గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, జులై 2015, శనివారం

ఎవరీపుష్కరుఁడు? పుష్కరాలకెందుకింత ప్రాశస్త్యమ్?

జైశ్రీరామ్.
గోదావరీ పుష్కరారాధకులకందరికీ శుభాభినందనలు.
పుష్కరాల చరిత్ర. 
క. తుందిలుఁడను ధర్మాత్ముఁడ
మందానందదుఁ నభవు నుమాపతి శివునిన్.
బంధించి హృదయమందున
పొందెన్ జల రూప శివుని, పూజ్యుండయ్యెన్. ౧.

క. నాడుమొదలు తుందిలుఁడున్
మూడున్నర కోట్ల తీర్థ పూజ్యాధిపుఁడై
బీడులను పండఁ జేయుచు,
నీడయె సత్పుష్కరుఁడయి నిఖిల జగతికిన్. ౨.

గీ. బ్రహ్మ సృష్టించుటకు జలం బవసరమయి
శివుని యర్థించె పుష్కరుఁడవసరమని.
శివుఁడొసంగె. పుష్కరుఁడంత శివుని యాజ్ఞ
బ్రహ్మ జలపాత్రఁ జేరెను భక్తితోడ. ౩.

గీ. బ్రహ్మ కార్యమ్ము ముగిసెను. ప్రాణి కోటి
జీవనాధార జలములు కావలెనని
తనకునిమ్మనియె గురుండు. కనికరమున
బ్రహ్మ యొసగెను పుష్కరున్ వరలఁ జగతి. ౪.

గీ. విధిని వీడి నే పోనని వేడుకొనెను
పుష్కరుఁడు. బ్రహ్మ దీని బరిష్కరింప
గురునితోడను యోచించి కూర్మి మీర
తుందిలుఁడు మెచ్చఁ జేసె నొప్పంద మొకటి. ౫.

గీ. మేషమాదిగ పన్నెండు రాసులందు
గురుఁడు చేరెడి సమయాన కూర్మి మీర
పదియు రెండు దినంబులు, వాసముండి,
పుష్కరుండిలఁ బూజ్యుఁడై పొలయఁ దగును. ౬.

గీ. వత్సరంబంత మధ్యాహ్న భాగమందు
నాల్గు గడియల చొప్పున నదుల నిలచి
గురుడు కోరిన కోరిక తీరఁ జేయు
పుష్కరుండగునిక శుభావిష్కరుండు. ౭.

గీ. అట్టి సమయాన దేవత లందరచట
పుష్కరునితోడవత్తురు మూలమైన
గురుఁడు వసియించు నదికిని కూర్మి మీర.
కాన పుష్కర స్నానంబు ఘనము తలప. ౮.

(అని నిర్దేశించిరి.)

క. దేవతలంత వసించెడి
జీవనదుల కడను చేయు సేవలు మహిమో
ద్భావిప్రదములు మనలకు.
సేవా తత్పరులకిడు విశేష ఫలంబుల్. ౯.

క. స్నానము చేయగ వచ్చిన
మానవ సత్ సేవ మనకు మాధవ సేవే.
నీ నా భేదము తొలగును.
జ్ఞానాక్షయ దీప్తి మనము కాంచగవచ్చున్. ౧౦.

ఆ.వె. ధనము కలుగువారు దానంబులను చేయు.
పేదవారి కొసగి ప్రీతిఁ గొలుపు.
పేదవారి కిడిన మాధవునకు చేరు.
పేదవారిఁ గొలిచి మోదమొందు. ౧౧.

క. దేవతలెల్ల వసించెడి
జీవనదులకడ పితరులఁ జిత్తము నందున్
భావన చేయుచు తర్పణ
మీవలయును. పుణ్యగతులనీయఁగ మనకున్. ౧౨.

జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
పుష్కరుని గురించి వివరించి నందులకుధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.