గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, మే 2016, బుధవారం

మానిషాద ప్రతిష్ఠాం . . .శ్లోకమున రామాయణం భావి కథా సూచి.

జైశ్రీరామ్.
వాల్మీకి నోటివెంట వెలువడ్డ ప్రప్రధమ శ్లోకమ్.
శ్లో. మానిషాద ప్రతిష్ఠాం త్వమగమ: శాశ్వతీస్సమా:
యత్ క్రౌంచ మిథునాదేకమ్ అవధీ: కామ మోహితమ్.
ప్రతిపదార్థము.
నిషాద! = ఓ బోయవాఁడా!
కామ మోహితమ్ = కామామోహితమై యున్నటువంటి
క్రౌంచ మిథునాత్ = క్రౌంచ పక్షుల జంట నుండి
ఏకమ్ = ఒకదానిని,
యత్ =  ఏ కారణము చేత
ఆవధీః = హతమార్చితివో,
తత్ = ఆ కారణము చేత,
త్వమ్ = నీవు,
శాశ్వతీ సమాః = ఎక్కువ సంవత్సరములు,
ప్రతిష్ఠామ్ = జీవించి యుండుట,
మా అగమః = ప్రాప్తించకుండును గాక.
భావము. ఓ బాయవాఁడా! కామ మోహితమై యున్న క్రౌంచ పక్షుల జంట నుండి ఒకదానిని ఏ కారణము చేత హతమార్చితివో, ఆ కారణము చేత నీవు ఎక్కువ సంవత్సరములు జీవించి య్ండుట ప్రాప్తించకుండును గాక.
ఇక ఈ శ్లోకమున భావి కథా సూచి ఏ విధముగ కలదో చూచెదము.
౧. మా - నిషాద = లక్ష్మీ దేవి అవతారమైన సీతా దేవిని చెటాఁబట్టిన ఓ రామా! ఈ పద ప్రయోగము సీతామ కల్యాణ ఘట్టమును కలిగిన బాల కాండ సూచితమగుచున్నది.
౨. ప్రతిష్ఠాం, త్వమ్, ఆగమః= పితృ వాక్య పరిపాలనమొనర్చి నీవు జగద్విఖ్యాతి పొందితివి.ఈ పద ప్రయోగమున మనకు అయోధ్య కాండ సూచితమగుచున్నది.
౩. శాశ్వతీః సమాః = ఆడిన మాట తప్పకుండుటకై పెక్కేండ్లు వనవాసమొనర్చితివి.ఈ పదముల ద్వారా అరణ్య కాండ సూచితమగుచున్నది.
౪. క్రౌంచ మిధునాత్ = కుటిల ప్రవృత్తి కల తారావాలి దంపతులలో వాలివధ సూచించు ఈ పద ప్రయోగము కిష్కింధకాండ సూచితమగుచున్నది.
౫. ఏకమ్ = అసహాయ సూరుఁడు హనుమంతుఁడు అని అర్థద్యోతకమగు పద ప్రయోగమున సుందర కాండ సూచితమగుచున్నది.
౬. అవధీః = దుష్ట రావణుని వధించితివి అని సూచించే ఈ పదము వలన యుద్ధ కాండ సూచితమగుచున్నది.
౭. కామ మోహితం = పట్టాభిషేకానంతరము సీతతో రాముని జీవిత గమనమును సూచించుచున్న ఈ పదముల ప్రయోగమున ఉత్తర కాండ సూచితమగుచున్నది.
ఈ విధముగా ప్రారంభ శ్లోకముననే శ్రీమద్రామాయణ భావి కథాసూచి చేసిన ఉత్కృష్టమైన ప్రథమ శ్రేణి గ్రంథము శ్రీమద్రామాయణము.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
వాల్మీకి నోటివెంట వెలువడిన ప్రధమ శ్లోకమును ప్రతిపదార్ధముతో వివరించడమే గాక ఒక్కొక్క పదప్రయోగమును ఆయా ఘట్టములకు సంబంధించిన సూచనలను చక్కగా వివరించి నందులకు కృతజ్ఞతలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.