గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, ఫిబ్రవరి 2013, ఆదివారం

నేడు రథ సప్తమి సూర్య జయంతి సందర్భముగా అందరికీ ఆరోగ్యాభివృద్ధి కలుగునుగాక.

జైశ్రీరామ్.
సోదరీ సోదరులారా!
నేడు రథ సప్తమి. సూర్యభగవానుని జన్మదినముగా పురాణాలు చెప్పుచున్నవి.
సూర్యభగవానుని అనుగ్రహము పొందు వారికి ఆయురారోగ్య ఐశ్వర్యములు సమకూరునని పెద్దల మాట.
ఈ ప్రకృతి అంతా సూర్యభగవానునిపై ఆధారపడి నడుచుచున్నది. అట్టి సూర్యభగవానుని అనుగ్రహము మీ అందరికీ లభించవలెనని, మీరంతా శారీరక, మానసిక ఆరోగ్యవంతులై  సద్వృద్ధికి మూలమవవలెనని, మనసారా కోరుకొనుచుంటిని.
ఈ సందర్భముగా కళింగాంధ్ర లో సూర్య జయంతి శీర్షికతో వెలువడిన  వ్యాసమును ఈ క్రింది
http://kalingaandhra.blogspot.in/2013/02/blog-post_16.html?m=1
ద్వారా చూడతగినది.
సప్తాశ్వంబులు లాగు నట్టి రథమున్, జక్రం బుతానొక్కటే,
ప్రాప్తంబైన ననూరు డాకసమునన్ వర్తించు సారధ్యమున్
సుప్తంబందున నున్న జీవతతికిన్ సూర్యుండు మేల్కొల్పగా
సప్తోద్భాసిత వర్ణ భాస రథియై సంచారమున్ సల్పెడున్.
అట్టి సూర్యుని సత్కృప నలరుడయ్య.
ఆయురారోగ్యములతోడ నసదృశమగు
గుణము ధాన్యము సంపత్తి ధనము లొంది
సుఖములందుచు భూమిపై శోభిలుడయ!
శ్రీ నేమాని వారు ఇలా అభినందన పూర్వకముగా వ్రాస్తున్నారు.
సూర్య స్తోత్రము:
Greetings to all.
ఆదిదేవాయ లోకాప్తాయ సూర్యాయ
దినకరాయ ఖగాయ తేనమోస్తు
వేదస్వరూపాయ బిసరుహమిత్రాయ
త్రిభువన సాక్షిణే తేనమోస్తు 
ఏకచక్ర రథాయ లోకైకరక్షాయ
త్రివిధ తాపహరాయ తేనమోస్తు
బ్రహ్మవిష్ణీశ్వరత్రయ తత్త్వవిభవాయ
దేవసంస్తుత్యాయ తేనమోస్తు
పద్మినీ వల్లభాయ శోభాకరాయ
వైనతేయ ప్రచోదిత వాహనాయ
అరుణ కిరణాయ తిమిర సంఘాపహాయ
శ్రితజన హితాయ ప్రహితాయ తేనమోస్తు
Nemani Ramajogi Sanyasi Rao
నమస్తే.
జైహింద్.
Print this post

1 comments:

తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ. చెప్పారు...

నాలోని అజ్ఞానమనే తిమిరాన్ని పోగొట్టుచూ జ్ఞానాంజన శలాకగా ఉన్న శ్రీ పండిత నేమాని వారికి శ్రీ చింతా వారికి ప్రనామములు. రథసప్తమీ స్తవములు ప్రశంసనీయములు.
తిమిరహరణము చేయుచు తేరునెక్కి
జీవ రాశులకిచ్చును జీవనంబు
జీవకర్మల సాక్షిగ చేతనంబు
నిచ్చి పాలించి బ్రోచువా డినుడు మనకు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.