జైశ్రీరామ్.
ఇప్పుడే రవీంద్రభారతిలో ☝🏽ప్రభుత్వం తరపున జరిగిన అవధానంలో
తెలంగాణా ప్రభుత్వ భాషా సాంసృతిక శాఖ వారి ఆధ్వర్యవంలో రవీంద్రభారతి ఆవరణలో పాల్కురికి సోమనాధ మూల వేదికగా 4_5_26 వ తేదీ సోమవారం రోజున జరిగిన శ్రీ చేపూరి శ్రీరాం గారి అష్టావధానంలో పూరణ చేసిన పద్యములు
సంచాలకులు గాశ్రీ సంగనభట్ల నరసయ్యగారు వ్యవహరించారు.
నిషిద్ధాక్షరి శ్రీ చింతా రామకృష్ణా రావుగారు
శ్రీ పద్మావతి దీవనల్ వడసి వాసిన్గాంచుచున్ సత్ సభన్
దీపింపందగు సద్వధానిగ మహద్దేదీప్యమానంబుగా
మీపై శారద సత్కృపామృతముసంప్రీతిన్ దయన్ గొల్పుతన్,
చేపూరిప్రభ వెల్గుగాత ధరపై శ్రీరామ్ వధానంబునన్.
అంశం-- జానపద కళలు మనసంస్కృతి.
శ్రీ(-)క(ళ)ర(మ) కం(ళ)జ(-)జ(డ)స(ద)తి(త)కిన్
(ల)ప్రాకా(ర)మ్యం(మ)బ(న)గు(-)క(ళ)వి(-)త్త్వ(-)రా(జ)శుల్ (ప)సు(గ)క(వ)ళల్..
కందము
శ్రీకర కంజజ సతికిన్
ప్రాకామ్యంబగు కవిత్త్వ రాశుల్ సుకళల్
ప్రాకటమై జానపదము
సాకృతియై నిల్చు గాక సంస్కృతి నిల్పన్!!
సమస్య శ్రీకటకం వేంకట రామ శర్మ గారు
సత్సాంగత్యము కూడు బెట్ట దకటా సర్వమ్ము లుప్తంబగున్
వత్సా! చూడుమ యొక్కసారి కటువౌ ధ్వాంతమ్ము వెన్నాడగా
సత్సాంగత్యమనన్ దలంచెడు లసత్ సంఘైక్య మార్గమ్మునే
ప్రోత్సాహమ్ముగ నెంచబోకు కనుమా భోగమ్ము లూహించు తత్
సత్సాంగత్యము కూడు బెట్ట దకటా సర్వమ్ము లుప్తంబగున్
(ఆఖరి పాదమే సమస్య )
దత్తపది శ్రీ అష్టకాల విద్యాచరణ్ గారు
అంశం ప్రాచీన,, ఆధునిక విద్యావిధానాలకి అన్వయిస్తూ స్వేచ్ఛా ఛందంలో...
మడి-- గుడి --బడి-- సడి పదములతో పద్యం చెప్పాలి
తే. గీ!
చాటె రా బడి సూత్రమై నేటి చదువు
చూసి సా గుడి సంస్కృతి చోదనమున
ధర్మ మీ సడిం చెడి వారుధరను గలరు
విద్య సేద్యపు మడి కట్టి వెలుగు నింపు!!
న్యస్తాక్షరి శ్రీమతి భానుమతి హట్టి గారు
అంశం- మకరినించి విముక్తికై గజేంద్రుడు విష్ణువును పిలవటం
రా-డా--నే--డే అక్షరాలను *1_2_3_8 స్థానాలలో వుంచుతూ శార్దూలంలో
రా డా చూడడ విష్ణుమూర్తి విలసత్ బ్రాజిష్ణుడై జిష్ణుడై
రా డా కావగ నక్ర బంధమును నా ప్రారబ్ధముల్ దీర్చగా
రాడా నే డిటు రక్షణన్ సలుపగా రమ్యాకృతిన్ దాల్చియున్
రాడే వేడ్కగ చూడ డే జలమునన్ ప్రాణంబులన్ కావడే!!
వర్ణన శ్రీమతి ఆరవల్లి శ్రీదేవి గారు
అంశం-నృసింహవర్ణన శార్దూలంలో
అక్షోభ్య ప్రతిమాన శౌర్య ధృతి వహ్ణ్యక్షుండె భీతిల్లగాన్
దీక్షాదక్షత భక్తపాలన కళా దీప్తత్వ సంభూతిలో
శిక్షించెన్ నరసింహ రూపమున కశ్చిన్ మూర్ఖ దైత్యాధిపున్
రక్షించెన్ ప్రియబాలకోత్తముని ప్రహ్లాదాఖ్య భక్తాగ్రణిన్!!
చిత్రానికి పద్యం శ్రీ గెంటేల జగదీష్ చంద్ర కుమార్ గారు
శార్దులంలో
శ్రీకామేశ్వరిలోకమాతతనురోచీవర్ణ సౌందర్య,శ్రీ
రాకాచంద్ర వికాస హాస వదనా రాజీవ నేత్రద్వయీ
శ్రీకారంబొనరించిమా
దురితముల్,చెండాడికాపాడ,రా
వాకారుణ్య గుణా వినోద లలితా వాగీశ్వరీ అంబికా!!
ఆశువు శ్రీకౌండిన్య తిలక్ గారు
1 అంశం ఓటు యొక్క ప్రాముఖ్యం
ప్రజా స్వామ్యమ్ము నిలిపెడి భాషయగుచు
ఎన్ని కలలను నడిపించు ఎన్నికలవి
చేటు తెచ్చెడి నాయక శ్రేణులందు
ఓటది సుదర్శనమ్ముగ పోటు పొడుచు!!
2 అంశం--యుద్ధం వద్దు శాంతి ముద్దు
వద్దు పెద్దన్న యుద్ధమ్ము వద్దు వద్దు
హద్దుదాటుట నెవరికి ముద్దుకాదు
ప్రజల బాధలు పెరుగును వాస్తవముగ
శాంతి గోరుచు సాగుటె సౌఖ్య పథము!!
అప్రస్తుత ప్రసంగం శ్రీ అవుసుల భాను ప్రకాశ్ ఆరు నిర్వహించారు.
జైహింద్.
Print this post
వ్రాసినది



0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.