గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, మే 2010, శనివారం

దేవీ స్తుతి 6 / 13. (కాళిదాసు కృత అశ్వధాటికి ఆంధ్రానువాదము)

http://lh3.ggpht.com/_qR98y73dw1Y/SPxfyMRSoPI/AAAAAAAADgo/Cj9Uqr-nuT8/lalitha.jpg
శ్లో:-
దాసాయమాన  సుమ  హాసా కదంబవన వాసా  కుసుంభ సుమనో
వాసా విపంచి కృత రాసా విధీత మధు మాసారవింద మధురా
కాసార సూత తతి భాసాzభిరామ తను రాసార శీత కరుణా
నాసా మణి ప్రవర భాసా శివా తిమిర మాసాదయే దుపరతిమ్. ౬.
సీ:-
దాసీ జనుల్ పూల హాసంబులే కాగ 
కడిమితోపులనుండు కల్పవల్లి;
కుంకుమ సుమ వర్ణ  సంకాశ వస్త్రంబు 
మేన దాల్చేటి సు జ్ఞాన దీప్తి.
విన రంజకమ్ముగా  వీణ మీటెడు తల్లి;
పద్మ శోభకు మించు భర్మ్య వల్లి.
సరసిజ సుమ కాంతి సముదంచిత శరీర.
ఘన వర్ష హిమతుల్య కరుణ కలది.
గీ:-
ఆ శివాణి నాసామణి నమరి యున్న
శ్రేష్ఠమైనట్టి తేజమ్ము శీఘ్ర గతిని
నన్ను పీడించు నజ్ఞాన నాశనమును
చేసి రక్షించి గాచుత. చేతనమిడి.
భావము:-
దాసీ జనులుగా అయిన పూల నగవులు కలదీ; కడిమి తోపులో నివసించేదీ; కుంకుమ పూల వంటి వస్ర్తాన్ని ధరించేదీ; వీణ మీద  మీటిన రస రంజితమైన నిక్వణం కలదీ; తిరస్కరించిన వసంత ఋతువు లోని పద్మాల యొక్క మనోహరత్వం గలదీ; సరోవరం లోని పూల మొత్తాల కాంతి చేత సొగసైన శరీరం కలదీ; జడి వాన వంటి చల్లని దయ కలదీ; సౌభాగ్యవతీ ఐన పార్వతీ దేవి ముక్కర లోని శ్రేష్ఠమైన కాంతి చేత (నా అజ్ఞానమనే) అంధకారాన్ని తొలగునట్లు చేయును గాక! 
జైహింద్.
Print this post

2 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శుభ మస్తు
ఈ రోజు లలిత లావణ్యమైన దేవీ స్థుతి అందమైన వర్ణనలు " ముక్కెర నుండి వెదజల్లబడే కాంతి కిరణాలతొ అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించుకో గలిగితె " అద్భుతం అసలే మహా కవి కావ్యం. అందునా తమ్ముని అనువాదం ఇక పొగడగ నేనెంత ?

రవి చెప్పారు...

శృంగేరి శారదా మందిరం లో అమ్మవారి ముక్కెర బయటనుండి కూడా ప్రకాశిస్తూ కనిపిస్తుంది. ఈ శ్లోకంలో ముక్కెర అనగానే అదే గుర్తొచ్చింది.

బొమ్మలు కూడా అద్భుతంగా ఉన్నాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.