గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, జనవరి 2013, సోమవారం

ఈ సమస్య చూడండి. పూరించండి. "తరువులు కూల్చివేయవలె ధాత్రి జనాళి సుఖాభివృద్ధికై"

జైశ్రీరామ్.
సాహితీప్రియులారా!
తరువులు కూల్చివేయవలె ధాత్రి జనాళి సుఖాభివృద్ధికై.
ధాత్రి జనావళి సుఖాభివృద్ధికై తరువులు కూల్చివేయవలెనట. ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా లేదండీ ఈ సమస్య? ఐతే కవుల మేధాసంపన్నతచే ఇట్టి వైరుద్ధ్యాలు పరిహరింప బడతాయి.
ఈ సమస్యకు నా పూరణను వ్యాఖ్యలో చూడ గలరు.
మీరు మీ పూరణలను పంపండి. ముఖేముఖే సరస్వతీ అన్నారు. మీ మేధస్సునుండి ఎంతట అద్భుతమైన పూరణము కవితారూపంలో వెలువడుతుందో అని ఎదురుచూస్తుంటాను.
ధన్యవాదములు.
జైహింద్.


Print this post

10 comments:

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

చ:-
కరుణను వోటువేసె ప్రజ. గౌరవ బాహ్య ప్రవృత్త మోర్ఖులై
తరుణ మిదే యటంచు కడు దారుణముల్ పచరించుచుండె. నా
ధరణికి భారమైన ధన దాహ మదోన్మద దుష్త చిత్తులే
తరువులు . కూల్చివేయవలె ధాత్రి జనాళి సుఖాభివృద్ధికై.

తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ చెప్పారు...

ఒక మంచి సమస్యనిచ్చిన శ్రీ చింతా వారికి నమస్సులతో

ధరణిని మారణాస్త్రముల ధాటిని కూల్చెడి యుగ్రవాదులన్
తరుణుల మాన ప్రాణములు తామసకామ గుణాల దోచగన్
కరమున ఖడ్గమున్ గొని సుకార్యము దీక్షగ నట్టి దుష్టపుం
తరువులు కూల్చివేయవలె ధాత్రి జనాళి సుఖాభివృద్ధికై

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఎంతటి భావనా గరిమ! ఎంతటి సద్గుణగణ్యతత్వమున్!
యెంతటి సత్కవిత్వవిధ మెంతటి ప్రస్ఫుట వాగ్విధానమున్!
కాంతలపైన గౌరవము కల్గిన తోపెలవంశ సంభవా!
భ్రాంతిగ మీదు పద్యమును పల్మరు నేపఠియించిమెచ్చితిన్.
ధన్యవాదములు.

తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ చెప్పారు...

శ్రీ చింతా రామకృష్ణా రావుగారికి సాదర పూర్వక వందనములు. హృద్య పద్యరూప మెచ్చికోలు మీవంటి ఆశుధారా కవిత్వ దిగ్దర్శకుల నుండి పొందుట శ్రీ పండిత నేమాని వంటి పెద్దల యాశీస్సుల ఫలితము. మీకు మిక్కిలి ధన్యవాదములు.

ఈక్రింది సమస్య యోఘ్యోయతాయోగ్యతలను పరిశీలింప మనవి.
" కటకటాలయ్యె నాతని ఖర్మ కొలది" .

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

మెరుపుల తీగ బోలు నటి మేనున నొంపులు సొంపులన్ని న
ల్గురు దిరు గాడు త్రోవలను గొప్పగ చూపుచు రంగు రంగులన్
పరుగులు దీయు చోదకుల వాహనముల్ బడ జేయునట్టి చి
త్తరువులు కూల్చివేయవలె ధాత్రి జనాళి సుఖాభివృద్ధికై.

పుష్యం చెప్పారు...


ఈ సమస్యకు నేను ఇంతకు ముందు చేసిన పూరణ (2009లో):

సరియగు చోటునిచ్చి నర జాతిని చల్లగ చూచు ధాత్రినిన్
కరుణన కాయగా వలయు, కమ్మని తల్లిని కంటి పాపలా.
"తరువులు కూల్చివేయవలె ధాత్రి జనాళి సుఖాభివృద్ధికై,
కరువది తీర త్రవ్వవలె గ్యాసుకు నూనెవి బావు" లంచు ఈ
ధరణిని కాలదన్ను ధన దాహపు మూర్ఖుల జుట్టుపట్టి ఆ
కురులను నున్నగా గొరిగి గుండుకు సున్నపు బొట్లుపెట్టెదన్

తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ చెప్పారు...

హనుమఛ్చాస్త్రిగారూ! వర్తమాన సినీ వ్యాపార అస్లీల వాల్ పోస్టర్ల పై మీ పూరణ చాల బాగున్నది. అభినందనలు

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా! కొంపెల్లవంశజా!
" కటకటాలయ్యె నాతని ఖర్మ కొలది" .
అనునది
" కటకటాలబ్బె నాతని ఖర్మ కొలది" .
అని ఉంటే ఇంక బాగుంటుందనిపిస్తోందండి.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శ్రీ తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారు.
శ్రీ గోలి హనుమచ్ఛాస్త్రి గారు.
శ్రీ పుష్యం గారు. చక్కని పూరణలతో అలరించినందులకు అభినందన పూర్వక ధన్యవాదములు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

తరుణుల సుందరం బగు సుతారపు డెందము గాంచ లేకయా
సరసన జేరి ముచ్చటగ స్వాంత నచెందుట మాని యివ్విధిన్
బరవశ మొంది రక్కస ప్రభావిత కృత్యము లందు ఘోరమౌ
తరువులు కూల్చి వేయ వలె ధాత్రి జనాళి సుఖాభి వృద్ద్జికై !

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.