గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, సెప్టెంబర్ 2012, గురువారం

1944లో పిసుపాటి చిదంబరశాస్త్రి అవధానం చేస్తుండగా ఇచ్చిన నిషిద్ధాక్షరి.

జైశ్రీరామ్.
సాహితీప్రియ బాంధవులారా!
1944లో పిసుపాటి చిదంబరశాస్త్రి గారు ఒక చోట అవధానం చేస్తుండగా
ఒక పృచ్ఛకుడు
1వ పాదంలో య, ర, ల, వ, శ, ష, స, హ, 
2వ పాదంలో ప, ఫ, బ, భ, మ, 
3వ పాదంలో త, థ, ద, ధ, న, 
4వ పాదంలో క, ఖ, గ, ఘ, జ్ఞ. 
అక్షరాలు నిషేధిస్తూ 
మత్తేభ ఛందస్సులో సరస్వతీ దేవిని వర్ణించమన్నాడు. 
పిసుపాటి వారు దానిని అవలీలగా పూరించారు.
ఆ పూరణ చూడండి.
'గణుతింతున్‌ మనమంది నుక్తిజననిన్‌ కాంతా మణిన్‌ జండధా
రణ హృత్సారస చంచరీక నవతారస్వైరసంచార, చ
ర్వణ బీయూష కరాభ్యుపేయ రుచపారం పర్య సంశోభ, గా
రణ భూతన్‌ వివిధ శ్రుతి స్మృతి విహారద్యోత మానస్థితిన్‌'  
చూచారు కదండీ! మరి ఈ పృచ్ఛకుఁడడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆ పూరణను మీరూ ఎందుకు చెయ్య కూడదు? మరింకెందుకాలస్యం? పూరించి వెంటనే పంపండి. మరి నా పూరణ అంటారా? ఓ! తప్పకుండా పూరించి మీలాగే నేనూ వ్యాఖ్యలో ఉంచగలనని మనవి చేయుచున్నాను.
నమస్తే.
జైహింద్.

Print this post

9 comments:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

ఈ సమస్య ను మీ బ్లాగులో ఇంతకు మునుపే ఇచ్చి ఉన్నారండి.
ఈ లంకె లో చూడండి.
http://andhraamrutham.blogspot.in/2011/09/2_18.html

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

అమ్మా!లక్ష్మీదేవీ! ఔత్సాహికులైన రచయితలు ప్రయత్నించి పూరణ చేస్తారేమోనని భావించి మళ్ళీ ఉంచానమ్మా.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

నా పూరణము:-
భజనన్ మోదము నొందుచుండు జననీ ! భక్తిన్ మనోజ్ఞంబుగా
సుజనుల్ సత్కవితా వితాన సరళిన్ శోధించి నిన్ గాంచుఁగా!
అజరంబౌ యమరంపు మార్గమ! మహా యజ్ఞ ప్రలబ్ధంపు స
ద్విజ వాణీ వర శారదా! ముదమునన్ ప్రీతిం బ్రపూజించెదన్.

Pandita Nemani చెప్పారు...

Dear Ramakrishna Rao Garu!
Congrats. Excellent.
There is nothing beyond your capacity.
Sanyasirao Nemani

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

పండిత వర్య! మీపలుకు పామరుచే పలికించు పద్యముల్
దండిగ శక్తి నిచ్చి. వరదాయిగ మీరిల నాకు నండగా
నుండగ పద్యముల్పలుకనొప్పుగ యుండక యెట్టులుండు ను
ద్దండ కవీశ్వరా!కనగధన్యుఁడ.నే్ ముకుళింతు హస్తముల్.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
మీ ఆంధ్రామృతం లో అడుగు పెట్టాక , ఏమి తెలియని నేను ఎన్నో , ఎన్నెన్నో , తెలుసు కో గలుగు తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఎప్పడికీ ఇలాగే ఇంకా ఇంకా తెలుసు కోవాలని కోరుతూ , ఆశీర్వదించి అక్క .

ఏల్చూరి మురళీధరరావు చెప్పారు...

పంక్తిపావన కవివరేణ్యులు శ్రీ రామకృష్ణారావు గారికి,

ఈ రోజు మీ “వేణుగోప కందగీత గర్భ చంపకోత్పల శతకము”ను సంపూర్ణంగా చదివి ఎంతో ఆనందించాను. తెలుగులో నాదెండ్ల పురుషోత్తమకవి గారి “కంద గీత గర్భ మల్లికార్జున శతకము” తర్వాత ఈ ప్రక్రియలో రచితమైన రౌచికరచన మీదే అనుకొంటాను. చిత్రకవిత్వచరిత్రలో చరితార్థం కాగల ఏవంరూప కృతినిర్మితికి మీకు నా హృదయపూర్వకమైన అభినందనలు!

మిత్రశ్రీ డా. దేవగుప్తాపు గణపతిరావు గారివి, పూజ్యశ్రీ పండిత నేమాని గురువుల రచనలను కూడా చదువుకొని ఆనందం కలిగింది.

పై పూరణలో “సద్ద్విజవాణీవరశారదా” అన్నప్పటి శ్లేష హృద్యం.

మీ రచనాధ్యయనం నాకు స్ఫూర్తిదాయకంగా ఉన్నది. ఈశ్వరానుగ్రహం మీ యందు పరిపూర్ణంగా ప్రసరించాలి గాక!

సర్వ శుభాకాంక్షలతో,

మీ
ఏల్చూరి మురళీధరరావు

సో మా ర్క చెప్పారు...

ఈ సమస్యా పూరణం చాలా చాలా బాగుంది రామకృష్ణ కవిగారూ!నిజంగా ఇలాంటి పద్య కవితా శక్తి ఎవరికబ్బునండీ?చక్కగా పూరించారు.నా ప్రశంసా పరిజాతాలు.
"ఈ కాలమ్ముననిట్టి'పద్య'కవనంబెవ్వారిమెప్పించు?ను
ద్రేకస్ఫూర్తిని పెంచు'గేయ'కవితన్ప్రేమింతురేకాని"యం చాకల్ వెట్టెడు మాకు!చారుతరగర్జావిష్కృతిన్,మానునే?
భేకవ్రాతము వెక్కిరింతలకు?బెంబేలెత్తు వర్షాభ్రముల్.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

(నిషిద్ధాక్షరి)
నిజ తేజంబును, నైపుణిన్, ఘన కృతిన్ నేమంబు నొప్పన్, మతిన్
విజయోత్సాహిత విజ్ఞతన్ దెలియఁగా వేదార్ధసాదృశ్యతన్
ప్రజలే మెచ్చఁగ విశ్వశోభఁగ మహా ప్రాచ్యా! సుసోమార్క! మీ
సుజనోద్దీపిత సత్ స్వభాస రచనల్ శోభిల్లు నెల్లప్పుఁడున్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.