గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, జులై 2011, బుధవారం

శ్రీ వేణు గోప కంద గీత గర్భ చంపకోత్పల శతకము. పద్యము 7 / 21 వ భాగము

చ:- పర నవ తేజమా! సుజన బాంధవ! నీదగు శోభఁ జూడనా?
       వర మదియే కదా! కుజన పాళి కసాద్యము గోపబాలకా!
       వర జవ మీవయై ప్రజల బాధ వరిష్ఠుఁడ! బాపవయ్య! దై
       త్య రిపు! హరీ! మతిన్ విజయతల్ సమ కూర్చుమ! వేణు గోపకా! 31.
       భావము:-
       శ్రేష్ఠమైన  నిత్య నూతన తేజమైన ఓ వేణు గోపకుఁడా! రాక్షస శత్రువైన  ఓ శ్రీ హరీ!
       సుజన బంధూ! నీదైన శోభను నేను చూడనా? నాకు అదే కదా వరము! ఓ గోప బాలకుఁడా!
       ఆ విధముగ నిన్నుచూచుట కుజనులకు సాధ్యము కాదు కదా! ఓ శ్రేష్ఠుఁడా!
       శ్రేష్ఠమైన వేగముగా నీవే అయి ప్రజల కష్టములను నసింపఁ జేయుము. మనసునందు
       విజయతలను నాకు సమకూర్చుము.

క:- నవ తేజమా! సుజన బాం  -  ధవ! నీదగు శోభఁ జూడనా? వర మదియే!
      జవ మీవయై ప్రజల బా  -  ధ వరిష్ఠుఁడ! బాపవయ్య! దైత్య రిపు! హరీ! 31.
      భావము:-
      నిత్య నూతన తేజమైన ఓ వేణూ గోపకుఁడా! రాక్షస శత్రువైన  ఓ శ్రీ హరీ! సుజన బంధూ!
      నీదైన శోభను నేను చూడనా? నాకు అదే కదా వరము! ఓ శ్రేష్ఠుఁడా! శ్రేష్ఠమైన వేగముగా
      నీవే అయి ప్రజల కష్టములను నసింపఁ జేయుము.

గీ:- సుజన బాంధవ! నీదగు శోభఁ జూడ  -  కుజన పాళి కసాద్యము గోపబాల!
      ప్రజల బాధ వరిష్ఠుఁడ! బాపవయ్య! -  విజయతల్ సమ కూర్చుమ! వేణు గోప! 31.
      భావము:-
      ఓ గోప బాలుఁడా! ఓ సుజన బంధూ! నీదైన శోభను చూచుట కుజనులకు అసాధ్యము సుమా!
      ఓ శ్రేష్ఠుడా! ప్రజల బాధలను పోఁ గొట్టుము. ఓ వేణు గోపుఁడా! విజయతలను చేకూర్చుము.

ఉ:- నీ పదపద్మముల్ కనిన నిత్య దరిద్రము కాలిపోవ దా?
      కోపహరీ! నినున్ వినిన కోప ప్రకంపన వీగి పోవ; ధా
      తా! పదిలంబుగా హరి పదం బది చేయదె; యాత్మ నుండి? పా
      పాపహరీ! సదా వినుత భాగ్య ప్రదీపక! వేణు గోపకా! 32.
      భావము:-
      ఎల్లప్పుడూ పొగడఁ బడెడి సంతోషమును మాలో ప్రకల్పించువాడా! ఓ వేణు గోపకుఁడా!
      మా లోని పాపమును హరింపఁ  జేయు ఓ  నారాయణుఁడా!  నీ పాద పద్మములను చూచినచో
      ప్రజల నిత్య దరిద్రము కాలి పోవును కదా! మా కోపమనెడి దుష్ట స్వభావమును హరించు
      ఓ శ్రీహరీ! నిన్ను గూర్చి వినినంతనే మాలో కలిగెడి  కోపము యొక్క ప్రకంపనలు
      వీగిపోవును కదా! ఓ పరమేశ్వరా! హరి యనే నీ పదము మా ఆత్మలో ఉండి మాకు
      పదిలమును చేకూర్చకుండా ఉంటుందా?

క:- పదపద్మముల్ కనిన ని  -  త్య దరిద్రము కాలిపోవదా? కోపహరీ!
      పదిలంబుగా హరి పదం -  బది చేయదె; యాత్మ నుండి? పాపాపహరీ! 32.
      భావము:-
      మా పాపములను హరించే ఓ పరమాత్మా! నీ పాద పద్మములను చూచినంతనే మా
      నిత్య దారిద్ర్యము ము కాలిపోవును కదా! మా కోపమనెడి దుష్ట స్వభావమును హరించే
      ఓ శ్రీ హరీ! నీ యొక్క హరి యనెడి పదము మా ఆత్మ నున్నంతనే అది మాకు పదిలమును
      కలుఁగఁ జేయదా!

గీ:- కనిన నిత్య దరిద్రము కాలిపోవ ? -  వినిన కోప ప్రకంపన వీగి పోవ;
      హరి పదం బది చేయదె; యాత్మ నుండి? -  వినుత భాగ్య ప్రదీపక! వేణు గోప! 32.
      భావము:-
      పొగడ బడెడి సంతోషమును మాలో ప్రదీపింపఁ జేయు ఓ వేణు గోపుఁడా! హరి యనే నీకు
      సంబంధించిన పదము మా ఆత్మలో ఉండి  ఆ పదమును మేము  చూచినచో మమ్ములను
      వెంటనంటి యుండే నిత్య దరిద్రము కాలిపోవునట్లును; ఆ పదమును వినిన మాలో గల
      కోప ప్రకంపనలు వీగి  పోవునట్లుగాను చేస్తుంది కదా!

చ:- మము కరుణించరా! అలుక మానర! మాపయి నంబుజాక్ష! న్యా
      యము కనరా! కృపన్ వర దయామయ! సత్కళ భాగ్యమిమ్మురా!
      సుమ పరిపూజ్యుడా! అమర సూక్తి రసస్ఫురణాదులిమ్ము! ది
      వ్య ముగ హరీ! సదా! విజయ వర్ధనఁ జేయర! వేణు గోపకా! 33.
      భావము:-
      ఓ వేణు గోపకుఁడా! ఓ పద్మ నేత్రుఁడా! మా మీద అలుకను మానుము. మమ్ములను
      కరుణించుము.ఏది న్యాయమో చూడుము. శ్రేష్టమైన దయాపూర్ణుఁడా! కళా భాగ్యమును మాకు
      కృపతో ప్రసాదింపుము. పుష్పములచే బాగుగా పూజింపఁ బడు ఓ శ్రీ హరీ! శాశ్విత మైన మంచి
      మాటలలోని  రసస్ఫూర్తిని మాకు దివ్యముగా కలుగఁ జేయుము. ఎల్లప్పుడూ విజయమును
      మాకు ప్రవర్ధింపఁ జేయుము.

క:- కరుణించరా! అలుక మా  -  నర! మాపయి నంబుజాక్ష! న్యాయము కనరా!
      పరిపూజ్యుడా! అమర సూ  -  క్తి రసస్ఫురణాదులిమ్ము! దివ్య ముగ హరీ! 33.
      భావము:-
      ఓ పద్మ నేత్రుఁడా! మా మీద అలుకను మానుము. మమ్ములను కరుణించుము.
      ఏది న్యాయమో చూడుము. బాగుగా పూజింపఁ బడు ఓ శ్రీ హరీ! శాశ్విత మైన
      మంచి మాటల లోని రసస్ఫూర్తిని మాకు దివ్యముగా కలుగఁ జేయుము.

గీ:- అలుక మానర! మాపయి నంబుజాక్ష! -  వర దయామయ! సత్కళ భాగ్యమిమ్ము!
      అమర సూక్తి రసస్ఫురణాదులిమ్ము! -  విజయ వర్ధనఁ జేయర! వేణు గోప! 33.
      భావము:-
      ఓ వేణు గోపకుఁడా!  ఓ పద్మ నేత్రుఁడా! మా మీద అలుకను మానుము.   శ్రేష్టమైన
      దయా పూర్ణుఁడా! కళాభాగ్యమును మాకు కృపతో ప్రసాదింపుము. శాశ్విత మైన
      మంచి మాటలలోని  రసస్ఫూర్తిని మాకు దివ్యముగా కలుగఁ జేయుము. ఎల్లప్పుడూ
      విజయమును మాకు ప్రవర్ధింపఁ జేయుము.

ఉ:- మా సిరి వల్లభా! పలుకుమా! దరి చేరితి పల్కరింప. ధా
      మా! సరిగా. రమా రమణ! మానస చోరుఁడ! రక్ష సేయవా !
      నీ సరి వానిగా భువిని నిన్నరయున్ గద; పూజ్యు లెల్ల హం
      సా! సుహరీక్షణా! విజయ సారధి వీవెగ! వేణు గోపకా! 34.
      భావము:-
      ప్రకాశించు వాడా! మా లక్ష్మీ పతీ!  ఓ వేణు గోపకుఁడా! నిన్ను పలుకరింప వలెనని
      నీ  సమీపమునకు చేరితిని. నాతో సరియగు విధముగా మాటాడుము. ఓ రమా రమణుఁడా!
      మా హృదయ చోరుఁడా! నన్ను రక్షించవా! పూజ్యులు  భూమిపై నీతో సరి పోలువాడిని
      నిన్నేవెదకును గదా? నీవు అనన్వయుఁడవు. హృదయమునందు హంస స్వరూపుఁడ వైన
      ఓ సుహరీక్షణా! విజయసారథివి నీవే కదా!

క:- సిరి వల్లభా! పలుకుమా! -  దరిచేరితి పల్కరింప. ధామా! సరిగా.
      సరి వానిగా భువిని ని  -  న్నరయున్ గద; పూజ్యు లెల్ల హంసా! సుహరీ 34.
      భావము:-
      ప్రకాశించు వాడా! లక్ష్మీ పతీ! హృదయమునందు హంస స్వరూపుఁడ వైన ఓ సుహరీ! నిన్ను
      పలుకరింప వలెనని నీ సమీపమునకు చేరితిని. నాతో సరియగు విధముగా మాటాడుము.
      పూజ్యులు  భూమిపై నీతో సరి పోలువాడిని నిన్నేవెదకును గదా?

గీ:- పలుకుమా! దరి చేరితి పల్కరింప. -  రమణ! మానస చోరుఁడ! రక్ష సేయ !
      భువిని నిన్నరయున్ గద; పూజ్యు లెల్ల  -  విజయ సారధి వీవెగ! వేణు గోప! 34.
      భావము:-
      ఓ వేణు గోపుఁడా!  మాహృదయ చోరుఁడా! నిన్ను పలుకరించుట కొఱకు నీ సమీపమునకు
      చేరితిని. నీవు నాతో మాటాడుము. మా విజయ సారథివి నీవే సుమా! పూజ్యులందరూ వారిని
      నీవు రక్ష సేయుట కొఱకు భూమిపై నిన్ను వెదకుదురు కదా!

ఉ:- శ్రీ మహనీయుఁడా! సుజన చిత్త హరీ! నినుఁ జూడనిమ్ము; ధా
      త్రీ మనుజుల్ నినున్ కొలుచు రీతి సుధామతిఁ గొల్పుమయ్య! కో
      రే మహితాత్మకుల్ ఘనత శ్రీ మహనీయతఁ గల్గఁ జేయు మా
      రామ హరీ! సదా  వినుత ప్రస్ఫుట రూపక! వేణు గోపకా! 35.
      భావము:-
      మా మనోహరుఁడవైన ఓ శ్రీహరీ! ఎల్లప్పుడూ పొగడఁ బడెడి విస్పష్టమైన రూపము కల
      ఓ వేణు గోపకుఁడా! శుభప్రదుఁడవైన ఓ మహాత్మా! సుజనుల చిత్తస్వరూపుఁడవైన ఓ శ్రీ హరీ!
      మంచి వారి మనసు దోచుకొనే వాఁడవైన ఓ శ్రీ హరీ! భూజనులు నిన్ను చూచే విధముగా
      చేయుము.  నిన్ను సేవించే విధముగా వారికి అమృతముతో సరిపోలెడి మనస్సును
      కలుగఁ జేయుము. నిన్నుకోరేటువంటి గొప్ప మనస్సు గల వారి యొక్క ఘనత;
      మంగళ ప్రదమగు  మాహాత్మ్యము; వారి యందు కలిగి యుండు నట్లు చేయుము.

క:- మహనీయుఁడా! సుజన చి  -  త్త హరీ! నినుఁ జూడనిమ్ము; ధాత్రీ మనుజుల్
      మహితాత్మకుల్ ఘనత శ్రీ  -  మహనీయతఁ గల్గఁ జేయుమా రామ హరీ! 35.
      భావము:-
      ఓ మహనీయుఁడా! ఓ అందగాడివైన శ్రీ హరీ! సుజనుల మనసువే నీవైన ఓ శ్రీ హరీ!
      భూ జనులు నిను చూచునట్లు చేయుము. గొప్ప మనస్సు కలవారు; ఘనతతో కూడిన
      మంగళప్రదమైన మహనీయత పొందు వారిగా చేయుము.

గీ:- సుజన చిత్త హరీ! నినుఁ జూడనిమ్ము; -  కొలుచు రీతి సుధామతిఁ గొల్పుమయ్య!
      ఘనత శ్రీ మహనీయతఁ గల్గఁ జేయు -  వినుత ప్రస్ఫుట రూపక! వేణు గోప! 35.
      భావము:-
      ఘనతతో గూడిన మంగళ ప్రదమైన మహనీయతను మాకు కలుగఁ జేసెడి పొగడఁ బడెడి
      స్పష్టమైన రూపము   గల ఓ వేణు గోపుఁడా!  సుజనుల మనసువే నీవైన ఓ శ్రీ హరీ!
      నిన్ను మేము చూచునట్లు చేయుము. నిన్ను సేవించే పద్ధతిని  అమృతముతో సరి పోలెడి
      మా మనసునందు  కల్పించుము.
      ( సశేషం )
జైశ్రీరాం.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.