గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, జులై 2011, శుక్రవారం

శ్రీ వేణు గోప కంద గీత గర్భ చంపకోత్పల శతకము. పద్యము 9 / 21 వ భాగము

చ:- ముని జనముల్ గనే త్రి గుణముల్ విన నీవగు దివ్యతేజ! పే
       దను కనుమా! కృపన్ సుగుణ ధైర్యములొప్పుగ చూచి యిమ్మురా!
       విని కనుమా దయన్. నిగమ వేద్య నిధానమ! నిర్మలాత్మ హా
       యి నిడు హరీ! దయన్ పిలిచి యిమ్ముర నింపుగ! వేణు గోపకా! 41.
         భావము:-
         ముని జనములు చూచేటువంటి త్రిగుణాత్మకుడఁవు నీవే అయిన ఓ దివ్య తేజుఁడా!
         ఓ వేణుగోపకుఁడా! నిర్మలాత్మను; హాయిని దయచేయు ఓ శ్రీ హరీ!.  నేను భక్తి చేత
         నిరు పేదవాఁడిని. అట్టి నన్ను చూడుమా! నన్ను చూచి సుగుణమును ధైర్య గుణమును
         కృపతో తగిన విధముగా ప్రసాదించుము. నా మాటలు విని దయతో నన్ను చూడుము.
         నిగమ వేద్యుఁడవైన ఓ పెన్నిధీ! నేను కోరినవి నన్ను పిలిచి నా కొఱకు నింపుగా  ఇమ్ము.

క:- జనముల్ గనే త్రి గుణముల్  -  విన నీవగు దివ్యతేజ! పేదను కనుమా!
      కనుమా దయన్. నిగమ వే  -  ద్య నిధానమ! నిర్మలాత్మ హాయి నిడు హరీ! 41.
        భావము:-
        ఓ శ్రీ హరీ!  శ్రద్ధతో వినినట్లైతే జనులు చూచెడి త్రిగుణములు నీవే అయినటువంటి ఓ దివ్యతేజా!
        పేదవారిని చూడుము. అదియు దయతో చూడుము. నిగమములందు ఎఱుఁగఁ బడెడి
        ఓ పెన్నిధీ! నిర్మలాత్మను; హాయిని ప్రసాదించుము.

గీ:- త్రి గుణముల్ విన నీవగు దివ్యతేజ! -  సుగుణ ధైర్యము లొప్పుగ చూచి యిమ్ము!
      నిగమ వేద్య నిధానమ! నిర్మలాత్మ -  పిలిచి యిమ్ముర నింపుగ! వేణు గోప!  41.
        భావము:-
        వినగా త్రిగుణాత్మక స్వరూపము నీవే ఐన ఓ దివ్య తేజుఁడా! ఓ వేణు గోపుఁడా! నాకు
        ఒప్పిదమగునట్లుగా చూచి సుగుణమును; ధైర్యమును ప్రసాదింపుము. నిగమ వేద్యుఁడవైన
        ఓ మా పెన్నిధీ! నన్ను పిలిచి మరీ నాకు నిర్మలమైన ఆత్మను దయచేయుము.

చ:- పరి తపమేలనో కనఁగ భక్త పటిష్ఠుఁడు కానిపించు తా
       శరణముగా! తగన్. మహిని శాశ్వతమిద్దని మాయఁ గొల్పు. తే
       లెర!  ఉపలబ్ధుడా!  విడువ లేనె! పరాత్పర! వెల్గు నిన్నునే
       ధరను హరీ! సదా వినుత ధర్మ పరాశ్రయ! వేణు గోపకా! 42.
         భావము:-
         ఆలోచించి చూడగా భక్త పటిష్టుడైన పరమాత్మయే శరణముగా తగిన విధముగా
         తానే నిలిచి కానిపించగా ఇక మేము పరితపించుట ఎందులకు? ఎల్లప్పుడూ నుతింపఁబడెడి
         ధర్మమునే పరముగా ఆశ్రయించి యున్న ఓ వేణు  గోపకుఁడా! భూమిపై ఇది యంతయు
         శాశ్వితము అని మాయను కలిగించు చుందువు కదా!  నీ సంగతి మాకు తెల్లమయ్యెను.
         మాకు లభించిన ఓ పరాత్పరా!  ఓ శ్రీహరీ! ఈ ధరపై అన్నిటా ప్రకాశించే్ నిన్ను
         నేను విడువ లేను కదా!

క:- తపమేలనో కనఁగ భ  -  క్త పటిష్ఠుఁడు కానిపించు తా శరణముగా!
      ఉపలబ్ధుడా!  విడువ లే  -  నె! పరాత్పర! వెల్గు నిన్ను నే ధరను హరీ! 42.
        భావము:-
        భక్తులకు పటిష్టుడైన ఆ పరాత్పరుడే తనకు తానుగానే శరణముగా కనిపించును.
        ఇక అతనిని చూచుటకై తపించ  వలసిన పని యేమున్నది? మాకు లభించిన ఓ శ్రీ హరీ!
        భూమిపై అన్నిటా వెలుగులీనెడి నిన్ను నేను విడువ లేను సుమా!

గీ:- కనఁగ భక్త పటిష్ఠుఁడు కానిపించు  -  మహిని శాశ్వతమిద్దని మాయఁ గొల్పు.
      విడువ లేనె! పరాత్పర! వెల్గు నిన్ను  -  వినుత ధర్మ పరాశ్రయ! వేణు గోప! 42.
        భావము:-
        చూచినట్లైతే భక్తులకు బలమైన ఆధారమైన పరమాత్మకనిపించును. భూమిపై ఈ కనిపించెడి
        సర్వస్వమును శాస్వితమనే భావన కల్పించి మాయలో ముంచును. ప్రశంసింపఁ బడెడి
        ధర్మమునే పరముగా ఆశ్రయించియున్న ఓ వేణు గోపుడా! ఓ పరాత్పరుఁడా! 
        అన్నిటా ప్రకాశించే నిన్ను నేను విడువ లేనయ్యా!
              
చ:- అల ఘన పాద! నీ కరములంట నయాచిత జ్ఞాన మొందుట  
      ల్లల మృదు వై న నీ పదములంట నయాచిత భాగ్య మొందుటల్.                    
      అల గుణ గణ్యమౌ నయనమంట నయాచిత న్యాయ మొందుటల్.
      కలుఁగు హరీ! యిటుల్ వెలయఁ గల్గుట నీ కృప వేణు గోపకా!  43.
        భావము:-
        ప్రసిద్ధమైన గొప్ప పాదములు కలవాఁడా! ఓ వేణు గోపుఁడా!  ఓ శ్రీ హరీ! నీ హస్తములు
        స్పర్శించినచో అయాచితమైన జ్ఞానము పొందుట జరుగును సుమా! ప్రసిద్ధమైన
        నీ మృదువైన పదము లంటినచో అయాచితమైన భాగ్యము పొందుట జరుగును సుమా!
        ప్రసిద్ధమైన నీ గుణ గణ్యమగు నేత్రములనంటిన అయాచితమైన న్యాయము పొందుట
        జరుగును సుమా! ఈ విధముగా మేము వెలయగల్గుట యన్నది నీకృపయే కాని
        వేరు కాదు కదా!  

క:- ఘన పాద! నీ  కరములం  -  ట నయాచిత జ్ఞాన మొందుటల్లల మృదు వై
      గుణ గణ్యమౌ నయనమం  -  ట నయాచిత న్యాయ మొందుటల్ కలుఁగు హరీ!  43.
        భావము:-
        గొప్ప పాదములు కలవాడా! ఓ శ్రీ హరీ! నీ హస్తములు స్పర్శించినచో అయాచితమైన జ్ఞానము
        పొందుట జరుగును సుమా! ప్రసిద్ధమైన మీ మృదువైన గుణ గణ్యమగు నేత్రములనంటిన
        అయాచితమైన న్యాయము పొందుట జరుగును సుమా!

గీ:- కరములంట నయాచిత జ్ఞాన మొందు -  పదములంట నయాచిత భాగ్య మొందు. 
      నయనమంటనయాచిత న్యాయమొందు - వెలయఁ గల్గుట నీ కృప వేణుగోప! 43. 
        భావము:-
        ఓ వేణు గోపుఁడా!  నీ హస్తములు స్పర్శించినచో అయాచితమైన జ్ఞానము పొందుట
        జరుగును. పదము లంటినచో అయాచితమైన భాగ్యము పొందుట జరుగును.
        నేత్రములనంటిన అయాచితమైన న్యాయము పొందుట జరుగును. ఈ విధముగా
        మేము వెలయఁ గల్గుట యన్నది నీకృపయే కాని వేరు కాదు కదా!                       
      
చ:- శుభ వసుధాస్థలిన్ చినుకు చుక్క సముద్రము చేతువీవెగా!
       అభయ దుడా! వినన్ పలుకు లందున తేనెలు పాఱఁ జేతువే?
       అభి వసియింతుమా - జననమంద ససేమిర సల్పనీవు ధై
       వభవ హరీ! కృపన్ వెలయ భక్తుల కాచెడి వేణు గోపకా!  44.
         భావము:-
         భక్తులను వెలయునట్లుగా కృపతో కాపాడే ఓ వేణు గోపకుఁడా! దైవత్వము నుండి పుట్టిన
         ఓ శ్రీహరీ! శుభప్రదమైన ఈ భూమిపై చినుకు చుక్కయే సముద్రముగా నీవేగదా
         చేయుదువు? ఓ అభయము నిచ్చువాడా! మేము వినునట్లుగా నీ మాటలలో
         తేనె ప్రవహింప చేయుదువు కదా? మాతో బాగుగా వసింతువు. మాయొక్క పుట్టుట
         యనునది ససేమిరా జరుగనీయవు కదా!

క:- వసుధాస్థలిన్ చినుకు చు  -   క్క సముద్రము చేతువీవెగా! అభయదుడా!
      వసియింతుమా  జననమం  -   ద ససేమిర సల్పనీవు ధైవ భవ హరీ!  44.
        భావము:-
        దైవత్వము నుండి పుట్టిన ఓ శ్రీహరీ! శుభప్రదమైన ఈ భూమిపై చినుకు చుక్కయే
        సముద్రముగా నీవే గదా చేయుదువు? ఓ అభయమునిచ్చువాడా!  మాతో బాగుగా
        వసింతువు. మా యొక్క పుట్టుట యనునది ససేమిరా జరగనీయవుకదా!

గీ:- చినుకు చుక్క సముద్రము చేతువీవె! -  పలుకులందున తేనెలు పాఱఁ జేతు?
      జననమంద ససేమిర సల్పనీవు  -  వెలయ భక్తుల కాచెడి వేణు గోప!  44.
        భావము:-
        భక్తులను వెలయునట్లుగా కాపాడే ఓ వేణు గోపుఁడా!  చినుకు చుక్కయే సముద్రముగా
        నీవే కదా చేయుదువు? మాటలలో తేనె ప్రవహింప చేయుదువు కదా?   మమ్ములను మరల
        పుట్టనీయవు కదా? ( మాకు ముక్తి నొసగెదవు )

చ:- ధర కరుణాలయా!  కనగ దాపరికం బెఱుగంగఁ జాల భా
       స్కర సదృశా! నినున్ కనుల గాంచగ కోరిక; కాంచఁ జేసి; శ్రీ
       ధర తెరువున్ గనన్ కనుల దాల్చి రహింపుచు కాచుమయ్య!  శ్రీ
       వరద హరీ! మహా విజయ భాగ్య ప్రదాయక! వేణు గోపకా! 45.
         భావము:-
         భూమిపై కరుణకు ఆలయమైనవాడా! గొప్ప విజయములు అనెడి భాగ్యమును 
         మాకు కల్పించు వాఁడా! ఓ వేణు గోపకుఁడా! చూడగా దాపరికమనునది నే నెఱుగను. 
         సూర్య భగవానుని వంటి
         వాఁడా! మంగళప్రదములగు వరములనొసగు ఓ శ్రీహరీ!  ఓ శ్రీధరుఁడా! నిన్ను 
         కనులతో చూడ వలెనని నా కోరిక. ఆ విధముగ చూచునట్లుగనూ; దాని కొఱకు 
         ఉపాయమును కనుగొను విధముగను మమ్ములను చేసి; నీ కళ్ళలో పెట్టుకొని; 
         మమ్ములను వృద్ధి చేయుచూ, కాపాడుము.

క:- కరుణాలయా!  కనగ దా  -  పరికం బెఱుగంగ జాల భాస్కర సదృశా!
      తెరువున్ గనన్ కనుల దా  -  ల్చి రహింపుచు కాచుమయ్య! శ్రీవరద హరీ! 45.
        భావము:-
        కరుణకు ఆలయమైనవాడా! మంగళ ప్రదమగు వరముల నొసగు ఓ శ్రీ హరీ! 
        ఆలోచించి చూడగా దాపరికమనునది నే నెఱుగను. సూర్య భగవానుని వంటి వాడా! 
        మార్గమును కనుగొను విధముగను మమ్ములను చేసి; నీ కళ్ళలో పెట్టుకొని; మమ్ములను  
        వృద్ధి చేయుచూ; కాపాడుము.

గీ:- కనగ దాపరికం బెఱుగంగఁ జాల  -  కనుల గాంచగ కోరిక; కాంచఁ జేసి;
      కనుల దాల్చి రహింపుచు కాచుమయ్య!  -  విజయ భాగ్య ప్రదాయక! వేణు గోప! 45.
        భావము:-
        విజయ భాగ్య ప్రదాయకుఁడవైన ఓ వేణు గోపకుఁడా! చూడగా దాపరికమన్నది 
        నేనెఱుగఁ జాలను. కనులారా నిన్ను చూడాలనే కోరిక గలవాడను. ఆవిధముగ 
        నిన్ను చూచునట్లు చేసి; నీ కన్నులలో పెట్టుకొని కాపాడుచూ నన్ను వృద్ధి చేయుము.
           ( సశేషం ) 
జైశ్రీరాం.జైహింద్.            
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.