గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, మే 2010, మంగళవారం

దేవీ స్తుతి 9 / 13. (కాళిదాసు కృత అశ్వధాటికి ఆంధ్రానువాదము)

http://farm3.static.flickr.com/2522/4130738189_b70d5c28ce_m.jpg
శ్లో:-
దక్షాయణీ దనుజ శిక్ష విధౌ వికృత దీక్షా మనోహర గుణా!
భిక్షాశినో నటన వీక్షా వినోద ముఖి దక్షాధ్వర ప్రహరణా!
వీక్షాం విదేహి మయి దక్షాస్వకీయ జన పక్షా విపక్ష విమిఖీ!
యక్షీశ సేవిత నిరాపేక్ష శక్తి జయ లక్ష్మ్యా వధాన కలనా!౯.
సీ:-
రాక్షస సంహార దీక్షఁ బూనిన తల్లి;
సుమనోజ్ఞ గుణ పూర్ణ; సుజన రక్ష.
శివ తాండవముఁ జూడ చిద్విలాసమ్ముగ
నానంద ముఖియయి యలరు జనని.
దక్షాధ్వర ధ్వంస. రక్షింప యోగ్యయు;
భక్తుల కండయై ప్రబలు మాత.
శత్రు విధ్వంసిని; శరణాగత త్రాణ.
శ్రీకర ధనపతి సేవిత పద.
గీ:-
యుక్తి నప్రతిహత మహా శక్తి హైమ.
విజయ సాధన దీక్షతో వెలయు గిరిజ.
అట్టి దాక్షాయణీ మాత పట్టి విడక
నన్ను కృప తోడఁ జూచుత సన్నుతముగ. 
భావము:-
రాక్షస సంహార విషయంలో అసాధారణమైన పట్టుదల కలదీ; మనసుకింపైన గుణ సంపద కలదీ; శివుని తాండవాన్ని తిలకించడంలో ఆనందించే ముఖం కలదీ; దక్షుడి యజ్ఞాన్ని ధ్వంసం చేసినదీ; సమర్ధురాలు; తన భక్తులకు అండగా నిలిచేదీ; శత్రువులకు ప్రతికూలమైనదీ; కుబేరుఁడు చేత సేవింపఁ బడేదీ; ఎదుర్కొనుటకు వీలుకానంత శక్తి కలదీ; విజయలక్ష్మిని పొందుటలో ఏకాగ్రత కలదీ;(విజయానికి గుర్తులైన ప్రశస్తమైన పూర్వ చరిత్ర కలదీ;)అయిన ప్రజాపతి కుమార్తె ఐన దాక్షాయణి నాపట్ల దృష్టిని ఉంచవలసినది.
జైహింద్.  
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఆశీర్వదించి
దుష్ట సంహారిణి జగజ్జననీ ఆ తల్లిని అను నిత్యం స్థుతించు కోగలగటం మన పూర్వ జన్మ సుకృతం కొలచిన కొలదీ కొంగు బంగారమె.రేపటి స్తుతి కోసం

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.