గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, ఫిబ్రవరి 2013, సోమవారం

అశ్వత్థ వృక్ష(రావి చెట్టు) ప్రదక్షిణ విధి, ఆవశ్యకత - వ్రాసినది శ్రీ జనార్థన శర్మ

జైశ్రీరామ్.
మిత్రులారా! ఏ పుట్టలో ఏ పాముంటుందో, ఏ విషయ సంగ్రహణం వల్ల ఏ సత్ఫలముంటుందో అంత సులభంగా అర్థం కాదు మనకు.శ్రీ జనార్థన శర్మగారు వ్రాయగా  శ్రీ రాజశేఖరుని విజయ శర్మ అంద జేసిన అశ్వత్థవృక్ష ప్రదక్షిణావశ్యకత, ప్రదక్షిణ విధానము వివరములు.
అశ్వత్థ ప్రదక్షిణ విధి
శనివారమునాడు శ్రీ శనైశ్చర దేవతా పీడా పరిహారమునకై అశ్వథ్థ ప్రదక్షిణము చెప్పబడినది.
అశ్వథ్థ వృక్షమును ఒక్క శనివారమునాడు మాత్రమే ముట్టుకోవచ్చును.
అశ్వథ్థ ప్రదక్షిణ , త్రిమూర్తుల సేవలలో ఒకటి.
ఉదకశాంతి మంత్రములలో వచ్చు " నమో అస్తు సర్పేభ్యో యేకే చ పృథివీ మను .... " అను మంత్రము లోని ’సర్పము ’ అను శబ్దమునకు ’ సూర్య కిరణము ’ అని కూడా అర్థమున్నది. ( ఈ మంత్రము రాహు గ్రహ ప్రత్యధిదేవత మూల మంత్రము కూడా )
అశ్వత్థ వృక్షము(రావి చెట్టు) ఆకులనుండీ ప్రసరించే సూర్య కిరణాలు గర్భవతుల పై పడినచో ఆ పుట్టబోయే వారికి ’ కాల సర్ప దోషము ’ కలగదు. వారి జాతకములో కాల సర్పదోషము ఉండదు. అందుకే , గర్భవతులు రావి చెట్టు ప్రదక్షిణము చేయవలెనని విధించినారు.
ప్రదక్షిణ చేయునపుడు చెప్పవలసిన
శ్లోకము:- మూలతో బ్రహ్మ రూపాయ - మధ్యతో విష్ణు రూపిణే
అగ్రతో రుద్రరూపాయ - వృక్షరాజాయ తే నమః.
పై శ్లోకము చెప్పుచూ యథాశక్తి  7 - 12 - 24 - 48 - 108   సార్లు ప్రదక్షిణలు చేసి అనంతరము కింది శ్లోకము చెప్పుచూ ప్రదక్షిణ సంఖ్యానుసారముగా అశ్వథ్థ వృక్షమునకు నమస్కరించవలెను.
శ్లో:- అశ్వత్థ హుతభుక్ వ్యాసో గోవిందస్య సదాశ్రయః 
అశేషం హర మే శోకం వృక్షరాజ నమోஉస్తుతే.
నమస్తే.
జైహింద్.
Print this post

3 comments:

Pandita Nemani చెప్పారు...

బ్రహ్మరూపము వృక్ష మూలమ్మునందు
అచ్యుతుని రూప మచటి మధ్యమ్ము నందు
అభవు రూపమ్ము కన్పట్టు నగ్రమందు
నట్టి అశ్వత్థ కుజమున కంజలింతు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అవును " అశ్వద్ధ నారాయణు డని సంతానము లేని వారు ప్రదక్షిణలు చేయడం నా చిన్నప్పుడు కొంచం తెలుసు . దేని కైనా నమ్మకం ముఖ్యం చాలా మంచి విషయం చెప్పారు. ధన్య వాదములు

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

వందనము చేసి హృదయా
నందము నేమాని వారు నా కొడగూర్చన్
బంధురమగు ప్రేమామృత
సుందరముగ అక్కగారు శోభను గూర్చెన్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.