గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, జులై 2011, సోమవారం

శ్రీ వేణు గోప కంద గీత గర్భ చంపకోత్పల శతకము. పద్యము 5 / 21 వ భాగము

ఉ:- ఏ మది నుంటివో ! మురళినే మదిఁ జేర్చితి, ముద్దుఁ జేసి; మా    
      రేమియనన్. సదా కరుణ నేలుమ మమ్మును కాంక్షతీర గా
      నే మది నన్ గనన్; వినవు! యేమది కష్టమొ?  విశ్వ తేజ! మా
      రామ హరీ! కృపన్ వెలయ రాదొకొ? మామది. వేణు గోపకా! 21.
      భావము:-
      ఓ విశ్వ తేజమా! మా యొక్క మనోహరుడవైన ఓ శ్రీ హరీ! ఓ వేణు గోపకుఁడా!
      నీ వేభావనతో నుంటివో కాని;  ఆమురళినే ముద్దు చేసి నీ మనస్సులో స్థానమునిచ్చి
      చేర్చు కొంటివి. నేనేమీ మాఱు మాటాడను. మమ్ముల నెల్లప్పుడూ
      మా కోరిక తీరేటంతగా ఏలుము. నన్ను చూచుటకు కనీసము వినవేమి?
      నీకు అది ఏమైనా కష్టమైనపనా ఏమి? దయతో మా మనసులలో వెలయరాదా యేమి?

క:- మది నుంటివో ! మురళినే -  మదిఁ జేర్చితి, ముద్దుఁ జేసి; మా రేమియనన్. 
      మది నన్ గనన్; వినవు! యే  -  మది కష్టమొ?  విశ్వ తేజ! మారామ హరీ! 21.
      భావము:-
      ఓ విశ్వ తేజమా! మాకు మనోహరమైన ఓ శ్రీ హరీ! ఆ మురళి యొక్క మదిలో నీవుంటివేమో.
      దానిని ముద్దు చేసి నీ మదిలోనే పదిలముగా స్థానము కల్పించి యుంచితివి. నేనేమీ
      మాఱు మాటాడను. నన్ను చూచుటకు కనీసము నీవు వినవేమి? ఏమి; అది ఏమైనా
      కష్టమైన కార్యమా నీకు?

గీ:- మురళినే మదిఁ జేర్చితి, ముద్దుఁ జేసి; -  కరుణ నేలుమ మమ్మును కాంక్షతీర 
      వినవు! యేమది కష్టమొ?  విశ్వ తేజ! -  వెలయ రాదొకొ? మామది. వేణు గోప! 21.
      భావము:-
      ఓ విశ్వ తేజమా! ఓ వేణు గోపుఁడా! మురళినే ముద్దు చేసి నీ మనస్సులో స్థానమునిచ్చి
      చేర్చుకొంటివి. మమ్ముల  మా కోరిక తీరేటంతగా ఏలుము. కనీసము వినవేమి? నీకు
      అది ఏమైనా కష్టమైన కార్యమా ఏమి? దయతో మా మనసులలో వెలయరాదా యేమి?

చ:- విని, నెలవుల్ కనన్ వెడలి; వెన్నలు దొంగిలి; వేచినావు, న
      వ్వనిదెవరో? వినన్. కలికి వన్నెలు దొంగిల కాచినావు !దా
      చిన వలపుల్ గనన్. చిలిపి చిన్నెలు చూపగ చేరవేమి? నే
      వినెద! హరీ! ధరన్ వెలయు వెన్నెల రూపక! వేణు గోపకా! 22.
      భావము:-
      వెన్నెల వలె చల్లని రూపముతో వెలయు  ఓ వేణు గోపకుఁడా! ఓ శ్రీహరీ!
      వెన్న ఉన్నదన్న సంగతి వినినవాడవై అది యున్న ప్రదేశమును చూచుటకు వెడలి;
      ఆ వెన్నలు దొంగిలించి; అచ్చట వేచియుండెడి వాడవు. అది విని నవ్వనివారెవరు? స్త్రీలు
      వారి హృదయమున నీపై దాచిన వలపులను చూచుట కొఱకు;  స్త్రీలయొక్క వన్నెలను
      దొంగిలించుట కొఱకు చాటుగా కాచితివి. నీ యొక్క చిలిపి ప్రవర్తనలు చూపుట కొఱకు
      నా వద్దకు చేరవేమి? నేను వినెదను చెప్పుము.

క:- నెలవుల్ కనన్ వెడలి; వె  -  న్నలు దొంగిలి; వేచినావు, నవ్వనిదెవరో? 
      వలపుల్ గనన్. చిలిపి చి  -  న్నెలు చూపగ చేరవేమి? నే వినెద! హరీ! 22.
      భావము:-
      ఓ శ్రీహరీ! వెన్న ఉన్నాదన్న సంగతి వినినవాడవై అది యున్న ప్రదేశమును చూచుటకు వెడలి;
      ఆ వెన్నలు దొంగిలించి; అచ్చట వేచియుండెడి వాడవు. అది విని నవ్వనివారెవరు? స్త్రీలు వారి  
      హృదయమున నీపై దాచిన వలపులను చూచుట కొఱకు;  నీ యొక్క చిలిపి ప్రవర్తనలు
      చూపుట  కొఱకు  చేరవేమి? నేను వినెదను చెప్పుము.

గీ:- వెడలి; వెన్నలు దొంగిలి; వేచినావు, -  కలికి వన్నెలు దొంగిల కాచినావు !
      చిలిపి చిన్నెలు చూపగ చేరవేమి? -  వెలయు వెన్నెల రూపక! వేణు గోప! 22.
      భావము:-
      వెన్నెల వలె చల్లని రూపముతో వెలయు ఓ వేణు గోపుఁడా! నీవు వెడలి; వెన్నలు దొంగిలించి;  
      వేచియుంటివి. స్త్రీల యొక్క వన్నెలను దొంగిలించుట కొఱకు చాటుగా కాచితివి. నీ యొక్క చిలిపి
      ప్రవర్తనలు చూపుట కొఱకు నా వద్దకు చేరవేమి?

చ:- తల పొలమున్ సదా విరుల తావుల లోపలి వింతఁ వౌదువో!
      వలపులలోపలన్. సరస భావుల పల్లవ షట్కమౌదువో !
      పలు నెలవుల్ గనన్ శుభ విభావుల పాలిటి శోభవౌదువో!
      పలుకు హరీ! సదా విజయ భావన గొల్పెడి వేణు గోపకా! 23.
      భావము:-
      ఎల్లప్పుడూ విజయ కారణమైన భావములను మాలో కలిగించెడి ఓ వేణు గోపకుఁడా!
      పొలిమేర వెంబడియున్నపొలమునందు ఎల్లప్పుడూ గల  పూల సువాసనల లోపలి వింతవు
      నీవే అయి యుందువా? కోరికల లోపల సరస స్వభావుల యొక్క
      నమ్: , స్వాహా ;  హుమ్ ; ఫట్ ;  వషట్ ; వపుషట్ ; అనెడి పల్లవ షట్కము
      నీవే అయియుందువా? అనేకమైన ప్రదేశములను చూడగా అచ్చట శుభ పరిచయస్తుల
      పాలిట శోభవు నీవే అయి యుందువా? పలుకుము.

క:- పొలమున్ సదా విరుల తా  -  వుల లోపలి వింతఁ వౌదువో!వలపులలో 
      నెలవుల్ గనన్ శుభ విభా  -  వుల పాలిటి శోభవౌదువో! పలుకు హరీ! 23.
      భావము:-
      ఓ శ్రీ హరీ! పొలమునందు ఎల్లప్పుడూ గల  పూల సువాసనల లోపలి వింతవు నీవే అయి
      యుందువా? కోరికల లోపల ప్రదేశములను చూడగా అచ్చట శుభ పరిచయస్తుల పాలిట
      శోభవు నీవే అయి యుందువా?  పలుకుము.

గీ:- విరుల తావుల లోపలి వింతఁ వౌదు.! -  సరస భావుల పల్లవ షట్కమౌదు !
      శుభ విభావుల పాలిటి శోభవౌదు! -  విజయ భావన గొల్పెడి వేణు గోప! 23.
      భావము:-
      ఎల్లప్పుడూ విజయ కారణమైన భావములను మాలో కలిగించెడి ఓ వేణు గోపుఁడా!
      పూల సువాసనల లోపలి వింతవు నీవే అయి యుందువా? సరసస్వభావుల యొక్క
      నమ్: , స్వాహా ;  హుమ్ ; ఫట్ ;  వషట్ ; వపుషట్ ; అనెడి పల్లవ షట్కము
      నీవే అయియుందువా? శుభ పరిచయస్తుల పాలిట శోభవు నీవే అయి యుందువా?

ఉ:- శ్రీ వచనామృతా!  సకల జీవ, చ రాచర సంస్థితుండ వై
      తావకమైనదై ప్రకటితంబయి కన్బడు ప్రాణనాథ! దే
      వా! వచియింపనౌ నిఖిల భావ చయంబును నీవె యౌదువా?
      దేవ! హరీ! ననున్ వెలయు తీరున కావుమ!వేణు గోపకా! 24.
      భావము:-
      ఓ వేణు గోపుఁడా! పరమాత్మవైన ఓశ్రీహరీ!   ఓ ప్రాణనాథా! ఓ దేవా! శుభప్రదమైన
      వచనామృతము కలవాడా! సమస్తమైన చరాచర జీవ కోటి యందు ఉన్నవాడివై; నీదైనదై
      ప్రకటిత మగుచు, కనిపించెడి, చెప్పుకొన దగిన సమస్తమైనటువంటి భావ సమూహము
      నీవే అయి యుందువు కదా? శోభించే విధముగా నన్ను కాపాడుము.

క:- వచనామృతా!  సకల జీ  -  వ చరాచర సంస్థితుండ వైతావకమై 
      వచియింపనౌ నిఖిల భా  -  వ చయంబును నీవె యౌదువా? దేవ! హరీ! 24.
      భావము:-
      పరమాత్మవైన ఓ శ్రీ హరీ! వచనామృతము కలవాడా! సమస్తమైన చరాచర జీవ కోటి యందు
      ఉన్నవాడివై; నీదైనదై  చెప్పుకొన దగిన సమస్తమైనటువంటి భావ సమూహము నీవే
      అయియుందువు కదా?

గీ:- సకల జీవ, చ రాచర సంస్థితుండ  -  ప్రకటితంబయి కన్బడు ప్రాణ నాథ! 
      నిఖిల భావ చయంబును నీవెయౌదు? -  వెలయు తీరున కావుమ! వేణు గోప! 24.
      భావము:-
      ఓ వేణు గోపుఁడా! ఓ ప్రాణ నాథా! సమస్తమైన చరాచర జీవ కోటి యందు ఉన్నవాడా!  ప్రకటిత
      మగుచు కనిపించెడి సమస్తమైనటువంటి భావ సమూహము నీవే అయియుందువు కదా?
      శోభించే విధముగా నన్ను కాపాడుము.

చ:- శుక. పిక శారికా సకల శోభ కమేయ ప్రసాధనంబు వై
      తి; కరుణతో ధరన్ నిఖిల తేజము నీవయి నిల్చినావుగా!
      ఇక సకలేశ్వరా! అఖిల మీవ. కృపన్ నను నాదుకొమ్మ! పా
      తకుఁడ! హరీ! దయన్ వినుమ; తప్పక నామొర. వేణు గోపకా! 25.
      భావము:-
      ఓ వేణు గోపకుఁడా! చిలుకలు; కోకిలలు; గోరువంకలు; మున్నగు సమస్తమైన వాని యొక్క
      శొభకు నీవే అంతు  లేని అలంకార మైనావు.  భూమిపై సమస్తమైన తేజస్సు  నీవే అయి
      దయతో నిలిచినావు కదా! సమస్తమునకూ  ప్రభువైన ఓ శ్రీ హరీ! ఇంక సమస్తమునూ
      నీవే సుమా!  నేను పాతకుఁడను. నీ కృపాగుణముతో నన్నాదుకొనుము.
      దయతో తప్పక నా యొక్క యీ మొరను ఆలకింపుము.

క:- పిక శారికా సకల శో  -  భ కమేయ ప్రసాధనంబు వైతి; కరుణతో 
      సకలేశ్వరా! అఖిల మీ  -  వ. కృపన్ నను నాదుకొమ్మ! పాతకుఁడ! హరీ! 25.
      భావము:-
      సకలేశ్వరుఁడవైన ఓ శ్రీ హరీ! కోకిలలు; గోరువంకలు మొదలగు వాని సమస్తమైన శోభకు
      నీ కరుణా స్వభావముతో అలంకారమైతివి. సమస్తమూ నీవే సుమా! నేను పాతకుఁడను.
      నీ దయా గుణముతో నన్ను ఆదుకొనుము.

గీ:- సకల శోభ కమేయ ప్రసాధనంబు -  నిఖిల తేజము నీవయి నిల్చినావు!
      అఖిల మీవ. కృపన్ నను నాదుకొమ్మ! -  వినుమ; తప్పక నామొర. వేణు గోప! 25.
      భావము:-
      సమస్తమైనటువంటి ఈ సమస్తమైన శోభకు అంతు లేని అలంకారమైన ఈ సమస్త తేజస్సు నీవే
      అయి నిలిచితివి.  నాకు సమస్తమూ నీవే సుమా! నీ కృపతో నన్ను ఆదుకొనుము.
      ఈ యొక్క నా మొరను నీవు తప్పక వినుము.
( సశేషం )
జై శ్రీరాం.
జైహింద్
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.