గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, ఫిబ్రవరి 2013, శనివారం

దత్త పది:- మోదము - రోదము - వేదము - జూదము . భారతం లోని కథ. స్వేఛా ఛందములో వ్రాయ గలరు.

జైశ్రీరామ్.
దత్త పది:-
మోదము - రోదము - వేదము - జూదము . 
భారతం లోని కథను స్వేఛా ఛందములో వ్రాయ గలందులకు మనవి.
నా పూరణను వ్యాఖ్యలో చూడ గలరు.
జైహింద్.
Print this post

6 comments:

తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ చెప్పారు...

మోదము గూర్చగన్ శకుని మోసపు పల్కు వినంగ నత్తరిన్
రోదము గాగ కౌరవులరూపునగమ్యము జూడయప్డు సం
వేదము తోడ పాడవుల విత్తము రాజ్యము దోచవచ్చు నా
జూదమునందునంచు సరిజూచియు పంపిరి వర్తమానమున్ .

డా. ప్రభల రామలక్ష్మి చెప్పారు...

పాచికను జూడ మోదమొప్పారుచుండ
రోదమున దేలి కంకుడు రోయి కాసె
వేదము తెలిసియుండియు వీడినదియు
జూదమాడగ వచ్చెను చోద్యమిదియే.
( రోదము = భూమ్యాకాశ మధ్య స్థానం; రోయి = పందెము)

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

జూదము నాడుట మోదము
వేదము నందైన వినగ వేడుక కైనన్ !
రోదించె తుదకు ధర్మజు
బాధగ మైకమ్ము నోడి భార్యను సైతం !

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

ఏ వేదములో జెప్పిరి
భూ విభులకు జూదములు ప్రమోదములనుచున్
చేవలు చెడి కురు శౌర్యము
బ్రోవగ హరి యుండి కూడ రోదము బొందెన్

డా. ప్రభల రామలక్ష్మి చెప్పారు...

పాచికను జూడ మోదమొప్పారుచుండ
రోదమున దేలి కంకుడు రోయికాసె
వేదము తెలిసియుండియు వీడెనదియు
జూదమాడగ వచ్చెను చోద్యమిదియె !!

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శ్రీమాన్ తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారు,
శ్రీమతి రాజేశ్వరక్కయ్య గారు,
శ్రీమాన్ లక్కాకుల వేంకట రాజా రావు గారు,
డా.ప్రభల రామ లక్ష్మి సహోదరి గారు,
తమ అసాధారణ భావనా పటిమతో తమ పూరణలద్వారా ఆంధ్రామృతాన్ని వర్షించిరి.
రాజేశ్వరక్కయ్య భార్యను సైతం అనేబదులు సభలో అంటే ఇంకా చక్కగా ఉంటుంది.
లక్కాకుల వారు ఏవేదములో చెప్పిరి అని నిలదీశారు. వారు చెప్పినట్లు చతుర్వేదాలలోను ఈ ప్రస్తావన ఎక్కడుందో సప్రమాణముగా తెలియజేయలేకపోయినా భారతము పంచమవేదమంటాము కదా!దానిని గ్రహించిన సరిపోవునని భావిస్తున్నాను.
అందరికీ అభినందన పూర్వక ధన్యవాదములుయ్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.