గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, మే 2026, గురువారం

అవధాన విద్యా వికాస పరిషత్ భాగ్యనగరం వారి 5వ శిక్షణా శిబిరం. నిర్వహణ శ్రీ మరుమాముల దత్తాత్రేయశర్మ. సమీక్షకురాలు ఏ. ఉమాదేవి. వరంగల్.

జైశ్రీరామ్.
అవివిప ఐదవ అవధానశిక్షణ సప్తాహం
అవధాన విద్యా వికాస పరిషత్ – భాగ్యనగరం ఐదవ అవధాన శిక్షణ,  పద్య శిక్షణ సప్తాహ శిబిరం, 'శతావధాన తిలక ' బ్రహ్మశ్రీ ఉప్పలధడియం భరత శర్మ గారి ఏకదిన సంపూర్ణ శతావధాన కార్యక్రమాల పై ఒక నివేదిక 

తెలుగువారికి మాత్రమే స్వంతమైన, ప్రత్యేకమైన విద్య అష్టావధాన, శతావధాన ప్రక్రియ.  ఈ అపురూపమైన మేధావికాసక్రీడ తరాలు గడుస్తున్న కొలదీ క్రమంగా కనుమరుగు అవుతుందనే శంక కలుగుతోంది. ఈ రంగం వైపు నేటి యువతను ఆకర్షించి నూతన అవధానులను గుర్తించి ప్రోత్సహించి, భావి అవధానులను తయారు చేయవలసిన ఆవశ్యకత పెరిగింది. ఈ నేపథ్యంలో గత మూడు దశాబ్దాలుగా అవధాన విద్యను అనేక విధాలుగా ప్రోత్సహిస్తూ విశేష కృషి చేస్తున్న శ్రీ మరుమాముల దత్తాత్రేయశర్మ గారు నూతన అవధానులకు ఒక శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేయాలని, భావి అవధానులను తీర్చి దిద్దాలనే బలమైన సత్సంకల్పంతో వ్యవస్థాపక అధ్యక్షులుగా ఏర్పాటు చేసినదే “అవధాన విద్యా వికాస పరిషత్” సంస్థ. ఈ సంస్థను తొలిసారిగా 2022, జూన్లో  ఏర్పాటు చేసారు. ఇప్పటికి నాలుగు శిబిరాలు జరిగాయి. గత శిబిరాలలో పదిమందికి పైగా అవధానులు, వందలాది మందిపద్యరచనా ప్రవీణులు సిద్ధమయ్యారు. ఈ శిక్షణ శిబిరాలు ప్రతి సంవత్సరం మే నెలలో జరుగుతాయి. వీటిలో పాల్గొనడానికి ఎటువంటి రుసుము లేకపోగా వారం రోజులు ఉచిత భోజన వసతి సదుపాయాలను కూడా నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ శిక్షణా శిబిరంలో పాల్గొనడానికి పద్యం పై మక్కువ, ఛందస్సుపై, అవధాన విద్యపై ప్రాథమిక అవగాహన, ఆశువుగా పద్యాలు స్వయంగా రచించి ఉండటం లాంటివి ప్రధాన అర్హతలుగా ఛాత్ర అవధానులు  కలిగిఉండాలనే నిబంధనతో రెండు తెలుగు రాష్ట్రాల లోని  సంవత్సరాల  యువకులను ఆహ్వానిస్తారు. ఈ ఆహ్వానాన్ని స్వీకరించి వచ్చినవారిలో బాలబాలికలే కాక 15నుండి - 65 సంవత్సరాల మధ్య వయసువారు యాభైమందికి పైగా ఉత్సాహంగా ఈ ఐదవశిబిరంలో పాల్గొనడానికి ముందుకురావడం ముదావహం. వీరిలో తెలుగు పండితులే కాక, ఇతర రంగాలలో ఉద్యోగం చేసి విశ్రాంతి జీవితం గడుపుతున్నవారు కూడా ఉండటం నిర్వాహకులకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఈ విధంగా భాగ్యనగరంలో నివసిస్తున్నవారు, తెలంగాణ లోని వివిధ ప్రాంతాలనుండి, ఆంధ్ర ప్రాంతం లోని అనంతపురం జిల్లా లోని సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ తెలుగు చేస్తున్న విద్యార్థులు 15 మంది , హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు పాఠశాల విద్యార్థు మొత్తం 25 మంది ఛాత్ర అవధానులు “అవధాన విద్యా వికాస పరిషత్” నిబంధనలకు లోబడి ఉంటామనే హామీ పత్రం సమర్పించి ఈ శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు. హైదరాబాదు నగరం “ ఈ శిబిరానికి దీన్ దయాల్ నగర్ నేరేడ్మెట్  లోని సెయింట్ మార్క్స్ గ్రామర్ హై స్కూల్ వేదిక గా ఎంచుకున్నారు. దాని నిర్వాహకులు మావుడూరి మల్లికార్జున్ గారు వారం రోజులపాటు శిక్షణ శిబిరాన్ని నడుపుకోవడానికి సకల సదుపాయాలు కలిగిన తమ భవనాన్ని ఉచితంగా ఇవ్వడమే కాక, ఈ వారం రోజులు ఛాత్రులకు , నిర్వాహకులకు, బోధకులకు, అతిథులకు అవసరమైన అన్ని సదుపాయాలను అందించి వారి విశాల హృదయాన్ని చాటుకున్నారు. వారికి అవధాన విద్యా వికాస పరిషత్ ఎంతైనా ఋణపడి ఉంది. అవధాన విద్య బోధించడానికి ప్రత్యేకమైన పాఠ్యాంశం (సిలబస్) రూపొందించి, ప్రణాళికాబద్ధమైన కాల నిర్ణయ పట్టికతో , విద్యార్థులకు అవధాన విద్యపై సక్రమ అవగాహన కలిగించడానికి తమ అనుభవాలనే పాఠ్యాంశంగా వివరించడానికి ఎందరో ప్రముఖులు ఈ సప్తాహానికి వచ్చారు. వారిలో శ్రీ దోర్భల ప్రభాకర శర్మ, (మహోపాధ్యాయ బిరుదాంకితులు, భారతదేశం గర్వించదగ్గ సంస్కృత, తెలుగు భాషా పండితులు), శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల శ్రీరామ చక్రవర్తి( విశ్రాం గురుకుల ఆచార్యులు ), శ్రీ గౌరీభట్ల మెట్రామ శర్మ (శతావధాని, శతావధాన పంచానన బిరుదాంకితులు), శ్రీ ఆముదాల మురళి (శతావధాని), శ్రీ కోట లక్ష్మీ నరసింహం ( సహస్రావధాని),  శ్రీ మావుడూరి సూర్యనారాయణ మూర్తి ( అష్టావధాని), డా. శ్రీమతి జంధ్యాల సుబ్బలక్ష్మి  (అచ్చ తెలుగు శతావధానిని), సంగనభట్ల నరసయ్య(భాషా వ్యాకరణ కోవిదులు), శ్రీ చిటితోటి విజయకుమార్(అష్టావధాని, సంస్కృతాంధ్ర భాషాపండితులు), గౌరీశంకరశర్మ(అష్టావధాని), నారాయణం బాలసుబ్రహ్మణ్యం (శతావధాని) ,శ్రీ అన్నమరాజు ప్రభాకరరావు (కవి),  శ్రీ చింతా రామకృష్ణారావు ( చిత్ర కవిత్వ బంధ కవిత్వంలో విశేష కృషి చేసినవారు ) శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ (అసమాన అచ్చతెనుగు అవధాన సార్వభౌములు) విచ్చేసారు. మరెందరో కవిపండితులు పాల్గొన్నారు . 
18.05.2026 (సోమవారం) నాడు ఉదయం పది గంటలకు శిక్షణ శిబిరం ప్రారంభమయ్యింది. ప్రారంభ సమావేశానికి  బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ శ్రీ బసవరాజు శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగావచ్చారు. మహా సహస్రావధాని, ప్రవచనకర్త పద్మశ్రీ డా. గరికపాటి నరసింహారావు గారు విశిష్ట అతిథిగా విచ్చేసి లాంఛనంగా శిబిరాన్ని ప్రారంభించారు. 
ఛాత్ర అవధానులను ఉద్దేశించి స్ఫూర్తిదాయకమైన అద్భుత ప్రసంగాన్నిచేసి విద్యార్థులను ఆశీర్వదించారు. గొప్ప బాధ్యతను చేపట్టిన అవధాన విద్యా వికాస పరిషత్ కార్యవర్గాన్ని అభినందించారు అవధానం నిర్వహించుటకు సెయింట్ మార్క్స్ గ్రామర్ హైస్కూలును వేదికగా కూర్చిన యాజమాన్యం మావుడూరి మల్లికార్జున్ గారి దంపతులను సన్మానించారు. సహకరిస్తున్న ఉపాధ్యాయులను ప్రశంసించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో వేదికపై సహస్రావధాని శ్రీ కోటలక్ష్మీనరసింహం, మహామహోపాధ్యాయ  డా.దోర్భల ప్రభాకర శర్మ, శతావధాని శ్రీ జీ. ఎం. రామశర్మ, అచ్చతెనుగు శతావధాని శ్రీ డా.పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, శతావధాని శ్రీ ఆముదాల మురళి, ద్విశతావధాని శ్రీమతి డా.బులుసు అపర్ణ తదితర గొప్ప అవధానులు, పండితులతో సభ కళకళలాడింది. అనంతరం ప్రాచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి సంచాలకత్వంలో 'అవధాన కళాకౌముది ' శ్రీమన్ నల్లాన్ చక్రవర్తుల సాహిత్ (అవధాన విద్యావికాస పరిషత్ తొలి అవధాని) స్వర్ణ (అర్ధ)శతావధానం దైవ ప్రార్థనతో ప్రారంభమైంది. అందులో ముందుగా 13సమస్యలు, తర్వాత 13దత్త పదులు పూర్తిచేసారు స్వల్ప భోజన విరామం అనంతరం 12వర్ణనలు కొన్ని 10ఆశువులు అద్భుతముగా పూర్తి చేసారు.

రెండవ రోజు 19/05/2026 ఉదయం 6 :00 గంటలకు దోర్భల ప్రభాకరశర్మ గారి సంస్కృత పాఠం అనంతరం సాహిత్ గారి  స్వర్ణ శతావధానం తిరిగి ప్రారంభమైంది. అందులో భాగంగా మిగిలిన 3 ఆశువులను పూర్తిచేసి అన్ని పూరణలు చేసి, నిర్విరామముగా ధారణ పరిసమాప్తం చేసి ప్రముఖుల ప్రశంసలనందుకున్నారు .
భోజనాల అనంతరం అవధాన శిక్షణ ప్రధానాచార్యులు శ్రీ ఆముదాల మురళిగారు అష్టావధానంలోని ప్రాధమిక అంశాలన్నిటి గురించి వివరణాత్మక పాఠం చెప్పారు. 
అనంతరం వరంగల్ వాసి తిరుక్కోవళ్ళూర్ శ్రీహర్ష గారు అష్టావధానం చేసి చక్కని ధార, ధారణలతో పలువురి ప్రశంసలనందుకున్నారు.

మూడవరోజు 20/05/2026 రోజున ఉదయం నుండి ప్రతిరోజు పద్యరచనలో మెళకువలు నేర్చుకునేవారికి ప్రత్యేక శిక్షణ ఒక విభాగంగా, అవధాన ఛాత్రులకు అవధాన శిక్షణ మరొకవిభాగంగా తరగతులు జరిగాయి. శ్రీ నారాయణం బాలసుబ్రహ్మణ్యం గారు పద్యరచనా విభాగ ప్రధానాచార్యులుగా వ్యవహరించగా పూర్వ శిబిరాల ఛాత్రావధానులు బోరెల్లి హర్ష గారు, గట్టెడి విశ్వంత్ గారు, ఎర్రంశెట్టి ఉమామహేశ్వర్ రావుగారు పద్య రచనలో శిక్షణాచార్యులుగా  అనేక అంశములను  ప్రతిరోజు తెలియజేశారు.

అవధాన శిక్షకులకు ముందుగా మొదటిరోజు దోర్బల ప్రభాకరశర్మగారు సంస్కృతంలో పురాణ పఠన తరగతి నిర్విహించిన అనంతరం 'భాష వ్యాకరణాంశాల' గురించి ప్రముఖ భాషావేత్త శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల శ్రీరామ చక్రవర్తి గారు తెలుగు సంధుల గురించి  పద్య ప్రయోగాలగురించి అనేక అంశాలను తెలియజేశారు. మధ్యాహ్నం ఆముదాల మురళి గారు అవధానంలోని సమస్యాంశాల పైగురించి పాఠంచెప్పారు. అనంతరం డా.మండపాక మహేశ్వరి గారు ( విఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త)  అష్టావధానం చేశారు. తమ ప్రతిభాయుత అవధానంతో  పలువురి ప్రశంసలనందుకున్నారు.

నాలుగవ రోజు (గురువారం) 21 .5 .2026 ఉదయం 6 గంటలకు దోర్బల ప్రభాకరశర్మ గారు సంస్కృతపాఠం చెప్పారు . శ్రీమాన్ చక్రవర్తి గారు భాష వ్యాకరణం లో సంధులు సమాసముల గురించి తెలియజేసారు. తర్వాత చిటితోటి విజయకుమార్ గారు అవధానంలో వార గణనం గురించి చక్కని పాఠం చెప్పారు. అనంతరం శ్రీ నారాయణం బాలసుబ్రమణ్యం గారు యాంత్రిక గణితం గురించి తెలియజేసారు .
ఆ తర్వాత శ్రీ చిటితోటి విజయకుమార్ గారు విశేష యతుల గురించి అనేక ఉదాహరణలతో పాఠ్యాంశాన్ని నిర్వహించారు. అదేరోజు భోజనాల అనంతరం శ్రీ ఆముదాల మురళి గారు అవధానంలోని నిషిద్ధాక్షరి అంశంలో అనేక మెళకువలు తెలియజేశారు. అనంతరం శ్రీ నల్లాన్ చక్రవర్తుల సాహిత్ గారు అవధానులకు ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానం గురించి చక్కగా  తెలియజేశారు . ఆ తరువాత అచ్చ తెలుగులో శతావధానం చేసినటువంటి డా.జంధ్యాల సుబ్బలక్ష్మి గారు అవధానంలో అచ్చ తెలుగు పద ప్రయోగం గురించి అనేక అంశాలు వివరించారు.
అనంతరం శ్రీ గట్టెడి విశ్వంత్ గారు (పూర్వఛాత్రావధాని)అష్టావధానం అద్భుతంగా పూర్తి చేసి అందరి మెప్పులను పొందాడు.

5వ రోజు (శుక్రవారం) 22 .5 .2026 ఉదయం దోర్భల ప్రభాకర శర్మ గారి సంస్కృతాధ్యయనం పురాణ పఠనం అనంతరం  శ్రీ మావుడూరి సూర్యనారాయణ మూర్తి గారు అప్రస్తుత ప్రసంగం గురించి అనేక ఉపయుక్త విషయాలు తెలియజేశారు. అనంతరం శ్రీ ఆముదాల మురళి గారు భావి అవధానులకు ఉపయుక్తమైనటువంటి అనేక నిఘంటువుల వినియోగంపై విలువైన సూచనలతో పాఠం చెప్పారు. తర్వాత అవధానంలో పురాణ పఠనం గురించి శ్రీ అన్నమరాజు ప్రభాకర రావు అనేక  కావ్యేతిహసాల పద్యాలను ఉదాహరణలతో వివరించారు.  భోజనానంతరం దేశి ఛందస్సు గురించి డా.సంగన భట్ల నరసయ్య గారు ప్రసంగిస్తూ మార్గ దేశి పద్ధతుల గురించి పాఠంచెప్పారు. ఎన్నో ఉదాహరణలు తెలియజేశారు .అనంతరం  చిత్రకవి సమ్రాట్ శ్రీ 
చింతా రామకృష్ణారావుగారు అవధానంలో 'గర్భ కవిత్వం బంధకవిత్వం' గురించి తెలియజేస్తూ ఉదాహరణలతో వివరించారు. సాయంకాలం వేళ బృహద్ద్విసహస్రావధాని డా.మాడుగుల నాగఫణి శర్మ గారు తమ అమూల్య ప్రవచనామృతమునందించి అవధాన విద్యావికాస పరిషత్ వారిని వారి సేవలను కొనియాడారు .
అనంతరం ఈ ఐదవ శిబిరం నుండిఆవిర్భవించిన శ్రీ భైరవనేని పోతురాజు చౌదరి గారు అష్టావధానం చక్కగా చేశారు .

ఆరవ రోజు (శనివారం) 23 .5 .2026 డా.దోర్బల ప్రభాకర శర్మ గారి సంస్కృత పురాణ పాఠం అనంతరం శ్రీ ఆముదాల మురళి గారు అవధానంలో వర్ణన ,ఆశువు అంశాల గురించి అనేక అంశాలు పాఠంగా తెలియజేశారు. అవధానములో గుర్తుంచుకోవలసినటువంటి ఎన్నో విషయాలను తెలియజేశారు. ముఖ్యమైన పదాల గురించి వివరించారు. అనంతరం శ్రీ చిటితోటి విజయ్ కుమార్ గారు అవధానంలో వ్యస్తాక్షరి, న్యస్తాక్షరి గురించి చాలా విషయాలను ఉదాహరణ పూర్వకంగా వివరించారు. అనంతరం ఈ సంస్థకు అవధాన విద్యా వికాస పరిషత్ అను నామకరణం చేసినటువంటి శతావధాన పంచానన డా. జీ ఎం రామశర్మ శతావధానిగారు అవధానంలోని ధార ధారణ గురించి అనేక విశేషాలు తెలియజేశారు. సాయంత్రం పద్యకోకిల డా. బోచ్కర్ ఓం ప్రకాశ్ గారు తిరుపతి వేంకట కవుల పద్య వైభవం గురించి సాధికారంగా ప్రసంగం చేశారు.  అనంతరంఅవివిప పూర్వ ఛాత్రావధాని చి. వింజమూరి సంకీర్త్య శర్మ అష్టావధానాన్ని చక్కగా పూర్తి చేశారు.

ఏడవ రోజు (ఆదివారం) 24/ 5/2026 ఉదయం డా.దోర్బల ప్రభాకర శర్మ పురాణ పఠన తరగతి ముగిసిన తరువాత శ్రీ ఆముదాల మురళి గారు అవధానంలో దత్తపదుల గురించి సోదాహరణ పాఠం అందించారు ,అనంతరం అవధానంలోనూ ,తెలుగు భాషా ఔన్నత్యాన్ని చాటడంలో విశేష కృషి చేస్తున్న ప్రముఖులను అవధాన విద్యా వికాస పరిషత్ గౌరవపురస్కారాలతో గౌరవించింది. వారిలో తెలుగు భాషా వికాసోద్యమ సారథి శ్రీ జగర్లపూడి సీతారామకృష్ణ శర్మ ( కర్నూల్)  వారికి, సమస్య పృచ్ఛక చక్రవర్తి శ్రీ కంది శంకరయ్య ( వరంగల్ )వారికి ,చంద్రశాస్త్ర రత్నాకర, శ్రీ తోపెల్ల బాలసుబ్రమణ్యం ( పగోజిల్లా) వారికి దేశి ఛందస్సులో విశేష కృషిచేస్తున్న సంగనభట్ల నరసయ్య గారికి అవధాన విద్యా వికాస పరిషత్ గౌరవ పురస్కారాలు అందజేశారు. డా.సంగనభట్ల గారిని 'దేశి చ్ఛందోంబుధి' అన్న బిరుదంతో గౌరవించారు. 
25/05/2026 (సోమవారం) రోజున త్రిభాషా మహా సహస్రావధాని వద్ధిపర్తి పద్మాకర్ గారి సమక్షంలో ఉప్పధడియం భరత్ శర్మ గారి ఏకదిన శతావధానం మరియు విద్యా వికాస పరిషత్ 5వ శిక్షణ శిబిరం సమాపనోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి.

ఉదయం 7:00 గంటలకు ఏకదిన శతావధాన కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ పద్య అంత్యాక్షరితో శోభా యాత్ర గావించారు. అనంతరం ప్రముఖులు జ్యోతి ప్రజ్వలన గావించిన తరువాత. వికాస పరిషత్ పూర్వ ఛాత్రావధాని యైన శ్రీ ఉప్పలధడియం భరత్ శర్మ గారు దైవ ప్రార్థనతో ఏక దిన శతావధానమును ప్రారంభించారు. ముందుగా సమస్యలు, తరువాత దత్తపదులు ఆతర్వాత వర్ణన ఆశువు అంశాలని దీర్ఘ సమాసాలతో అద్భుతంగా పూర్తిచేసారు .అనంతరం స్వల్ప విరామము తరువాత నిరాటంకముగా ధారణ పూర్తిచేసి పలువురి ప్రశంసలనందుకున్నారు.అందరినీ అబ్బురపరిచారు. ఈ విధంగా శిక్షణ కార్యక్రమం ముగిసింది మరుమాముల దత్తాత్రేయ శర్మ గారూ ,మరుమాముల వెంకట రమణ శర్మ గారూ ఇంకా అనేక ప్రముఖుల నిర్విరామ కృషితో అవధాన సప్తాహం విజయవంతమైనది. ఈ కార్యక్రమం ఎందరో విద్యార్థులకు పద్య రచనలో మరియు అవధానంలో మెళకువలు నేర్పడమే కాకుండా ప్రతి రోజు రాత్రి సాధనావధానం శ్రీ ఆముదాల మరళి గారి సమక్షంలో జరిగింది.  ప్రతి రోజు జరిగిన కార్యక్రమాలను, పాఠాలను మరుమాముల వెంకటరమణ శర్మగారి దర్శనమ్ యూట్యూబ్  ఛానెల్ లో ప్రత్యక్ష ప్రసారం చేయడం విశేషం.
మండువేసవిలో పన్నీటి జల్లులాగా హృద్యపద్యాలలతో మల్లినాథ అవధాన ప్రాంగణంలో ఎనిమిది రోజుల ఆనంద వృష్టి కురిసింది. ఇది తరతరాల మనవారసత్వవిద్యను భావితరాలకు అందించే గొప్ప ప్రయత్నంగా చరిత్రలో నిలిచి పోతుంది.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.