గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, జనవరి 2013, గురువారం

ఈ సమస్యను పూరించ గలరా? "భామకు మీసముల్ మొలిచె బాపురె! పూరుషుడూనె గర్భమున్"

జైశ్రీరామ్.
సాహితీసన్మిత్రులారా! 
భామకు మీసముల్ మొలిచె బాపురెపూరుషుడూనె గర్భమున్.
అనే సమస్యను నేను పూరించిన విధము చూడండి.
మీరూ పూరించగలిగితే, పూరించి పంపితే ఆనందం మాకూ పంచినవారౌతారు.
:-
తామును సంతతిన్ బడయ తప్పక వైద్యము పొందితృప్తులై
ఏమరపాటుచే తమకు యిచ్చిన మందులు తారు మారుగా
భామయు భర్తయున్ గొనిరివాడిన మందుల దుష్ఫలంబుచే
భామకు
 మీసముల్ మొలిచె బాపురెపూరుషుడూనె గర్భమున్.
శుభమస్తు.
జైహింద్.
Print this post

8 comments:

Pandita Nemani చెప్పారు...

ఏమని చెప్పవచ్చు నొక యింటి పరిస్థితి, పెత్తనంబహో
భామినిదే, యమాయకుడు భర్త, యిదంతయు గాంచి యొక్కడెం
తేమది రోసి వ్యంగ్యముగ దెల్పెను రమ్య కవిత్వ ధోరణిన్
భామకు మీసముల్ మొలిచె బాపురె! పూరుషు డూనె గర్భమున్

Zilebi చెప్పారు...


స్త్రీ వాది సంఘం జరిపిన కలియుగ
'పుత్రికామేష్టి' యాగ విచిత్రము జూతము రారె!
ఈ యాగ మహత్వము వశమున
భామ కు మీసముల్ మొలిచె, బాపురె పూరుషుడూనె గర్భమున్ !

కమనీయం చెప్పారు...

ఏమని చెప్పవచ్చునిక యెన్నియొ వింతలు కల్గె, చెట్టులున్,
జేమలె కావు ,దోమలును జీమలె కావు ,మనుష్య జాతికిన్
క్షేమముగాని శాస్త్రముల చిత్ర ప్రయోగ విశేష పద్ధతిన్
భామకు మీసముల్ మొలిచె బాపురె పూరుషుడూనె గర్భమున్.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

ఏమని చెప్పుదింక నిల నిద్దరు దొంగలు దంపతుల్ కనన్
క్షేమమునెంచుచున్ కలసి సీమకు నిద్దరు పారిపోవగా
కోమలి నాతడున్ త్వరగ క్రొత్తగ వేషము మార్చినారహో
భామకు మీసముల్ మొలిచె బాపురె! పూరుషుడూనె గర్భమున్.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

తమ స్పందనలను పూరణ రూపమున నందజేసిన శ్రీ పండిత నేమాని వారికి,శ్రీ జిలేబీ గారికి,శ్రీ కమనీయం గారికి, శ్రీ గోలి హనుమచ్ఛాస్త్రిగారికి ధన్యవాదముల్ తెలియజేస్తున్నాను.

తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ చెప్పారు...

లేమకు ద్వేషముంగలిగి లేశపు మాత్రము పూరుషాళిపై
ప్రేమయులేకనొక్క ముని ప్రీతిని పొందెను దివ్యనీరమున్
ప్రేమను త్రాగజేయనొక స్త్రీపొర పాటున త్రాగెనంతలో
భామకు మీసముల్ మొలిచె బాపురె! పూరుషుడూనె గర్భమున్.

తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ చెప్పారు...

లేమకు ద్వేషముంగలిగి లేశపు మాత్రము పూరుషాళిపై
ప్రేమయులేకనొక్క ముని ప్రీతిని పొందెను దివ్యనీరమున్
ప్రేమను త్రాగజేయనొక స్త్రీపొర పాటున త్రాగెనంతలో
భామకు మీసముల్ మొలిచె బాపురె! పూరుషుడూనె గర్భమున్.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఏమది వింత గాక మునుపెన్నడు గాంచని వింత పోకడల్
లేమయె సంతు కోసమని లేహ్యము మ్రింగుట తారు మారవన్
యేముని మంత్ర జాలమది యేమరు పాటున మోస మొందెనో
భామకు మీసముల్ మొలిచె బాపురె పూరుషు డూనె గర్భమున్ !

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.