గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, సెప్టెంబర్ 2012, మంగళవారం

మా మంచి మాష్టారు శ్రీమాన్ మానాప్రగడ శేషశాయి.

జైశ్రీరామ్.
శ్రీ మంగళంపల్లికి ఎడమవైపున శ్రీ మానా ప్రగడశేషశాయి గురువులు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురు దేవులకు సుమనర్నమస్సులు.హృదయ పూర్వక అభినందనలు.
సాహితీ బంధువులారా! 
వారికి ఇదివర్కు భక్తి పారవశ్యముతో చేయుచున్నపాదాభివందనములు ఈ సుభ సందర్భములో మరల ప్రకటిస్తున్నాను.

శ్రీరస్తు.                         శుభమస్తు.                    అవిఘ్నమస్తు.
శ్రీమాన్ మానాప్రగడ శేషశాయి శ్రీ గురు చరణములకు
మీ శిష్య పరమాణువు చింతా రామ కృష్ణా రావు
భక్తి పారవశ్యముతో చేయుచున్న
పాదాభివందనములు.
శా:- శ్రీనాధాది కవుల్ ధరా తలమునన్ శ్రీ శేషశాయే యనన్
మానాప్రగ్గడ శేష శాయి గురుసమ్మాన్యా! కృపన్ గల్గిరే!
జ్ఞానాంభోధి ప్రసన్నభాస్కర! మహా జ్ఞానామృతాంశల్ సదా
ప్రాణంబై ప్రణవంబునౌచు వెలయన్ భాగ్యంబుగాఁ గొల్పిరే!

చ:- గురువర! మీ మహాద్భుత సుగోచర మయ్యెడి జ్ఞాన దీప్తి మా
వరగుణ వృద్ధి కారణము. భాగ్య నిధానము. భవ్య బోధయున్.
సరి యెవరయ్య మీకిలను సద్గుణ గణ్యులలోన నెన్నగా.
కరములు మోడ్చి మ్రొక్కెదను గౌరవమొప్పగ, జ్ఞాన భాస్కరా!

చ:- మధుర వచస్వి! మీ మృదుల మంజుల గాత్ర విశేషమేమొ! మా
యెదలును పల్లవించినవి. ఏమని చెప్పుదు మీదు ప్రేమ! వా
ఙ్నిధి లభియించె మాకు. మహనీయుల దర్శన భాగ్యమబ్బె. మీ
సదమల దివ్య మానసము సారథియై నడిపించె మమ్ములన్.

కంద గీత గర్భ చంపక మాల:-
వర మధుస్రావమై, అమృత వారిధియై, శుభమై రహించు శ్రీ
చరణ నుతిన్ సదా సకల సత్పరివర్తనఁ జక్క జేయుచున్,
పర సుధనంబు గా కవిత పార, ధరన్ నను గౌరవించ్రి. ప్రాక్
సరస కవీ! సదా తమరి సన్నుత దీవన తప్పదెందునన్!

చంపక గర్భస్థ గీతము:-
అమృత వారిధియై, శుభమై రహించు
సకల సత్పరివర్తనఁ జక్క జేయు
కవిత పార, ధరన్ నను గౌరవించ్రి.
తమరి సన్నుత దీవన తప్పదెందు.

చంపక గర్భస్థ కందము:-
మధుస్రావమై, అమృత వా
రిధియై, శుభమై రహించు శ్రీచరణ నుతిన్
సుధనంబుగా కవిత పా
ర, ధరన్ నను గౌరవించ్రి, ప్రాక్ సరస కవీ!

శ్రీ చక్ర బంధ తేటగీతి:-
వరద పాండిత్య! శ్రీ యుత! వాఙ్నిధాన!
లక్ష్య వరదుఁడ! శ్రీ కర! లక్షణాది
సిద్ధిఁ గొలిపితే! శ్రీ వరసిద్ధి రామ
వరలఁ జేసితి నన్నంది వామ దేవ!

చ"తురంగ"గతి బంధ కందము:- ( గురువరు - వదనము - భవభయ హరణము )
సునిశిత పదముల తగు వివ
రణముగ గురువుల శరణు నర వరులు మహతిన్
కనవలె నుయభ సుఫలదము
లనవరతము నయము శుభము లది యిడును తగన్. 


నక్షత్ర బంధ కందము:- ( సుజనవర - శేషశయన )
సుధ నభిషవ వశ వర! జ్ఞా
న ధనా! నయ బోధనను తనర కొలుపన్ శే
షి ధిషణ! భూమిజ దేవ! వి
శదమయ సుకవివర గణన. జన శేఖరుఁడా!

చ:- శుభమగు గాక దివ్య పరిశోభిత మూర్తికి జ్ఞాన దీప్తికిన్,
శుభమగు గాక పూజ్య రవి శోభలు గాంచిన పుణ్య మూర్తికిన్,
శుభమగు గాక శిష్య గణ శోభిత సద్గురు భవ్య కీర్తికిన్, 
శుభమగు గాక పుణ్య పరిశోభిత సత్కవి శేష శాయికిన్.
  
మంగళం                                                                   మహత్
శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ
ఇట్లు,
మీ శిష్య పరమాణువు
చింతా రామ కృష్ణా రావు.
హైదరాబాదు.
తేదీ.05 - ౦9 - 2012.
http://andhraamrutham.blogspot.com
సెల్.నెంబరు:- 9247238537.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శ్రీ మానాప్రగడ శేష శాయి గురువులకు భక్తితో సమర్పించిన పాదాభి వందన పద్య మాలలు , వివిధ చందస్సుల శౌగందికములు . పదే పదే చదివింప జేయ గలిగిన శ్రీ చింతా వారు ధన్యులు .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.