గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, జులై 2011, శుక్రవారం

శ్రీ వేణు గోప కంద గీత గర్భ చంపకోత్పల శతకము. పద్యము 3 / 21 వ భాగము


చ:- ఘన రమణీ మణీ హృదయ కాంతి ముదాకృతి కృష్ణ వీవె. తృ
      ప్తి నరయగన్. సుధా మధుర ప్రేరణ నీ కృప;  మాకు దక్కెరా!
      జన సుమనోజ్వలా! పొగడఁ జాలముగా నిను. పోషకుండ! లా
      లనగ హరీ! నినున్ పిలువ లజ్జిలుటేమిర! వేణు గోపకా! 11.
      భావము:-
      ఓ వేణు గోపకా! ఓ కృష్ణా! మనస్తృప్తిగా వెదికి చూడగా రమణీ మణుల యొక్క 
      హృదయములందు గొప్ప కాంతితో విలసిల్లే హర్షణీయమైన ఆకారము నీవే సుమా! 
      అమృతము వంటి మధుర భావ ప్రేరణ కలిగినదన అది నీ కృపచేతనే కదా! 
      అది మాకే లభించినది. ప్రజల మంచి మనసులలో ప్రకాశించేవాఁడా! మమ్ములను 
      పోషించేవాఁడా! ఓ హరీ! నిన్ను లాలనగా పొగడుటకు మేము సరిపోముకదా! 
      నిన్ను నేను పిలుచు చుండగా నీవు సిగ్గు పడుటేమిటి?  

క:- రమణీ మణీ హృదయ కాం  -  తి ముదాకృతి కృష్ణ వీవె. తృప్తి నరయగన్. 
      సుమనోజ్వలా! పొగడఁ జా  -  లముగా నిను పోషకుండ లాలనగ; హరీ! 11.
      భావము:-
      ఓ కృష్ణా! మనస్తృప్తిగా వెదికి చూడగా రమణీ మణుల యొక్క హృదయములందు గొప్ప కాంతితో
      విలసిల్లే హర్షణీయమైన ఆకారము నీవే సుమా! మంచి మనసులలో ప్రకాశించేవాఁడా!
      మమ్ములను పోషించేవాఁడా! ఓ హరీ! నిన్ను లాలనగా పొగడుటకు మేము 
      సరిపోముకదా!

గీ:- హృదయ కాంతి ముదాకృతి కృష్ణ వీవె.  -  మధుర ప్రేరణ నీ కృప;  మాకు దక్కె!
      పొగడఁ జాలముగా నిను. పోషకుండ!  -  పిలువ లజ్జిలుటేమిర! వేణు గోప! 11.
      భావము:-
      ఓ వేణు గోపకా! ఓ కృష్ణా! రమణీ మణుల యొక్క హృదయములందు గొప్ప కాంతితో విలసిల్లే  
      హర్షణీయమైన ఆకారము నీవే సుమా! మధుర భావ ప్రేరణ కలిగినదన అది నీ కృప చేతనే కదా!
      అది మాకే లభించినది. మమ్ములను పోషించేవాఁడా!  నిన్ను  పొగడుటకు మేము 
      సరిపోముకదా! నిన్ను నేను పిలుచు చుండగా నీవు సిగ్గు పడుటేమిటి?  

చ:- భువి భవదీయులౌ పరమ పుణ్య వదాన్యుల పాద ధూళి నా
      కవిరళమై తగన్ కలుఁగ, యద్భుత మార్గ సుగమ్య సూచి యై
      యవి కవనాకృతిన్ కలిగి అయ్యవి నీ కథ గాంచఁజేయున
      య్య విన; హరీ! సదా విమల! హాయి నొసంగెడు వేణు గోపకా! 12.
      భావము:-
      ఎల్లప్పుడూ నిర్మలమైన హాయిని కలుగఁ జేసెడి ఓ వేణు గోపకుఁడా! ఓ శ్రీ హరీ! వినినచో  భువిపై
      నీవారైన; పరమ పుణ్యముతో కూడిన వారును; మనోజ్ఞముగా మాటలాడెడి వారును ఐన
      వారి యొక్క పాద ధూళి నాకొఱకు అవిరళముగా తగిన విధముగా లభించినచో సుగమమైన
      అద్భుత మార్గ సూచి యగుచు; అవియే కవిత్వముగా రూపొంది;  అవియే నీయొక్క చరిత్రను
      చూడఁ జేయును.

క:- భవదీయులౌ పరమ పు  -  ణ్య వదాన్యుల పాద ధూళి నాకవిరళమై 
      కవనాకృతిన్ కలిగి అ  -  య్యవి నీ కథ గాంచఁజేయునయ్య; విన; హరీ! 12.
      భావము:-
      ఓ శ్రీ హరీ! వినినచో నీవారైన; పరమ పుణ్యముతో కూడిన వారును; మనోజ్ఞముగా 
      మాటలాడెడి  వారును ఐన వారియొక్క పాద ధూళి నాకొఱకు అవిరళముగా 
      కవిత్వముగా రూపొంది;  అవియే  నీ యొక్క చరిత్రను చూడఁ జేయును.

గీ:- పరమ పుణ్య వదాన్యుల పాద ధూళి   -  కలుఁగ, యద్భుత మార్గ సుగమ్య సూచి 
      కలిగి అయ్యవి నీ కథ గాంచఁజేయు!  -  విమల! హాయి నొసంగెడు వేణు గోప! 12.
      భావము:-
      ఎల్లప్పుడూ నిర్మలమైన హాయిని కలుగ జేసెడి ఓ వేణు గోపుఁడా! పరమ పుణ్యముతో కూడిన
      వారును;  మనోజ్ఞముగా మాటలాడెడి వారును ఐన వారియొక్క పాద ధూళి నా కొఱకు
      లభించినచో సుగమమైన అద్భుత మార్గ సూచి  అవియే నీయొక్క చరిత్రను కలిగి యుండి
      చూడఁ జేయును.

చ:- సమరస భావమున్ నిగమసార! సమర్పణ; నిశ్చలాత్మ రా
      మ మననమున్; మహా మహితమౌ ఋషి తేజము; మౌన దీప్తియున్
      తమ యసమానమౌ పరమ తత్వ సురూప  విభావ నాత్మఁ పం
      చు; ముర హరీ! తగన్  విమల శోభలు నిల్పుమ! వేణు గోపకా! 13.
      భావము:-
      ఓ వేణు గోపకుఁడా! ఓ నిగమసారా! ఓ శ్రీ హరీ!  అభేద భావమును;  సమర్పణ భావమును;
      నిశ్చలమైన ఆత్మను; శ్రీ రామ స్మరణమును;  మిక్కిలి గొప్పదైన వశిష్ఠాది ఋషులలో ఉండెడి
      తేజస్సు; మౌన ప్రకాశమును; సాటి లేని తమయొక్క పర బ్రహ్మ తత్వము యొక్క మంచి
      రూపము యొక్క విశిష్టమైన బావనతో కూడి యుండెడి ఆత్మను; నాకు తగిన విధముగా పంచి
      యిమ్ము. నిర్మలమైన శోభను నాలో నిల్పుము.

క:- రస భావమున్ నిగమసా  -  ర! సమర్పణ; నిశ్చలాత్మ రామ మననమున్; 
      యసమానమౌ పరమ త  -  త్వ సురూప  విభావ నాత్మఁ పంచుముర హరీ! 13.
      భావము:-
      ఓ నిగమసారా! ఓ శ్రీ హరీ!   అభేద భావమును;  సమర్పణ భావమును; నిశ్చలమైన ఆత్మను;
      శ్రీ రామ స్మరణమును; సాటి లేని పర బ్రహ్మ తత్వము యొక్క మంచి రూపము యొక్క
      విశిష్టమైన బావనతో కూడి యుండెడి ఆత్మను; నాకు తగిన విధముగా పంచి యిమ్ము.

గీ:- నిగమసార! సమర్పణ; నిశ్చలాత్మ  -  మహితమౌ ఋషి తేజము; మౌన దీప్తి
      పరమ తత్వ సురూప  విభావ నాత్మఁ  -  విమల శోభలు నిల్పుమ! వేణు గోప! 13.
      భావము:-
      ఓ వేణు గోపుఁడా! ఓ నిగమసారా! సమర్పణ భావమును; నిశ్చలమైన ఆత్మను; 
      మిక్కిలి గొప్పదైన వశిష్ఠాది ఋషులలో ఉండెడి తేజస్సు; పర బ్రహ్మ తత్వము యొక్క 
      మంచి రూపము యొక్క విశిష్టమైన బావనతో కూడి యుండెడి ఆత్మను;  
      నిర్మలమైన శోభను నాలో నిల్పుము.

చ:- సుమ సుకుమారుడా! కరుణఁ జూపి, కళాత్ముల కాంక్ష తీర్చి; పే
      రిమి  గనితే! సదా! నుత వరిష్ఠుల గొల్పు మనోజ్ఞ భావ! దై
      వమ! సకలాక్షరా!  గొలుపవా? సకలాత్ములఁ గొల్చు భక్తి; సా
      మమున హరీ! తగన్ విమల మార్గముఁ జూపెడి! వేణు గోపకా! 14.
      భావము:-
      పూవు వలె సున్నితమైనవాఁడా! నిర్మలమైన మార్గమును జూపెడి ఓ వేణు గోపకుఁడా! 
      ఓ శ్రీ హరీ! నీవు కరుణఁ జూపి; కళాహృదయుల యొక్క కోరిక తీర్చి;  ప్రసిద్ధి పొందితివా! 
      పొగడ బడెడి వరమైన వారిని పుట్టించ వలెననెడి మనోజ్ఞమైన భావము కలవాఁడా! 
      ఓ పరమాత్మా! సమస్తమైన అక్షర స్వరూపుఁడా! సమస్తమైన ఆత్మలను గొలిచెడి 
      భక్తి భావమును అనుకూలమైన ఉపాయముతో తగిన విధముగా నాలో కలుగ జేయవా?  

క:- సుకుమారుడా! కరుణఁ జూ  -  పి, కళాత్ముల కాంక్ష తీర్చి; పేరిమి  గనితే! 
      సకలాక్షరా!  గొలుపవా?  -  సకలాత్ములఁ గొల్చు భక్తి; సామమున హరీ! 14.
      భావము:-
      సున్నితమైనవాడా!  ఓ శ్రీహరీ! నీవు కరుణ జూపి; కళాహృదయుల యొక్క కోరిక తీర్చి;
      ప్రసిద్ధి పొందితివా!  సమస్తమైన అక్షర స్వరూపుడా! సమస్తమైన ఆత్మలను గొలిచెడి
      భక్తి భావమును అనుకూలమైన ఉపాయముతో తగిన విధముగా  నాలో కలుగ జేయవా?  

గీ:- కరుణఁ జూపి, కళాత్ముల కాంక్ష తీర్చి;  -  నుత వరిష్ఠుల గొల్పు మనోజ్ఞ భావ!
      గొలుపవా? సకలాత్ములఁ గొల్చు భక్తి;  -  విమల మార్గముఁ జూపెడి! వేణు గోప! 14.
      భావము:-
      సమస్తమైన ఆత్మలను గొలిచెడి భక్తి భావమును; నిర్మలమైన మార్గమును జూపెడి
      ఓ వేణు గోపుఁడా! నీవు కరుణ జూపి; కళాహృదయుల యొక్క కోరిక తీర్చి; పొగడ బడెడి
      వరమైన వారిని పుట్టించ వలెననెడి మనోజ్ఞమైన భావము కలవాఁడా!

చ:- రమ రమణీయ సన్ మనమె రాజ్యముగా మహిమన్ వసింతు; సా
      ధ్యమయెనుగా! మహా మహుల ధన్యులఁ జేతువు. మమ్ము గావ నే
      రమ!  గమనింపగా భరమ? ప్రాణములుండగ! ప్రాణ నాథ! న్యా
      యమొకొ? హరీ! సదా  వినుతు లందు  గుణాత్మక! వేణు గోపకా! 15.
      భావము:-
      ఎల్లప్పుడూ పొగడ్తలందెడి గుణముతో కూడిన మనస్సు కలవాఁడవైన ఓ వేణు గోపకుఁడా!
      ఓ శ్రీ హరీ! లక్ష్మీ దేవి యొక్క అందమైన మంచి మనస్సే రాజ్యము కాగా నీవచ్చట
      మహిమతో నివసింతువు. నీకది సాధ్యమాయెను కదా! మహామహులైన వారికి
      ధన్యత చేకూరుతువు. ఓ ప్రాణ నాథా! మా ప్రాణములుండగా మమ్ములను కాపాడుట
      నేరమగునా? ఆలోచింపగా ఆ పని కష్టమైనదా? ఈ విధముగ ఉపేక్షించుట నీకు న్యాయమా?

క:- రమణీయ సన్ మనమె రా  -  జ్యముగా మహిమన్ వసింతు సాధ్యమయెనుగా! 
      గమనింపగా భరమ?ప్రా  -  ణములుండగ! ప్రాణ నాథ! న్యాయమొకొ? హరీ! 15.
      భావము:-
      ఓ శ్రీ హరీ! అందమైన మంచి మనస్సే రాజ్యము కాగా నీవచ్చట మహిమతో నివసింతువు.  నీకది
      సాధ్యమాయెను కదా! ఓ ప్రాణ నాథ! మా ప్రాణములుండగా మమ్ములను నీవు గమనించుటయే
      నీకు కష్టమైన పనియా? అది నీకు న్యాయమా?

గీ:- మనమె రాజ్యముగా మహిమన్ వసింతు - మహుల ధన్యులఁ జేతువు.మమ్ము గావ 
      భరమ?ప్రాణములుండగ! ప్రాణ నాథ!  - వినుతు లందు  గుణాత్మక! వేణు గోప! 15.
      భావము:-
      ఎల్లప్పుడూ పొగడ్తలందెడి గుణముతో కూడిన మనస్సు కలవాడవైన ఓ వేణు గోపుడా! మనస్సే
      రాజ్యము కాగా నీవచ్చట మహిమతో నివసించు చుంటివి.  మహామహూలైన వారికి ధన్యత
      చేకూరుతువు.  ఓ ప్రాణ నాథా! మా ప్రాణములుండగా మమ్ములను కాపాడుట కష్టమా?
( సశేషం )
జైశ్రీరాం.
జైహింద్.
Print this post

1 comments:

మిస్సన్న చెప్పారు...

కంద పద్యములను అందముగా వ్రాసి
తేట గీతములను తీర్చి దిద్ది
వృత్త మందు పొదిగి వృష్ణి ప్రదీపకు
నుతుల జేయు మీకు నతులు గొనుడు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.