గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, జులై 2011, శనివారం

శ్రీ వేణు గోప కంద గీత గర్భ చంపకోత్పల శతకము. పద్యము 10 / 21 వ భాగము

ఉ:- జీవన సారధీ!  మములఁ జే కొనవా కని మంచిఁ జూపి;  గో
       సేవకుఁడా! మహా ఘనుఁడ! శ్రీ పద ధూళిని కల్గఁ జేసి; శ్రీ
       శా! వనమాలివే! మములఁ జక్కన జేయవె మాన్యులట్లు క్ష్మా;
       దేవ హరీ! సదా వినుత తేజ ప్రకల్పక! వేణు గోపకా! 46.
         భావము:-
         ఎల్లప్పుడూ ప్రశంసింపఁబడెడి జ్ఞాన తేజమును ప్రకల్పించువాఁడా! ఓ వేణు గోపకుఁడా!
         భగవంతుఁడివైన ఓ శ్రీ హరీ!  మా జీవన రథ సారథీ! మమ్ములను చూచి
         మంచిని మాకు చూపి; మమ్ములను స్వీకరింపవా? ఓ గోపాలకుఁడా!
         మహా గొప్పవాఁడా!  ఓ లక్ష్మీపతీ! వనమాలివే కదా! భూమిపై నీ పద ధూళిని
         మాకు ప్రాప్తింపఁ జేసి మాన్యుల విధముగ చక్కనగునట్లుగా చేయవా?

క:- వన సారధీ!  మములఁ జే  -  కొనవా కని మంచిఁ జూపి;  గో సేవకుఁడా!
      వనమాలివే! మములఁ జ  -  క్కన జేయవె మాన్యులట్లు క్ష్మా దేవ హరీ! 46.
        భావము:-
        భగవంతుడివైన ఓ శ్రీ హరీ!  వన సారథీ!  మమ్ములను చూచి మంచిని మాకు చూపి;
        మమ్ములను స్వీకరింపవా? ఓ గోపాలకుఁడా! వనమాలివే కదా! భూమిపై నీ పద ధూళిని
        మాకు ప్రాప్తింపఁ జేసి మాన్యుల విధముగ చక్కనగునట్లుగా చేయవా?

గీ:- మములఁ జే కొనవా కని మంచిఁ జూపి? -  ఘనుఁడ! శ్రీ పద ధూళిని కల్గఁ జేసి;
      మములఁ జక్కన జేయవె మాన్యులట్లు -  వినుత తేజ ప్రకల్పక! వేణు గోప! 46.
        భావము:-
        ప్రశంసింపఁబడెడి జ్ఞాన తేజమును ప్రకల్పించువాఁడా! ఓ వేణు గోపుఁడా!     మమ్ములను చూచి
        మంచిని మాకు చూపి; స్వీకరింపవా? మహా గొప్పవాఁడా! నీ పద ధూళిని మాకు
        ప్రాప్తింపఁ జేసి, మాన్యుల విధముగ చక్కనగునట్లుగా చేయవా?

ఉ:- నే వినుతింతు నా హృదయ నిత్య నివాసుఁడ! ఈప్సితార్థ దా!
       శ్రీ వరుఁడా! సదా మధువుఁ జిందెడి సత్కృతి మాకుఁ గొల్పు! రా
       నా వనమాలివై విరుల నందన శోభలఁ వెల్గనిమ్ము తత్
       భావ హరీ! దయన్ వెలయు పద్యము లీవుగ! వేణు గోపకా! 47.
         భావము:-
         నా హృదయమున నిత్యము నివసించు్వాడా! ఓ వేణు గోపకుఁడా! నిన్ను నేను
         వినుతింతును.  ఈప్సితార్థమునొసగెడివాడా! ఓ లక్ష్మీ వరుఁడా! ఎల్లప్పుడూ
         అమృత ప్రాయముగ నుండెడి సత్కవిత్వమును మాకు ప్రసాదింపుము. నా వనమాలివై
         రమ్ము.తద్భావుఁడవైన ఓ శ్రీ హరీ!  విరులతోనొప్పెడి నందన వన శోభను
         మా పరిసరముల తేజరిల్లనిమ్ము. దయతో నా కలమునుండి వెలువడే పద్యములు
         నీవే కదా!

క:- వినుతింతు నా హృదయ ని  -  త్య నివాసుఁడ! ఈప్సితార్థ దా! శ్రీ వరుఁడా!
      వనమాలివై విరుల నం  -  దన శోభలఁ వెల్గనిమ్ము తత్భావ హరీ! 47.
        భావము:-
        నా హృదయమున నిత్యము నివసించువాఁడా!   ఓ శ్రీ హరీ! నిన్ను నేను వినుతింతును.
        ఈప్సితార్థము నొసగెడి వాఁడా! ఓ లక్ష్మీ వరుఁడా!  నా వనమాలివై రమ్ము. తద్భావుఁడవైన
        ఓ శ్రీ హరీ! విరులతో నొప్పెడి నందన వన శోభను మా పరిసరముల తేజరిల్లనిమ్ము.

గీ:- హృదయ నిత్య నివాసుఁడ! ఈప్సితార్థ -  మధువుఁ జిందెడి సత్కృతి మాకుఁ గొల్పు!
      విరుల నందన శోభలఁ వెల్గనిమ్ము! -  వెలయు పద్యము లీవుగ! వేణు గోప! 47.
        భావము:-
        నా హృదయమున నిత్యము నివసించువాడా! ఓ వేణు గోపకుఁడా! నిన్ను నేను వినుతింతును.
        నా ఈప్సితార్థమయిన ఎల్లప్పుడూ అమృతప్రాయముగ నుండెడి సత్ కవిత్వమును మాకు
        ప్రసాదింపుము. విరులతో నొప్పెడి నందన వన శోభను మా పరిసరముల తేజరిల్లనిమ్ము.
        నా కలమునుండి వెలువడే పద్యములు  నీవే కదా!

చ:- మృదు మధురాక్షరా! కరుణ నీ వ్యధ లెన్నుచుఁ గాంచు చుందువా!
       బుధ వినుతా! మహా కృపను బుద్ధుల సద్గతి నిచ్చి చూచి మా
       మది మృదు భావనల్; సుగుణ మాన ధనంబులఁ శోభఁ గూర్చు నా
       యెదను హరీ! సదా! విచలితేక్షణ! మ్రొక్కెద! వేణు గోపకా! 48.
         భావము:-
         మృదు మధురాక్షరుఁడా! ఓ వేణు గోపకుఁడా! ఈ నా వ్యధలను కరుణ కలవాడవై
         లెక్కించుచూ, చూచుచూ ఉందువా? బుధ వినుతుఁడా! ఓ శ్రీ హరీ!  మా మనస్సునందు
         నీ గొప్ప కృపతో బుద్ధుల యొక్క సద్గతిని ఒసగి చూచి; నా మనసులో సుకుమారమైన
         భావనలను; సుగుణ మాన ధనములతో గూడిన శోభను చేకూర్చుము. ఓ విచలితేక్షణుఁడా!
         ఎల్లప్పుడూ నిన్ను నేను మ్రొక్కెదను.

క:- మధురాక్షరా! కరుణ నీ -  వ్యధ లెన్నుచుఁ గాంచు చుందువా! బుధ వినుతా!
      మృదు భావనల్; సుగుణ మా  -  న ధనంబులఁ శోభఁ గూర్చు నాయెదను హరీ! 48.
        భావము:-
        ఓ మధురాక్షరుఁడా! ఓ వేణు గోపకుఁడా! ఈ నా వ్యధలను కరుణ కలవాడవై  లెక్కించుచూ
        చూచుచూ ఉందువా? బుధ వినుతుఁడా! ఓ శ్రీ హరీ! నా మనసులో సుకుమారమైన
        భావనలను; సుగుణ మాన ధనములతో గూడిన శోభను చేకూర్చుము.

గీ:- కరుణ నీ వ్యధ లెన్నుచుఁ గాంచు చుందు! -  కృపను బుద్ధుల సద్గతి నిచ్చి చూచి !
      సుగుణ మానధనంబులఁ శోభఁ గూర్చు -  విచలితేక్షణ! మ్రొక్కెద! వేణు గోప! 48.
        భావము:-
        ఓ వేణు గోపకూఁడా! ఈ నా వ్యధలను లెక్కించుచూ చూచుచూ ఉందువు కదా! నీ గొప్ప కృపతో
        బుద్ధుల యొక్క సద్గతిని ఒసగి చూచి; సుగుణ మానధనములతో గూడిన శోభను
        చేకూర్చుము.ఓ విచలితేక్షణుఁడా! నిన్ను నేను మ్రొక్కెదను.

చ:- తిరుపతి! నీ శుభా కృతులఁ దీప్తి తెఱంగుల నెన్నఁ జాలుదే?
       పరిపరి నే. నినున్ విమల భావన గొల్పగ వేడుకొందుగా!
       ధర నుతిఁ గాంచగా సుఫల దైవత కార్యము చూడఁ జేయు భా
       సురుఁడ! హరీ! మహా వినుత  శోభల వెల్గెడి వేణు గోపకా! 49.
         భావము:-
         గొప్పగా పొగడఁ బడెడి శొభలతో తేజరిల్లెడి ఓ వేణు గోపకుఁడా! ఓ లక్ష్మీ వల్లభుఁడా!
         నీ యొక్క శుభప్రదమైన అనేక విధములుగా కల ఆకారముల తేజస్సును నేను
         మరల మరల ఎన్నుటకు సరిపోదునా! భువిపై పొగడఁ బడు విధముగ
         మంచి ఫలితముల నొసగెడి దేవతా కార్యములను చూడ చేయు; ప్రకాశించెడి ఓ శ్రీ హరీ!
         నిర్మలమైన భావనలను నాలో నెలకొలుపుమని నిన్ను నేను వేడుకొందును కదా!

క:- పతి! నీశుభా కృతులఁ దీ  -  ప్తి తెఱంగుల నెన్నఁ జాలుదే?పరిపరి నే.
      నుతిఁ గాంచగా సుఫల దై  -  వత కార్యము చూడఁ జేయు భాసురుఁడ! హరీ! 49.
        భావము:-
        పొగడఁ బడు విధముగ మంచి ఫలితముల నొసగెడి దేవతా కార్యములను చూడ చేయు;
        ప్రకాశించెడివాఁడా! ఓ శ్రీ హరీ! మా దైవమా! నీ యొక్క శుభప్రదమైన అనేక విధములుగా
        కలిగిన ఆకారముల తేజస్సును నేను మరల మరల ఎన్నుటకు సరిపోదునా!

గీ:- కృతులఁ దీప్తి తెఱంగుల నెన్నఁ జాలు -  విమల భావన గొల్పగ వేడుకొందు!
      సుఫల దైవత కార్యము చూడఁ జేయు -  వినుత  శోభల వెల్గెడి వేణు గోప! 49.
        భావము:-
        మంచి ఫలితముల నొసగెడి దేవతా కార్యములను చూడ చేయు  పొగడఁ బడెడి శొభలతో
        తేజరిల్లెడి ఓ వేణు  గోపకుఁడా!  రచనలలో గల శొభల యొక్క అనేకమైన విధములను
        ఎన్నఁ జాలెడు నిర్మలమైన భావనను నాలో కొలుపుమని నిన్ను నేను వేడుకొందును.

చ:- తడఁబడి లోనఁ గాంచితిని దౌరడ యుండుట చిత్రమౌనురా!
       శిలగ నిలన్ సదా యతుల సృష్టిగ నుండెద వన్నిచోట్లలో
       నిలు కడదాక! నిన్ గనగ నేర్చి; లసద్గుణ గణ్యులెంచు శ్రీ
       శుఁడిగ హరీ! కృపన్ వెలయు శోభయె నీవుగ; వేణు గోపకా! 50.
         భావము:-
         ఓ వేణు గోపకుఁడా! నేను కొంత  తడబడినను నాలో నిన్ను చూచితిని.
         కాంతి రూపమున నీవుండుట మాకు విచిత్రమే సుమా! ఈ సమస్తమైనసృష్టిలో నీవు
         ఈ భూమిపై రాళ్ళ రూపములో అంతటా ఉందువు.కడ వరకూ అదే విధముగా
         నిలిచి యుండుము.నిన్ను చూడ నేర్చిన ప్రకాశించెడి  సద్గుణ గణ్యులు నిన్ను
         లక్ష్మీ పతిగా గణింతురు కదా! ఓ శ్రీ హరీ! కృపతో వెల్లి విరిసే ఈ సమస్తమైన శోభయూ
         నీవే కదా!

క:- బడిలోనఁ గాంచితిని దౌ  -  రడ యుండుట చిత్రమౌనురా! శిలగ నిలన్
      కడదాక నిన్ గనగ నే  -  ర్చి లసద్గుణ గణ్యులెంచు శ్రీశుఁడిగ హరీ! 50.
        భావము:-
        బడిలో నిన్ను చూచితిని.  కాంతి రూపమున నీ వుండుట మాకు విచిత్రమే సుమా! ఓ శ్రీ హరీ!
        ఈ భూమిపై రాళ్ళ రూపములో కడ వరకూ నిన్ను చూడ నేర్చిన ప్రకాశించెడి  సద్గుణ గణ్యులు
        నిన్నులక్ష్మీ పతిగా గణింతురు కదా!

గీ:- చితిని దౌరడ యుండుట చిత్రమౌను!  -  యతుల సృష్టిగ నుండెద వన్నిచోట్ల
      గనగ నేర్చి లసద్గుణ గణ్యులెంచు  -  వెలయు శోభయె నీవుగ; వేణు గోప! 50.
        భావము:-
        ఓ వేణు గోపుఁడా!  చితిని  కాంతి రూపమున నీవుండుట మాకు విచిత్రమే సుమా!
        ఈ సమస్తమైనసృష్టిలో నీవు అంతటా ఉందువు. వెల్లి విరిసే ఈ సమస్తమైన శోభయూ
        నీవే యని నిన్ను చూడ నేర్చిన ప్రకాశించెడి  సద్గుణ గణ్యులు  నిన్నుగుర్తింతురు.
           ( సశేషం ) 
జైశ్రీరాం. 
జైహింద్.   
Print this post

1 comments:

గన్నవరపు నరసింహమూర్తి చెప్పారు...

శ్రీ చింతా రామకృష్ణా రావు గారూ నమస్సులు. మీ వేణు గోపక శతకము మృదు మధురోక్తుల సుధా ధారలతో అలరారు చున్నది. మీకు సదా దైవ కటాక్షము కలుగు గాక !

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.