గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, జనవరి 2013, బుధవారం

ప్రపంచ తెలుగు మహా సభలలో నా ఉపన్యాస సారాంశము

ప్రపంచ తెలుగు మహా సభలలో నా ఉపన్యాస భాగము.
జైశ్రీరాం.
సాహితీ ప్రియ బాంధవులారా!సాహితీ మిత్రులు  చాలా మంది నాలుగవ ప్రపంచ తెలుగు మహా సభలలో నా ఉపన్యాస పాఠాన్ని వివరిస్తే బాగుంటుందని సూచించారు. అందుకే ఇప్పుడు ఇక్కడ ఆ విషయాన్ని సూక్ష్మంగా తెలియ జేస్తున్నాను.
29-12-2012వ తేదీని తిరుపతిలో సాహితీ (ఉప) వేదికపై మా ఉపన్యాస కార్యక్రమము మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయింది. శ్రీ దత్తాత్రేయ శర్మగారు, శ్రీ సాధన నరసింహాచార్యులు గారు మున్నగు నిర్వాహకుల సమక్షంలో ఉస్మానియా విశ్వ విద్యాలయ అనుబంధ కళాశాల ఆచార్యులు శ్రీ వెల్దండ నిత్యానంద గారు ఈ కార్యక్రమ నిర్వాహకులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో 5గురం వక్తలుగా పాల్గొన్నాము.శ్రీ మంగిపూడి రమణమూర్తి భాగవతార్ ప్రథమ వక్త కాగా ద్వితీయ వక్తగా నేను ఉపన్యసించాను. 
:- శ్రీ సుమ పేశ లాన్విత  విశేష పదజ్ఞులుజాను తెల్గు  
ద్భాషణ భూషణుల్మధుర వాఙ్మయ స్రష్టలుగౌరవార్హులై
యీ సభనొప్పి యుండుదురనేకులు సత్కవి పండితుల్,సద
భ్యాస పరుల్,మహాత్ములును,భక్తిగనందరికంజలించెదన్.1.
:- సోదర సోదరీ మణులు  సుందర భావ సమృద్ధు లీరునే
మీ దరి పల్క నుంటి నిట మేలగు నండురి రామ కృష్ణ సద్
బోధన నొప్పు సత్కృతుల పూజ్యత నెన్నుచుసత్ కవిత్వ సన్
మాధురి నెంచుచున్గలుగు మంచిని గాంచెడి మీకు మ్రొక్కెదన్. 1.
చమత్కారాలు. 
ప్రతిపద్యమునందు చమత్కృతి కలుగం జెప్ప నేర్తువెల్లెడ అని రఘునాధుఁడు చామకూరవేంకట కవిని ప్రశంశించాఁడు. నిజమే విజయ విలాసములో ప్రతీ పద్యములోను చమత్కారం ఉంది.
మన పెద్దల సంభాషణలలో కూడా ఎన్నెన్నో చమత్కారాలు ఉన్నట్టు మనం గమనించ వచ్చు.
ఒకమారు తిరుపతి వేంకట కవులు మండపేట వెళ్ళారు. అక్కడ మణి అనే పేరు గల నర్తకి చేసిన అద్భుతమైన నాట్యం చూచారు. వేంకట కవి ఆమె నాట్యాన్ని అద్భుతంగా ఉందని ప్రశంసించారు. అంతటితో ఊరుకోక ఆమెతో
‘మణి మామూలుగా ఉండేకంటే కడియంలో ఉంటే ప్రకాశిస్తుంది. శోభస్కరంగా ఉంటుంది’ అని ఆమెతో అన్నారు. వేంకట శాస్త్రిగారి గ్రామం కడియం అంటే తనతో కడియం వచ్చేయమనే భావ గర్భితంగా అన్నారన్న మాట. 
వారి మాటలలోనున్న మర్మం ఆ నర్తకికి అర్థం కాకపోలేదు. అందుకే ఆమె
‘స్వచ్ఛమైన మణి కడియంలో ఉంటేనేమి? పేటలో ఉంటేనేమి?’ అని అంది..
ఆమె గ్రామం మండపేట. పేట అంటే ఆభరణము అని అర్థము.
ఆ మాటలను విన్న శాస్త్రిగారు ‘నీవు సొగసరివే అబుకున్నాను. గడుసరివి కూడాను’ అని ప్రశంసించి చక్కగా జారుకున్నారు.
భాగ్య నగరంలో శ్రీ మేడసాని మోహన్ పంచ సహస్రావధానం చేసినప్పుడు అప్రస్తుత ప్రసంగ పృచ్ఛకుఁడు 
"అవధానిగారూ! భర్త బోజనం చేస్తున్నాడు. భార్య వడ్డిస్తోంది.
భర్త భార్యతో పశువ అన్నాడు.
భార్య నవ్వుతూ కోతి అంది.
వీరి సంభాషణ నాకేమీ అర్థం కావటంలేదండి. మీరు కొంచెం వివరిస్తారా? అని అడిగాడు.
అది విన్న అవధాని 
ఆ దంపతులు మిత భాషులు. అందుకే అలా మాటాడుకొన్నారు.
భర్త పశువ అని కాదా అన్నాడు. అంటే ల్లెంలో శుభ్రంగా డ్డించవే అని అడిగాడు
భార్య కోరినంత తినండి అని పలికింది. ఈ మాటలలో గల చమత్కారం అర్థంచేసుకొన్న శ్రోతల కరతాళ ధ్వనులు మిన్నంటాయి. 
‘‘వాక్యం రసాత్మకం కావ్యం అనుకొంటే రసాత్మకమయిన చాటువులు్న్నీ కావ్యాలే.
చాటు పద్య మిలను చాలదా యొక్కటి అని అన్నాడు వేమన.  -  నిజమే.
2)  పాలు పెరుగు కన్న పంచదారల కన్న  -  జుంటు తేనె కన్న జున్ను కన్న
చెరుకు రసము కన్న చెలి మాట తీపిరా-విశ్వదాభిరామ వినుర వేమ.ఈక్రిందిచాటుపద్యం చూడండి
ఆ:- కొండనుండు నెమలి కోరిన పాలిచ్చు
పశువు చదువుచుండు శిశువు తోడ
వనిత వేదములను వల్లెవేయుచునుండు.
బ్రాహ్మణుండు కాకి పలలము తిను.
ఈ పద్యంలో గల చమత్కారం అర్థమైందా?
కొండనుండు నెమలి 
కోరిన పాలిచ్చుపశువు 
చదువుచుండు శిశువు తోడవనిత 
వేదములను వల్లెవేయుచునుండు.
బ్రాహ్మణుండు కాకి పలలము తిను. అని చదివితే సరిపోతుందనేసరికి జనం కరతాళధ్వనులతో వారి ఆనందాన్ని తెలియపరిచారు. అలాగే ఈ క్రింది పద్యం కూడాను.
ఆ:- పంట పొలము నుండు వరి చేలలో నుండు
జొన్న చేలనుండు చోద్యముగను
తలుపుమూలనుండు తలపైన ఉండును 
దీని భావమేమి తిరుమలేశ?
అదే విధంగా గరికి పాటి వారి మన్ననలందిన కవివతంస బులుసు వేంకటేశ్వర్లు గారి పద్యం
ఆ:- చలికి వణుకు చుండె సర్వ మానవ జాతి.
తల్లి కడుపులోని పిల్ల తప్ప.
మంటలెల్ల వారి మన్ననల్ గొనుచుండె.
మసనమందు వెలుగు మంట తప్ప. 
వివరించాను.
శ్రీ నండూరి కృష్ణమాచార్యులవారి
ఆ:- మింట మెఱుపు తీగ మిరుమిట్లతో వెల్గు
గుర్తు పట్ట లేడు గ్రుడ్డివాడు
జ్ఞాన దృష్టి లేక కవితలోపలి వెల్గు 
నెట్లు గుర్తుపట్టు నెవ్వడైన 
అనే పద్యముపఠించాను.
. శుభ కరముఁగ జరిగిన యీ - సభలోని ప్రపంచ తెలుగు సభికులకెల్లన్
శుభమగు కావుత! వేంకట - విభు దీవన లందు గాత విరివిగ నెపుడున్ .  స్వస్తి             
జైహింద్.
Print this post

9 comments:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

బాగున్నదండి. శుభాభినందనలు.
చమత్కారములే కవిత్వపఠనమునందు మఱింత ఆసక్తిని పెంచునవి.

సురేష్ బాబు చెప్పారు...

మీలాంటివారిని చూస్తేనే తెలుగు భాష మనుగడకు ఎటువంటి సమస్యా ఉండదు అనుకోవడానికి ధైర్యం వస్తుంది. ఇది అతిశయోక్తి కాదు.

కంది శంకరయ్య చెప్పారు...

చాలా బాగుంది. ప్రసంగ పాఠాన్ని సంక్షిప్తంగానైనా ఇచ్చినందుకు ధన్యవాదాలు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శ్రీ Ravi Kumar ఇలా అన్నారు
Congrats.. for your success full completion of this program.

సో మా ర్క చెప్పారు...

మీ చమత్కారాలు,మిరియాలు అందంగా జత కూర్చిన కట్టు పొంగలిలా బహు రుచిగా ఉన్నాయి.మీకు నా అక్షర పాణిగ్రహణ మర్యాదతో సత్కరిస్తున్నాను.నర్తకీ మణి మణి వంటి సరస సల్లాపాలు మరీ బాగున్నాయి.వారి హాస్య ధారావ్రతానికి నా జోహార్లు.అందుకే విశ్వనాధ వారికి "తత్సమం"అయ్యారేమో!ఇలాంటి చమత్కారాలు ఈ రోజుల్లో శిరస్సాలిగ్రామాలకు మంచి ప్రసంగం చేసినందుకు,అందులో మాకు ఒక చెంచాడు ఒలకబోసినందుకు ధన్యవాదాలు.అర్ధం కావేమో!

మిస్సన్న చెప్పారు...

ఆర్యా! చమత్కార భరితమైన చక్కని ప్రసంగం చేశారు. అభినందనలు.

గన్నవరపు నరసింహమూర్తి చెప్పారు...

చమత్కృతికి తెలుగు వారికి అవినాభావ సంబంధ ముంటే తెలుగు సాహితీ వేత్తలా చమత్కారాన్ని యింకొంచెము యెక్కువ పాలులో తమ రచనలలో గుంభించారు. అందు వలననే తెలుగు రచనలు,కవితలు,పాటలు వన్నె కెక్కాయి. తిక్కన ,చేమకూరి వెంకట కవుల నుంచి యీ దినములలో గరికపాటి వారి వరకు ఆ చమత్కారము ప్రస్ఫుటముగా కనిపిస్తుంది. మరి రాచకొండ విశ్వనాథ శాస్త్రి వంటి కధా రచయితలు కూడా చమత్కారాన్ని తక్కువ తిన లేదు.ఆంధ్రామృతాన్ని నిరంతరాయముగా తెలుగు వారికి పంచడమే గాక ,ప్రపంచ తెలుగు మహా సభలో తెలుగు కవుల చమత్కారాన్ని సభికులకు మరో సారి చవి చూపిన శ్రీ చింతా రామకృష్ణా రావు గారికి హార్దికాభినందనలు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

Bommakanti Lkant ఇలా అన్నారు
mama
happy new year
mee prapancha mahasabhalalo upanyasam chala bagundi .

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
చమత్కార భరితమైన చక్కని పద్యములతో ప్రపంచ తెలుగు మహాసభలు రస రమ్యంగా జరుపు కున్న అదృష్ట వంతు లందరికీ అభి నందనలు . అందులో పాలు పంచుకునే అదృష్టాన్ని మాకు కలి గించిన శ్రీ చింతా వారికి ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.