గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, నవంబర్ 2026, మంగళవారం

దైవంనుంచి జారి పరిశుభ్రతమీద.... డా. వెలుదండ సత్యనారాయణ. పరమార్థ కవి

జైశ్రీరామ్.
🌻దైవంనుంచి జారి పరిశుభ్రతమీద..🌻
డా. వెలుదండ సత్యనారాయణ. పరమార్థ కవి

       వైశ్రవణుడు అనే భక్తుడు మలవిసర్జన చేసేటప్పుడు రామనామాన్ని స్మరించడం చూసి ఆంజనేయుడు అసహ్యపడి వీపు మీద ఒక్క చరపు చరచినాడు. రాముని దగ్గరికి వచ్చేసరికి రాముడు బాధపడుతుంటే విషయం అడిగినాడు. ఒక భక్తుడు నన్ను కొట్టినాడని రాముడు చెప్పాడు. ఎక్కడున్నా డంటే ఇక్కడే ఉన్నా డన్నాడు. మారుతికి అర్థం అయింది. చాలా బాధపడి వైశ్రవణుడి దగ్గరకు వెళ్లి క్షమాపణ కోరుకున్నాడు. 
    ఇక్కడ గమనించవలసినది ఏంటంటే అపరిశుభ్రమైన రామనామం పరిశుద్ధమైన రామనామం అనే రెండు ఉండవు. రామ నామం అంటాము. అంతే! దానికి అపరిశుభ్రతను గాని పరిశుభ్రతను గాని జోడించలేము. 
    అంటే ఏదీ అంటడం లేదు రామనామానికి. రామనామం చేసేవాడు పరిశుభ్రంగా ఉండవచ్చు.. అపరిశుభ్రంగా ఉండవచ్చు. అది అతనికి సంబంధించినదే! కానీ రామ నామానికి సంబంధించినది కాదు. కానీ ఆ విచికిత్స మనం మానేసి రామ నామానికి శుభ్రత అపరిశుభ్రత అంటగట్టి  హైరానా పడిపోతున్నాం. ఇది అవసరమా అని ఆలోచించడం లేదు.
     అపరిశుభ్రత గుర్తుకు వచ్చిందంటే దానిమీదకు మనసు పోయినట్టే కదా! అపరిశుభ్రత మీదకు మనసు పోతే దేవుని మీద నుంచి పక్కకు జారిపోయిందనే కదా అర్థం! అంటే మనసు దేవుని మీద పెట్టా లనుకొని కదా కూర్చున్నది! కానీ మనసు తనకు తోచిన రీతిగా అక్కడినుంచి జారుకుని అపరిశుభ్రత మీదకు పోయిం దన్నమాట. దానిని మనం గమనించనే లేదు. అక్కడ మనసును సరి చేసుకొనే అవసరం  ఉంది. కానీ అపరిశుభ్రతను సరి చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉన్నాము. మనసును సరి చేసుకోవడానికి కాదు. మన మనసు మనలోనే ఉన్నది. దానిని సరిచేసుకోలేక బయట ఉన్న వస్తువును గాని అపరిశుభ్రతను గాని సరి చేసుకోవాలని భ్రమ పడుతూ దాని వెంట పరుగెత్తుతూ ఉన్నాము. అంటే పుం డొకచోట మం దొకచోట అన్న సామెత ఋజువౌతున్నది. ఇది ఎంతవరకు సమంజసం అని కూడా ఆలోచించడం లేదు.      అపరిశుభ్రత తొలగిపోయిందంటే చాలు ఎంతో గొప్పగా దేవుని మీద మన మనసు నిలిచిపోతుందని భ్రమ పడుతూ ఉన్నాం. కానీ నిజంగా నిలిచిపోయిందా అని మాత్రం మనం చిత్తశుద్ధితో తరచి చూసుకోవటం లేదు.   ఊరకే క్షమించి వదిలేస్తున్నాం. అది మన మనస్సు కదా! అది ఏం చేసినా సరే అనుకుంటాం.
     ఇప్పుడు మనస్సు దేవుని మీద నుంచి జారిపోయి అపరిశుభ్రత మీద పడితే అపరిశుభ్రతను సరి చేసాం అనుకోండి. మరొకటి వచ్చేస్తుంది దాని చోట. అంటే మరొకటి ఆ ఖాళీని భర్తీ చేస్తుంది. అప్పుడు దాని మీద పడిపోతుంది మనస్సు. అప్పుడు దాన్ని కూడా సరి చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత ఆ చోట మరొకటి పడుతుంది. ఇలా ఎన్ని సరి చేసుకుంటూ పోతాము? ఇక్కడ గమనించవలసినది ఏమిటంటే సరి చేయడం అనేది కాదు దైవం మీదినుంచి జారిపోవడం మనసుకు అలవాటయింది అని తెలుసుకోవాలి. 
    అలా జారిపోవడం అనే లక్షణం మనసుకు లేకుండా చేసుకోవడంలోనే ఉన్నది సాధకుని యొక్క నేర్పరితనం. దానిని గుర్తించకుండా ఇంకేదో ఇంకేదో చేస్తున్నాము అనడం వృథా ప్రయాస. ఇదంతా తూర్పుకు వెళ్లా లనుకుని పడమరకు వెళ్ళినట్టే అవుతుంది కానీ మరొకటి కాదు.

...        శుభమ్ భూయాత్

✍🏻డా. వెలుదండ సత్యనారాయణ 
                    పరమార్థ కవి

పరమార్థకవి డా. వెలుదండ సత్యనారాయణ గారికి ధన్యవాదములు.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.