గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, ఏప్రిల్ 2011, శనివారం

ఈ క్రింది పద్యంలో ఎన్ని ఛందస్సులు ఇమిడి యున్నాయంటే .....

ఈ క్రింది పద్యంలో ఎన్ని ఛందస్సులు ఇమిడి యున్నాయో గమనించే ప్రయత్నం చెయ్యండి.
అని క్రీదటి టపాలో మీ ముందుంచాను. ఆపద్యం గమనించండి.
సీ:- ఓ రసజ్ఞుఁడ! కావ్య మొప్పుగ నుండ సత్ కవివై భువిన్ కావ్య కర్తవగుము.
కోరి వ్రాయుము. శిష్ట కోవిద కోటి నీ కృతి గాంచగాను, సన్నుతులతోఁడ
చేరి, గాంచి, పఠించి   చిత్తము చేర్చి, పొంగి ముదంబుతో నీకు కీర్తి కొలుప  
వారి భావన తెల్పి, భాగ్యము పంచునట్టుల నుండుగా సదా! లలిత హృదయ!
గీ:- సుమ పరిమళంబు తోపగ, విమల గతిని
కావ్య మమర, విజ్ఞులు పలుకంగ మహిత
గతిని సలుపుమా! కమనీయ కవిత లొలుక
గ, గమకము తోడ నలరంగ గౌరవంబు.

దీనికి స్పందించిన చిరంజీవి ముక్కు రాఘవ కిరణ్ సమాధానం చెప్పారు.

రాఘవ చెప్పారు...
మదించిన కోకిల రసాలాన్ని కాక కంద తింటూ కనబడిందండీ. :) నేను మన రాఘవను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.
మరికొంచెం లోతుగా పరిశీలిస్తే
వ్రాయఁబడిన సీసము+తేటగీతులలో
సీసము, 
గీతము తో పాటు
ద్విపద
మత్త కోకిల,
కందము,
ఉన్నట్టుగా అర్థమౌతుంది. అంటే మొత్తం మీద ఈ సీస పద్యం ఐదు ఛందస్సంయుతమై ఉందన్నమాట. విడి విడిగా చూద్దాం.
ద్విపద:-
ఓ రసజ్ఞుఁడ! కావ్య మొప్పుగ నుండ 
కోరి వ్రాయుము. శిష్ట కోవిద కోటి 
చేరి, గాంచి, పఠించి   చిత్తము చేర్చి,
వారి భావన తెల్పి, భాగ్యము పంచు.

మత్త కోకిల:-
ఓ రసజ్ఞుఁడ! కావ్య మొప్పుగ నుండ సత్ కవివై భువిన్ 
కోరి వ్రాయుము. శిష్ట కోవిద కోటి నీ కృతి గాంచగా
చేరి, గాంచి, పఠించి   చిత్తము చేర్చి, పొంగి ముదంబుతో 
వారి భావన తెల్పి, భాగ్యము పంచునట్టుల నుండుగా!

కందము:-
సుమ పరిమళంబు తోపగ
విమల గతిని కావ్య మమర, విజ్ఞులు పలుకం
గ మహితగతిని సలుపుమా!
కమనీయ కవిత లొలుకగ, గమకము తోడన్.
మీరూ ప్రయత్నించి కృతకృత్యులవాలనే నా ఆశ. 
యత్నే కృతే యది న సిద్ధ్యతి కో೭త్ర దోషః?
అందుచేత ప్రయత్ని స్తారు కదూ?
ధన్యవాదములు.
జైశ్రీరాం.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.