గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, జూన్ 2018, గురువారం

చిత్రగర్భకవితావతంశులు,గౌరవశ్రీ!చింతారామకృష్ణవరేణ్య!విరచిత"శ్రీమన్నారాయణ శతకము"-పై నూతన ఛందోగర్భ కవితాసుమపారిజాతము.

0 comments

జైశ్రీరామ్.
చిత్రగర్భకవితావతంశులు,గౌరవశ్రీ!చింతారామకృష్ణవరేణ్య!విరచిత"శ్రీమన్నారాయణ శతకము"-పై నూతన ఛందోగర్భ కవితాసుమపారిజాతము.నర్తన,మనోరమ,సుభిక్ష,దదామీతి,వర్ఛశ్వినీ,సంస్తుత్య,హేతుభూత,చిదానంద, సమ్మోదినీ,ముక్తిహేతు,గర్భ-"జన్మధన్య"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

"  జన్మధన్య-వృత్తము."
ఉత్కృతి ఛందము. మ.భ.స.మ.య.య.త.ర.లగ.గణములు.
యతులు.10,18.ప్రాసనీమముగలదు.
శ్రీమన్నారాయణ స్ఫురణం?చిదానంద!సమ్మోదమౌ!జీవన్ముక్తిహేతు!భూతమౌ
మా' మాధుర్యంబగు!మహిమన్!మదార్తిం దొలగించుగా! మావద్దివ్యసంస్తుతిం జనున్!
రామా!  మీదౌ! శతక"  మిలం!  రథారోహణంబౌ, ఘనా! ప్రావర్ఛశ్వులం! వెలుంగిడున్!
దామంబౌదివ్యు! గళముం! దదామీతి "మోక్షంబనం? తావజ్జన్మ! ధన్యతం గనెన్!

భావము:-శ్రీమన్నారాయణ స్ఫురణము మనస్సున కానంద మొసగును.
జీవన్ముక్తికి హేతుభూతమదియే. ఈశతకము శ్రీమన్మహాలక్ష్మిమహిమచే
మాథుర్యము సంతరించుకొనును. నాయొక్క యనగా ఆత్మాకమైన(ఆత్మగల
ప్రతీజీవికి) కష్టములను తొలగించును కదా! లక్ష్మీప్రదమైన, మనోహరమైన
స్తుతితోనలరారును.రామా! శ్రీయుతులురామకృష్ణార్యా! మీచే రూపు దిద్డ
బడిన మీదైన శ్రీమన్నారాయణ శతకము ఈ రసాతలమున క్రొత్తకాంతులతో
వెలుగులిడును. జ్ఞాన ప్రబోధ యగును. కంఠహారముగా సురలగళాకంఠ రవమై
దనరును. మోక్షదాయినియైన మీకృతి వలన మీజన్మ ధన్యతనందెను.

1.గర్భగత"-నర్తనా"-వృత్తము.
బృహతీఛందము. మ.భ.స.గణములు.వృ.సం.241.ప్రాస కలదు.
శ్శ్రీమన్నారాయణ స్ఫురణం!
మా"-మాథుర్యంబగు మహిమన్!
రామా! మీదౌ!  శతక.    మిలన్!
దామంబౌ! దివ్యు  గళమున్?

2.గర్భగత"-మనోరమ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.య.య.లగ.గణములు.వృ.సం.74.ప్రాసగలదు.
చిదానంద సమ్మోదమౌ?
మదార్తిం తొలంగించుగా!
రథారోహణంబౌ!ఘనా!
దదామీతి! మోక్షంబనన్?

3.గర్భగత"-సుభిక్ష"-వృత్తము.
బృహతీఛందము.మ.జ.ర.గణములు.వృ.సం.169.ప్రాసగలదు.
జీవన్ముక్తి హేతు భూతమౌ?
మావద్దివ్య!సంస్తుతిం జనున్?
ప్రావర్ఛశ్వులం!వెలుంగిడున్?
తావజ్జన్మ!ధన్యతం గనెన్?

4.గర్భగదదాదదామీతి"-వృత్తము.
అత్యష్టీఛందము.మ.భ.స.య.య.లగ.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమము గలదు.
శ్రీమన్నారాయణ స్ఫురణం? చిదానంద సమ్మోదమౌ?
మా"-మాథుర్యంబగుమహిమం! మదార్తిం దొలంగించుగా!
రామా! మీదౌ శతక మిలం? రథారోహణంబౌ! ఘనా?
దామంబౌ దివ్యు గళముం?దదామీతి మోక్షంబనన్?

5.గర్భగత"-వర్ఛశ్వినీ"-వృత్తము.
అత్యష్టీఛందము.య.య.య.త.ర.లగ.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
చిదానంద సమ్మోదమౌ? జీవన్ముక్తి హేతు భూతమౌ?
మదార్తిం దొలంగించుగా! మా"-వద్దివ్య సంస్తుతిం జనున్!
రథారోహణంబౌ ఘనా! ప్రావర్ఛశ్వులం? వెలుంగిడున్!
దదామీతి"-మోక్షంబనం? తావజ్జన్మ! ధన్యతం  గనెన్!


6.గర్భగత"-సంస్తుత్య"-వృత్తము.
ఉత్కృతిఛందము.య.య.య.త.ర.య.మ.న.లగ.గణములు.
యతులు.9.18.ప్రాసనీమముగలదు.
చిదానంద సమ్మోదమౌ! జీవన్ముక్తి హేతుభూతమౌ! శ్రీమన్నారాయణ స్ఫురణం!
మదార్తిం దొలంగించుగా! మా"-వద్దివ్య సంస్తుతింజనుం? మా,మాథుర్యంబగు మహిమన్?
రథారోహణంబౌ ఘనా! ప్రావర్చశ్వులంవెలుంగిడున్! రామా! మీదౌ శతకమిలన్!
దదామీతి! మోక్షంబనం? తావజ్జన్మ! ధన్యతంగనెం! దామంబౌ! దివ్యు గళమున్!

7.గర్భగత"హేతుభూత"-వృత్తము.
ధృతిఛందము.మ.జ.ర.మ.భ.స.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
జీవన్ముక్తి! హేతుభూతమౌ? శ్రీమన్నారాయణ  స్ఫురణం?
మా"-వద్దివ్యసంస్తుతిన్! జనుం? మా"-మాథుర్యంబగు! మహిమన్?
ప్రావర్ఛశ్వులం వెలుంగిడున్! రామా! మీదౌ ! 'శతక ' మిలన్?
తావజ్జన్మ! ధన్యతం గనెం? దామంబౌ! దివ్యు  గళమున్!

8.గర్భగత"-చిదానంద"-వృత్తము.
ఉత్కృతిఛందము.మ.జ.ర.మ.భ.స.య.య.లగ.గణములు.
యతులు.10,19.ప్రాసనీమముగలదు.
జీవన్ముక్తి హేతుభూతమౌ! శ్రీమన్నారాయణస్ఫురణం! చిదానంద! సమ్మోదమౌ
మా'-వద్దివ్య! సంస్తుతిన్ జనుం! మా'మాధుర్యంబగు! మహిమం!మ'దార్తిం! దొలంగించుగా?
ప్రావర్ఛశ్వులం! వెలుంగిడుగా! రామా! మీదౌ'శతక'మిలన్? రథారోహణంబౌ! ఘనా!
తావజ్జన్మ! ధన్యతం గనెం? దామంబౌ దివ్యు గళముం? దదామీతి!మోక్షంబనన్

9.గర్భగత"-సమ్మోదినీ"-వృత్తము.
అత్యష్టీఛందము.య.య.య.మ.న.లగ.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
చిదానంద! సమ్మోదమౌ! శ్రీమన్నారాయణ! స్ఫురణం?
మ'దార్తిం! దొలంగించుగా? మా"-మాథుర్యంబగు? మహిమన్!
రథారోహణంబౌ ఘనా! రామా!  మీదౌ 'శతక ' మిలన్?
దదామీతి మోక్షంబనన్? దామంబౌ! దివ్యు గళమున్!

10.గర్భగత"-ముక్తి హేతు"-వృత్తము.
ఉత్కృతిఛందము.య.య.య.మ.న.య.త.ర.లగ.గణములు.
యతులు.9.18.ప్రాసనీమముగలదు.
చిదానంద! సమ్మోదశ్రశ్రీమన్నారాయణ! స్ఫురణం? జీవన్ముక్తిహేతుభూతమౌ?
మ'దార్తిం! దొలంగించుగా? మా"-మాథుర్యంబగు! మహిమన్!మా"-వద్దివ్య.  సంస్తుతిం జనున్!
రథారోహణంబౌ! ఘనా! రామా! మీదౌ 'శతక'మిలన్? ప్రార్ఛశ్వులలం! వెలుంగిడుగా!
దదామీతి మోక్షంబనం? దామంబౌ! దివ్యు గళముం! తావజ్జన్మ! ధన్యతం గనెన్!

భక్తి ప్రబోధాత్మకమైన మీ కృతి యాచంద్రతారార్కమీపుడమిని నిలుచుటయేగాక, శ్రీమన్నారాయణునికరుణాకటాక్షములు
లోకమునకుప్రసరించునుగాత!
సమస్త సన్మంగళాని భవంతు! సర్వేజస్సుఖినోఃభవంతు!
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
అవ్యాజానురాగామృతమును నాపై ప్రసరింపఁజేసిన బ్రహ్మశ్రీ వల్లభవఝలాప్పలనరసింహమూర్తి కవివరులకు నా ప్రణామములు.
జహింద్.

చాటువులు. ~కొరిడె విశ్వ నాథశర్మ. " యస్య షష్ఠీ చతుర్థీ చ

1 comments

 జైశ్రీరామ్.
చాటువులు.
~ కొరిడె విశ్వనాథశర్మ.
" యస్య షష్ఠీ చతుర్థీ చ
విహస్య చ విహాయ చ |
అహం కథం ద్వితీయా స్యాత్ ?
ద్వితీయాస్యామహం కథమ్ ||”

సాధారణముగా ఏ కన్య యైనా తనకు కాబోయే భర్త చదువులో కాని, ఆర్థికములో కాని అధికారములో కాని తమస్థాయి కంటే ఉన్నతుడై ఉండాలని కోరుకుంటుంది. అటువంటి వరుడికై వెతుకుతుంటుంది. లేదా తమ స్థాయి యైనా అంగీకరించవచ్చు. కాని తన కంటే అధమమైనవాడిని ఎన్నుకొనుట ఎక్కడో ఒక చోట గాని సర్వ సాధారణముగా జరుగదు .
ఒక విద్యావతి పెళ్ళి చూపులో ఏమి రాని శుంఠను ఎట్లు వ్యతిరేకించిందో గమనించండి. వరుని పక్షమువాళ్ళతో వరుడు వచ్చినాడు. పెళ్ళిచూపులు జరిగినవి. అబ్బాయి అమ్మాయి నచ్చిందని చెప్పాడు. అమ్మాయికి ఆ అబ్బాయి చదువు మీద ఎందుకో అనుమానము వచ్చినేను కొన్ని ప్రశ్నలు వేస్తాను చెప్పమంది. ఆ అమ్మాయి విద్వాంసుడైన తండ్రి దగ్గర చదువుకొన్నది. మంచి విద్వత్తును సాధించుటయే కాక ఛందోబద్ధకముగా పద్యములల్లగల విదుషీమణి. అబ్బాయి సరే అడుగమన్నాడు.
అమె కొంచం తేలికయైన పదములను అడిగి , ఆ తర్వాత క్లిష్టమైన వాటిని అడుగాలని అనుకొన్నది.‘విహస్య’ , ‘ విహాయ’ , ‘ అహం ’ అనువాటి వ్యాకర్ణవిషయములను తెల్పమన్నది.
అప్పుడా అబ్బాయి తడబడ్డాడు. బాగాచదువుకొన్నవాడని దాంబికాలు చెప్పాడే కాని నిజమునకు రామ (మొదటి) శబ్దము తప్పించి మరొకటి రాదు. అందుకే విచారించాడు. ఐనా లేని ధైర్యాన్ని తెచ్చుకొని అంతా తెలిసిన వాడివలె " దీంట్లో ఏముంది అన్నీ రామ శబ్దము వలెనే ఉంటాయి. ‘విహస్య’ రామ శబ్దములో ‘ రామస్య, రామయొః, రామాణాం’ అని చెప్పినట్లే ‘విహస్య , విహయోః , విహానాం ’ , అని షష్ఠి విభక్తి విహునియొక్క అని అర్థము. అన్నాడు. ఐతే మరి ‘ విహాయ ’ ఏమిటి అని అడిగితే అది కూడ రామ శబ్దము వలె చతుర్థీ విభక్తి . విహునికొరకు అని అర్థము. అన్నాడు. ఒహో అట్లానా ! మరి ‘ అహం ’ ? అని అడగగా అయ్యొ అది ద్వితీయా విభక్తి. అహునిగురించి అని అర్థము. అని చెప్పగానే.. ఆ అమ్మాయికి ఆ శుంఠని చూచి క్రొధురాలై ‘ ఈ పరమ శుంఠను నేను చేసుకోను అన్నది. ఎందుకమ్మా? అని బంధువులడగగా అప్పుడు ఈ శ్లోక రూపకముగా జవాబు చెప్పినది.

" యస్య షష్ఠీ చతుర్థీ చ
విహస్య చ విహాయ చ |
అహం కథం ద్వితీయా స్యాత్ ?
ద్వితీయాస్యామహం కథమ్ ||”

ఈ మూర్ఖునికి రామశబ్దము తప్పించి మరొకటి రాదు. విహస్య , విహాయ పదములు షష్ఠీ చతుర్థీ అని చెప్పే ఈ అల్పాజ్ఞాని నాకిష్టము లేదు. అహం అనేది ద్వితీయా అని చెపుతున్నాడు. అదెట్లా ఔతుంది. అందుకే అహం (నేను) ఈతనికి ద్వితీయ ( భార్య) ను ఎట్లగుదును ? అని ప్రశ్నిస్తూ వ్యతిరేకతను తెలిపింది. ఇక్కడ విహస్య విహాయ రెండూ కూడ ల్యప్ ప్రత్యయాన్తరూపములే కాని శబ్దములు కావు. అవి అవ్యయములు. (లింగవిభక్తి వచన శూన్యములు.)
అనగా ఇక్కడ ‘ హస్’ ధాతువుపై ‘ వి ’ అనే ఉపసర్గ చేర్చుతద్వారా అసమాపకార్థమున ‘ ల్యప్ ’ అనే కృత్ ప్రత్యయము వచ్చి ‘ విహస్య ’ (నవ్వి) అనేపదము, అదేవిధముగా ‘ విహాయ ’ కూడ ‘ హా ’ త్యాగే అను ధాతువుపైన ‘ ల్యప్ ’ వచ్చి ‘ విహాయ ’ ( వదిలి ) అని మారును. అదేవిధముగా అహం అనేది దకారాన్త ‘ అస్మద్’ శబ్దము యొక్క ప్రథమావిభక్తి. నేను అనే అర్థము కలది.
ఈ శ్లోకము ద్వారా ముఖ్యముగా ఉత్తరార్ధముద్వారా ఆమె వైదుష్యము చక్కగా ప్రదర్శితమగుచున్నది.
జైహింద్

6, జూన్ 2018, బుధవారం

మత్తరజినీ,పరనిందా,చెడుతీరు,నీటితీరు,భాసురతర,భాస్వతర,నిల్చునా,మరయా,గాడిచెడు,కన్నారే,గర్భ"-పన్నాలవల్లె"-వృత్తము. జైశ్రీరామ్.

0 comments


జైశ్రీరామ్.
మత్తరజినీ,పరనిందా,చెడుతీరు,నీటితీరు,భాసురతర,భాస్వతర,నిల్చునా,మరయా,గాడిచెడు,కన్నారే,గర్భ"-పన్నాలవల్లె"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
-"పన్నాలవల్లె"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.భ.స.ర.త.ర.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
ఎండమావి నీటి తీరయెం?ఏడు పదుల స్వాతంత్ర్యమే?యెన్నాళ్ళునిల్చునందువే!
కొండ కోన లెల్ల మాసెనే?గోడు పడుచు స్వార్ధంబునం! కొన్నాళ్ళె నిల్చు నీసిరుల్!
గండు మీలు మ్రింగు చుండగా!గాడి పడని సామ్యంబునం!కన్నారె?యిట్టి.దుస్థితిన్?
బండలాయె భావి భాగ్యముల్!పాడుపడెను స్వేచ్ఛింతలో!పన్నాలు తీరునెంచకన్?                                                                                       
1.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
ఎండమావి నీటి తీరయెన్?
కొండ కోన  లెల్ల   మాసెనే?
గండు మీలు మ్రింగు చుండగా!
బండలాయె భావి భాగ్యముల్!

2.గర్భగత"-పరనిందా"-వృత్తము
బృహతీఛందము.భ.స.ర.వృ.సం.159.ప్రాసగలదు
ఏడు పదుల స్వాతంత్ర్యమే!
గోడు పడుచు స్వార్ధంబునన్?
గాడి పడని సామ్యంబునన్?
పాడు పడెను స్వేచ్ఛింతలో?

3.గర్భగత"-చెడు తీరు"-వృత్తము.
అనుష్టుప్ఛందము.మ.ర.లగ.గణములు.81.ప్రాసనీమము గలదు.
ఎన్నాళ్ళు  నిల్చు నందువే?
కొన్నాళ్ళె  నిల్చు నీసిరుల్!
కన్నారె యిట్టి దుస్థితిన్?
పన్నాలు తీరు నెంచకన్?

4.గర్భగత"-నీతి తీరు"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.భ.స.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ఎండమావి నీటి తీరయెం?ఏడు పదుల స్వాతంత్ర్యమే?
కొండ కోన లెల్ల మాసెనే! గోడు పడుచు స్వార్ధంబునన్?
గండు మీలు మ్రింగు చుండగా!గాడి పడని సామ్యంబునన్?
బండలాయె భావి భాగ్యముల్!పాడుపడెనుస్వేచ్ఛింతలో?

5.గర్భగత"-భాసుర తర"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.స.ర.త.ర.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ఏడు పదుల స్వాతంత్ర్యమే! ఎన్నాళ్ళు నిల్చు నందువే?
గోడు పడుచు స్వార్ధంబునం!కొన్నాళ్ళె నిల్చు నీసిరుల్?
గాడి పడని సామ్యంబునం!కన్నారె?యిట్టి దుస్థితిన్?
పాడు పడెను స్వేచ్ఛింతలో!పన్నాలు తీరు నెంచకన్?

6.గర్భగత"-భాస్వతర"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.స.ర.త.ర.య.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
ఏడు పదుల స్వాతంత్ర్యమే!ఎన్నాళ్ళు నిల్చు నందువే?ఎండమావి నీటి తీరయెన్?
గోడు పడుచు స్వార్ధంబునం!కొన్నాళ్ళె నిల్చు నీ సిరుల్?కొండ కోన లెల్ల మాసెనే!
గాడి పడని సామ్యంబునం!కన్నారె యిట్టి దుస్థితిం?గండు మీలు మ్రింగుచుండగా!
పాడు పడెను స్వేచ్ఛింతలో! పన్నాలు తీరు నెంచకం?బండలాయె భావి భాగ్యముల్!

7.గర్భగత"-నిల్చునా"-వృత్తము.
అత్యష్టీఛందము.త.ర.య.జ.ర.లగ.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమము గలదు.
ఎన్నాళ్ళు నిల్చు నందువే?ఎండమావి నీటి తీరయెన్?
కొన్నాళ్ళె నిల్చు నీ సిరుల్?కొండ కోన లెల్ల మాసెనే!
కన్నారె యిట్టి దుస్థితిం?గండు మీలు మ్రింగు చుండగా!
పన్నాలు తీరు నెంచకం?బండలాయెభావవి భాగ్యముల్!

8.గర్భగత"-మారయా"-వృత్తము.
ఉత్కృతిఛందము.మ.ర.య.జ.ర.య.న.య.లగ.గణములు.యతులు.9,18.ప్రాసనీమముగలదు.
ఎన్నాళ్ళు నిల్చు నందువే?ఎండమావి నీటి తీరయెం?ఏడు పదుల స్వాతంత్ర్యమే!
కొన్నాళ్ళె నిల్చు నీ సిరుల్?కొండ కోన లెల్ల మాసెనే!గోడు పడుచు స్వార్ధంబునన్!
కన్నారె యిట్టి దుస్థితిం?గండు మీలు మ్రింగు చుండగా!గాడి పడని వ్సామ్యంబునన్!
పన్నాలు తీరు నెంచకం?బండలాయె భావి భాగ్యముల్!పాడు పడెను స్వేచ్ఛింతలో!

9.గర్భగత"-గాడిచెడు"-ధృతిఛందము.
ధృతిఛందము.భ.స.ర.ర.జ.ర.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ఏడు పదుల స్వాతంత్ర్యమే!ఎండమావి నీటి తీరయెం?
గోడు పడుచు స్వార్థంబునం!కొండ కోన లెల్ల మాసెనే!
గాడి పడని సామ్యంబునం!గండు మీలు మ్రింగు చుండగా!
పాడుపడెను స్వేచ్ఛింతలో!బండ లాయె భావి భాగ్యముల్!

10.గర్భగత"-కన్నారే"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.స.ర.ర.జ.ర.త.ర.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
ఏడు పదుల స్వాతంత్ర్యమే!ఎండమావి నీటి తీరయెం?ఎన్నాళ్ళు నిల్చునందువే?
గోడు పడుచు స్వార్థంబునం!కొండ కోన లెల్ల మాసెనే!కొన్నాళ్ళె నిల్చునీ సిరుల్!
గాడి పడని సామ్యంబునం!గండుమీలు మ్రింగు చుండగా! కన్నారె యిట్టి దుస్థితిన్?
పాడుపడెను స్వేచ్ఛింతలో!బండలాయె భావి భాగ్యముల్!పన్నాలు తీరు నెంచకన్?
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.

   జైహింద్.

5, జూన్ 2018, మంగళవారం

జపానికి 108 సంఖ్యే ఎందుకు? దాని ప్రాముఖ్యత ఏమిటి?

1 comments

జైశ్రీరామ్
జపానికి 108 సంఖ్యే ఎందుకు? దాని ప్రాముఖ్యత ఏమిటి?

హైదరాబాద్:మనం ఏదైనా మంత్రం జపించడానికి 108 సంఖ్యను ఉపయోగిస్తుంటాము.ఇది
మనం పెద్దలు చెప్పారని ఆచరిస్తున్నాము.అసలు ఈ 108 సంఖ్యకు అంత
ప్రాధాన్యతను ఇస్తూ వస్తున్నాం కాని ఎప్పుడైన ఆలోచించారా,ఆ విషయం గురించి
ఎవరి ద్వార నైన తెలుసుకోవాలని ప్రయత్నం కూడ చేయలేదు అందుకే ఆ సంఖ్య యొక్క
ప్రాదాన్యతను మీకు వివరిస్తున్నాం.

విష్ణుసహస్రనామాలు 108,అష్తోత్తరాలలో 108 సంఖ్య నామాలతో దేవతలను
ఆరాధిస్తాము. ఇందుకు ప్రదానమైన కారణం మన భారతదేశ ఋషిపుంగవుల అనేక వేల
సంవత్సరాల వారి పరిశోధనలో తెల్చిచెప్పిన జ్యోతిషానికి సంబంధించి మనకు
ఉపయోగ పడేవి 27 నక్షత్రాలు ప్రతి నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. అనగా
నక్షత్రాలు వాటి పాదాలు కలిపితే 27 x 4 = 108 అవుతుంది. ప్రతి మనిషి ఈ
108 నక్షత్ర పాదాలలో ఏదో ఒకదానిలో పుట్టి ఉంటాడు కావున ఈ సంఖ్యకు అంత
ప్రాముఖ్యత.కానీ వీటికన్నా మరెన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ఈ సంఖ్యతో
ముడిపడి ఉన్నాయి. అవేమిటో ఒకసారి చూద్దాము.

ఖగోళ పరంగాసూర్యునికి, భూమికి ఉన్న దూరం 149.6million kms. ఈ దూరాన్ని
సూర్యుని చుట్టు కొలత 1391000kms తో భాగిస్తే వచ్చే సంఖ్యా రమారమి 108
అలాగే చంద్రునికి భూమికి ఉన్న దూరం 38 లక్షల కిలోమీటర్లను చంద్రుని
చుట్టుకొలత అయిన 3474 kms తో భాగిస్తే వచ్చే సంఖ్య 108
27 నక్షత్రాలు ప్రతి నక్షత్రానికి 4 పాదాలు = 27 x 4 = 108
12 రాశులు 9 నక్షత్ర పాదాలు = 12 x 9 = 108

హైందవం ప్రకారంముఖ్య శివలింగాలు 108 అందుకే శైవ మతాలు కూడా 108.గౌడియ
వైష్ణవంలో బృందావనలో 108 గోపికలను పూజిస్తారు. 108 వైష్ణవ దివ్య
క్షేత్రాలుకంబోడియాలో ఆంగ్కోర్ వాట్ గుడిలో 108 మంది (అసురులు, దేవతలు)
కలిసి సాగరమధనం చేసినట్టు చిత్రింపబడివుంది.హైందవ భావాలనుండి ప్రేరణ
పొందిన బౌద్ధం ప్రకారం పంచేంద్రియాలతో స్పృహ ను కలిపి ఆరు భావాలను
వాటివల్ల కలిగే అంతర్భావాలైన సుఖము, దుఃఖము, స్తిరత్వబుద్ధిని గుణించి
అవి బాహ్యంగానైనా ఆంతరంగానైనా భూత, భవిష్యద్, వర్తమానాలలో కలిగిన భావనలను
గుణిస్తే 6x3x2x3 = 108

ఓం పూర్ణమదః పూర్ణమిదం
పుర్ణాత్పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ
పూర్ణమేవావశిష్యతే

నుండి ఇన్ఫినిటీ (8) కు చేరుకునే విధానం 108 symbolism.

ఆయుర్వేదం ప్రకారం 108 మర్మ స్థానాలు, శక్తి కేంద్రాలు
కలారిపయట్టు ప్రకారం ( తరువాత కరాటే గా మారింది) 108 pressure పాయింట్స్
108 డిగ్రీల జ్వరం వచ్చినప్పుడు శరీరంలో ఉన్న అన్ని అవయవాలు చచ్చుబడిపోతాయి.
108 సార్లు జపం చేయడం వలన మనస్సును నిర్మలం చేస్తుంది.

లోపల ఉన్న భావాలను అణగదోక్కుతుంది.
సంస్కృత భాషలో 54 అక్షరాలు ఉంటాయి. వాటికి శివ, శక్తి తత్త్వాలైన స్త్రీ,
పురుష రూపాలుంటాయి. 54 x 2 =108
12000 దివ్య సంవత్సరాలు = 43,20,000 మానవ సంవత్సరాలు = బ్రహ్మకు ఒక పగలు
= 4000 x 108108 లో 1 జీవుడిని తెలియచేస్తుంది. 8 జీవుని తత్త్వాలను
తెలియ చేస్తుంది. 0 పరిపూర్ణ భగవత్తత్త్వము. ఈ శరీరాన్ని జీవుడిని కలిపి
నియమించేది పరిపూర్ణ భగవత్తత్త్వము 108.
ఈ సంఖ్యను కూడితే 1+0+8 = 9 చాలా ముఖ్యమైన సంఖ్య. 9 తో ఏది కలిపినా
వచ్చిన సంఖ్యలో numberలను కలిపితే చివరకు అదే సంఖ్య వస్తుంది.

గణిత పరంగా 108 ఒక abundant number. అంటే వాటి divisors
1+2+3+4+6+12+18+27+36+54 = 163 > 108
Tetranacci number ( ముందటి నాలుగు fibonacci నమ్బెర్లను కలిపితే
వచ్చేది) 0,0,1,1,2,4,8,15,29,56,108
హైపర్factorial 1*1 + 2*2 + 3 **3 = 108
ఒక పెంటగాన్ కోణాలు అన్నీ కలిపితే 108
ఒక refactorable number ( వాటి divisors ఎన్నున్నాయో వాటితో భాగింపపడగలిగేది )

ఇంకా మరెన్నో విశిష్టతలను తనలో ఇముడ్చుకున్న సంఖ్యా

ఇటువంటి ప్రత్యేకతతో ఉన్నది కనుకనే మన ఋషులు, ద్రష్టలు ఎప్పుడో 108 సంఖ్య
ప్రాముఖ్యతను మనకు నామాలలో, ప్రదక్షిణలలో, జపాలలో విధిగా విధించారు. మన
పూర్వీకులైన వారు చాలా విషయాలను మనకోసం శోధన,సాధన వలన మనకు తెలియకుండానే
లాభం పొందుతున్నాము.
జైహింద్. 

4, జూన్ 2018, సోమవారం

బడబానల పంక్తి మీద పచ్చిక మొలచెన్. సమస్య.... పూరణ.

2 comments

జైశ్రీరామ్.
జైశ్రీమన్నారాయణ.

సమస్య.
బడబానల పంక్తి మీద పచ్చిక మొలచెన్.

నా పూరణ.
కంద గీత గర్భ చంపకమాల.

పలుపలు రీతులన్ దురితపాళి లయించెను దుర్గ కాళి. లే
రిల నిలుపన్ తనన్. కుపితనీశుఁడె మార్చెను. కోపమాపె. శో
భిల నిలిచెన్ తనే వలపుచే. బడబానల పంక్తి మీద ప
చ్చిక మొలచెన్ గదా. పసిరి చిన్నెలు మొల్చెను భర్తగాంచెనే.

చంపక గర్భ గత కందము.

పలు రీతులన్ దురితపా
ళి లయించెను దుర్గ కాళి. లేరిల నిలుపన్.
నిలిచెన్ తనే వలపుచే
బడబానల పంక్తి మీద పచ్చిక మొలచెన్.

చంపక గర్భ గత తేటగీతి.

దురితపాళి లయించెను దుర్గ కాళి.
కుపితనీశుడె మార్చెను. కోపమాపె
వలపుచే బడబానల పంక్తి మీద
పసిరి చిన్నెలు మొల్చెను భర్తఁ గాంచె.🏼
జైహింద్.🏼

3, జూన్ 2018, ఆదివారం

మరుగున పడుతున్న మన సామెతలు.

2 comments

జైశ్రీరామ్.

మరుగున పడుతున్న మన  సామెతలు.

1. అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు
2. అంబలి తాగే వారికి మీసాలు యెగబట్టేవారు కొందరా
3. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ
4. అత్తలేని కోడలుత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతురాలు
5. అనువు గాని చోట అధికులమనరాదు
6. అభ్యాసం కూసు విద్య
7. అమ్మబోతే అడివి కొనబోతే కొరివి
8. అయితే ఆదివారం కాకుంటే సోమవారం
9. ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం
10. ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత
11. ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు
12. ఇంట గెలిచి రచ్చ గెలువు
13. ఇల్లు పీకి పందిరేసినట్టు
14. ఎనుబోతు మీద వాన కురిసినట్టు
15. చెవిటి వాని ముందు శంఖమూదినట్టు
16. కందకు లేని దురద కత్తిపీటకెందుకు
17. కత్తిపోటు తప్పినా కలంపోటు తప్పదు
18. కుక్క కాటుకు చెప్పుదెబ్బ
19. కోటి విద్యలూ కూటి కొరకే
20. నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు
21. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం
22. పిట్ట కొంచెం కూత ఘనం
23. రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు
24. వాన రాకడ ప్రాణపోకడ ఎవరి కెరుక
25. కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదు
26. మింగమెతుకులేదు మీసాలకు సంపంగి నూనె
27. ఆడబోయిన తీర్థము యెదురైనట్లు
28. ఆడలేక మద్దెల వోడు అన్నట్లు
29. ఆది లొనే హంస పాదు
30. ఏమీ లేని యెడారిలో ఆముదము చెట్టే మహా వృక్షము
31. ఆకలి రుచి యెరుగదు నిద్ర సుఖమెరుగదు
32. ఆకాశానికి హద్దే లేదు
33. ఆలస్యం అమృతం విషం
34. ఆరే దీపానికి వెలుగు యెక్కువ
35. ఆరోగ్యమే మహాభాగ్యము
36. ఆవులింతకు అన్న ఉన్నాడు కాని తుమ్ముకు తమ్ముడు లేడంట
37. ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా?
38. అబద్ధము ఆడినా అతికినట్లు ఉండాలి
39. అడగందే అమ్మైనా అన్నము పెట్టదు
40. అడ్డాల నాడు బిడ్డలు కాని గడ్డాల నాడు కాదు
41. ఏ ఎండకు ఆ గొడుగు
42. అగ్నికి వాయువు తోడైనట్లు
43. ఐశ్వర్యమొస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమంటాడు
44. అందని మామిడిపండ్లకు అర్రులు చాచుట
45. అందితే జుట్టు అందక పోతే కాళ్ళు
46. అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో శని ఉన్నట్లు
47. అన్నపు చొరవే గాని అక్షరపు చొరవ లేదు
48. అప్పు చేసి పప్పు కూడు
49. అయ్య వారు వచ్చే వరకు అమావాస్య ఆగుతుందా
50. అయ్యవారిని చెయ్యబొతే కోతి బొమ్మ అయినట్లు
51. బతికుంటే బలుసాకు తినవచ్చు
52. భక్తి లేని పూజ పత్రి చేటు
53. బూడిదలో పోసిన పన్నీరు
54. చాదస్తపు మొగుడు చెబితే వినడు,
గిల్లితే యేడుస్తాడు
55. చాప కింద నీరులా
56. చచ్చినవాని కండ్లు చారెడు
57. చదివేస్తే ఉన్నమతి పోయినట్లు
58. విద్య లేని వాడు వింత పశువు
59. చేతకానమ్మకే చేష్టలు ఎక్కువ
60. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు
61. చక్కనమ్మ చిక్కినా అందమే
62. చెడపకురా చెడేవు
63. చీకటి కొన్నాళ్ళువెలుగు కొన్నాళ్ళు
64. చెరువుకి నీటి ఆశ నీటికి చెరువు ఆశ
65. చింత చచ్చినా పులుపు చావ లేదు
66. చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే,
ఆ వంకర టింకరవి యేమి కాయలని అడిగిందట
67. చిలికి చిలికి గాలివాన అయినట్లు
68. డబ్బుకు లోకం దాసోహం
69. దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు
70. దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన
71. దాసుని తప్పు దండంతో సరి
72. దెయ్యాలు వేదాలు పలికినట్లు
73. దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు
74. దొంగకు దొంగ బుద్ధి, దొరకు దొర బుద్ధి
75. దొంగకు తేలు కుట్టినట్లు
76. దూరపు కొండలు నునుపు
77. దున్నపోతు మీద వర్షం కురిసినట్లు
78. దురాశ దుఃఖమునకు చెటు
79. ఈతకు మించిన లోతే లేదు
80. ఎవరికి వారే యమునా తీరే
81. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు
82. గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే, ఒంటె అందానికి గాడిద మూర్ఛ పోయిందంట
83. గాజుల బేరం భోజనానికి సరి
84. గంతకు తగ్గ బొంత
85. గతి లేనమ్మకు గంజే పానకం
86 గోరు చుట్టు మీద రోకలి పోటు
87. గొంతెమ్మ కోరికలు
88. గుడ్డి కన్నా మెల్ల మేలు
89. గుడ్డి యెద్దు చేలో పడినట్లు
90. గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు
91. గుడినే మింగే వాడికి లింగమొక లెఖ్ఖా
92. గుడిని గుడిలో లింగాన్నీ మింగినట్లు
93. గుడ్ల మీద కోడిపెట్ట వలే
94. గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నాడట
95. గుర్రము గుడ్డిదైనా దానాలో తక్కువ లేదు
96. గురువుకు పంగనామాలు పెట్టినట్లు
97. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు
98. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు
99. ఇంటి పేరు కస్తూరివారు వీధిలో గబ్బిలాల కంపు
100. ఇంటికన్న గుడి పదిలం
101. ఇసుక తక్కెడ పేడ తక్కెడ
102. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందంట
103. కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు
104. కాగల కార్యము గంధర్వులే తీర్చినట్లు
105. కాకి ముక్కుకు దొండ పండు
106. కాకి పిల్ల కాకికి ముద్దు
107. కాలం కలిసి రాక పోతే కర్రే పామై కాటు వేస్తుంది
108. కాలు జారితే తీసుకోగలము కాని నోరు జారితే తీసుకోగలమా
109. కాసుంటే మార్గముంటుంది
110. కడుపు చించుకుంటే కాళ్ళపైన పడ్డట్లు
111. కలకాలపు దొంగ ఏదో ఒకనాడు దొరుకును
112. కలి మి లేములు కావడి కుండలు
113. కలిసి వచ్చే కాలం వస్తే, నడిచి వచ్చే కొడుకు పుడతాడు
114. కంచే చేను మేసినట్లు
115. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా !
116. కందకు కత్తి పీట లోకువ
117. కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం
118. కీడెంచి మేలెంచమన్నారు
119. కొండ నాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడినట్లు
120. కొండల్లే వచ్చిన ఆపద కూడా మంచువలే కరిగినట్లు
121. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు
122. కొన్న దగ్గిర కొసరే గాని కోరిన దగ్గర కొసరా
123. కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిచిందిట
124. కూటికి పేదైతే కులానికి పేదా
125. కొరివితో తల గోక్కున్నట్లే
126. కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లు
127. కొత్తొక వింత పాతొక రోత
128. కోటిి విద్యలు కూటి కొరకే
129. కొత్త అప్పుకు పొతే పాత అప్పు బయటపడ్డదట
130. కొత్త బిచ్చగాడు పొద్దు యెరగడు
131. కృషితో నాస్తి దుర్భిక్షం
132. క్షేత్ర మెరిగి విత్తనము పాత్ర మెరిగి దానము
133. కుడుము చేతికిస్తే పండగ అనేవాడు
134. కుక్క వస్తే రాయి దొరకదు రాయి దొరికితే కుక్క రాదు
135. ఉన్న లోభి కంటే లేని దాత నయం
136. లోగుట్టు పెరుమాళ్ళకెరుక
137. మెరిసేదంతా బంగారం కాదు
138. మంచమున్నంత వరకు కాళ్ళు చాచుకో
139. నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది
140. మంది యెక్కువయితే మజ్జిగ పలచన అయినట్లు
141. మనిషి మర్మము.. మాను చేవ...
బయటకు తెలియవు
142. మనిషి పేద అయితే మాటకు పేదా
143. మనిషికి మాటే అలంకారం
144. మనిషికొక మాట పశువుకొక దెబ్బ
145. మనిషికొక తెగులు మహిలో వేమా అన్నారు
146. మంత్రాలకు చింతకాయలు రాల్తాయా
147. మీ బోడి సంపాదనకుఇద్దరు పెళ్ళాలా
148. మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అయ్యిందట
149. మొక్కై వంగనిది మానై వంగునా
150. మొరిగే కుక్క కరవదు కరిసే కుక్క మొరగదు
151. మొసేవానికి తెలుసు కావడి బరువు
152. ముల్లును ముల్లుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతొనే కొయ్యాలి
153. ముందర కాళ్ళకి బంధాలు వేసినట్లు
154. ముందుకు పోతే గొయ్యి వెనుకకు పోతే నుయ్యి
155. ముంజేతి కంకణముకు అద్దము యెందుకు
156. నడమంత్రపు సిరి నరాల మీద పుండు
157. నేతి బీరకాయలో నెయ్యి యెంత ఉందో నీ మాటలో అంతే నిజం ఉంది
158. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా
159. నవ్వు నాలుగు విధాలా చేటు
160. నీ చెవులకు రాగి పొగులే అంటే అవీ నీకు లేవే అన్నట్లు
161. నిదానమే ప్రధానము
162. నిజం నిప్పు లాంటిది
163. నిమ్మకు నీరెత్తినట్లు
164. నిండు కుండ తొణకదు
165. నిప్పు ముట్టనిదే చేయి కాలదు
166. నూరు గొడ్లు తిన్న రాబందుకైనా ఒకటే గాలిపెట్టు
166. నూరు గుర్రాలకు అధికారయినా, భార్యకు యెండు పూరి
167. ఆరు నెళ్ళు సావాసం చేస్తే వారు వీరు అవుతారు
168. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు
169. ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకొని బ్రతకవచ్చు
170. బతికి ఉంటే బలుసాకు తినవచ్చు
171. ఊరంతా చుట్టాలు ఉత్తికట్ట తావు లేదు
172. ఊరు మొహం గోడలు చెపుతాయి
173. పనమ్మాయితొ సరసమ్ కంటే అత్తరు సాయిబు తో కలహం మేలు
174. పాము కాళ్ళు పామునకెరుక
175. పానకంలో పుడక
176. పాపమని పాత చీర ఇస్తే గోడ చాటుకు వెళ్ళి మూర వేసిందట
177. పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనపడినట్లు
178. పండిత పుత్రః పరమశుంఠః
179. పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్లు
180. పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మేలు
181. పట్టి పట్టి పంగనామం పెడితే, గోడ చాటుకు వెళ్ళి చెరిపేసుకున్నాడట
182. పెదవి దాటితే పృథ్వి దాటుతుంది
183. పెళ్ళంటే నూరేళ్ళ పంట
184. పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకు వెళ్ళినట్టు
185. పేనుకు పెత్తనమిస్తే తలంతా గొరికిందట
186. పెరుగు తోట కూరలో, పెరుగు యెంత ఉందో, నీ మాటలో అంతే నిజం ఉంది
187. పిచ్చి కోతికి తేలు కుట్టినట్లు
188. పిచ్చోడి చేతిలో రాయిలా
189. పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా
190. పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం
191. పిండి కొద్దీ రొట్టె
192. పిట్ట కొంచెము కూత ఘనము
193. పోరు నష్టము పొందు లాభము
194. పోరాని చోట్లకు పోతే , రారాని మాటలు రాకపోవు
195. పొర్లించి పొర్లించి కొట్టినా మీసాలకు మన్ను కాలేదన్నదడట
196. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు
197. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు
198. రాజు గారి దివాణంలో చాకలోడి పెత్తనము
199. రామాయణంలో పిడకల వేట
200. రామాయణం అంతా విని రాముడికి సీత యేమౌతుంది అని అడిగినట్టు
201. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలనట్లు
202. రెడ్డి వచ్చే మొదలెట్టు అన్నట్టు
203. రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు
204. రౌతు కొద్దీ గుర్రము
205. ఋణ శేషం శత్రు శేషం ఉంచరాదు
206. చంకలో పిల్లవాడిని ఉంచుకుని ఊరంతా వెతికినట్టు
207. సంతొషమే సగం బలం
208. సిగ్గు విడిస్తే శ్రీరంగమే
209. శివుని ఆజ్ఞ లేక చీమైనా కుట్టదు
210. శుభం పలకరా వెంకన్నా అంటే పెళ్ళి కూతురు ముండ ఎక్కడ అన్నాడంట!
స్వస్తి.
జైహింద్.

2, జూన్ 2018, శనివారం

తైత్తిరీయోపనిషత్తు .. .. .. సూక్ష్మ వివరణము.

0 comments

జైశ్రీరామ్.
తైత్తిరీయోపనిషత్తు
తైత్తిరీయోపనిషత్తు లో 4 భాగాలున్నాయి. అవి
1.శీక్షావల్లి, / 2.ఆనందవల్లి, / 3.భ్రుగువల్లి, / 4.మహానారయణోపనిషత్తు.

1.శిక్షావల్లిలో వేదాభ్యాసంలో ముఖ్యమైన ఆరు అంశాలు వివరించబడ్డాయి. విద్యార్థిగా అధ్యయనం, గృహస్థుగా అధ్యాపనం, అతిథి సత్కారం, నిత్యకర్మానుష్టానం, దేవపిత్రుకార్యాలు ధర్మాలని ప్రవచించింది . విద్యార్థులు అధ్యయనం పూర్తి చేసుకుని గురుకులం వదలి గృహస్థాశ్రమం స్వీకరించబోయే సమయంలో వీడ్కోలుగా గురువిచ్చిన స్నాతకోపన్యాసం, జగత్ ప్రసిద్ధం, ఉత్తేజకరం, మన సనాతన ధర్మ సారం.

2. ఆనందవల్లి బ్రహ్మవిదాప్నోతి పరంబ్రహ్మజ్ఞాని బ్రహ్మమే అవుతాడనే ప్రసిద్ధమైన వాక్యంతో ప్రారంభంఅవుతుంది . బ్రహ్మము నుండి ఆకాశం, దాని నుండి వాయువు, దాని నుండి అగ్ని, దాని నుండి నీరు, దాని నుండి పృథివి, దానినుండి ఓషధులు (అన్నం), దానినుండి పురుషుడు ఉద్భవించారని సృష్టిక్రమాన్ని వివరించింది. మానవునిలో అన్నమయకోశం, ప్రాణమయకోశం, మనోమయకోశం, విజ్ఞానమయకోశం, ఆనందమయకోశాలనే కోశాలు ఒకదానికంటే ఒకటి సూక్ష్మమైనవి ఉంటాయని, అందులో ఆనందమయకోశంలో ఆనందస్వరూపంగా పరమాత్మ ఉంటాడని వివరించింది. పరమాత్మ వాన్జ్మానసులకు అవగతమయ్యే వాడు కాడని, సర్వోత్తముడని చెప్పి ఆనందంలో తరతమ భేదాలను విశదపరచింది.

3. భ్రుగువల్లిలో, భ్రుగువు తన తండ్రి వరుణున్ని తనకు బ్రహ్మమునుపదేశించమని అర్థించగా, తండ్రి అన్నం, ప్రాణం, చక్షువు, శ్రోత్రం, మనస్సు, వాక్కు దేనినుండి ఉద్భవిస్తున్నాయో, దేనివల్ల వర్ధిల్లి, దేనిలో లయం అవుతున్నాయో అదే బ్రహ్మము, దాన్ని తపస్సు ద్వారా మాత్రమే తెలుసుకోగలవుఅని ఉపదేశించాడు. భ్రుగువు అలాగే తపస్సు చేసి ఆనందమే బ్రహ్మమని చిట్టా చివరకు తెలుసుకున్నాడు. ఈ వల్లిలో, అన్నప్రశంస, అతిథి సత్కారం, సృష్టి మూలం, బ్రహ్మోపాసన మొదలైన విషయాలు చక్కగా వివరించ బడ్డాయి.

4. నారాయణోపనిషత్తు.ఈ ఉపనిషత్తు పరిమాణంలో చాలా పెద్దది అవడం చేతనూ, పరమాత్మను నారాయణ స్వరూపంగా వర్ణించే ఉపనిషత్తు కావడం చేతనూ, దీనిని మహానారాయణోపనిషత్తని పిలుస్తారు.
ప్రతి పూజలోను మనం పఠించే మంత్రపుష్పం మంత్రాలు, యతీశ్వరుల సన్నిధిలో పఠించే మంత్రాలు, సంధ్యావందనంలో వచ్చే మంత్రాలు, విరజా హోమ మంత్రాలు, దుర్గాసూక్త మంత్రాలు మొదలైన అనేక ప్రసిద్ధమైన మంత్రాలన్నీ ఈ ఉపనిషత్తులోనివే.

వేద వేదాంగములను అధ్యయనం చేసి, వేదోక్తమైన కర్మలన్నింటినీ సంగ రహితంగా అనుష్టించి, ఆధ్యాత్మమార్గంలో సంపూర్ణంగా లీనమై, పరమాత్మ తత్వంతో తాదాత్మ్యం చెంది, తన దేహంలోని ప్రతి అణువణువునూ వేదవేద్యుడు, యజ్ఞస్వరూపుడూ అయిన నారాయణునికి సర్వ సమర్పణ చేస్తూ, ఆత్మసాక్షాత్కారాన్ని అనుభూతిపరంగా పొందే ఆదర్శవంతమైన ఒక మహాయోగి జీవన విధాన వర్ణన ఒక మహాద్భుత ఘట్టం.

ఆధ్యాత్మ మార్గంలో ఆసక్తి ఉన్న ప్రతివారూ తప్పక పఠించ వలసిన భాగం ఇది. ఈ సన్నివేశంతో ఈ ఉపనిషత్తు ముగుస్తుంది. కృష్ణయజుర్వేదానికి చెందిన తైత్తిరీయ శాఖలో ఈ ఉపనిషత్తు ఆఖరి పన్నం అవడం చేత ఈ వేదశాఖ కూడా దీనితో పూర్తయినట్లే అవుతుంది.
*వేద మంత్రాల ఉచ్చారణ లోని అంతర్భాగాలు ఏమిటి?
ఓం శీక్షాం వ్యాఖ్యాస్యామః | వర్ణః స్వరః | మాత్రా బలం | సామ సంతానః | ఇత్యుక్తః శీక్షాధ్యాయః | (1.2)
శీక్షాఅంటే స్వరశాస్త్రం (science of phonetics). వేద మంత్రాల అర్థం, ఫలితం కూడా స్వరం మీద ఆధారపడి ఉంటుంది అందుచేత ఈ ఉపనిషత్తులోని మొదటి అధ్యాయంలో వేదోచ్చారణ పద్ధతి వివరించబడింది.
ఈ ఉచ్చారణలో భాగాలు
(1) అకారాది వర్ణములు;
(2) ఉదాత్త, అనుదాత్త, స్వరితాలనే స్వర భేదాలు;
(3) హ్రస్వ, దీర్ఘ, ప్లుతము (నిబ్బర గమనం – steady pace) అనే మాత్రలు;
(4) ఉచ్చరించునప్పుడు చేయవలసిన ప్రయత్న విశేషం దీన్ని బలం అంటారు;
(5) అతి వేగంగాను, మందంగాను కాక మధ్యస్థ వృత్తిగా పలకడం దీన్ని సామం అంటారు;
(6) అక్షరాలను అలసత్వం లేకుండా పలకడం దీన్ని సంతానం అంటారు. ఈ విధంగా మంత్రోచ్చారణ చెయ్యాలని వేదం శాసిస్తోంది.
* గురు శిష్య సంబంధాన్ని ఈ ఉపనిషత్తు ఎలా వర్ణించింది?
ఆచార్యః పూర్వరూపం | అంతేవాస్యుత్తర రూపం | విద్యా సంధిః | ప్రవచనగ్ం సంధానం (1.3)
విద్యా విధానంలో ఆచార్యుడు మొదటి స్థానం; శిష్యుడు రెండవ స్థానం; వీరి కలయిక విద్య; కలిపేది బోధన.
* మహా సంహితలు ఏమేమిటి?
ఈ క్రింది ఐదింటిని మహా సంహితలంటారు.

అధిలోకము; అధిజ్యౌతిషము; అధివిద్యము; అధిప్రజము; అధ్యాత్మము.

జైహింద్..

1, జూన్ 2018, శుక్రవారం

కవిసింహ కాఫీ దండకము. .. .. .. పోకూరి కాశీపతి

3 comments

జైశ్రీరామ్.

కాఫీ దండకం

ఆర్యులారా!
కవిసింహ పోకూరి కాశీపతిగారిని మద్రాసులో జరిగిన అవధాన సభలో
కాఫీని గురించిన దండకంచెప్పమని
కోరినపుడు ఆశువుగా చెప్పినది.

శ్రీమన్మహాదేవి! లోకేశ్వరీ! కాళికాసన్నిభా హారిణీ!
లోకసంచారిణీ!అంబ!కాఫీ!జగన్మోహినీ! తొల్లి శ్రీకృష్ణు డా
స్వర్గమున్ జేరి పూతంబునౌ పారిజాతంబునున్ దెచ్చియున్
నాతికిన్ బ్రీతిగానిచ్చు కాలంబునందా సుమంబందునంగల్గు
బీజంబు లుర్వీస్థలిన్ రాలియున్ లోకభేదంబుచే కాఫి భూజంబుగా బుట్టియున్
గొమ్మలన్ రెమ్మలన్ బూవులన్
దావులన్ జక్కనౌ పిందెలన్ జక్కనౌ కాయలన్ జొక్కమౌ
పండ్ల‌ భాసిల్ల దద్బీజ జాలంబు నైర్లండు నింగ్లాండు హాలెండు
పోలెండు రష్యా జపాన్ జర్మనీ గ్రీకు దేశంబులన్ నాటి పెన్
మ్రాకులై ఇండియాన్ దోటలై విత్తనాలిచ్చుచున్నావటంచున్
మదిన్  దోచెడిన్ బాపురే! తీపిలో నీరమున్ క్షీరమున్ జక్కెరన్ మించుటన్
గాదె  నీ బీజ చూర్ణంబు నా మూటిలో
జేర్చి సేవించుటన్ నీదు బీజంబులన్ బెంచులో మాడ్చి
చూర్ణంబు గావించినన్ దీపి పోదాయె నీ మాధురీశక్తి నీ యింపు నీ సొంపు నీ
పెంపు వర్ణింప నేనెంత వాడన్
ధనాకర్షణీ! ప్రాణసంరక్షణీ! ధాత్రినెవ్వారలేన్ వేకువన్ లేచియున్
నిత్యకృత్యంబులన్ దీర్చి మున్ ముందుగా
నిన్ను సేవింప కేకార్యమున్ సేయగా లేరదెట్లందువా నిన్ను
బానంబు గావింపకున్నన్ ద్విజుల్ వేదమంత్రంబులన్
బల్కగాలేరు ప్రాంచత్కవుల్ పద్యముల్ హృద్యమౌరీతి నిర్మింపగా లేరు
శ్రావ్యంబుగా శౌరిదాసుల్ గళంబెత్తియున్
బాడి నృత్యంబులన్ సేయగాలేరు శిల్పుల్ మనస్ఫూర్తిగా
సుత్తె జేపట్టగాలేరు డ్రైవర్లు మోటార్ల స్టీరింగులన్ బట్టగాలేరు
*టీచర్లు పాఠంబులన్ జెప్పగాలేరు* డాక్టర్లు నింజక్షనున్
జేయగాలేరు ప్లీడర్లు నోరెత్తి వాదింపగాలేరు జడ్జీలు నే స్వల్పమౌ
తీర్పులన్ వ్రాయగాలేరు దిట్టంబుగా బాలసుల్
కూటసాక్ష్యంబులన్ జెప్పగాలేరు ముప్పూటలన్ నిన్నొగిన్
గ్రోలకున్నన్ శిరోభారమై నాల్క యెండున్ మనంబెంతొ
చాంచల్యమున్ బొందుచున్ గుండియల్ తల్లడం బందుచున్  మేను కంపించుగాదే!
కటాక్షంబుతోనిత్యమున్
వేకువన్ దర్శనంబిచ్చి  నిన్ బాగుగాద్రాగు సౌభాగ్యమున్గూర్చి
రక్షింపవే!సారెకున్ గొల్చెదన్నిన్ను *పోకూరికాశీపతి*స్వాంత రాజీవ
సంవాసినీ నీకికన్ మంగళంబౌ మహాకాఫిదేవీ!నమస్తే నమస్తే నమస్తే నమః.

జైహింద్.