గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, మే 2010, సోమవారం

దేవీ స్తుతి 12 / 13. (కాళిదాసు కృత అశ్వధాటికి ఆంధ్రానువాదము)

http://www.ilovehou.com/twonicknames/gifsite/1/wrynne/durga.gif
శ్లో:-
కూలాతిగామి భయ తూలావళి జ్వలన కీలా;  నిజ స్తుతి విధా;
కోలాహల క్షపిత కాలామరీ కుశల కీలాల పోషణ నభా!
స్థూలా కుచే; జలద నీలా కచే; కలిత లీలా కదంబ విపినే;
శూలాయుధ ప్రణతి శీలా; విభాతు హృది శైలాధి రాజ తనయా! ౧౨.
సీ:-
వృద్ధియౌ భయ తూల హద్దులు మీరిన 
గద్దించి కాల్చెడి వృద్ధ మాత.
స్తోత్ర పద్ధతికల స్తుత. కలఁగు సతుల
క్షేమంబు నిడఁ గూర్చు శివుని రాణి.
స్తన భరంబున నొప్పు; ఘన నీల కురులొప్పు;
జన వాక్యములనొప్పు జనని హైమ.
కడిమి తోపులలోన గంభీరముగ తాను
కలయ తిరుగు భక్త కల్ప వల్లి.
గీ:-
చాల భక్తిగ తన పతి శూలి కెలమి
వందనంబులు చేసెడి సుందరాత్మ.
అట్టి హేమాద్రి కన్యక పట్టు పట్టి
నన్ను వర్థిల్లఁ జేయుత మిన్న గాను.
భావము:-
హద్దు మీరిన మిక్కిలి భయమనే దూది రాశులకు అగ్ని శిఖ వంటిది. తన యొక్క స్తోత్ర పద్ధతి కలదీ; కష్టాల కలఁకతో కాలం గడిపిన దేవతా స్త్రీలకు క్షేమమనే నీటిని వృద్ధిపరచే శ్రావణ మేఘం లాంతిదీ; స్తన విషయంలో భారం కలదీ; కురుల విషయంలో మేఘాల వలె నల్లనైనదీ; కడిమి చెట్ల తోపులో విహారం కలదీ; శూలాన్ని ఆయుధంగా ధరించే శివునికి నమస్కరించే మంచి నడవడి గలదీ ఐన హిమవంతుని కూతుర్తె ఐన హైమవతి నా హృదయంలో వెలుగొందు గాక.
జైహింద్.
Print this post

2 comments:

రవి చెప్పారు...

ఎత్తుగీతిలో "గద్దించి కాల్చెడి వృద్ధ మాత." అన్నారు. "వృద్ధ మాత" - అంటే వయస్వి అయిన తల్లి అన్న అర్థమా? మరో అర్థం ఉందా?

సురులకు, ముఖ్యంగా జగజ్జననికి జరామరణములు లేవు కదా? "వృద్ధ మాత" అంటే ఎలాంటి భావంలో అన్వయించుకోవాలి?

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఈ రోజు చక్ర,గదా,ఖడ్గ,త్రిశూల ,కదలికలతొ అమ్మవారు నూతన కాంతులను విరజిమ్ముతోంది. శ్రావణ మేఘము వంటిది.నల్లని కురులు గలది,కడిమి తోపులొ విహరించ గలది శూలపాణికి నమస్కరించ గలది ఐన హిమ సుమము చెడును చెండాడి మంచిని వృద్ధి చేయగల హిమవంతుని కూతురు హైమను ఆదేవిని నిత్యము స్తుతించ గలగటము మన అదృష్టము. అభినందనలతొ అక్క.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.