గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, మార్చి 2009, శుక్రవారం

మేలిమి బంగారం మన సంస్కృతి 52.

అనుభవజ్ఞుల మాటలు ఎంతటి యదార్థాలు!
చూడండి.

శ్లో:

వేద శాస్త్ర పురాణేన కాలో గచ్ఛతి ధీమతాం.
వ్యసనేనచ మూర్ఖాణాం నిద్రయా కలహేనచ.

గీ:-
వేద శాస్త్ర పురాణముల్ బోధ చేత
గడపు ధీమతులు తమదు కాల మెపుడు.
వ్యసన, నిద్ర , కలహముల భ్రష్టు లగుచు
కాలము గడుపు మూర్ఖులు, కాన లేక.

భావము:-
బుద్ధిమంతులకు కావ్య శాస్త్ర పురాణాదులతో తమ కాలమును గడుపుదురు. మూర్ఖులు వ్యసనములతోను, నిద్ర తోను, యితరులతో నిత్యమూ కలహించుటతోను తమ కాలమును గడుపుచుందురు.

మహానుభావులు, పరమ యోగీశ్వరులు, అగు మన పెద్దలు తమ అనుభవ సారమును కావ్యములుగా, శాస్త్రములుగా, పురాణములుగా మనకందించారు. మనము
మన మతి మనకు అందుబాటులో ఉన్నప్పుడే ఆ జీవిత అనుభవ సారములైన కావ్య, శాస్త్ర, పురాణాదులను చర్చించు కొనుట కొఱకు మనకు సంప్రాప్తించిన అమూల్యమైన కాలాన్ని వెచ్చించాలి. గడచిన కాలాన్ని వెనుకకు తీసుకు రాలేము కదా.బుధులు ఇట్టి విషయమున అప్రమత్తులై యుందురు కదా. మూర్ఖులైన వారు మాత్రమే ఈవిషయము నందు మనసు పెట్టఁ జాలక
కాలము పాప కార్యములు చేయుచూ వ్యర్థ పరతురు.

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.