గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, మార్చి 2009, శనివారం

కవి సమ్రాట్ విశ్వనాథ భావుకత 11

శ్రీ విరోధి ఉగాది వేడుకలు సాహితీ మిత్రులైన మీరందరూ ఆనందోత్సాహాలతో జరుపుకొని ఉంటారనుకొంటున్నాను. అందరికీ అభినందనలు.

దీనికంటే మూందుటపాలో నూతన సంవత్సర ఫలాల్ని పద్యాల్లో ివరించాను. మీరంతా చూచే వుంటారనుకొంటాను. సంతోసోషం.
సుమారు మూడు మాసాలుగా నిరవకాశం వలన విశ్వనాథ భావుకత మీకందించ లేకపోయినందుకు క్షంతవ్యుడను.

ఇదివరలో 10 భాగములు చెప్పుకొన్నాం. ఇప్పుడు 11 వ భాగం శ్రీ బులుసు వేంకటేశ్వర్లు గారి ఉపన్యాస సారాన్నితెలుసుకొందాం.

రామాయణ కల్ప వృక్షంలో కిష్కంధ కాండలో శ్రీరాముడు సీతాన్వేషణ చేస్తున్న సందర్భం. పంపా సరోవర పరిసర భూముల్లో శ్రీరాముడు తిరుగాడుతూ అచ్చటి ప్రకృతిని అణువణువు అన్వేషిస్తున్నాడు.

పంపా అరణ్యం ఒక్కొక్క అందాన్ని ప్రదర్శిస్తున్నది. పూల తీగలూ, ఫల వృక్షాలూ, చిన్నచిన్న పొదలూ, మహావృక్షాలూ, వేటికవే విలక్షణ సౌందర్యంతో ుతున్నాయి. అలాగే నేలలు కూడా కొన్ని చోట్ల ఇసుక భూములూ వున్నాయి. అక్కడంతా జీడి మామిడి పొదలు, పచ్చని స్వర్గం దిగి వచ్చిందా అన్నట్లుందా ప్రదేశంఅంతా.
విశ్వనాథ కూర్పును అవధరించండి.
శా:-
పంపా కానన భిన్న దేశముల సౌభాగ్యంబు చిత్రంబు నై
లింపశ్రీకముగా కనంబడెడి, వల్లీ గల్మ వృక్షాదులం
దింపౌనీడిగ చెట్ల ఱాగరప తా నిచ్చోటునిచ్చోటు చొ
క్కంపుంగుమ్ముల జీడి మామిడి పొదల్గా సైకత శ్రేణులన్.

గరప నేలల్లో ఈడిగ చెట్ల గుంపులు, పోగా పోగా ఇసుక నేలల్లో జీడిమామిడి పొదలు నెలకొని వున్నాయి. భిన్న భిన్న మైన లతలు, పొదలు, వృక్షాలు, స్వర్గ సౌందర్యంతో వున్నాయి.
ఇక్కడ విభిన్నమైన భూ భాగాల్ని వర్ణించడం ఎందుకంటే శ్రీరాముని ప్రస్తానం సాగుతున్నట్లు మనకు తెలియఁజేయడమే. సీత కనబడని క్షణం నుండి రాముని మనస్సుకే కాదు తనువుకూ కుదురు లేదు. నిర్విరామంగా ఆయన తిరుగుతూనే వున్నాడు సోదర సహితుడై. ఆ అన్వేషణలో ఆయన చూచిన ప్రదేశాలే ఇక్కడ వర్ణితమగుతున్నవి.

పై పద్యం మమూలుగా చూస్తే ఏ విశేషము లేనట్లు కేవలము పంపాపరిసర భూముల్ని యథా తథంగా వర్ణించినట్లు కనిపిస్తుంది. కాని మహాకవుల కావ్య రచనలో శిల్పం అనేది ఒక నైపుణి. కథను పాఠకుల మనస్సుకు హత్తుకొనేటట్లు చేయడంలో వర్ణనలదే ప్రథాన పాత్ర. ఈ వర్ణనలు మళ్ళీ బహు విధాలు. చలన వస్తువుల్ని వర్ణించే విధానం వేరు, నిశ్చల దృశ్యాల్ని వర్ణించే విధానం వేరు. ఇందుకు కవి లోకజ్ఞుడై ఉండాలి. అటవీ వర్ణనలో కవి కేవలం వృక్ష జాతుల పేర్లు గుదిగుచ్చిఆ జాబితా యివ్వడంతో సరిపోదు. పాఠకుడు ఆ వర్ణనలో రమించడు. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంలో దుష్యంతుడు రథాధిష్టుడై అడవికి వేటకు వెళ్ళిన సందర్భంలో రథం వేగంగా పోయేటప్పుడు ప్రకృతి ఆయనకు ఏవిధంగా కనిపిస్తోందో వర్ణించాడు. " యదా లోకే సూక్ష్మం వ్రజతి సహసా తద్విపులతాం " అంటూ అతి చిన్నదిగా కనిపించే వస్తువు మఱు క్షణంలో అతి పెద్దదిగా కనిపిస్తోంది అని అర్థం. అంటే ఏమిటి? రథం అంత వేగంగా పోతున్నదన్నమాట. మహా కవుల శిల్పమార్గంయిది. ప్రత్యేకం వర్ణనల్లో ఇది మరీ సూక్ష్మ భావుకత కలవారికే సాధ్యం.
రస మార్గ ప్రస్తరణలో నిపుణుడైన విశ్వనాథ ఇక్కడ అడవిని వర్ణిస్తూ అక్కడ ఉన్న రకరకాల నేలలను ( భూములను ) చెప్పడం ద్వారా రాముని సీతాన్వేషణ సాగుతున్న సంగతిని శిల్ప మార్గంలో చెప్పడం జరిగింది.
పైకి సామాన్యంగా కనిపించే పద్యాల్లో కూడా తరచి చూస్తే విశ్వనాథ భావుకత మనల్ని ముగ్ధుల్ని చేస్తుంది.

చూచారుకదా కవి వతంసుడు శ్రీ బులుసు వేంకటేశ్వర్లు గారు వెలువరించిన విశ్వనాథ భావుకత. మరొక పర్యాయం మరో పద్యంలోని భావుకతను తెలుకొందాం.
మీ అభిప్రాయాల్ని తెలియఁజేస్తారుకదూ?
వారితో మీరు నేరుగా మాటాడాలనుకొంటే వారిసెల్ నెంబరు: 09949175899. అందరికీ శుభము కలుగును గాక.
జైహింద్. Print this post

2 comments:

రాఘవ చెప్పారు...

ప్రకృతిని ఎంత దగ్గఱగా దర్శించియుంటారోనండీ విశ్వనాథవారు! లేకుంటే ఱాళ్ల గరపనేలల్లో సైకత శ్రేణులలో అక్కడక్కడ ఈడిగ, గుమ్ముడు, జీడిమామిడి, మొదలైనవాటి పెరుగుదల గుఱించి ఎలా చెప్పగలరు? మంచి పద్యాన్ని పరిచయం చేసారు, కృతజ్ఞుడను. మీకు మఱొక్కమాఱు నమోవాకం.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

రాఘవ
కి నాకు

వివరాలను చూపించు 10:33 AM (11 గంటల క్రితం)


జవాబివ్వు


మీ "కవి సమ్రాట్ విశ్వనాథ భావుకత 11" పోస్ట్‌పై రాఘవ క్రొత్త వ్యాఖ్యను ఉంచారు:

ప్రకృతిని ఎంత దగ్గఱగా దర్శించియుంటారోనండీ విశ్వనాథవారు! లేకుంటే ఱాళ్ల గరపనేలల్లో సైకత శ్రేణులలో అక్కడక్కడ ఈడిగ, గుమ్ముడు, జీడిమామిడి, మొదలైనవాటి పెరుగుదల గుఱించి ఎలా చెప్పగలరు? మంచి పద్యాన్ని పరిచయం చేసారు, కృతజ్ఞుడను. మీకు మఱొక్కమాఱు నమోవాకం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.