గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, జులై 2011, మంగళవారం

శ్రీ వేణు గోప కంద గీత గర్భ చంపకోత్పల శతకము. పద్యము 6 / 21 వ భాగము


ఉ:- పోతన భక్తి భావనము పొందినదై నిను వన్నె గాంచె దృ
      గ్జాతమయెన్‍గ! యా తఱిని చక్కగ భాగవతమ్ముఁ జెప్పెఁ గా
      దే! తనలోనిదై వఱలు దివ్య నిరామయు భవ్యరూప ప్ర
      ఖ్యాతి; హరీ! కృపన్ విజయ కానుక నిచ్చిన వేణు గోపకా! 26.
      భావము:-
      కృపతో విజయములనే కానుకగా యిచ్చిన ఓ వేణు గోపకుఁడా! ఓ శ్రీ హరీ!
      పోతన మహా కవి యొక్క భక్తి  భావము నిన్ను పొంది వన్నె గడించెను.
      ఆ సమయమున భాగవతము అతని  జ్ఞాన నేత్రము నుండి ఉద్భవించెను కదా!
      ఓ గొప్ప నిరామయుఁడా!  ఆ మంచి సమయముననే తన లోనే యుండి వరలెడి
      నీ యొక్క భవ్య రూపము యొక్క ప్రఖ్యాతిని  చక్కగా భాగవతమున చెప్పెను కదా!

క:- తన భక్తి భావనము పొం  -  దినదై నిను వన్నె గాంచె దృగ్జాతమయెన్ గ!
      తన లోనిదై వఱలు ది  -  వ్య నిరామయ! భవ్యరూప ప్రఖ్యాతి హరీ! 26.
      భావము:-
      భవ్యమైన రూపముచే ప్రఖ్యాతి పొందిన ఓ శ్రీ హరీ! తాను వేరుగా భావింపఁ బడెడి
      మానవుఁడు  తన భక్తి భావము నిన్నే పొందిన కారణముగా వన్నె గాంచెను.
      ఆ మానవుని లోనిదై వరలెడి నీ దివ్య నిరామయ స్వరూపము అతని
      అంతర్ జ్ఞాన నేత్రము నుండి పుట్టెను కదా!

గీ:- వనము పొందినదై నిను వన్నె గాంచె -  తఱిని చక్కగ భాగవతమ్ముఁ జెప్పెఁ
      వఱలు దివ్య నిరామయ భవ్యరూప -  విజయ కానుక నిచ్చిన వేణు గోప! 26.
      భావము:-
      విజయ కానుకలనొసగెడి ఓ వేణు గోపుఁడా! బృందావనము నిన్ను పొంది వన్నె గడించెను.
      ఆ  సమయమున చక్కగా వరలెడి దివ్య నిరామయ స్థితితో ఒప్పెడి భవ్యమైన నీ రూపమును;
      నీకు సంబంధించిన చరిత్రను తన ప్రకృతి రూపముననే తెలియఁ జెప్పెను.

ఉ:- నీ కను పాపలో వెలుగు నే కనఁ గల్గుట వింత కాదుగా?
      నీకనఁ గాదటుల్! జిలుగు నీదగు, నాదగు జిడ్డు బాప! ద
      క్షా! కనఁ గాదుగా కనుల గాంచను నాముఖ కాంతి రేఖ సం
      లోక హరీ! ప్రభూ! వెలుగు లోపలఁ గొల్పుమ! వేణు గోపకా! 27.
      భావము:-
      లోకమును సంలోకించువాడవైన ఓ శ్రీ హరీ! ఓ ప్రభూ! నీకు సంబంధించిన కాంతి
      నాకు సంబంధించిన జాడ్యమును నశింపఁ జేయగా నీ కన్నులఁ గల కాంతి రేఖ
      నేను చూడఁ గలుగుట విచిత్ర మేమీ కాదు కదా! నేను పలికిన విధముగ అనుటకు
      నీకు కుదరదు. ఓ దక్షుఁడా! ఆలోచించి చూడగా నాముఖము లోని ( లేని ) కాంతి రేఖను
      నీకనులార గాంచుట అసాధ్యము కదా! నీ స్వరూపమైన వెలుగు రేఖను నాలోపలఁ గొల్పుము.

క:- కను పాపలో వెలుగు నే  -  కనఁ గల్గుట వింత కాదుగా? నీకనఁగా
      కనఁ గాదుగా! కనుల గాం  -  చను నాముఖ కాంతి రేఖ సంలోక హరీ! ప్రభూ! 27.
      భావము:-
      లోకములను సంలోకించు ఓ శ్రీ హరీ! కంటి పాపలో వెలుగును నేను చూడ గలుగుట
      విచిత్రమేమీ కాదు కదా! ఆలోచింపగా నీకైతే నా ముఖములో కాంతి రేఖ చూచుట
      కనులారాచూచుట జరుగదు కదా! నా ముఖములో ఆ కాంతి లేదు కావున అసాధ్యము.

గీ:- వెలుగు నే కనఁ గల్గుట వింత కాదు -  జిలుగు నీదగు, నాదగు జిడ్డు బాప!
      కనుల గాంచను నాముఖ కాంతి రేఖ -  వెలుగు లోపలఁ గొల్పుమ! వేణు గోప! 27.
      భావము:-
      ఓ వేణు గోపుఁడా! నీకు సంబంధించిన వెలుగు నాలోని జాడ్యమును నశింపఁ జేయగా దైవ
      సంబంధమైన వెలుగు రేఖను నేను చూడఁ గలుగుట విచిత్రమేమీ కాదు. నీ ముఖము లోని
      కాంతి రేఖను నా కనులతో చూచుట కొఱకు నా హృదయము లోపల నీకు సంబంధించిన
      వెలుగును ముందుగా పుట్టించుము.

చ:- కనఁ రమణీయమౌ కవుల జ్ఞానము నీవయి  గాంచఁ జేసినా
      వ నుపమమౌన్. గనన్ రవియు నారయ లేనివి రాజిలంగ తో
      చిన; సుమనోజ్ఞమౌ రచన చేయు మహాద్భుత రాణ నిస్తి. యొ
      ప్పు నది; హరీ! భువిన్ వెలయు పుణ్యము నీవెగ! వేణు గోపకా! 28.
      భావము:-
      ఓ వేణు గోపకుడా! ఓ శ్రీ హరీ! చూడగా రమణీయమైన కవుల లోఁ గల జ్ఞానము
      స్వయముగా నీవే అయి; చూడఁ జేసితివి. సాటి లేనిదగును కదా ఆ పని.
      సూర్యుఁడునూ చూడ జాలనివి రాజిల్లునట్లుగా మనస్సునకు తోచగా
      మంచి హృద్యంగమమైన రచన చేసేటువంటి మహాద్భుతమైన
      నైపుణ్యమును కవుల కొసంగితివి కదా! అది ఒప్పిదమైయున్నది సుమా!

క:- రమణీయమౌ కవుల జ్ఞా  -  నము నీవయి  గాంచఁ జేసినావ నుపమమౌన్.
      సుమనోజ్ఞమౌ రచన చే  -  యు మహాద్భుత రాణ నిస్తి. యొప్పు నది; హరీ! 28.
      భావము:-
      ఓ శ్రీహరీ! కవులకుండే రమణీయమగు జ్ఞానము అది నీవే అయి నిలిచి; చూచునట్లు చేసితివి.
      అది సాటి లేని పనియే అగును. మంచి మనోజ్ఞమగు రచనను చేసెడి శక్తిని కవులకు
      ప్రసాదించితివి. అది ఒప్పిదమై యున్నది సుమా!

గీ:- కవుల జ్ఞానము నీవయి  గాంచఁ జేసి  -  రవియు నారయ లేనివి రాజిలంగ
      రచన చేయు మహాద్భుత రాణ నిస్తి. -  వెలయు పుణ్యము నీవెగ! వేణు గోప! 28.
      భావము:-
      ఓ వేణు గోపుఁడా! కవులలో ఉండే జ్ఞానము స్వయముగా నీవే అయి; చూడఁ జేసి; సూర్యుఁడు
      కూడా చూడ జాలనివి కూడా రచన చేసే విధముగా మహాద్భుతమైన నైపుణ్యమును కవులకు
      ప్రసాదించితివి. తత్ పుణ్య ఫలముగా వెలయు కావ్య స్వరూపము నీవే కదా!

చ:- మది వసియించు దుర్ వ్యధలు ; మాన, సుధామతు లంతరింప; నా
      యెదఁ గనితిన్. మహిన్ బుధుల నెల్ల రసాకృతి మూలకేగుఁగా!
      మది వసుధేశుఁడా కరుణ మానస! గాంచుమ. కట్టడించు నా
      వ్యధను హరీ! సదా వినుచు  హాయి నొసంగుమ ! వేణు గోపకా! 29.
      భావము:-
      ఓ వేణు గోపకుఁడా! నా మనస్సు నందు చెడ్డవైన వ్యధలు వసియించు చున్నవి.
      నా మనస్సునందు గల మానము; అమృతోపమానమైన బుద్ధి అంతరించి పోగా
      అది నేను చూచితిని. పండితుల యందుండెడి సమస్తమైన రస స్వరూపములును
      అణగి పోవును కదా! ఓ కరుణతో గూడిన మనస్సు కలవాడా! ఓ శ్రీ హరీ! ఓ వసుధేశుఁడా!
      నీ మనస్సులో ఈ విషయమును గమనింపుము.నాకు సంప్రాప్త మగుచున్న వ్యధను
      కట్టడి చేయుము. నా మాటలు నీవు ఆలకించుచు ఎల్లప్పుడూ నాకు
      హాయిని ప్రాప్తింపఁ జేయుము.

క:- వసియించు దుర్ వ్యధలు ; మా -  న, సుధామతు లంతరింప; నాయెదఁ గనితిన్.
      వసుధేశుఁడా కరుణ మా  -  నస! గాంచుమ. కట్టడించు నావ్యధను హరీ! 29.
      భావము:-
      ఓ శ్రీహరీ! నా మనసులో ఉండెడి అభిమాన ధనము; సుధా మతి అంతరించు విధముగా నా
      మనస్సునందు దుష్టమైన బాధలు  వసియించుచుండును. అది నేను చూచితిని.
      ఓ వసుధాధిపా! కరుణా మనస్కుఁడా! చూడుము. నాకు సంభవిస్తున్న వ్యధను
      కట్టడి చేయుము.

గీ:- వ్యధలు ; మాన, సుధామతు లంతరింప; -  బుధుల నెల్ల రసాకృతి మూలకేగుఁ!
      కరుణ మానస! గాంచుమ. కట్టడించు - వినుచు హాయినొసంగుమ ! వేణుగోప! 29.
      భావము:-
      ఓ వేణు గోపుఁడా! వ్యధలు అభిమాన సుధా మతులను అంతరింపఁ జేస్తుండగా పండితులలో
      నుండెడి సమస్తమైన కావ్య నిర్మాణమునకు సంబంధించిన రస స్వరూపమూ మారుమూల పడి
      పోవును. ఓ కరుణాహృదయుఁడా! నా మాట వినుచు; అట్టి అవాంఛనీయ వ్యధను నిరోధించి;
      హాయిని కలుగఁ జేయుము.

చ:- పలు ఘనతల్ గనన్ మధుర భాషణ చాతురి మంబునీయ; సం
      తుల మతితో నిలన్ సుకవి తోషణఁ గూర్చెడి సూక్తి నీయ;కో!
      పిల ఎనలేనిదౌ కుకవి భీషణ వాగ్ ఝరి కూర్మినీయ; సం
      దడియె హరీ! ననున్ వెలయఁ దారిని గొల్పితె? వేణు గోపకా! 30.
      భావము:-
      ఓ వేణు గోపకుఁడా! ఓ శ్రీహరీ! అనేక విధములైన  ప్రఖ్యాతులు పొందే విధముగా మధురముగా
      మాటాడే చతురత నాకు నీ వీయగా;  సరి సమానమైన మనస్సుతో సుకవులకు ఆనందము
      కలిగించఁ గలిగెడి మంచి మాటను ప్రసాదింప; కుకవుల విషయమున కోపించుటకు అంతు
      లేనిదైనటువంటి భయంకరమైన వాక్ ప్రవామును ప్రేమతో నాకు నీవీయగా
      అది నాకు సందడియే సుమా! నన్ను వెలయఁ జేయుటకు చక్కని మార్గమునుఁ
      సిద్ధ పరచితివా?

క:- ఘనతల్ గనన్ మధుర భా  -  షణ చాతురి మంబునీయ; సంతుల మతితో
      ఎనలేనిదౌ కుకవి భీ  -  షణ వాగ్ ఝరి కూర్మినీయ; సందడియె హరీ!  30.
      భావము:-
      ఓ శ్రీ హరీ! ఘనతలు గాంచు విధముగా నాకు నీవు మధుర భాషణా చతురతను
      సంతుల మతితోనీయగా; కుకవి భీషణ మైన అంతు లేని  వాగ్ఝరి నీయగా
      అది నాకు సందడియే సుమా!

గీ:- మధుర భాషణ చాతురి మంబునీయ; -  సుకవి తోషణఁ గూర్చెడి సూక్తి నీయ;
      కుకవి భీషణ వాగ్ ఝరి కూర్మినీయ; -  వెలయఁ దారిని గొల్పితె? వేణు గోప! 30.
      భావము:-
      ఓ వేణు గోపుఁడా! నాకు మధురముగా సంభాషించు నైపుణ్యము నిచ్చుట కొఱకు; సుకవుల
      కానందము కలిగించే విధముగ నుండు మంచి మాటలను ప్రసాదించుట కొఱకు; కుకవులకు
      భయంకరముగా నుండు వాక్ ప్రవాహమును ప్రేమతో యిచ్చుట కొఱకు; నన్ను
      వెలయఁ జేయుట కొఱకు; మంచి మార్గమును నాకు చూపితివా!
      ( సశేషం )
జై శ్రీరాం.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.