రుడికి అప్పగించాడు .అల్లాగే ఎంత పరమేశ్వరుడైనా బిచ్చ మెత్తు కుంటాడు .ఇలాగే సూర్యుడూ మున్నగు వారిని నిందాస్తుతిచేత అద్భుతంగా వర్ణించిన శ్రీ చొప్పగట్ల సత్యనారాయణ గారు బహు శ్లాఘ నీయులు .శిరసాభి వందనములు .శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.