గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, ఏప్రిల్ 2011, గురువారం

శ్రీమాన్ మానాప్రగడ శేషశాయి శ్రీగురుచరణారవిందాభ్యాంనమోనమః.

శ్రీ మంగళంపల్లిని తన చూపులతో మంగళప్రదునిగా చేస్తున్న శ్రీశేషశాయి
శ్రీరస్తు.                         శుభమస్తు.                    అవిఘ్నమస్తు.
శ్రీమాన్ మానాప్రగడ శేషశాయి శ్రీ గురు చరణములకు
మీ శిష్య పరమాణువు చింతా రామ కృష్ణా రావు
భక్తి పారవశ్యముతో చేయుచున్న
పాదాభివందనములు.

శా:- శ్రీనాధాది కవుల్ ధరా తలమునన్ శ్రీ శేషశాయే యనన్
మానాప్రగ్గడ శేష శాయి గురుసమ్మాన్యా! కృపన్ గల్గిరే!
జ్ఞానాంభోధి ప్రసన్నభాస్కర! మహా జ్ఞానామృతాంశల్ సదా
ప్రాణంబై ప్రణవంబునౌచు వెలయన్ భాగ్యంబుగాఁ గొల్పిరే!

చ:- గురువర! మీ మహాద్భుత సుగోచర మయ్యెడి జ్ఞాన దీప్తి మా
వరగుణ వృద్ధి కారణము. భాగ్య నిధానము. భవ్య బోధయున్.
సరి యెవరయ్య మీకిలను సద్గుణ గణ్యులలోన నెన్నగా.
కరములు మోడ్చి మ్రొక్కెదను గౌరవమొప్పగ, జ్ఞాన భాస్కరా!

చ:- మధుర వచస్వి! మీ మృదుల మంజుల గాత్ర విశేషమేమొ! మా
యెదలును పల్లవించినవి. ఏమని చెప్పుదు మీదు ప్రేమ! వా
ఙ్నిధి లభియించె మాకు. మహనీయుల దర్శన భాగ్యమబ్బె. మీ
సదమల దివ్య మానసము సారథియై నడిపించె మమ్ములన్.

కంద గీత గర్భ చంపక మాల:-
వర మధుస్రావమై, అమృత వారిధియై, శుభమై రహించు శ్రీ
చరణ నుతిన్ సదా సకల సత్పరివర్తనఁ జక్క జేయుచున్,
పర సుధనంబు గా కవిత పార, ధరన్ నను గౌరవించ్రి. ప్రాక్
సరస కవీ! సదా తమరి సన్నుత దీవన తప్పదెందునన్!

చంపక గర్భస్థ గీతము:-
అమృత వారిధియై, శుభమై రహించు
సకల సత్పరివర్తనఁ జక్క జేయు
కవిత పార, ధరన్ నను గౌరవించ్రి.
తమరి సన్నుత దీవన తప్పదెందు.

చంపక గర్భస్థ కందము:-
మధుస్రావమై, అమృత వా
రిధియై, శుభమై రహించు శ్రీచరణ నుతిన్
సుధనంబుగా కవిత పా
ర, ధరన్ నను గౌరవించ్రి, ప్రాక్ సరస కవీ!

శ్రీ చక్ర బంధ తేటగీతి:-
వరద పాండిత్య! శ్రీ యుత! వాఙ్నిధాన!
లక్ష్య వరదుఁడ! శ్రీ కర! లక్షణాది
సిద్ధిఁ గొలిపితే! శ్రీ వరసిద్ధి రామ
వరలఁ జేసితి నన్నంది వామ దేవ!

చ"తురంగ"గతి బంధ కందము:- ( గురువరు - వదనము - భవభయ హరణము )
సునిశిత పదముల తగు వివ
రణముగ గురువుల శరణు నర వరులు మహతిన్
కనవలె నుయభ సుఫలదము
లనవరతము నయము శుభము లది యిడును తగన్. 


నక్షత్ర బంధ కందము:- ( సుజనవర - శేషశయన )
సుధ నభిషవ వశ వర! జ్ఞా
న ధనా! నయ బోధనను తనర కొలుపన్ శే
షి ధిషణ! భూమిజ దేవ! వి
శదమయ సుకవివర గణన. జన శేఖరుఁడా!

చ:- శుభమగు గాక దివ్య పరిశోభిత మూర్తికి జ్ఞాన దీప్తికిన్,
శుభమగు గాక పూజ్య రవి శోభలు గాంచిన పుణ్య మూర్తికిన్,
శుభమగు గాక శిష్య గణ శోభిత సద్గురు భవ్య కీర్తికిన్, 
శుభమగు గాక పుణ్య పరిశోభిత సత్కవి శేష శాయికిన్.
  
మంగళం                                                                   మహత్
శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ
ఇట్లు,
మీ శిష్య పరమాణువు
చింతా రామ కృష్ణా రావు.
హైదరాబాదు.
తేదీ.౧౪ - ౦౪ - ౨౦౧౧.
http://andhraamrutham.blogspot.com
సెల్.నెంబరు:- 9247238537.

Print this post

10 comments:

కథా మంజరి చెప్పారు...

గురు దేవుల ఆశీరమృత సేసలు మీ పై అపారముగా కురియుట చేతనే కాబోలు, మీరింత అందముగా, ఛందస్సుందరముగా, హృదయమంగా, నిరుపమానంగా పద్య రచన చేయగలుగు చున్నారు.

ఇట్టి పద్య విద్య మీకబ్బుట మీ పురాకృత జన్మ విశేషపరిపాక ఫుణ్య ఫలమనుట ఎంత మాత్రము సత్య దూరము కానేరదు.

మీ వంటి సత్కవులు నా మిత్రులని చెప్పు కొనుట నాకు మిక్కిలి గర్వకారణము.

జయోస్తు. ప్రతిభా వ్యత్పత్తుల చేత కాక , కేవల వయసు చేత నా కంటె చిన్న వారగుట చేత శతమానం భవతి.

కథా మంజరి చెప్పారు...

హృదయమంగా అను దానిని హృదయంగమంగా అని సరిచేసికో గోరుతున్నాను. టైపులో వచ్చిన తప్పుగా మన్నించ ప్రార్ధన.

గన్నవరపు నరసింహమూర్తి చెప్పారు...

పంజరమ్ము నందుఁ బంచ రంగుల చిల్క
పాట పాడి నటుల, బంధ మయ్యు
కవిత నాట్య మాడెఁ గన్నుల కింపుగా
రమ్య కవిత చంద్ర రామకృష్ణ !

అసమాన కవితా ప్రావీణ్యులైన శిష్యులను గాంచుట గంటే గురువులకు పరమావధి యింకేమి ఉంటొంది ? మీ వంటి శిష్య సంపద గలిగిన శ్రీ మానాప్రగడ శేషశాయి గారు అదృష్ట వంతులు. మీ ద్వారా వారి పాద పద్మములకు మా నమస్సుమాంజులులు !

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

సోదరా!
శారదాంబ ముద్దు బిడ్డలైన మీవంటి వారి సాహచర్యము, అసాధారణ ప్రతిభా పాండితీ తేజస్వరూపులైన గురుదేవుల కరుణా కటాక్షము నాకు వరాలై పద్యకవితకు ప్రేరేపిస్తున్నాయే కాని అది నా సమర్ధత కానే కాదు. నీవు చేసిన ప్రసంశ చూస్తుంటే అది నీ హృదయ వైశాల్యానికి అద్దం పట్టుతోందే కాని ఆ ప్రశంసకు నేను పాత్రుఁడనని అనుకోలేను.
ఏది ఏమైనా నేను ధన్యుఁడను.
నీకు నా కృతజ్ఞతాభివందనములు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

సీ:-
ప్రార్థనీయులు గన్న వరపుత్రకులు మీరు.
గన్నవరపు వంశ గౌరవమును
దేశాంతరములందు దీపింప చేసిరి.
దీనుల హృదయాల దేవుఁడీరు.
కరుణ శోభిత వాణి కమనీయ చూడ్కుల
వెన్నెలలందిన విబుధులీరు.
నారసింహుని పేరు కోరి తాల్చిన గాని
మహనీయ సౌమ్యత్వ మహితులీరు.
గీ:-
కన్నవారల యొక్క కన్ సన్నలరసి
మెలగు మిము గాంచి కాంచితి తెలుగు వెలుగు.
వర భిషఙ్మణి! మీదు సచ్చరిత మరసి
తెలుగు జాతియె గర్వించు, దివ్య చరిత!

మీకు నా ధన్యవాదములు.

గన్నవరపు నరసింహమూర్తి చెప్పారు...

ధన్యోస్మి

paMdita nEmAni చెప్పారు...

గురు స్తుతి

శా. శ్రీనిష్ఠానిధి, వాగ్విభూషణుడు, రాశీభూత కారుణ్యమున్
జ్ఞానానంద మహాబ్ధి, శిష్యగణ సంక్షేమానుసంధాయి, శ్రీ
మానాప్రగ్గడ శేషశాయి, బుధ సమ్మాన్యుండు, సద్భక్తితో
నేనా సద్గురు పాదపద్మ యుగళిన్ సేవింతు నశ్రాంతమున్

మ. నను సౌహార్దము నిండు దెందమున సన్మానించె, వాణీ స్వరూ
పునిగా జెప్పుచు గూర్చె గౌరవము, నా పొత్తమ్ములో పద్యముల్
మనమారన్ విని చాల మెచ్చుకొనె, నా మానాప్రగడ్వంశ చం
ద్రుని, చంద్రాతప కీర్తిమంతు వినుతింతున్ వాగ్లతాంతాళితోన్

తే.గీ. అతని తలపులు లోక శ్రేయస్కరములు
అతని పలుకులు ప్రథిత విద్యాంకురములు
అతని కృతులు సాహిత్య లోకాధ్బుతములు
శ్రిత హితార్థ ప్రదాయి శ్రీ శేషసాయి

ఇట్లు
నేమాని రామజోగి సన్యాసి రావ

పండిత నేమాని చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
ఫణి ప్రసన్న కుమార్ చెప్పారు...

శ్రీమాన్ మానాప్రగడ శేషశాయి గారి గురించి మీరు,పండిత నేమాని గారు వ్రాసిన పద్యములు అత్యంత ఆనందదాయకంగా ఉన్నాయి. ధన్యవాదములు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఫణి కుమారా! మీకు ఆనందం కలిగించినందుకు ఆశారదాంబకు పాదాభివందనాలు.మీకు నా ధన్యవాదములు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.