గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, మే 2010, ఆదివారం

దేవీ స్తుతి 7 / 13. (కాళిదాసు కృత అశ్వధాటికి ఆంధ్రానువాదము)

http://www.shalincraft-india.com/images/sculpture/image/large/durgab001.jpg
శ్లో:-
న్యంకా కరే వపుషి కంకాళ రక్త పుషి కంకాది పక్షి విషయే.
త్వం కామనా మయసి కిం కారణం హృదయ! పంకారి మే హి గిరిజాం.
శంకాశిలా నిశిత టంకాయమాన పద సంకాశమాన సుమనో
ఝంకారి భృంగ తతి మంకాను పేత శశి సంకాశ వక్త్ర కమలాం. ౭.
సీ:-
హృదయమా! నిరతంబు  మది వ్రేల్చు యపవాద
కలుషంబులకు నెల్ల నిలయమౌచు;
అస్తిపంజర రక్తమమరగా  పోషించు;
పులుగుల కాధార భూతమయెడి;
దేహమ్ము విషయమై దేవురించుచు నీవు 
కోర దగని కోర్కె కోరు టేమి?
పాపంబులకు నరి; దీపించు యనుమాన
పాషాణమున కులి; భవ్య రొదల
గీ:-
దేవతాభృంగ సేవిత దివ్య పాద.
పద్మములు గల్గినట్టిది; భవ్యమూర్తి.
చంద్ర ముఖ పద్మమున నొప్పు శంభు రాణి
నాశ్రయింపగ తగునీకునద్భుతముగ.
భావము:-
ఓ హృదయమా! అనేక నిందలకూ కళంకలకూ నిలయమైనదీ;  అస్తి పంజరాన్నీ; రక్తాన్నీ పోషించేదీ; రా పులుగుల వంటి అనేక పక్షులకు ఆధారమైనదీ; అయిన శరీరము విషయంలో నీవు కోరికను పొందుతున్నావు.  కారణమేమిటి? పాపాలకు శత్రువైనదీ; అనుమానాలనే రాళ్ళకు కరుకైన కాశ ఉలుల వంటివైన పాదాలమీద బాగా ప్రకాశిసున్న దేవతలు అనే రొద చేస్తున్న తుమ్మెదల సమూహం కలదీ;  కళంకంతో కూడుకొన్న చంద్రుని వంటి ముఖ పద్మం కలదీ; అయిన పార్వతీ దేవిని పొందవలసింది. 
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఆశీర్వదించి
అంతటి కళంకములను భరిస్తున్న మహాతల్లి పార్వతీ దేవిని ఆశ్రయించక నశ్వరము కలుషితము ఐనటువంటి ఈ శరీరం మీద వ్యామోహాన్ని ఎందుకు పొందు తున్నావు ? " అన్న అర్ధం నాకు స్పురించింది. అది సమంజసమొ కాదొ తెలియదు.

ఇంతటి మహా కావ్యానికి వ్యాఖ రాయగల అర్హత నాకు లెదు అదృష్టం మాత్రం ఉందనుకుని [ తమ్ముడిచ్చిన ]

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.