గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, మే 2010, గురువారం

సన్మార్గులకు కన్నతల్లినైన నేను దుర్మార్గుల పట్ల భద్రకాళిని.

http://www1.sulekha.com/mstore/ashishdimri/albums/default/Hindu-Goddess-Devi-Durga-Maa-Photo-0046.jpg
ఉ:-
శ్రీ గుణ గణ్యమైన కులశీలములొప్పెడి మానవాళిలో
రాగ విదూరులున్; కలుష రాక్షస దుర్గుణ దుష్ఠ శీలురున్
భోగ విలోలురున్; పురుష భోగ విష జ్వలనాభి శీలురున్.
ఏగతి పుట్టుచుండిరొకొ! ఈశ్వరునాన సహింప నేనికన్. 1.
అశ్వ ధాటి:-
దుర్మార్గు లీ జగతి ధర్మాత్ములన్ మిగుల మర్మంబుతో నిడుమలన్
కర్మంబులం గొలిపి నిర్మూలనం బవగ భర్మాపహార మతులై
కూర్మిన్మదిన్ విడిచి పేర్మిన్ వసించు. గని ధర్మంబు నే నిలిపగా
నిర్మూలనం బవగ మర్మాత్ములన్ దునిమి పేర్మిన్ భువిన్ నిలుపుదున్. 2.
ఉ:-
రక్త పిపాసులీజగతి రాజిలు చుండిరి చూచు చుంటి. నే
శక్తిని. కాళికాకృతిని. శాంభవి నేను. సహింప రాని మీ
యుక్తి కుయుక్తులన్ గనితి. యూరక చూచుచు నుండ బోను. నా
భక్తుల కావ మిమ్ములను భస్మము చేసెద  నిశ్చితంబుగన్. 3.
చ:-
జననికి మారు రూపముగ; చక్కని యక్కగ; చెల్లెలం బలెన్
వినయము దోప పల్కు తరి వింతగ నా కుల కాంతలన్ మహిన్ 
కనులను కామరూపిణిగ కాంచెడి  వారి నుపేక్ష సేయ నీ
గునపము తోడ చీల్చెదను. గ్రుడ్లను నే పెకలించి వేసెదన్. 4.
ఉ:-
ఎంతటి పాప కర్మముల నేమియు చింత యొకింత లేక క
వ్వింతల తోడ చేయుదురె విజ్ఞులు చింతిల? యెంత వింత? నే
సాంతము గాంచు చుంటి. సరసత్వము వీడు పశు ప్రవృత్తులన్
గొంతులు నొక్కి చంపెదను  ఘోర దురాకృత దుష్ప్రవృత్తనై. 5.
చ:-
చిఱు చిఱు బాలురన్; మరియు చిన్నరి పాపల దొంగిలించి; యా
చిఱుతల బాంధవాళి కడు చింతిల లక్షల నాశ చేయుచున్
కఱకు మనమ్ముతో శిశుల కాపదఁ గొల్పెడి దుర్విదగ్థులన్
మఱి మఱి పట్టి చంపెదను. మానవ జాతిని కాచెదన్ గృపన్. 6.
ఉ:-
దుర్మతు లెల్ల యీ జగతి దుస్థితి మూలము. వారి నందరిన్
మర్మములందు కారముల మంటలు గొల్పుదు. కాల్చివేతు. యే
మర్మ మెఱుంగనట్టి గుణ మాన్యుల కెగ్గులు సేయువారలన్
ధర్మ విరుద్ధ వర్తులను తప్పక చంపుదు. చూచు చుండుడీ! 7. 

మ:-కసభుక్కుల్ ప్రభవించినారు జగతిన్ కాంక్షించు చుండెన్ సదా
మసిచేయంగను మానవాళినిలపై మన్నింప రానట్టియా
కసభుక్జాతినిమట్టు పెట్టెదను నే.  కాఠిన్యమున్ జూపుచున్న్
అసి ఘాతంబుల ఖండఖండములుగా యా దుష్టులన్ ద్రుంచెదన్. 8.
చ:-
సుగుణ విరాజమానులను; సుందర భాసుర భావ తేజులన్;
ప్రగణిత దేశ భక్తులను; బండన రంగ విరాజపూజ్యులన్
మగువల మాన రక్షకుల; మంచిగ నుండెడి యెల్ల వారలన్


ప్రగణిత రీతి గాచెదను. భక్త జనావళి నెన్ని బ్రోచెదన్. 9.

సీ:-సర్వ మంగళ నేను సద్గుణ గణ్యుల 
సర్వత్ర గాచెద సమయ మెఱిగి;
దుర్వర్తులను గాంచి గర్వాపహారంబు
నిర్వహించెదనేను నిశ్చయముగ;
పర్వంబులను గూర్తు గర్వింపగను చేతు
సర్వార్థములు గూర్తు సజ్జనులకు;
సర్వత్ర  గనక నన్ గర్వించి యెదిరించు
గర్వాంధులన్ బట్టి కాల రాతు.
గీ:-
సర్వులందున నేనుంటి చక్కఁ గనిన.
దుర్విదగ్ధులు కనలేరు; తుచ్ఛమైన
గర్వమును పొంది దురితముల్ కలుగఁ జేయు.
నిర్వహింతుస్వధర్మమ్ము. నిజముఁ గనుడు. 10. 

జైహింద్.


Print this post

8 comments:

రవి చెప్పారు...

పది కరముల పెట్టుగా పది పద్యాలు చక్కగా చెప్పారు. చిత్రమూ, పద్యాలు, వేటికవే సాటి.

రాఘవ చెప్పారు...

అమ్మో! మీ కలం ఇంత ఘాటుగా వ్రాయటం నేను ఇంతవఱకూ చూడలేదండీ! తేలికగా ఉండి, చదవడానికి హాయిగా బాగున్నాయి.

నాకు చిన్న అనుమానమండీ. మొదటి పద్యంలో ఏది సాధువు? రాగ విదూరులున్ అనడమా రాగ విదూరులన్ అనడమా? రెండవ పద్యం నాకు సరిగా అర్థం కాలేదు.

కొత్త పాళీ చెప్పారు...

చాలా బావుంది. చివరగా సీస గీతాల్లో ర్వ తో రెండో అక్షరం ప్రాస (ప్రాసయతితో సహా) .. ఆహా! మాస్టరూ మీకు నమస్కారం!

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

రాఘవా! ప్రయోగించినది లున్ అనే ప్రథమా విభక్తి బహువచన ప్రత్యయము.
లన్ అనే ద్వితీయా విభక్తి ప్రత్యయం మత్రం కాదు.

దుర్మార్గు లీ జగతి ధర్మాత్ములన్ మిగుల మర్మంబుతో నిడుమలన్
కర్మంబులం గొలిపి నిర్మూలనం బవగ భర్మాపహార మతులై
కూర్మిన్మదిన్ విడిచి పేర్మిన్ వసించు. గని ధర్మంబు నే నిలిపగా
నిర్మూలనం బవగ మర్మాత్ములన్ దునిమి పేర్మిన్ భువిన్ నిలుపుదున్.
ఇది రెండవ పద్యము.
భావము:-
ఈ లోకంలో దుర్మార్గులు ప్రేమ అన్నది మనస్సునుండి విడిచిపెట్టి; ధర్మాత్ములను మాయ చేసి; ఇడుమలను; అవస్య మాచరిపంపక తప్పని దుష్కర్మలను కల్పిస్తూ; వారు నిర్మూలింప బడిన పిమ్మట ధనాదులనపహరించు స్వభావులై గొప్ప వారిగా చలామణీ ఔతున్నారు.అది చూచి; నేను ధర్మమును నిలుపుటకు మాయతో కూడిన మనస్సు కలవారిని నిర్మూలమయే విధంగా సంహరించి; భూమిని ప్రసిద్ధముగా నిలుపుదును సుమా!
అని నా భావన. ఇందలి ఔచిత్యము పాఠకులకెఱుక.
మీ స్పందనకు నెనరులు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

రవీ!
రవి గాంచనివి కవి గాంచునని నానుడి. కాని కవి గాంచనివి రవి గాంచునని కూడా అనవచ్చునని రుజువు చేసావు. నెనరులు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

స్వామీజీ! నమో నమః.
ధన్యోస్మి.
ధన్యవాదములు.

Sanath Sripathi చెప్పారు...

చింతా వారూ. పద్యాలూ, ఆకృతీ బావున్నాయి.. :-) ధన్యవాదాలు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

అభీష్ట సిద్ధిరస్తు

చంపకోత్పల మాలలతో దేవి గళమునలంకరించి జగజ్జనని చేతిలోని ఖడ్గమనే కలంలోంచి దుష్ట శిక్షణ శిక్ష రక్షణ " అశ్వధాటిలొ " ఘాటుగా రంగరించి ఒలికించిన మణుల కాంతులు, దేవి పాదాలపై పడి మిరుమిట్లు గొలుపుతున్నాయి.పది...పద్య..." పాదములు " = ఇక్కడ " పాదములు " = దేవి పాదములని కుడా

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.