జైశ్రీరామ్.
భక్తుని అక్కునఁ జేర్చుకొనే పరంధాముఁడు మన శ్రీ రాముఁడు.
సాహితీ ప్రియ బంధువులారా! రామ నామ మహిమ అవాఙ్మానసగోచరము. ఆ మహిమను గూర్చి శ్రీ అయ్యగారి సూర్య నాగేంద్రకుమార్ ఇలా వివరించారు. చూడండి.
శ్రీ అయ్యగారి సూర్య నాగేంద్ర కుమార్
శ్రీ గురుభ్యోనమః
శ్రీ గణేశాయ నమః
శ్రీ రామ
’రా’శబ్దోచ్చార మాత్రేణ ముఖా న్నిర్యాంతి పాతకాః
పునః ప్రవేశభీత్యా చ ’మ’కార స్తు కవాటవత్ (శ్రీ రామ కర్ణామృతం)
రామేతి వర్ణద్వయ మాదరేణ
సదాస్మరన్ ముక్తి ముపైతిజంతుః (శ్రీ రామ కర్ణామృతం)
’రా’కలుషంబులెల్ల బయలం బడద్రోచిన ’మా’కవాటమై
దీకొని ప్రోచునిక్కమని ధీయుతులెన్నఁదదీయ వర్ణముల్
గైకొని భక్తిచే నుడువఁగానరుగాక విపత్పరంపరల్
దాకొనునే జగజ్జనుల దాశరథీ! కరుణాపయోనిధీ!
పైని పేర్కొన్న శ్రీరామ కర్ణామృతంలోని శ్లోకాలలోని మాటలే శ్రీ రామదాసు
గారు పైని ఉటంకించిన దాశరథీ శతకంలో చెప్పారు.
సముద్రమంత కరుణ కలిగిన ఓ దాశరథీ! ’రామ’ అను రెండక్షరములలో ’రా’ అను
అక్షరము పాపములన్నిటిని బయటికి పోగొట్టగా, ’మ’ అను అక్షరము తలుపువలె మూసి
లోపలికి పాపములను రాకుండునట్లు చేసి భక్తులను రక్షించును. ఇది నిజమని
జ్ఞానవంతులు చెప్పగా ఇతరులు గ్రహింపలేకున్నారు. లోకులు ’రామ’ నామము
జపించినచో జన్మపరంపరగా పాపముల రాశి వల్ల వచ్చు ఆపదలు వారికి కలుగునా!
పెద్దలు, విజ్ఞులు ఐన వారి మాట వినక రామ నామమను మాటను నిర్లక్ష్యము
చేయుదురే గాని భక్తిచే రామ నామము ఉచ్చరించరు కదా! అలా పెద్దల మాటలను
వింటే ఆపదలనుంచి గట్టెక్కగలరు కదా!
రామనామ మహాత్యము గురించి ఇతిహాసమొక్కటి పెద్దలు చెప్తారు
వనే చ’రామో’, వసు చా హ’రామా’!
నదీం స్త’రామో’, నభయం స్మ’రామః’!!
ఒకానొక సమయంలో దారిదోపిడీ చేసే గజదొంగలు ఇలా మాట్లాడుకుంటున్నారట. మనము
వనములందు (చరామః) సంచరిస్తున్నాము, వీలైనంత (హరామా.) దొంగిలిస్తున్నాము,
మనకు దారిలో అడ్డువచ్చిన నదులను (తరామః) ఈది దాటుతున్నాము, మనము అభయము
అన్నదానిని (స్మరామః) స్మరిద్దాము అని అనుక్కుంటుండగా వారందరూ
ప్రమాదవశాత్తూ మరణించారు, ఆ సమయమందు రామా రామా అన్న శబ్దమును
ఉచ్చరించడంతో ఉద్దరింపబడి ముక్తిని పొందారు.
కాబట్టి శ్రీ రామనామఉచ్చారణము తెలియక చేసినా ముక్తికి ఆలంబనం అవుతుంది. ఇక
తెలిసి తెలిసి ఒక యాగంలా చేస్తే దాని ఫలితమెంతటిదో ఊహకందుతుందా!.
రామ హరే కకుత్థ్సకుల రామ హరే రఘురామ రామ శ్రీ
రామ హరే యటంచు మది రంజిల భేక గళంబులీల నీ
నామము సంస్మరించిన జనంబు భవంబెడ బాసి తత్పరం
ధామ నివాసులౌదురఁట దాశరథీ! కరుణాపయోనిధీ!
ఏతత్ సర్వం శ్రీ హనుమ ద్లక్ష్మణ భరత శత్రుఘ్న సకల పరివార సమేత
సీతారామచంద్రార్పణమస్తు.
ఇట్లు
మీ నాగేంద్ర
చూచారు కదండీ! ఎంత చక్కటి మహిమోపేతమో శ్రీ రామ నామము. మీరూ మీ శ్రీరామనామానుభూతిని వివరిస్తూ సహృదయుల హృదయాలను కదిలించండి. జైశ్రీరామ్
జైహింద్.
2 comments:
Dhanyavadalu
నమస్కారములు
రస రమ్యమైన శ్రీ రామనామ మహిమను వివరించిన శ్రీ అయ్యగారి నాగేంద్ర కుమార్ గారికి ,అందించిన శ్రీ చింతా వారికి కృతజ్ఞతలు .
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.