గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, నవంబర్ 2026, ఆదివారం

ఆంధ్రామృత పాఠకులకు దీపావళి శుభాకాంక్షలు.

1 comments

 కైశ్రీరామ్.

ఆంధ్రామృత పాఠకులకు దీపావళి శుభాకాంక్షలు.

ఉ.  శ్రీవరణీయ సత్య మది చేరిన యా  నరకాసురాంతకున్

కావఁగ భక్తునిన్  మదిని కాచి వధించెను, తన్ మనోజ్ఞమౌ

భావననొప్పునా జనని భాసిలు రూపము చూడబోవ దీ

పావళిశోభకానగు,నా జనయిత్రి మిమున్ కృపన్ గనున్.

జైహింద్.

6, నవంబర్ 2026, శుక్రవారం

నిశా వృత్త గర్భిత సీసము. ... రచన. శ్రీమతి పావులూరి సుప్రభ.

0 comments

 జైశ్రీరామ్.

నిశా వృత్త గర్భిత సీసము

సిత వనజనయన, శ్వేతవస్త్రాన్వితా, శుద్ధతత్త్వాత్మికా, శోభితాంగి

గణ గణుత విభవ, కమ్రగానప్రియా ,

కచ్ఛపీధారిణీ, కంబుకంఠి

నతజనశుభకరి, జ్ఞానసంపత్ప్రదా,

సర్వవిద్యామయీ, సత్యరూప

నినుఁగని ప్రియముగ నిత్యగానాలతో

మోదమీఁ దల్తునే వేదమాత

*

తే. గీ

*

కరుణతోఁ గాంచి తనియించి దరిసెనమున

నిరతి నినుఁగొల్చి కీర్తించు వరమునొసఁగి

దరినిఁ జేర్చంగ మదినెట్టి దరము లేక

వరలఁ గల్గుదు సౌఖ్యాన ధరను సతము

*

గర్భిత “నిశా” వృత్తము

*

గణములు, యతి - న,న,ర,ర,ర,ర- 9

*

వనజనయన, శ్వేతవస్త్రాన్వితా, శుద్ధతత్త్వాత్మికా

గణుత విభవ, కమ్రగానప్రియా ,

కచ్ఛపీధారిణీ

జనశుభకరి జ్ఞానసంపత్ప్రదా

సర్వవిద్యామయీ

కని ప్రియముగ నిత్యగానాలతో

మోదమీఁదల్తునే

*

సుప్రభ

5:34 AM

06-11-2026

జైహింద్.

నవదుర్గావిలాస హేల. ... చిత్ర గర్భకవితోద్భాసము . రచన. ... చింతా రామకృష్ణారావు.23 - 9 - 2017.

0 comments

 జైశ్రీరామ్.

శైలపుత్రీ : (బాలా త్రిపుర సుందరి)

శ్లో|| వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృతశేఖరాం| 

వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్ ||

ఉపజాతి వృత్త గర్భ సీసము.

ఈశ్వరీ! శరణు. జాగేల నన్ గావఁగ - శైల పుత్రీ కృపన్ శరణమిమ్ము,

కారుణ్య రూపా! ప్రగణ్య విశ్వార్చిత - వామ నేత్రీ సదా ప్రాపు నిలుమ.

అద్భుతంబైన భోగాదులంగూర్చిన - పూజ్య మాతా లసన్మూర్తి జనని

కంజాత నేత్రీ జగంబులోనంచిత శాంతినిమ్మా మాకు సంతసమున..

తే.గీ. నీదు నవరాత్రులన్ మాకు బోధఁ గొలిపి, సత్కవిత్వబు సలిపిశక్తినిచ్చి,

బంధ గర్భసుచిత్రంబులందుగొలుపు నేర్పునొసగి మమ్మేలుమా నిఖిల జనని.

సీస గర్భస్థ ఉపజాతి వృత్తము.

జాగేల నన్ గావఁగ శైల పుత్రీ!

ప్రగణ్య విశ్వార్చిత వామ నేత్రీ!                                  

భోగాదులంగూర్చిన పూజ్య మాతా!

జగంబులోనంచిత శాంతినిమ్మా!

బ్రహ్మచారిణి( గాయత్రి )

శ్లో|| దధానా కరపద్మాభ్యాం అక్షమలాకమండలూ |

దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ||

రుచిర గర్భ సీసము. ( రుచిరము. - జ భ స జ గ .. యతి 9)

శ్రీమాతవు పరాత్పరీ కను నను బ్రహ్మ - చారిణీ! భక్తితో సంస్తుతింతు.

నిన్నే గనితరింతునేన్ మది నిను దాల్చి - భక్తితో నిరతంబు భజన చేతు.

ప్రార్థింతునునిరంతరంబసదృశ నిశ్చ- లాత్మతో నిన్నెంచి యజ్ఞ రూప.

నీరూపునె స్మరింతు నిన్ ననుఁగను మాతృ - దేవతా! వరమీగదే శివాని.

దివ్య నవరాత్రిలోనిద్వితీయ మూర్తి

బ్రహ్మచారిణివైమమ్ము బ్రతుకఁ జేయ

మమ్ము కరుణించి వచ్చితే కమల నయన!

వందనంబులు చేకొమ్ము పావనాఘ్రి!

సీస గర్భస్థ రుచిరవృత్తము. ( రుచిరము. - జ భ స జ గ .. యతి 9)

పరాత్పరీ కను నను బ్రహ్మచారిణీ!

తరింతునేన్ మది నిను దాల్చి భక్తితో

నిరంతరంబసదృశ నిశ్చలాత్మతో

స్మరింతు నిన్ ననుఁ గను మాతృ దేవతా!

చంద్రఘంట(అన్నపూర్ణ)

శ్లో|| పిండజప్రవరూరుఢా చంద్రకోపాస్త్ర కైర్యుతా|

ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ||

అంతరాక్కర - తేటగీతి - ఆటవెలది ద్వయ గర్భ సీసము. 

మాన్య రూప! నిరుపమము చంద్రఘంట నీ నిర్మలాత్మ సుగుణ ధర్మ బోధ.

కలిమిఁ గూర్చి కరుణఁ గను తల్లి వీవెగా కాపు మాకు కనఁగ కామిత ప్రద!

నయతనీయ, సరగునను వచ్చి కొల్పు సత్సంగ రక్తి.  వరశుభాంగ నీవు..

ఎన్ని చూడ తరుణ మిది కావ నన్ను తత్వార్థ భాస! కనుమ! వరల నిమ్మ!

తే.గీ. నీదు పాదాబ్జములపైన నాదు మనసు

నిలువఁ జేయుమ! మాయమ్మ! నిన్నె కొలుతు.

నీవె రక్షీంపకున్నచో త్రోవ లేదు.

పార్వతీ! పతి తోడుగ వరలు మదిని.

సీస గర్భస్థ  అంతరాక్కర. 

(అంతరాక్కర. - 1సూ.గణము, 2ఇం.గణములు, 1చం.గణము .. 

యతి 3వ గణము చివరి అక్షరము)

నిరుపమము చంద్రఘంట నీ నిర్మలాత్మ 

కరుణఁ గను తల్లి వీవెగా కాపు మాకు

సరగునను వచ్చి కొల్పు సత్సంగ రక్తి. 

తరుణ మిది కావ నన్ను తత్వార్థ భాస! 

సీస గర్భస్థ  తేటగీతి.

నిరుపమము చంద్రఘంట నీ నిర్మలాత్మ 

కరుణఁ గను తల్లి వీవెగా కాపు మాకు

సరగునను వచ్చి కొల్పు సత్సంగ రక్తి. 

తరుణ మిది కావ నన్ను తత్వార్థ భాస! 

సీస గర్భస్థ ఆటవెలది ద్వయము.

౧. మాన్య రూప! నిరుపమము చంద్రఘంట నీ - నిర్మలాత్మ సుగుణ ధర్మ బోధ.

కలిమిఁ గూర్చి కరుణఁ గను తల్లి వీవెగా - కాపు మాకు కనఁగ కామిత ప్రద!

౨. నయతనీయ, సరగునను వచ్చి కొల్పు స - త్సంగ రక్తి.  వరశుభాంగ నీవు..

ఎన్ని చూడ తరుణ మిది కావ నన్ను త - త్వార్థ భాస! కనుమ! వరల నిమ్మ!

కూష్మాండ ( కామాక్షి )

శ్లో||  సురా సంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ|

దధానా హస్త పద్మభ్యాం కూష్మాండా శుభ దాస్తుమే ||

ప్రణవ వృత్త గర్భ సీసము. ( ప్రణవ వృత్తము - మ న య గ .. యతి 6 )

నిర్మల రూప! నే నిన్ మ్రొక్కెద నిల కూ  ష్మాండా! జగన్మాత! శంభురాణి!

నోరార పిల్తు దీనున్ నన్ గని తెరవున్  జూపన్ గదే తల్లి! శోభఁ గొలుప.

ఆనంద పూర్ణజ్ఞానాంభోధివి కనవే  మమ్మా! మహా దేవి! సమ్మతమున.

నవతేజ పూజ్య! ప్రాణంబీవెగ పరమే  శానీ! మహాదేవి! జ్ఞానమిమ్ము.

తే.గీ. 

నిత్యకల్యాణివీవమ్మ! నిరుపమాన! - సత్య సన్మార్గ గా సలుపు నన్ను.

బంధ చిత్రాదులన్ గల భారతాంబ! - సుందరోజ్వల తేజమా! చూపు భవిత.

సీసగర్భస్థ ప్రణవ వృత్తము. 

నే నిన్ మ్రొక్కెద నిల కూష్మాండా! 

దీనున్ నన్ గని తెరవున్ జూపన్ 

జ్ఞానాంభోధివి కనవేమమ్మా! 

ప్రాణంబీవెగ పరమేశానీ!

స్కందమాత ( లలిత )

శ్లో|| సంహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా|

శుభదాస్తు సదాదేవీ స్కందమాతా యశస్వినీ ||

నదీ వృత్త గర్భ సీసము. (నదీవృత్తము. న న త జ గగ .. యతి 8 )

నిలు మదిని, జయము గొలుపుమో సన్నుత - స్కందమాతా! నన్నుఁ గాంచవమ్మ!

పలుకుల వినయము నిలుపుమానందద - నవ్య తేజా! నిన్ను నమ్మి కొలుతు.

వెలుఁగ మది శ్రియము కలుగనీ జీవిత - మంత నాకున్ మదిన్ భ్రాంతి తీర.   

ఎలమినిడిభయము తొలగనీ పాప వి - ముక్తుఁ జేయన్ ననున్ బ్రోచు తల్లి!

తే.గీ. నీదు భక్తుల కోరికల్ నీవె కాక

తీర్చ నెవ్వరు కలరమ్మ? తీర్చుమమ్మ.

కరుణ చూపుచు ప్రజనెల్ల కావుమమ్మ.

శరణు శరణమ్ము జనయిత్రి శరణు శరణు.

సీస గర్భస్థ నదీ వృత్తము. (న న త జ గగ .. యతి 8)

జయము గొలుపుమో సన్నుత స్కందమాతా!

నయము నిలుపుమానందద నవ్య తేజా!   

శ్రియము కలుగనీ జీవితమంత నాకున్ 

భయము తొలగనీ పాప విముక్తుఁ జేయన్.

కాత్యాయని (లక్ష్మి)

శ్లో|| చంద్రహాసోజ్జ్వలకరా శార్దూల వరవాహనా |

కాత్యాయనీ శుభం దద్యాద్దేవీ దానవఘాతినీ ||

దండక గర్భ సీసము. (దండకము త త త త త త  . . . . . )

కాత్యాయనీ నీదు కారుణ్యమున్నన్ బ్ర కాశింతుమే మేము ఘనతరముగ.

నీకన్న మాకున్న లోకేశ్వరెన్నంగ లేదమ్మ.మాయమ్మ! మోదమిమ్మ.

నీపాద పద్మంబులేపార జూడంగ దీపించు సత్యంబు తేజమబ్బు

పాపాలు పోకార్పి కోపాలనే బాపి మాపాల నీవుండుమా కృపాబ్ధి.

తే.గీ. దండకంబందు నీవేను తలచి చూడ.

మెండుగాతోచు. మదినిండి యుండుమమ్మ.

పండు వెన్నెల చలువలు నిండియుండు

నీదు చూపులు మమ్ముల సేద తీర్చు.

సీస గర్భస్థ దండకము. (త త త త త త  . . . . . )

కాత్యాయనీ నీదు కారుణ్యమున్నన్ బ్రకాశింతుమే మేము.

నీకన్న మాకున్న లోకేశ్వరెన్నంగ లేదమ్మ.మాయమ్మ!

నీపాద పద్మంబులేపార జూడంగ దీపించు సత్యంబు.

పాపాలు పోకార్పి కోపాలనే బాపి మాపాల నీవుండుమా!

కాళరాత్రి ( సరస్వతి )

శ్లో|| ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నాఖరాస్థితా|

లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్త శరీరిణీ |

వామపాదోల్లసల్లోహలతాకంటక భూషణా|

వర మూర్ధధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ || 

సరసాంక వృత్త గర్భ సీసము. (సరసాంక వృత్తము. - స జ స స య .. యతి 10)

కరుణింపవా! కలి కాల దుర్జన భయం - కర కాళరాత్రీ! సుఖంబునీవ?

హరియింపవా? కలుషాధముల్ సుజనులన్ - కలఁగించుచుండన్గ కనవదేల?

లక్ష్యంబుతో ఖలులన్, దహించగ నుపే - క్ష యదేలనమ్మా! సుజనులఁ గావ.

నాలసింపక మలినాత్ములన్ మడచి, మా - మది నుండిపొమ్మా! సమస్తమగుచు.

తే.గీ. ఖలుల పాలిట మాయమ్మ కాళరాత్రి.

సుజనులనుకాచుమాయమ్మ సుస్మితాంబ.

యనుచు జనులెల్ల నిన్గన కనుము మమ్ము.

వందనంబులు చేకొమ్ము భద్రకాళి.

సీస గర్భస్థ సరసాంక వృత్తము (స జ స స య .. యతి 10)

కలి కాల దుర్జన భయం కర కాళరాత్రీ!

కలుషాధముల్ సుజనులన్ కలఁగించుచుండన్

ఖలులన్, దహించగ నుపేక్ష యదేలనమ్మా!

మలినాత్ములన్ మడచి, మా మది నుండిపొమ్మా!

మహాగౌరి( దుర్గ )

శ్లో|| శ్వేతే వృషే సమారూడా స్వేతాంబరధరా శుచిః|

మహాగౌరీ శుభం దద్యాత్, మహాదేవ ప్రమోదదా ||

నిశావృత్త గర్భ సీసము ( నిశావృత్తము న న ర ర ర ర .. యతి 9 )

సతి! కృపను గనుమ శాంభవీ! తల్లి! మా శ్రీమహాగౌరివై! చేదుకొనుము.

ఇక తపము జపములేల తల్లీల వమ్మౌనె నిన్ గాంచినన్. జ్ఞాన తేజ!

నిలు. నెపము వలదు నేను నిన్నే మదిన్ నిల్పి ధ్యానించెదన్. నేర్పు మీర.

ఇట ప్రపగ దొరికితీవ, భారంబు నీదే. జగద్రక్షిణీ! దివ్య తేజ!

తే.గీ. ఘన నిశా వృత్త గర్భస్థ గణ్య సీస

వినుత శ్రీమహా గౌరీ! వివేకమిమ్ము.

శారదానవరాత్రుల చలువనెపుడు

మమ్ము కాంచుచు రక్షించుమమ్మ! దేవి!

సీస గర్భస్థ నిశావృత్తము .( న న ర ర ర ర .. యతి 9 )

కృపను గనుమ శాంభవీ! తల్లి! మా శ్రీమహాగౌరివై!

తపము జపములేల తల్లీల వమ్మౌనె నిన్ గాంచినన్.

నెపము వలదు నేను నిన్నే మదిన్ నిల్పి ధ్యానించెదన్.

ప్రపగ దొరికితీవ, భారంబు నీదే. జగద్రక్షిణీ! దివ్య తేజ!

సిద్ధిధాత్రి ( మహిషాసుర మర్దిని )

శ్లో|| సిద్ధగంధర్వయక్షాద్యైరసురైరమరైరపి |

సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ||

మాలినీ వృత్తము గర్భ సీసము. (మాలిని వృత్తము. - న న మ య య .. యతి 9)

వినయ మొసగెదవీవే నాకిలన్ సిద్ధి దాత్రీ! పరాత్పరి దారి నీవె.

విజయ విభవములీవే సత్య సంపూర్ణ తేజా! మదిన్ నిల్పి పూజ సేతు.

సదయ నిలుము మనోజ్ఞా! దర్ప సన్మూల నాశా! మహేశాని! నాదు మదిని.

విలయ మగునెడ నీవే రక్ష నాకున్. మ దంబా! నిరంజనా! హరుని రాణి.

తే.గీ. కార్య సిద్ధిని కలిగించు  కామితప్రద!

సౌర్య సద్గుణ సంపద్విశారదులుగ

సజ్జనంబులఁ గాచుచు సదయఁ గనుమ!

వందనంబులునీకునానందపూర్ణ!

సీస గర్భస్థ మాలినీ వృత్తము . (న న మ య య .. యతి 9)

నయ మొసగెదవీవే నాకిలన్ సిద్ధి దాత్రీ! 

జయ విభవములీవే సత్య సంపూర్ణ తేజా!! .

దయ నిలుము మనోజ్ఞా! దర్ప సన్మూల నాశా! 

లయ మగునెడ నీవే రక్ష నాకున్. మ దంబా!

రాజ రాజేశ్వరి, 

శ్లో||  ఓం హ్రీం కాలాభ్రాభాం కటాక్షైరరికులభయదాం మౌలిబద్ధేందురేఖాం 

శంఖం చక్రం కృపాణం త్రిశిఖమపి కరైరుద్వహంతీం త్రినేత్రామ్ |

సింహస్కంధాధిరూఢాం త్రిభువనమఖిలం తేజసా పూరయంతీం

ధ్యాయేద్ దుర్గాం జయాఖ్యాం త్రిదశపరివృతాం సేవితాం సిద్ధికామైః ||

షోడశ కళాపూర్ణ నవదుర్గా స్వరూపిణియైన 

శ్రీ రాజరాజేశ్వరీ జగన్మాత కృపామృతాస్వాదనాసక్తుఁడనైన నాచే విరచింపఁ జేసిన 

దండక గర్భ షోడశ పాద సీసము

శ్రీరాజ రాజేశ్వరీ సర్వ లోకేశ్వ రీ! శాశ్వితానంద! రీతినొసగు.

శ్రీ శైలపుత్రీ! ప్రసీద ప్రసీద ప్రభారాశివోయమ్మ భాతినిమ్ము.

నే బ్రహ్మసచ్చారిణీ కొల్తు నిన్నే సుధారాశివేనీవు. దయను కనుమ.

హే చంద్రఘంటా మహేశానివమ్మా! కృపన్ గాంచుమోయమ్మ. భక్తిఁ గొలుతు.

కూష్మాండమాతా! నిగూఢాంతరంగప్రకాశంబు వీవేను. కరుణఁ జూపు.

మా స్కందమాతా ప్రమత్తుండ నన్ జూచి కాపాడు మాతల్లి కనకవల్లి.

కాత్యాయినీ భవ్య కామేశ్వరీ నీదు కారుణ్యమేనెన్న గలనొ? చెపుమ.

ఓకాళరాత్రీ మహోన్మత్తకాశీమహారాజ్ఞివీవేను యజ్ఞ దగ్ధ!

శ్రీమన్మహాగౌరి చైతన్యమున్ గొల్పి చిత్తమ్మునన్నిల్చు చిత్ప్రభాస!

ఓసిద్ధిదాత్రీ పయోరాశివీవే మహద్దక్షసత్పుత్రి హారతిఁ గొను.

ఈశానివీవేవశింపన్ హృదిన్ మమ్ము రక్షించుచుండంగ ప్రకృతమైన

ప్రాణంబుపై ప్రీతి ప్రాణంబుపై భీతి మాకేలనోయమ్మ! మాకు నీవె

శ్రీకాంతులన్ గొల్పి చేకొంచు మమ్మున్ మహత్కార్యముల్ ప్రీతి నసదృశముగ

చేయింతువమ్మా! విశేషంబుగా నిత్య కల్యాణివీవేను కనకదుర్గ!

నిత్యంబు మాయందు స్తుత్యంబుగానిల్చి కాపాడు మాయమ్మ కల్పవల్లి.

ధాత్రిన్ గృపన్ జూడు తల్లీ! నమస్తే న మస్తేనమస్తేనమఃప్రభాస!

తే.గీ. హారతిగొనుమమ్మా! ధీసుధార్ణవ! ప్రియ

హారతిగొనుమమ్మా! జనహారతిగొనుమ!

దోషపరిహారిణీ శుభపోష జనని.

వందనంబులు. నిలుము మా డెందములను.

సీస గర్భ షోడశ పాద దండకము

శ్రీరాజ రాజేశ్వరీ సర్వ లోకేశ్వ రీ! శాశ్వితానంద!

శ్రీ శైలపుత్రీ! ప్రసీద ప్రసీద ప్రభారాశివోయమ్మ

నే బ్రహ్మసచ్చారిణీ కొల్తు నిన్నే సుధారాశివేనీవు.

హే చంద్రఘంటా మహేశానివమ్మా! కృపన్ గాంచుమోయమ్మ.

కూష్మాండమాతా! నిగూఢాంతరంగప్రకాశంబు వీవేను.

మాస్కందమాతా ప్రమత్తుండ నన్ జూచి కాపాడు మాతల్లి

కాత్యాయినీ భవ్య కామేశ్వరీ నీదు కారుణ్యమేనెన్న

ఓకాళరాత్రీ మహోన్మత్తకాశీమహారాజ్ఞివీవేను

శ్రీమన్మహాగౌరి చైతన్యమున్ గొల్పి చిత్తమ్మునన్నిల్చు

ఓసిద్ధిదాత్రీ పయోరాశివీవే మహద్దక్షసత్పుత్రి

ఈశానివీవేవశింపన్ హృదిన్ మమ్ము రక్షించుచుండంగ

ప్రాణంబుపై ప్రీతి ప్రాణంబుపై భీతి మాకేలనోయమ్మ

శ్రీకాంతులన్ గొల్పి చేకొంచు మమ్మున్ మహత్కార్యముల్ ప్రీతి

చేయింతువమ్మా! విశేషంబుగా నిత్య కల్యాణివీవేను

నిత్యంబు మాయందు స్తుత్యంబుగానిల్చి కాపాడు మాయమ్మ

ధాత్రిన్ గృపన్ జూడు తల్లీ! నమస్తే న మస్తేనమస్తేనమః!

జైహింద్.

ఆశ్వయుజ బహుళ త్రయోదశి యమ త్రయోదశి. ఈ రోజున సూర్యాస్తమయానంతరము యమదీపము పెట్టవలెను.

0 comments

 జైశ్రీరామ్.

గృహమున మంగళములు కలుగుట కొఱకు, అపమృత్యు నివారణ కొఱకు ఆశ్వయుజ బహుళ త్రయోదశి యమ త్రయోదశి రోజున సూర్యాస్తమయానంతరము  ద్వారబంధమునకు కుడివైపున ఒత్తి తూర్పుముఖముగా ఉండే విధంగా యమదీపము పెట్టవలెను. దీనికి నైవేద్యము కూడా పెట్ట వలెను.

శ్లో.  ఆశ్వినస్యాసితే పక్షే త్రయోదశ్యా నిశాముఖే |

యమదీపం బలిం దద్యాత్ అపమృత్యుర్వినశ్యతి ||

ఆదీపము ఆవు నేతితో కాని, నువ్వుల నూనెతో కాని మాత్రమే పెట్టవలెను.

శ్లో.  ఘృతం తైలంచ దీపార్ధే నైవ దద్యాత్కథంచన |

ఘృతాద్దీపః ప్రశస్తశ్చ తైలాద్దీపస్తథైవ చ ||

దీపము పెట్టేటప్పుడు పఠించవలసిన శ్లోకము.

మృత్యునా పాశ దండాభ్యాం కాలేనచ మయా సహ,

త్రయోదశ్యాం దీపదానాత్  సూర్యజస్ప్రీయతామితి.

జైహింద్.

4, నవంబర్ 2026, బుధవారం

దత్తపది. పంది - చేప - కప్ప - కోడి. బ్రాహ్మణ భోజన వర్ణన. ... నా పూరణము.

0 comments

జైస్రీరామ్. 

ఓం శ్రీమాత్రే నమః.

దత్తపది పూరణ.

దత్తపది.   పంది - చేప - కప్ప - కోడి. బ్రాహ్మణ భోజన వర్ణన. ... 

నా పూరణము.

గీ.  ఆర్తుల యినట్టి ద్విజులకిం పంది భుక్తి 

పెట్టె చేప ట్ట ఫలితమ్ము, విజ్ఞుఁడొకఁడు,

దీని కప్ప రమాత్మయే తృప్తినంది 

యతని కోడి ముక్తినే యతనికిచ్చె.


అమ్మ దయతో,

చింతా రామకృష్ణారావు.

జైహింద్.

3, నవంబర్ 2026, మంగళవారం

దైవంనుంచి జారి పరిశుభ్రతమీద.... డా. వెలుదండ సత్యనారాయణ. పరమార్థ కవి

0 comments

జైశ్రీరామ్.
🌻దైవంనుంచి జారి పరిశుభ్రతమీద..🌻
డా. వెలుదండ సత్యనారాయణ. పరమార్థ కవి

       వైశ్రవణుడు అనే భక్తుడు మలవిసర్జన చేసేటప్పుడు రామనామాన్ని స్మరించడం చూసి ఆంజనేయుడు అసహ్యపడి వీపు మీద ఒక్క చరపు చరచినాడు. రాముని దగ్గరికి వచ్చేసరికి రాముడు బాధపడుతుంటే విషయం అడిగినాడు. ఒక భక్తుడు నన్ను కొట్టినాడని రాముడు చెప్పాడు. ఎక్కడున్నా డంటే ఇక్కడే ఉన్నా డన్నాడు. మారుతికి అర్థం అయింది. చాలా బాధపడి వైశ్రవణుడి దగ్గరకు వెళ్లి క్షమాపణ కోరుకున్నాడు. 
    ఇక్కడ గమనించవలసినది ఏంటంటే అపరిశుభ్రమైన రామనామం పరిశుద్ధమైన రామనామం అనే రెండు ఉండవు. రామ నామం అంటాము. అంతే! దానికి అపరిశుభ్రతను గాని పరిశుభ్రతను గాని జోడించలేము. 
    అంటే ఏదీ అంటడం లేదు రామనామానికి. రామనామం చేసేవాడు పరిశుభ్రంగా ఉండవచ్చు.. అపరిశుభ్రంగా ఉండవచ్చు. అది అతనికి సంబంధించినదే! కానీ రామ నామానికి సంబంధించినది కాదు. కానీ ఆ విచికిత్స మనం మానేసి రామ నామానికి శుభ్రత అపరిశుభ్రత అంటగట్టి  హైరానా పడిపోతున్నాం. ఇది అవసరమా అని ఆలోచించడం లేదు.
     అపరిశుభ్రత గుర్తుకు వచ్చిందంటే దానిమీదకు మనసు పోయినట్టే కదా! అపరిశుభ్రత మీదకు మనసు పోతే దేవుని మీద నుంచి పక్కకు జారిపోయిందనే కదా అర్థం! అంటే మనసు దేవుని మీద పెట్టా లనుకొని కదా కూర్చున్నది! కానీ మనసు తనకు తోచిన రీతిగా అక్కడినుంచి జారుకుని అపరిశుభ్రత మీదకు పోయిం దన్నమాట. దానిని మనం గమనించనే లేదు. అక్కడ మనసును సరి చేసుకొనే అవసరం  ఉంది. కానీ అపరిశుభ్రతను సరి చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉన్నాము. మనసును సరి చేసుకోవడానికి కాదు. మన మనసు మనలోనే ఉన్నది. దానిని సరిచేసుకోలేక బయట ఉన్న వస్తువును గాని అపరిశుభ్రతను గాని సరి చేసుకోవాలని భ్రమ పడుతూ దాని వెంట పరుగెత్తుతూ ఉన్నాము. అంటే పుం డొకచోట మం దొకచోట అన్న సామెత ఋజువౌతున్నది. ఇది ఎంతవరకు సమంజసం అని కూడా ఆలోచించడం లేదు.      అపరిశుభ్రత తొలగిపోయిందంటే చాలు ఎంతో గొప్పగా దేవుని మీద మన మనసు నిలిచిపోతుందని భ్రమ పడుతూ ఉన్నాం. కానీ నిజంగా నిలిచిపోయిందా అని మాత్రం మనం చిత్తశుద్ధితో తరచి చూసుకోవటం లేదు.   ఊరకే క్షమించి వదిలేస్తున్నాం. అది మన మనస్సు కదా! అది ఏం చేసినా సరే అనుకుంటాం.
     ఇప్పుడు మనస్సు దేవుని మీద నుంచి జారిపోయి అపరిశుభ్రత మీద పడితే అపరిశుభ్రతను సరి చేసాం అనుకోండి. మరొకటి వచ్చేస్తుంది దాని చోట. అంటే మరొకటి ఆ ఖాళీని భర్తీ చేస్తుంది. అప్పుడు దాని మీద పడిపోతుంది మనస్సు. అప్పుడు దాన్ని కూడా సరి చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత ఆ చోట మరొకటి పడుతుంది. ఇలా ఎన్ని సరి చేసుకుంటూ పోతాము? ఇక్కడ గమనించవలసినది ఏమిటంటే సరి చేయడం అనేది కాదు దైవం మీదినుంచి జారిపోవడం మనసుకు అలవాటయింది అని తెలుసుకోవాలి. 
    అలా జారిపోవడం అనే లక్షణం మనసుకు లేకుండా చేసుకోవడంలోనే ఉన్నది సాధకుని యొక్క నేర్పరితనం. దానిని గుర్తించకుండా ఇంకేదో ఇంకేదో చేస్తున్నాము అనడం వృథా ప్రయాస. ఇదంతా తూర్పుకు వెళ్లా లనుకుని పడమరకు వెళ్ళినట్టే అవుతుంది కానీ మరొకటి కాదు.

...        శుభమ్ భూయాత్

✍🏻డా. వెలుదండ సత్యనారాయణ 
                    పరమార్థ కవి

పరమార్థకవి డా. వెలుదండ సత్యనారాయణ గారికి ధన్యవాదములు.
జైహింద్.

ఎందరో మహానుభావులు వారందరిలో అవధాని శ్రీ మైలవరపు మురళీకృష్ణ కవికి నా అభినందనలు.

0 comments

 జైశ్రీరామ్.

జైహింద్.

2, నవంబర్ 2026, సోమవారం

అవధాని శ్రీ మైలవరపు మురళీకృష్ణ గారి మనసుపొరలనుండి ప్రవహించిన అభిమానామృతఝరి.

0 comments

జైశ్రీరామ్.

నాపై ఇంతటి అవ్యాజానురాగమును చూపి కవితామృతాభిషేకము చేసిన అవధాని శ్రీ మైలవరపు మురళీకృష్ణ గారికి ఆ జగన్మాత ఆశీస్సులు పుష్కలముగా లభించుగాక. వారికి నా ధన్యవాదములు.

జైహింద్. 

30, అక్టోబర్ 2026, శుక్రవారం

మూకపంచశతి.. మూకకవి - పాదారవిందశతకము - 76. ... వివరణ ... శ్రీపాలకుర్తి రామమూర్త్రి.

0 comments

 జైశ్రీరామ్

మూకపంచశతి.. మూకకవి - పాదారవిందశతకము - 76.

వివరణ ... శ్రీపాలకుర్తి రామమూర్త్రి.

76.  ప్రణవ మంజీర వాచాల పాదయుగళి

ముదముఁ గూర్చునొ వాచంయములకు నెట్లు?

శోణమయ్యును జనులకు శుద్ధచిత్త

మెట్టులిచ్చునో? కామాక్షి! యిదియ వింత!

మూల సంస్కృత శ్లోకం...

కథం వాచాలోಽపి ప్రకటమణి మంజీరనినదైః

సదేవా నింద్రాదీన్విరచయతి వాచంయమజనాన్ I

ప్రకృత్యా తే శోణచ్ఛవిరపి చ కామాక్షి చరణో

మనీషా నైర్మల్యం కథమివ నృణాం మాంసలయతే!

(మూకపంచశతి.. మూకకవి - పాదారవిందశతకము - 76)

ఓ కామాక్షీ దేవీ! నీయొక్క దివ్య పాద పద్మము స్పష్టముగా, రత్న ఖచితమైన అందెల యొక్క నాదముల చేత ఎక్కువగా మాట్లాడే స్వభావం కలదైనప్పటికీ మౌన వ్రతాన్ని ఆచరించే మునులను, యోగులను ఎల్లప్పుడునూ బ్రహ్మానంద రసము చేత  తడిసినవారిగా ఎలా చేయగలుగుతోంది? మరియు స్వభావం చేతనే ఎర్రటి కాంతి కలదైనప్పటికీ మనుషుల యొక్క బుద్ధియొక్క నిర్మలత్వాన్ని రాగద్వేషాలు లేని స్థితిని ఎలా పెంపొందిస్తోంది?

శ్లోకాన్ని పద్యరూపంలో అనువదించి, తాత్పర్యాన్ని సమకూర్చినవారు  శ్రీ చింతా రామకృష్ణారావు గారు...

అమ్మవారి కాలి అందెలు సదా సవ్వడి చేస్తుంటాయి.. అవి ఎలా ఉన్నాయి అంటే.. ఒకదానితో మరొకటి మాట్లాడుతున్నాయా.. అన్నట్లుగా ఉన్నాయట. అవి ఎప్పుడూ మాట్లాడుతూనే ఉన్నా ఇంద్రాది దేవతలనూ, మౌనాన్ని ఆశ్రియించిన మౌనులనూ ఏ విధంగానూ అసహనానికి గురిచేయడం లేదు.. సరికదా వారిని ఎల్లప్పుడూ బ్రహ్మానంద రసము చేత  తడిసినవారిగా చేస్తున్నాయి. ఎందుకు? అంటే వారి మౌనంలో లేదా వారు పాటించే నిశ్శబ్దంలో వెలువడే శబ్దము బ్రహ్మానందాన్ని అనుగ్రహిస్తున్నది. వారంతా ఆ రస ప్రభూతిలో ఓలలాడుతూ సంస్విన్నాత్ములై రమిస్తున్నారట. 

సాధారణంగా శబ్దం మనస్సును బాహ్య ప్రపంచం వైపు మళ్లిస్తుంది. మౌనం మనస్సును అంతర్ముఖం చేస్తుంది. కానీ అమ్మవారి పాదనూపురాల శబ్దం మాత్రం మౌనుల అంతరంగంలో బ్రహ్మానందాన్ని నింపుతోంది.

నిజానికి సాధారణ శబ్దం మనస్సును చాంచల్యం వైపు మళ్ళిస్తుంది. దైవికమైన నాదం మనస్సును నిశ్చలం చేస్తుంది. అంటే శబ్దం విలువ దాని తీవ్రతలో కన్నా ఆ శబ్దంయొక్క మూలంలోనూ, దాని తత్త్వంలోనూ ఉంటుందని గ్రహించాలి. అమ్మవారి నూపురనాదమే నాదబ్రహ్మ తత్త్వంగా ప్రకటితమై సాధకులను రసానందంలో ముంచెత్తుతుంది. ఇక్కడ వెలువడుతున్న "నాదము" ప్రణవాన్ని స్ఫురింపచేస్తుంది. ఈ సృష్టి అంతా పరమచైతన్యం యొక్క ప్రకటనగానూ, ఓంకారం ఆ పరమ చైతన్యానికి ప్రతీకగానూ భావించాలి. ఆ ప్రణవ నాదమే అమ్మవారి అందెల సవ్వడిగా సాధకులను తన్మయులను చేస్తున్నది. అయితే ఇక్కడ గుర్తించాల్సింది... బాహ్య శబ్దమయితే అది ఇంద్రియాలను ఆకర్షించి మనస్సును బయటకు లాగుతుంది. కాగా అదే అంతరంగంలోని నాదమయితే సాధకుడి మనస్సును ఆత్మస్వరూపం వైపు నడిపిస్తుంది. అమ్మవారి మంజీరనాదం ఉత్తమ ఆధ్యాత్మిక స్థితిని ప్రసాదిస్తున్నది, అందువల్లనే మౌనులను ఆ శబ్దం ఇబ్బంది పెట్టకుండా, వారి మౌనానికి పరిపూర్ణతను ప్రసాదిస్తున్నది. శబ్దం ఉన్నా మనస్సు చలించని స్థితిని సాధించడమే మౌనానికి భాష్యంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మౌనుల మౌనం అంటే శబ్దం లేని స్థితి కాదు. మనస్సులోని సంకల్ప వికల్పాలు శాంతించిన స్థితిగా చెప్పుకోవాలి. ఎందుకంటే వారు వినేది కేవలం బాహ్యమైన అమ్మవారి మంజీరధ్వని కాదు... ఆ ధ్వని ద్వారా స్ఫురించే భగవచ్చైతన్య ధ్వనులను మాత్రమే. నిజానికి శబ్దం మనస్సును ఆక్రమించి ఏకాగ్రతను భగ్నంచేస్తే అది విక్షేపం. అదే శబ్దం మనస్సును ఆత్మలో లయం చేసుకునే ఏకాగ్రతను ప్రసాదిస్తే..  అది ఉపాసన అనుకోవచ్చు.

అలాగే... అమ్మవారి పాదాలు ఎఱుపు రంగుతో అలరారుతున్నాయి. నిజానికి ప్రకృతిలోని త్రిగుణాలలో సత్త్వగుణం నిర్మలత్వానికి, జ్ఞానానికి, ప్రశాంతతకు ప్రతీక కాగా రజోగుణం చాంచల్యతకు, కామాసక్తికి, వ్యగ్రత, క్రియాశీలతకు ప్రతీకలుగా చెపుతారు. అయితే శ్రీవిద్యా సంప్రదాయంలో అమ్మవారిని స్తుతిస్తూ.. అరుణాం కరుణతరంగితాక్షీం" అంటారు. అంటే అరుణవర్ణం... కరుణ, సృజనాత్మక చైతన్య భావనను కూడా స్ఫురింపచేస్తున్నది. ఇక తమోగుణం అజ్ఞానం, జడత్వం, మోహం లాంటి వాటికి ప్రతీకగా చెపుతారు.  ఎఱుపు రంగు రజోగుణానికి ప్రతీకగా సృష్టికి  మూలాధారమే కాని అది అహంకారం, స్వార్థపరత, ఫలితాపేక్షలతో మిళితమైతే రాగద్వేషాలకు దారిచూపుతుంది. అయితే అమ్మవారి పాదాల అరుణవర్ణం సాధకుల బుద్ధిలోని రాగద్వేషాలను పరిహరించి, నిర్మలత్వాన్ని ప్రసాదిస్తున్నది. 

నిజానికి, గుణములకు లోబడిన వస్తువు గుణధర్మాలకు అనుగుణమైన ఫలితాలనే ఇవ్వగలదు. కానీ గుణాతీతమైన చైతన్యం మాత్రం గుణముల పరిమితులను అధిగమించే శక్తిని ప్రసాదించగలదు. అమ్మవారి పాదాల ఎఱుపు రజోగుణాన్ని సూచిస్తున్నట్లు పైకి కనిపిస్తున్నా, ఆ పాదాల అనుగ్రహం సాధకుడిలో సత్త్వశుద్ధిని కలిగిస్తుందని భావించాలి. 

అయితే.. పరస్పర విరుద్ధమైన భావ ప్రకటన ఎలా సాధ్యపడుతున్నది? అంటే అమ్మవారు లోకాతీత, గుణాతీత, సర్వాతీత, శమాత్మికా (లలితా సహస్రనామాలు) కాబట్టి. అంటే ప్రాకృతికమైన వైరుధ్యాలు అమ్మ పాదాల వద్ద పరస్పర సహకార కేంద్రాలుగానూ, సమన్వయ కేంద్రాలుగానూ ప్రవర్తిస్తాయి.

శ్లోకంలో "మనీషా నైర్మల్యం" అనే వాక్యాన్ని వాడారు. మనీష అంటే బుద్ధి, వివేచనాశక్తి, సత్యాసత్య విచక్షణాజ్ఞానం. నైర్మల్యం అంటే నిర్మలత లేదా మలినరాహిత్యం. అంటే అమ్మవారి పాదాలను ఆశ్రయించిన సాధకులకు మనశ్శాంతి మాత్రమే కాకుండా వివేకంతో కూడిన నిర్మలమైన బుద్ధి లభిస్తుంది అంటున్నాడు మూకకవి.

అమ్మవారి పాదాలను ఆశ్రయించడం అంటే ఏమిటి? ఆశ్రయించడం అంటే కేవలం భక్తితో నమస్కరించడం కాదు. సాధకునిలోని అహంకారాన్ని, స్వార్థాన్ని, మమకారాన్ని ఆమె సన్నిధిలో సమర్పించి పునీతులు కావడంగా భావించాలి.

పరిమిత దృష్టితో పరిశీలిస్తే... పరస్పర విరుద్ధంగా కనిపించే శబ్దం, నిశ్శబ్దం, ఎఱుపు, తెలుపు లాంటివి భౌతిక జగత్తులో ద్వంద్వాలుగా కనిపించే భేదాలు మాత్రమే. పరబ్రహ్మతత్త్వం మాత్రం ఈ ద్వంద్వాలకు అతీతమైనది. అమ్మవారి పాదాలు మాత్రం ప్రాకృతికమైన విరుద్ధ ధర్మాలను తనలో సమన్వయపరచుకొని, సాధకుడిని పరమానంద స్థితికి చేర్చే పరాశక్తి తత్త్వ ప్రకటనలుగా,  ద్వంద్వాతీత స్థితికి ప్రతీకలు. ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టం చేయాలి.. ద్వంద్వాతీతము అంటే ద్వంద్వాలను పూర్తిగా తొలగించడం అనే భావన కన్నా వాటి ప్రభావానికి లోను కాకుండా ఉండటమే అనే భావనగానే చూడాలి. నిజానికి అదే సాధకుడి ఆధ్యాత్మిక పరిణతిగా చెప్పుకోవచ్చు.  

అందువల్ల, అమ్మవారి పాదాలే సాధకుడికి శరణ్యాలు. ఆ పాదనాదమే సాధకునికి అమ్మవారు చేసే ఉపదేశం. ఆ పాదముల కాంతియే సాధకునిలో ఆవిష్కృతమయ్యే  జ్ఞానప్రకాశం. ఆ పాదముల సేవనయే సాధకుని చిత్తశుద్ధికి మార్గం. బాహ్య ప్రపంచంలోని వైరుధ్యాలను చూసి కలత చెందకుండా, వాటి వెనుక ఉన్న ఏకత్వ చైతన్యాన్ని దర్శించగలిగినప్పుడే సాధకుడికి నిజమైన మౌనం, నిర్మలత్వం, బ్రహ్మానందం సిద్ధిస్తాయి.

చివరగా అమ్మవారి పాదాల నూపురనాదాలు మనలో అత్యున్నతమైన ప్రణవనాద స్ఫూర్తిని జాగృతం చేయాలని, అమ్మ పాదాల అరుణిమ మన బుద్ధిని తేజస్వంతం చేస్తూ నిర్మలంగా చేయాలని, అమ్మవారి పాదసేవన మనలను ద్వంద్వాతీతమైన పరమానంద స్థితికి చేర్చాలనీ "లోకాతీత, గుణాతీత, సర్వాతీత, శమాత్మిక" యైన ఆ పరాత్పరిని ప్రార్థిస్తూ... స్వస్తి.

పాలకుర్తి రామమూర్తి.

ధన్యవాదాలు రామ్మూర్తిగారూ!

జైహింద్.

అశుచిర్వా శుచిర్వాపి గచ్ఛన్ ... నదోషో మానసే జాప్యే . ... మేలిమి బంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో 𝕝𝕝   అశుచిర్వా శుచిర్వాపి గచ్ఛన్ తిష్ఠన్ స్వపన్నపి౹

మంత్రైక శరణో విద్వాన్ మనసైవ సదా౽భ్యసేత్౹౹("రామార్చన చంద్రిక")

నదోషో మానసే జాప్యే సర్వదేశే౽పి సర్వదా౹

జపనిష్ఠో ద్విజశ్రేష్ఠః సర్వయజ్ఞఫలం లభేత్ ||(శ్రీల గోపాల భట్ట గోస్వామి రచించిన, శ్రీల సనాతన గోస్వామి వ్యాఖ్యానించిన శ్రీ హరిభక్తి విలాసంలో17వ అధ్యాయం, 161వ శ్లోకం.)

తే.గీ.  మంత్ర దీక్షను గొనినట్టి మహితుఁడవని

నున్న నశుచిగ, శుచిగ తానున్నఁ గాని,

నడచుచున్న, నిల్చున్న, స్వప్నమున గాని,

మదిని నిరతము జపవిధి మానరాదు.

తే.గీ.  నిష్ఠగాజపమును జేయు శిష్ఠులకిల

నెల్లవేళలనియతిని నెచటనైన

చేయ జపమును దోషంబు చేరఁబోదు,

సర్వయజ్ఞఫంబులు సమకురరయ.

తా𝕝𝕝  మంత్రాన్ని మాత్రమే శరణు వేడిన జ్ఞాని... తాను అశుచిగా (అపవిత్రంగా) ఉన్నా, శుచిగా (పవిత్రంగా) ఉన్నా, నడుస్తున్నా, నిలబడి ఉన్నా, లేదా నిద్రిస్తున్నా సరే... ఎల్లప్పుడూ తన మనస్సులోనే ఆ మంత్రాన్ని నిరంతరం జపించాలి.

జపమునందు నిరంతర శ్రద్ధ, పట్టుదల కలిగిన, ఉత్తముడైన సాధకుడు చేసేటటువంటి మానసిక జపమునకు, ఏ అపవిత్రమైన లేదా పవిత్రమైన చోటనైనా సరే, ఎల్లప్పుడూ అపవిత్రత కాని విధివిరామ దోషము కాని కలుగదు. అన్ని రకాల యజ్ఞాలు, యాగాలు చేయడం వల్ల కలిగే పుణ్యఫలాన్ని పొందుతాడు.

జైహింద్.

25, అక్టోబర్ 2026, ఆదివారం

చిమ్మపూడి ఫౌండేషన్ సప్తమ వార్షికోత్సవం. తే. 25 - 1`0 - 2026.

0 comments

జైశ్రీరామ్.

https://www.youtube.com/live/4JMwa87RioY?si=rEpW0LTG4CqKhOAA

శ్లో.  హ్రీంకారాసన, గర్భితానల శిఖాం, సౌః క్లీం కళాం బిభ్రతీం,
సౌవర్ణాంబర ధారిణీం వరసుధాదౌతాం త్రినేత్రోజ్జ్వలామ్ |
వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం
త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీమ్ ||
పద చ్ఛేదము.
హ్రీంకార-ఆసన + గర్భిత-అనల + శిఖాం / సౌః / క్లీం / కళాం / బిభ్రతీం / సౌవర్ణ-అంబర-ధారిణీం / వర-సుధా-దౌతాం / త్రి-నేత్ర-ఉజ్జ్వలామ్ / వందే / పుస్తక-పాశ-అంకుశ-ధరాం / స్రక్-భూషితాం / ఉజ్జ్వలాం / త్వాం / గౌరీం / త్రిపురాం / పరాత్పర-కళాం / శ్రీచక్ర-సంచారిణీమ్.

అన్వయక్రమము.
హ్రీంకార ఆసన - గర్భిత అనల శిఖాం - సౌః క్లీం కళాం - బిభ్రతీం - సౌవర్ణ అంబర ధారిణీం - వర సుధా దౌతాం - త్రి నేత్ర ఉజ్జ్వలామ్ - పుస్తక పాశ అంకుశ ధరాం - స్రక్ భూషితాం - ఉజ్జ్వలాం - గౌరీం - త్రిపురాం - పరాత్పర కళాం - శ్రీచక్ర సంచారిణీమ్ - వందే.
ప్రతిపదార్థము.
హ్రీంకార ఆసన: 'హ్రీం' అనే ప్రణవ మంత్రాన్నే ఆసనముగా (పీఠముగా) కలిగినది,
గర్భిత అనల శిఖాం: తన గర్భమందు (లోపల) అగ్ని జ్వాలలను దాచుకున్నది (తీక్షణమైన తేజస్సు కలది),
సౌః క్లీం కళాం: 'సౌః', 'క్లీం' అనే బీజాక్షరాల స్వరూపమైన కళలను,
బిభ్రతీం: ధరించియున్నట్టిది,
సౌవర్ణ అంబర ధారిణీం: బంగారు వస్త్రములను ధరించినట్టిది,
వర సుధా దౌతాం: శ్రేష్ఠమైన అమృతము చేత అభిషేకింపబడినట్టిది (లేదా అమృతంలా ప్రకాశించే నిర్మలమైన రూపం కలది),
త్రి నేత్ర ఉజ్జ్వలామ్: మూడు కన్నులతో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నట్టిది,
పుస్తక పాశ అంకుశ ధరాం: చేతులలో పుస్తకము, పాశము (త్రాడు), అంకుశములను ధరించినట్టిది,
స్రక్ భూషితాం: పూలదండల చేత అలంకరింపబడినట్టిది,
ఉజ్జ్వలాం: దివ్యమైన కాంతితో వెలిగిపోతున్నట్టిది,
గౌరీం: గౌరవర్ణము (తెలుపు/బంగారు వర్ణము) కలిగిన గౌరీదేవి,
త్రిపురాం: త్రిపుర సుందరిగా కొనియాడబడేది,
పరాత్పర కళాం: అత్యున్నతమైన పరబ్రహ్మ స్వరూపమైన కళ కలిగినది,
శ్రీచక్ర సంచారిణీమ్: పవిత్రమైన శ్రీచక్రములో విహరించేది అయిన,
త్వాం: అటువంటి నిన్ను,
వందే: నేను నమస్కరిస్తున్నాను / స్తుతిస్తున్నాను.

తాత్పర్యము.   హ్రీం' కారమనే పీఠంపై ఆసీనురాలై, గర్భంలో ప్రళయాగ్ని జ్వాలల వంటి అనంత తేజస్సును దాచుకొని, 'సౌః', 'క్లీం' అనే దివ్య బీజాక్షర కళలను ధరించి, సువర్ణ వస్త్రాలతో శోభిల్లుతూ, అమృతధారలచే ప్రక్షాళన చేయబడిన నిర్మల రూపంతో, మూడు కన్నుల కాంతితో మెరిసిపోతున్న జగన్మాతకు నమస్కారం. చేతులలో పుస్తకము, పాశము, అంకుశము ధరించి, సుగంధ పుష్పమాలాలంకృతయై, శ్రీచక్రంలో సంచరించే పరాత్పర స్వరూపిణి అయిన ఆ గౌరీ త్రిపురసుందరి దేవికి భక్తితో ప్రణమిల్లుతున్నాను.

శ్లో.  విద్యాకైరవకౌముదీం శ్రుతిశిరస్సీమన్తముక్తామణిం
దారాన్ పద్మభువస్త్రీలోకజననీం వన్డే గిరాం దేవతామ్ ।
యత్పాదాబ్జనమస్క్రియాః సుకృతినాం సారస్వతప్రక్రియా-
బీజన్యాసభువో భవన్తి కవితానాట్యైకజీవాతవః ॥
(ఇది ప్రసిద్ధ అలంకార శాస్త్ర గ్రంథమైన ప్రతాపరుద్ర యశోభూషణం గ్రంథ ప్రారంభంలో విద్యానాథుడు రచించిన ప్రార్థనా శ్లోకం.)

ప్రతిపదార్థము.
యత్  = ఏ దేవి యొక్క 
పాదాబ్జ = పాదపద్మములకు చేసే 
నమస్క్రియాః = నమస్కారములు;
సుకృతినామ్ = పుణ్యాత్ములకు;
సారస్వత ప్రక్రియా = కవిత్వ నిర్మాణ ప్రక్రియకు;
బీజ న్యాస భువః = విత్తనము నాటే నేల వంటివి (ఆమెకు నమస్కరించడం ద్వారా కవిత్వానికి పునాది పడుతుంది);
కవితా నాట్య ఏక జీవాతవః = కవిత్వం అనే నాట్యానికి 
ఏక జీవాతవః = ఏకైక ప్రాణదాతలు;
భవన్తి = అవుతున్నాయో ఆ .
విద్యా : విద్యలనే 
కైరవ : కలువ పూలకు 
కౌముదీం : వెన్నెల వంటిది, 
శ్రుతి-శిరస్: ఉపనిషత్తులనే 
సీమంత : స్త్రీల పాపిట ధరించే 
ముక్తామణిం : ముత్యపు మణి వంటిది (వేదాంతసారమైనది).
పద్మభువః : పద్మం నుండి జన్మించిన బ్రహ్మదేవుని యొక్క 
దారాన్: భార్య అయినది యున్నదో 
త్రిలోక : మూడు లోకాలకు 
జననీం : తల్లి అయినదానిని.
గిరాం : వాక్కుకు 
దేవతామ్: దేవత అయిన సరస్వతిని.
వన్డే: నేను నమస్కరిస్తున్నాను.
తాత్పర్యము.   విద్యలనే తెల్లకలువలను వికసింపజేసే వెన్నెల వంటిది, ఉపనిషత్తులు అనే పాపిటలో ముత్యపు బొట్టులా భాసిల్లేది, బ్రహ్మదేవుని అర్ధాంగి మరియు ముల్లోకాలకు తల్లి అయిన వాగ్దేవికి (సరస్వతికి) నేను నమస్కరిస్తున్నాను. పుణ్యాత్ములు ఆమె పాదపద్మాలకు చేసే నమస్కారాలే కవిత్వ సృష్టి అనే పంటకు విత్తనాలు నాటే సారవంతమైన నేలలుగా మారుతాయి. అంతేకాక, ఆ నమస్కారాలే కవిత్వమనే నాట్యానికి ఏకైక ప్రాణము వంటివి.

జైహింద్. 

20, అక్టోబర్ 2026, మంగళవారం

ప్రమాణీ,మత్తరజనీ,జవాశ్రీ,ఆజ్ఞతా,జాతి భిక్షుక,సృష్టి భ్రష్ట,స్వార్థ మేథ,అనారత,, కుల స్వార్ధ,కు జ్ఞతా,దోషాజ్ఞ,స్వార్ధ పూర్ణ,అపక్వ,ధర్మ హరణ,గర్భ వివక్షతా"- వృత్తము, రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,

0 comments

జై శ్రీరామ్

ప్రమాణీ,మత్తరజనీ,జవాశ్రీ,ఆజ్ఞతా,జాతి భిక్షుక,సృష్టి భ్రష్ట,స్వార్థ మేథ,అనారత,,

కుల స్వార్ధ,కు జ్ఞతా,దోషాజ్ఞ,స్వార్ధ పూర్ణ,అపక్వ,ధర్మ హరణ,గర్భ వివక్షతా"-

వృత్తము,


                                          రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,

                                                                       జుత్తాడ,


వివక్షతా వృత్తము,


వివక్ష జాతి భిక్షువై! విజ్ఞతెల్ల నజ్ఞ తొందెనే?విరించి సృష్టి భ్రష్టు పడన్!

భవాబ్ది కాల కూటమై!ప్రజ్ఞదే?కులంబు నంటెనే?వరామ లేమి సామ్యమయెన్!

అవాంఛ నీయ తెల్వయెన్?ఆజ్ఞ దోష వర్తనాశ్రియై!హరించె నీతి,ధర్మ మిలన్!

కవాతు ద్రొక్కె భూతలిన్!కుజ్ఞతే ప్రమోద మాయెనే?కు రూప కేళిమోద మననన్!!


అర్ధములు

విజ్ఞత=తెలివి తేటలు,అజ్ఞత=తెలివిలేని,ఆజ్ఞదోష=చెడు ఆజ్ఞలు,

కు జ్ఞత=చెడు తెల్వి,కురూప కేళి=వికారాకారుల యాట,


వివక్షతా వృత్తము, జ,ర,య,జ,ర,జ,ర,జ,లగ,గణము లుండును,

ఉత్కృతి ఛందము నందలిది, ప్రాస నియమము కలదు,

యతులు,9,18. అక్షరములు,వృ,సం:-2.79.61.992.


1.గర్భ గత ప్రమాణీ వృత్తము,


వివక్ష జాతి భిక్షువై!

భవాబ్ది కాలకూటమై!

అవాంఛనీయ తెల్వయెన్!

కవాతు ద్రొక్కె!భూతలిన్!!


ప్రమాణీ వృత్తము,జ,ర,లగ,గణము లుండును,

అనుష్టుప్ఛందము నందలిది,ప్రాస నియమము కలదు,

వృ,సం:-86.


2.గర్భగత,మత్త రజినీ వృత్తము,


విజ్ఞ తెల్ల నజ్ఞ తొందెనే?

ప్రజ్ఞ దే?కులంబు నంటెనే?

ఆజ్ఞ దోష వర్తనాశ్రియై!

కుజ్ఞతే ప్రమోద మాయెనే?


మత్త రజినీ వృత్తము,ర,జ,ర,గణము లుండును,

బృహతి ఛందము నందలిది,ప్రాస నియమము కలదు,

వృ,సం:-171.


3.గర్భగత,జవాశ్రీ వృత్తము,


విరించి సృష్టి భ్రష్టు పడన్!

వరామ లేమి సామ్య మయెన్!

హరించె ,నీతి,ధర్మ మిలన్!

కురూప కేళి మోదమనన్?


జవాశ్రీ వృత్తము,జ,ర,స,గణము లుండును,

బృహతి ఛందము నందలిది,ప్రాస నియమము కలదు,

వృ,సం:-214.


4.గర్భగత,ఆజ్ఞతా వృత్తము,


వివక్ష జాతి భిక్షువై!విజ్ఞతెల్ల?నజ్ఞ తొందెనే?

భవాబ్ది కాలకూటమై!ప్ర జ్ఞదే?కులంబు నంటెనే?

అవాంఛ నీయ!తెల్వయెన్!ఆజ్ఞ!దోష వర్తనాశ్రియై!

కవాతు ద్రొక్కె!భూతలిన్!కుజ్ఞతే ప్రమోద మాయెనే!


ఆజ్ఞతా వృత్తము,జ,ర,య,జ,ర,లగ,గణము లుండును,

అత్యష్టి ఛందము నందలిది,ప్రాస నియమము కలదు,

యతి,9.వ యక్షరము,వృ,సం:-46,006.


5.గర్భగత జాతి భిక్షుక వృత్తము,


విజ్ఞ తెల్ల?నజ్ఞ తొందెనే!విరించి సృష్టి భ్రష్టు పడన్!

ప్రజ్ఞదే?కులంబు నంటెనే?వరామ లేమి!సామ్య మయెన్!

ఆజ్ఞ దోష వర్తనాశ్రియై!హరించె!నీతి,ధర్మ మిలన్!

కు జ్ఞతే ప్రమోద మాయెనే?కురూప కేళి మోద మనన్!


జాతి భిక్షుక వృత్తము,ర,జ,ర,జ,ర,స,గణము లుండును,

ధృతి ఛందము నందలిది,ప్రాస నియమము కలదు,

యతి,10.వ,యక్షరము,వృ,సం::-1.10.227.


6.గర్భగత సృష్టి  భ్రష్ట వృత్తము


విరించి సృష్టి భ్రష్టు పడన్!వివక్ష జాతి భిక్షువై!

వరామ లేమి!సామ్య మయెన్!భవాబ్ది కాలకూటమై!

హరించె!నీతి,ధర్మ మిలన్!అవాంఛనీయ తెల్వయెన్?

కురూప కేళి మోద మనన్?కవాతు ద్రొక్కె!భూతలిన్!


సృష్టి భ్రష్ట వృత్తము,జ,ర,స,త,ర,లగ,గణము లుండును,

అత్యష్టి ఛందము నందలిది,ప్రాస నియ మము కలదు,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-43.222.


7.గర్భ గత స్వార్ధ మేథ వృత్తము,


విజ్ఞ తెల్ల?నజ్ఞ తొందెనే!వివక్ష జాతి భిక్షువై!

ప్రజ్ఞదే?కులంబు నంటెనే?భవాబ్ది కాలకూటమై!

ఆజ్ఞ దోష వర్తనాశ్రియై!అవాంఛనీయ!తెల్వయెన్!

కుజ్ఞతే!ప్రమోద మాయెనే?కవాతు ద్రొక్కె భూతలిన్!!


స్వార్ధ మేథ వృత్తము,ర,జ,ర,జ,ర,లగ,గణము లుండును,

అత్యష్టి ఛందము నందలిది,ప్రాస నియమము కలదు,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-43.691.


8.గర్భగత అనారత వృత్తము,


విరించి సృష్టి భ్రష్టు పడెన్!విజ్ఞ తెల్ల?నజ్ఞ తొందెనే!

వరామ లేమి సామ్యమయెన్!ప్రజ్ఞదే?కులంబు నంటెనే?

హరించె!నీతి,ధర్మ మిలన్!ఆజ్ఞ దోష వర్తనాశ్రియై!

కురూప కేళి మోద మనన్!కుజ్ఞతే!ప్రమోద మాయెనే!



అనారత వృత్తము,జ,ర,స,ర,జ,ర,గణము లుండును,

ధృతి ఛందము నందలిది,ప్రాస నియమము కలదు,

యతి,10.వశయక్షరము,వృశసం;-87,254.


9.గర్భ గత కులస్వార్ధ వృత్తము,


వివక్ష జాతి భిక్షువై!విరించి సృష్టి భ్రష్టు పడెన్!

భవాబ్ది కాలకూటమై!వరామ లేమి?సామ్య మయెన్!

అవాంఛ నీయ!తెల్వయెన్?హరించె నీతి,ధర్మ మిలన్!

కవాతు ద్రొక్కె!భూతలిన్!కురూప కేళి మోద మనన్?


కుల స్వార్ధ వృత్తము,జ,ర,జ,ర,జ,లగ,గణము లుండును,

అత్యష్టి ఛందము నందలిది,ప్రాస నియమము కలదు,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-54.574.


10.గర్భగత కుజ్ఞతా వృత్తము,


విజ్ఞ తెల్ల నజ్ఞ తొందెనే?విరించి సృష్టి భ్రష్టు పడెన్!వివక్ష జాతి భిక్షువై!

ప్రజ్ఞదే?కులంబు నంటెనే?వరామ!లేమి సామ్య మయెన్!భవాబ్ది!కాలకూటమై!

ఆజ్ఞ దోషవర్తనాశ్రియై!హరించె!నీతి,ధర్మ మిలన్!అవాంఛనీయ!తెల్వయెన్?

కు జ్ఞతే?ప్రమోద మాయెనే!కు రూప కేళి మోద మనన్?కవాతు ద్రొక్కె!భూతలిన్!!


కుజ్ఞతా వృత్తము,ర,జ,ర,జ,ర,స,జ,ర,లగ,గణము లుండును,

ఉత్కృతి ఛందము నందలిది,ప్రాస నియమము కలదు,

యతులు,10.19.అక్షరములు,వృ,సం;-2.23.91.267.


11.గర్భగత:-దోషాజ్ఞా వృత్తము,


విరించి సృష్టి భ్రష్టు పడెన్!వివక్ష జాతి భిక్షువై!విజ్ఞ తెల్ల నజ్ఞ తొందెనే?

వరామ లేమి!సామ్య మయెన్!భవాబ్ది కాలకూటమై!ప్రజ్ఞదే?కులంబు నంటెనే?

హరించె!నీతి,ధర్మ మిలన్!అవాంఛనీయ తెల్వయన్!ఆజ్ఞ దోష వర్తనాశ్రియై.

కు రూప కేళి మోద మనన్!కవాతు ద్రోక్కె!భూతలిన్!కుజ్ఞతే?ప్రమోద మాయెనే?


దోషాజ్ఞా వృత్తము,జ,ర,స,జ,ర,య,జ,ర,లగ, గణము లుండును,

ఉత్కృతి ఛందము నందలిది,ప్రాస నియమము కలదు,

యతులు,10.18.అక్షరములు,వృ,సం:-2.26.96.482.


12.గర్భగత స్వార్ధ పూర్ణ వృత్తము,


విజ్ఞ తెల్ల నజ్ఞ తొందెనే?వివక్ష జాతి భిక్షువై!విరించి సృష్టి భ్రష్టు పడెన్!

ప్రజ్ఞదే?కులంబు నంటెనే!భవాబ్ది కాలకూటమై!వరామ లేమి!సామ్య మయెన్!

ఆజ్ఞ దోష వర్తనాశ్రియై!అవాంఛనీయ!తెల్వయెన్!హరించె!నీతి,ధర్మ మిలన్!;!

కుజ్ఞతే?ప్రమోద మాయెనే?కవాతు ద్రొక్కె భూతలిన్!కురూప కేళి మోద మనన్?


స్వార్ధ పూర్ణ వృత్తము,ర,జ,ర,జ,ర,జ,ర,జ,లగ,గణము లుండును,

ఉత్కృతి ఛందము నందలిది,ప్రాస నియమము కలదు,

యతులు,10.18.అక్షరములు,వృ,సం:-2.79.62.027.


13.గర్భగత అపక్వ వృత్తము,


విరించి సృష్టి భ్రష్టు పడన్!విజ్ఞ తెల్ల నజ్ఞ తొందెనే?వివక్ష జాతి భిక్షువై!

వరామ లేమి?సామ్య మయెన్!ప్రజ్ఞదే?కులంబు నంటెనే!భవాబ్ది కాలకూటమై!

హరించె!నీతి,ధర్మ మిలన్!ఆజ్ఞ దోష వర్త నాశ్రియై ! అవాంఛ నీయ?తెల్వయెన్!

కురూప కేళి మోద మనన్!కుజ్ఞతే?ప్రమోద మాయెనే!కవాతు ద్రొక్కె!భూతలిన్!!


అపక్వ వృత్తము,జ,ర,స,ర,జ,ర,జ,ర,లగ,గణము లుండును,

ఉత్కృతి ఛందము నందలిది,ప్రాస నియమము కలదు,

యతులు,10.19.అక్షరములు,వృ,సం:-2.23.69.494.


14.గర్భగత ధర్మ హరణ వృత్తము,


వివక్ష జాతి భిక్షువై!విరించి సృష్టి  భ్రష్టుపడెన్!విజ్ఞ తెల్ల నజ్ఞ తొందెనే?

భవాబ్ది కాలకూటమై!వరామ లేమి సామ్య మయెన్!ప్రజ్ఞదే?కులంబు నంటెనే?

అవాంఛ నీయ తెల్వయెన్?హరించె నీతి ధర్మ మిలన్!ఆజ్ఞ దోష వర్తనాశ్రియై!

కవాతు ద్రొక్కె!భూతలిన్!కురూప కేళి మోద మనన్?కు జ్ఞతే?ప్రమోద మాయెనే!


ధర్మ హరణ వృత్తము,జ,ర,జ,ర,జ,య,య,ర,లగ,గణము లుండును,

ఉత్కృతి ఛందము నందలిది,ప్రాస నియమము కలదు,

యతులు,9.18.అక్షరములు,వృ,సం:-2.12.88.236.

జైహింద్. 

19, అక్టోబర్ 2026, సోమవారం

రేనాటి సూరీడు ... శ్రీ పొన్నెకంటి సూర్యనారాయణరావు మహోదయులు..

0 comments

 జైశ్రీరామ్.


శ్రీ పొన్నెకంటి సూర్యనారాయణరావు.

రేనాటి సూరీడు. చారిత్రకప్రబంధము.  నా భావన.

రేనాటిసూరీడు చారిత్రక ప్రబంధము గూర్చి సాహసించి నాలుగు మాటలు వ్రాయుటకు ముందు నా అనుంగు సహోదరులు చింతావారికి, నాకు గల స్నేహానురాగాల అనుబంధపుమూలముల గురించి చెప్పితీరవలసినదే. మాన్యులు ద్విసహస్రావధాని శ్రీయుతులు మాడుగుల నాగఫణిశర్మగారి యవధాన పృచ్ఛకబృందములోతొలుత మేమిరువురము సభ్యులమై, తదుపరి పంచసహస్రావధానములో 15రోజుల పరిచయముతో ‘‘ఇంతింతై ’’ అనునట్లు అనురాగమును పెంచుకొంటిమి. నేను వారికన్న వయసా కొంత పెద్దవాడిని కనుక వారిచే అన్నగారని పిలిపించుకొను నర్హత సంపాదించితిని. సాహితీ పరముగా జూచిన వారే నాకన్నగారు. వారి చిత్ర ,గర్భ కవితా గంగా ప్రవాహమును గూర్చి ఎంత వ్రాసినను తక్కువే. చింతావారి రచనలు ఏ రూపముతో నున్నా నిశ్చింతగా చదువుకొన వచ్చును. ఒక్కరోజు లోనే శతకమును వ్రాసిన వాసి వారిది. పద్యమును హృద్యముగా, అనవద్యముగా గంభీరముగా పాఠకుల మస్తిష్కములోనికి జొనుపుట వీరికి అలవోకగా నబ్బిన క్రీడ. ఇక వీరు లేని యవధానసభ లేనేలేదు. 

‘‘రేనాటి సూరీడు’’ పంచ ఆశ్వాసముల పద్యకావ్యము. ఇందు ముఖ్యముగా నరసింహారెడ్డి సార్ధకనామధేయుడైనాడు. తన సూర్య ప్రతాపానలజ్వాలలు తుచ్ఛఆంగ్లేయ మూకలపై చూపించి భరతమాత ముద్దుబిడ్డగా గర్వించాడు. 

కవివర్యులు ప్రథమముగా శ్రీ నృసింహ ప్రార్ధన చేయుటలో నెంతో ఔన్నత్యం కనబడుతుంది. ప్రేమ, క్రూరత్వం సమపాళ్లలో ఉండి ఎప్పుడెక్కడేది చూపించాలో స్వామివలె తెలిసినవాడు నాయకుడు.

 ‘‘ శ్రీమన్మంగళ .......భారతీయతనిలన్ బెంపొందగా జేయుతన్.’’ 

ఈ కావ్యమును మన ధేశము కొఱకు ప్రాణములర్పించిన మహా త్యాగమయ వీరులకంకిత మిచ్చుట కవిగారి సందర్భశుద్ధికి, దేశభక్తి కి తార్కాణము. రేనాటి పౌరుషము చిన్న ఎత్తు గీతిలో...

‘‘ వినుత రేనాడులో పుట్టి వెలుగువారు., చచ్చుటో చంపుటో  రేనాడు వీరనాడు. ...ప్రథమ. ఆ. 44. వివిధరకముల ఛందస్సుల నుపయోగించుటో వీరు సిద్ధహస్తులు.

[7:57 pm, 19/10/2026] Ponnekanti Suryanarayanarao Hyd: ద్వితీయాశ్వాసము;‌‌‌‌‌ సంక్లిష్ట ప్రాసల నలవోకగా ప్రయోగించుట వీరికొక క్రీడ. ‘‘ సృష్టి వింతగ జూడగ.....తుష్టిని ....ఆహరింపగన్. ..9.

తెల్ల దొరల పెత్తనములో పాలెగాండ్ర వ్యవస్త ఎన్ని అవస్తల పాలైనదో కన్నులకు కట్టినట్టు వర్ణించారు.

 గీ. పాలెగాండ్ర వ్యవస్తను పాతిపెట్టి., ....44.

పన్నులు కట్టలేని వారి దుస్తితిని గూర్చి ఈ పద్యంలో చూడండి,

 ‘‘ వి...చ్ఛిన్న శరీర భాగముల చిందెడి రక్తము పైన కారముల్ ... క్రన్నన జల్లుచుండ.   60. 

కవిగారి రచనలో జాతీయములకు కొదవే లేదు. 

‘‘ ఎవ్వని బాబు సొమ్మనుచు .....’’67. 

దుర్గాదేవిని ధ్యానించగా శత్రుసంహారమునకు ఖడ్గమునిచ్చుట మనకు ఛత్రపతి శివాజీ మహారాజును గుర్తుచేయక మానదు, ధర్మ రక్షణలో పరాక్రమములో...

‘‘ చం. జతనము సాగె ......, క్షితిపయి ధర్మ రక్షణ చేసెడి వేళను. 92

. 

తృతీయాశ్వాసము...

నరసింహారెడ్డి వాడ్సనుని దండింపబూను సందర్భములో భయమునెలా ఆవిష్కరించారో చూడండి. 

‘‘ చం. పలుమరు చూచె వెన్కకును వచ్చుచు నుండెనో రెడ్డి? యంచు తాన్.  77. 

జగన్నాధుని ధర్మయుద్ధమునకు సాయముగోరు సమయమున రెడ్డి తన భక్తిని చూపిన విధము మనోహరము. 

‘‘ హేమ హిమాన్వితా .......ఉపాయము నెన్నజేయుమా!...87.


చతుర్ధాశ్వాసము...

ఎల్లమ్మ జాతరలో తప్పించుకొనిన సమయాన మనోహరభావన చూడండి

‘‘ గీ. నందె ,,, దైవంబు తోడున్న మందమతియు , 

      నాపదలనుండి రక్షణ నందగలడు. ..5.

రెడ్డి సహచరులతో నజ్ఞాతముగా నున్న సమయాన చక్కని భావన.

‘‘ నరసింహుండును మిత్రులున్ ....మేధాశక్తితో నిత్తరిన్. 19.


పంచమాశ్వాసము. 

రెడ్డి పరాక్రమమునకు ధర్మనిష్టకు మరొక మచ్చుతనుక. 

‘‘ గీ.   తనను బంధింప నొక్కడున్ .....    రెడ్డి ప్రజ్ఞ నెరిగి. ..3. 

రెడ్డి యొక్క దేశభక్తి , త్యాగనిరతికి మంచి యుదాహరణము. 

‘‘ గీ.  రెడ్డి ముఖమున చింతయే లేదు చూడ. నెదరు తిరుగుటయు లేదు. బెదురు లేదు. 33. 

నరసింహారెడ్డికి సంబంధించిన మానవత,దేశభక్తి, త్యాగశీలత, ఒకటేమి సమస్త సద్గుణములు తమకు తాముగా వరించినవి. కథ చారిత్రకమైనను ఏక ధారగా వివిధ ఛందోరీతులతో రసాత్మకమై గుణాత్మకమై గణనీయముగా నలరారినది. కవి ప్రతిభ ప్రతిపద్యము నందు వెల్లివిరియుచున్నది. తప్పక పాఠకలోకము చదివి తీరవలసిన కావ్యము. చిత్రకవితా సార్వభౌములు భగవానుని దయవలన ఆయురారోగ్యములు కలిగి  మరెన్నో కావ్యములు ఆవిష్కృతము చేయాలని కోరుతు .... ఈ భావపరంపరలోని గుణదోషములలో గుణములు మా గురువర్యులవి, దోషములు నావి.  

                                              మీ సహోదరుడు.

  మల్కాజ్గిరి                   పొన్నెకంటి సూర్యనారాయణరావు

  భాగ్యనగరం.                    విశ్రాంతాంధ్రోపాధ్యాయుడు. 

                                       ది. 19. 10. 2026.

నా కావ్యమును ఆద్యంతము ఓపికగా పఠించి వారి అమూల్యమైన సమీక్షను అందించిన శ్రీ పొన్నెకంటి సూర్యనారాయణరావు అన్నగారికి  ధన్యవాద పూర్వక నమస్సులు.


జైహింద్.

తమసో లక్షణం కామో.... మేలిమి బంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  తమసో లక్షణం కామో,  -  రజస స్త్వార్థ ఉద్యతే,

సత్త్వస్య లక్షణం ధర్మః,  -  శ్రైష్ఠ్య మేషామ్ యథోత్తరమ్.

గీ.  తమమునకు కామమే లక్షణముగ నుండు,

కన రజోలక్షణంబర్థమనఁగనొప్పు,

సత్వలక్షణమది ధర్మ సాధనంబె,

మూటిలో గొప్పదైనది మూడవదియె.

భావము: తమో గుణ లక్షణం కామము, రజో గుణ లక్షణం అర్థము, సత్త్వ గుణ 

లక్షణం ధర్మమునందు అభిలాష. వీటిలో మొదటి దానికంటే రెండోది, 

రెండో దానికంటే మూడోది శ్రేష్ఠమైనది.

జైహింద్.

18, అక్టోబర్ 2026, ఆదివారం

మూకశంకరుల పాదారవింద శతకముపై నా ప్రవచనము.(తే.16 - 10 - 2026.)

0 comments

 జైశ్రీరామ్.


👇🏾

https://www.youtube.com/live/Mkb07G5uuIM?si=F4nCFxxgGYYVT4MN
☝🏾
click the above URL for the video.

జైహింద్.

17, అక్టోబర్ 2026, శనివారం

పాదారవిందశతకము - 60 పద్యానువాదముపై శ్రీ పాలకుర్తి రామమూర్తిగారి వివరణము.

0 comments

 జైశ్రీరామ్.

శ్రీ పాలకుర్తి రామమూర్తి.

ఆత్మీయులకు సుప్రభాత నమస్సులు...

శ్లో.  నయంతీం దాసత్వం నలిన భవముఖ్యా నసులభ

ప్రదానాత్ దీనానా మమరతరు దౌర్భాగ్య జననీం 

జగజ్జన్మ క్షేమక్షయవిధిషు కామాక్షి పదయోః

ధురీణా మీష్టే కస్తవ భణితు మాహోపురుషికామ్!

(మూకపంచశతి - పాదారవిందశతకము - 60)

అనువాద పద్యము. రచన.  శ్రీ చింతారామకృష్ణారావు గారు, హైదరాబాద్.

గీ.  పద్మజాదులన్ దాసులై ప్రబలఁ జేయు,

కల్పకము వీఁగ జనుల సత్ కాంక్షలొసగు,

సృష్టి కార్యముల్ మూడును చేయు న(ట్టి)మ్మ

నీపదోద్ధతి నెవరిల చూపఁ గలరు?

వ్యాఖ్యానము.

తల్లీ! ఓ కామాక్షీ! నీ పాద కమలములు సాధారణ భక్తులైన దీనులకు మోక్షాన్ని ఇస్తున్నాయి. కాని బ్రహ్మ మరియు ఇతర దేవతలను మాత్రం  నీ సేవకులుగా చేస్తున్నాయి. అలాగే కోరినవన్నీ అనుగ్రహించే కల్పవృక్షాదులకు కూడా దీనత్వాన్ని ప్రసాదిస్తున్నాయి. నీ పాద మహిమను ఆశ్రయించే త్రిమూర్తులు జగత్తును సృష్టిస్తారు, నిలబెడతారు మరియు లయం చేస్తారు. ఈ కార్యకలాపాలన్నింటిలో ముందుండే నీ పాదాల మహిమను వర్ణించడం ఎవరికి సాధ్యమౌతుంది తల్లీ!

అహో పురుషికామ్.. అంటున్నాడు, కవి. అహో అనడంలో "అ"కారం బ్రహ్మతత్త్వం కాగా "హ"కారం శక్తి తత్త్వం. ఈ రెంటి కలయికయే "అహం".. అదే సృష్టికి ముందుగా ఉన్నది. ఆద్యము, అనంతమైన "అహం" ఒక్కటే.. అందులోనే స్త్రీపురుష తత్త్వాలు ఓతప్రోతమై ఉన్నాయి. పుంభావనలో పరమేశ్వరుడు లేదా సదాశివుడని, స్త్రీ భావనలో ఆదిశక్తియని లేదా లలితాపరమేశ్వరియని చెపుతారు. పురుషికా అనడంలో.. "నేను" అనే అహంకార స్వరూపం ఉన్నది. నేను అంటే ఎవరు? శివునిలోని "నేనే"... దానినే అమ్మ లేదా ఆదిశక్తి అంటున్నాము. ఆ శివుడు ఎలాంటివాడు.. త్రిపురాలను నశింపచేసినవాడు. త్రిపురాలు ఏవి? స్థూలసూక్ష్మ కారణ శరీరాలు.. (పురము అనగా శరీరము) మూడు పురములను నశింపచేసే శివుని అహంకార స్వరూపమే ఆదిశక్తి.

అమ్మవారు పంచకృత్యపరాయణ.. సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాలు పంచకృత్యములు. ఇందులో బ్రహ్మకు సృజనను, విష్ణువునకు స్థితిని, శంకరునకు లయను.. బాధ్యతలుగా అప్పజెప్పి మిగిలిన రెండింటినీ తన వద్దనే ఉంచుకున్నదట, ఆదిశక్తి. దాసత్వం అనడంలో.. బ్రహ్మాదులు అమ్మ అప్పగించిన పనిని మాత్రమే చేస్తున్నారు కాబట్టి దాసులుగా భావింపబడుతున్నారు. 

లింగత్రయాలు.. (స్త్రీ పురుష నపుంసక) అభేదములని వేదవాక్యం. అట్టి లింగత్రయాలకు అతీతమైన అమ్మవారి మహిమను వర్ణించడం ఎవరికి సాధ్యపడుతుంది? అంటే ఒక్క ఆత్మకు మాత్రమే అని సమాధానం. ఎందుకు? అది అమ్మవారు మాత్రమే కాబట్టి.

నిజానికి ఈ స్తోత్రం యొక్క పరమావధి నిర్మలమైన అమ్మవారి మహిమను వర్ణిస్తూ, జిజ్ఞాసువులకు ఆధ్యాత్మిక పరిణతికి మార్గాన్ని చూపడమే అయినప్పటికీ ఇందులోని భావనలను నిత్య జీవితంలో నిర్వహణను అన్వయించుకుంటే... భౌతిక జీవన నిర్వహణకూ మార్గం చూపుతుంది.. 

అమ్మవారి పంచకృత్యాలను సంస్థ నిర్వహణలో ఐదు ప్రధాన బాధ్యతలుగా చెప్పుకుంటే... అమ్మవారి పంచకృత్యాలైన సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాలను ఆధునిక సంస్థ నిర్వహణకు అన్వయించుకునే ప్రయత్నం చేయవచ్చు.

సృష్టి అనడం... నూతన ఆలోచనలకు రూపకల్పన చేయడంగా భావించవచ్చు. సంస్థలో కొత్త ప్రణాళికలను రూపొందించడం, నూతన ఉత్పత్తులను అభివృద్ధి చేయడం, వినూతన ఆలోచనలకు కార్యరూపం కల్పించడం సృష్టికార్యానికి ప్రతీకగా భావించవచ్చు. నాయకుడు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు క్రొత్త అవకాశాలను అన్వేషించాలి, సృష్టించాలి.

స్థితి అనడం... సంస్థ మనుగడ, అభివృద్ధిని సూచిస్తుంది. అభ్యుదయం ఉన్నచోటనే మనుగడ ఉంటుంది.. క్రొత్తదనానికి అవకాశం ఉంటుంది. ప్రారంభించిన కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించడం, వనరులను కాపాడుకోవడం, ఉద్యోగుల సామర్థ్యాన్ని పెంపొందించడం, సంస్థ లక్ష్యాల సాధనకు నిరంతరం కృషి చేయడం... వీటిని స్థితికార్యానికి అన్వయం చేసుకోవచ్చు.

లయము అనడంలో... సంస్థలో అనవసరమైన విధానాలను తొలగించడం... కాలం చెల్లిన విధానాలు (Obsolete), ప్రయోజనం కోల్పోయిన కార్యక్రమాలు, వనరుల వృథాకు కారణమయ్యే పద్ధతులను తొలగించడం సంస్థ ప్రగతికి అవసరం. ఇక్కడ లయము అనడం విధ్వంసం కాదు. అవసరం తీరిన వ్యవస్థలను తొలగించి నూతన అభివృద్ధికి మార్గం కల్పించడం. చెట్టు శిశిరంలో తన ఆకులను తానే రాల్చేసుకుంటుంది.. అంటే తన నాశనం తానే చేసుకుంటుందని కాదు.. పునః సృష్టికి బీజం వేసుకుంటుందని భావించాలి. అలాగే అవసరం లేని వాటిని తొలగించడం వల్ల అవసరమైన వాటికి చోటు కల్పిస్తున్నాము. పాతనీరు పోతేనే క్రొత్తనీటికి చోటు లభిస్తుంది కదా.

తిరోధానం అనడం... పరిమితులను  గుర్తించడం.. సంస్థ రహస్యాలను కాపాడడంగా భావించవచ్చు. నిర్వహణలో ప్రతి సమాచారాన్ని ప్రతి ఒక్కరికీ వెల్లడించడం సముచితం కాదు. సంస్థ ప్రయోజనాలను కాపాడే గోప్యత, అవసరమైన సమాచారాన్ని తగిన స్థాయిలో అర్హులకు మాత్రమే అందించడం, నిర్ణయాల వెనుక ఉన్న పరిమితులను గుర్తించడం ఈ భావానికి ఒక ఆధునిక అన్వయంగా చెప్పుకోవచ్చు. నిజానికి సంస్థలో గోప్యత అవసరమే... కానీ ఆ పేరుతో తప్పులను లేదా అక్రమాలను దాచడం మాత్రం ఏవిధంగానూ సమర్థనీయం కాదు. అయితే తిరోధానం అనడంలో ఇది అర్థంగా చెప్పుకోవడమూ సమంజసమూ కాదు. ఈ అన్వయం ఒక పరిమితమైన భావన మాత్రమే. 

అనుగ్రహం అనడం... ప్రతిభకు ప్రోత్సాహం, వ్యక్తి వికాసమే సంస్థ వికాసంగా గుర్తించడం. కార్య నిర్వహణలో ఉద్యోగుల ప్రతిభను గుర్తించడం, వారికి కార్యనిర్వహణలో తగిన శిక్షణను అందించడం, అర్హత ప్రాతిపదికగా అవకాశాలను కల్పించడం, తప్పుల నుంచి నేర్చుకునే వాతావరణాన్ని ఏర్పరచడం, సమర్థులను ఉన్నత బాధ్యతలకు సిద్ధం చేయడం అనుగ్రహ భావానికి అన్వయంగా చెప్పుకోవచ్చు.

ఈ ఐదు అంశాల ద్వారా ఒక ముఖ్యమైన నిర్వహణా సూత్రాన్ని ప్రతిపాదించవచ్చు. క్రొత్తదాన్ని సృష్టించడం, ఉన్నదానిని నిలబెట్టడం, అనవసరమైనదాన్ని తొలగించడం, అవసరమైన గోప్యతను కాపాడడం, సమర్థతను ప్రోత్సహించడం... ఈ ఐదు కృత్యాలు సమన్వయంతో జరిగినప్పుడే సంస్థ సంపూర్ణంగా అభివృద్ధి చెందుతుంది. అమ్మవారి మాహత్మ్యం ఈ పంచకృత్యాలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా ప్రకటితమౌతుంది.

బ్రహ్మవిష్ణుమహేశ్వరులకు బాధ్యతలు అప్పగించింది లలితాపరమేశ్వరి అనడం ఆధునిక నిర్వహణలో అధికారాల వికేంద్రీకరణకు ప్రతీకగా చెప్పుకోవచ్చు. ఒక సంస్థలో అధిపతి ప్రతి పనినీ స్వయంగా నిర్వహించడానికి ప్రయత్నిస్తే వ్యవస్థ సమర్థంగా నడవదు. అందువల్ల కార్యాల స్వభావాన్ని బట్టి తగిన లేదా అర్హత కలిగిన అధికారులకు బాధ్యతలు అప్పగించాలి. బాధ్యతల విభజన, అధికారాల అప్పగింతతో యజమాని బాధ్యత ముగిసిపోదు. వేరువేరు విభాగాల అధిపతుల మధ్య ఆయా బాధ్యతల నిర్వహణలో సమన్వయ బాధ్యతను యజమాని నిర్వహించాల్సిందే. 

శ్లోకంలో చెప్పబడిన దాసత్వ భావాన్ని... బ్రహ్మాది దేవతలు స్వతంత్రంగా పని చేస్తున్నారే కాని తమ ఇష్టానుసారం కాదు. తమకు నిర్దేశించిన కార్యాల చట్రంలో మాత్రమే పనిచేస్తున్నారు. దీనినే సంస్థలోని అధికారులు వ్యక్తిగత ప్రతిష్ఠ కోసం కాకుండా సంస్థ లక్ష్యాల కోసం పనిచేయాలనే సూత్రంగా భావించవచ్చు. అయితే దాసత్వం అంటే బానిసత్వం కాదు. అది వ్యక్తిగత అహంకారాన్ని పక్కనపెట్టి, అప్పగించిన బాధ్యత పట్ల నిబద్ధతతో వ్యవహరించడం అనే అర్థంలోనే తీసుకోవాలి.

అహో పురుషికా... అహంకారం నుంచి ఆత్మపరిశీలన వరకు ప్రతి నిర్వహణాధ్యక్షుడు ఎదగాలి. వ్యక్తిగత అహంకారం కంటే వ్యవస్థ యొక్క సమగ్ర ప్రయోజనం ఉన్నతమైనదని సంస్థలోని ప్రతి ఉద్యోగి గుర్తించాలి.

అమ్మవారి పాదాలు అనడంలో నాయకత్వానికి పునాది పాదాలే అనే భావన కనిపిస్తున్నది. తల ఆలోచనకు, పాదాలు ఆచరణకు ప్రతీకలు. నాయకత్వం ఆచరణలోనే ప్రకటితమౌతుంది. ఎలాగైతే జగత్తుకు అమ్మవారి పాదాలు ప్రధానమైనవో అలాగే నిర్వహణాపరంగా నాయకత్వం యొక్క విలువలు, సంస్థ సంస్కృతి ఆ సంస్థ విజయానికి మూలాధారంగా భావించవచ్చు. ఒక సంస్థలో అనేక విభాగాలు పనిచేస్తున్నప్పటికీ, వాటన్నింటికీ ఒక ఉమ్మడి లక్ష్యం, విలువల వ్యవస్థ, కార్యాచరణ దిశ అవసరం. 

కల్పవృక్షం కూడా దీనత్వాన్ని పొందడం అనడం... వనరులకంటే ఉన్నతమైనది సంస్థలో మరొకటి ఉన్నది అనే విషయాన్ని ప్రతిపాదిస్తున్నది. సంస్థలో ఆర్థిక వనరులు, సాంకేతిక పరిజ్ఞానం, ప్రతిభావంతులైన ఉద్యోగులు, అత్యాధునిక పరికరాలు ఉండవచ్చు. కానీ వీటన్నింటినీ సరైన దిశలో ఉపయోగించే వివేకం, నైతిక విలువలు, సమన్వయం లేకపోతే ఆశించిన ఫలితాలు లభించవు. దీనిని బట్టి వనరుల సమృద్ధి ఒక్కటే విజయానికి హామీ కాదనీ, వాటిని సద్వినియోగం చేసే మార్గదర్శకాలు, వాటిని ఉపయోగించే వ్యక్తుల విలువలు, నిర్ణయాల నాణ్యత, సంస్థ లక్ష్యాల స్పష్టత కూడా అంతే ముఖ్యమనే అంశం స్పష్టమౌతున్నది..

అమ్మవారి పంచకృత్యాలను ఆధునిక నిర్వహణాశీలతకు అన్వయించుకోవడంలో అవగతమయ్యే ఒక భావన... ఒక సంస్థలో నూతన కార్యక్రమాలకు రూపకల్పన చేయడం, వాటిని సమర్థంగా నిర్వహించడం, కాలం చెల్లిన విధానాలను తొలగించడం, అవసరమైన గోప్యతను పాటించడం, ప్రతిభావంతులను ప్రోత్సహించడం వంటి కార్యాలన్నీ సమన్వయంతో జరగాలి. బ్రహ్మవిష్ణుమహేశ్వరులకు నిర్దిష్టమైన బాధ్యతలను అప్పగించిన ఆదిశక్తి తత్త్వం, సంస్థలో అధికారాల వికేంద్రీకరణతోపాటు సమగ్ర పర్యవేక్షణ ఆవశ్యకతను గుర్తుచేస్తుంది. బాధ్యతలను అప్పగించడం నాయకత్వ లక్షణమైతే, వాటన్నింటినీ ఒకే లక్ష్యానికి అనుసంధానించడం సమర్థ నిర్వహణా లక్షణం. వ్యక్తిగత అహంకారానికి తావివ్వకుండా, సంస్థ ప్రయోజనానికి ప్రాధాన్యమిస్తూ, సమష్టి ప్రగతికి కృషిచేయడమే ఈ తాత్త్విక భావం నుంచి మనం గ్రహించగల నిర్వహణా సందేశంగా భావించవచ్చు. 

చివరగా మరొక్కమాట... ఈ ఆధునిక నిర్వహణ సూత్రాల అన్వయాన్ని ఆధ్యాత్మిక పంచకృత్యాలుగా పొరపాటున కూడా భావించరాదు. ఇది ఆధునికంగా చేసిన భావాన్వయం మాత్రమే. నిర్వహణలోని ఐదు అధికారిక విభాగాలుగా ఈ అన్వయాలను సంప్రదాయం నిర్దేశించినట్లు భావించరాదు. .... స్వస్తి.

పాలకుర్తి రామమూర్తి..

ఇంత చక్కని వ్యాఖ్యానమునందించిన శ్రీ పాలకుర్తి రామమూర్తి గారికి ధన్యవాదములు.

జైహింద్.