గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, జూన్ 2022, శనివారం

బలం బలవతాం చాహం ..|| 7-11 || . యే చైవ సాత్త్వికా భావా.. || 7-12 ||..//.. శ్రీమద్భగవద్గీతే సప్తమోధ్యాయః - జ్ఞానవిజ్ఞానయోగః

 జైశ్రీరామ్

 || 7-11 ||

శ్లో.  బలం బలవతాం చాహం కామరాగవివర్జితమ్|

ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ.

తే.గీ.  కామరాగముల్ లేకుండ కలిగి యున్న

బలము నేనును బలునందు భరతకులజ!

ధర్మబద్ధమౌ కామము తలప నేనె

జీవులందున, గనుమిది, భావమరసి.

భావము.

ఓ భరతశ్రేష్టుడా! బలవంతులలోని కామరాగాలు లేని బలాన్ని 

నేను. జీవులలో ధర్మ విరుద్ధం కాని కామాన్ని నేను.

|| 7-12 ||

శ్లో.  యే చైవ సాత్త్వికా భావా రాజసాస్తామసాశ్చ యే|

మత్త ఏవేతి తాన్విద్ధి న త్వహం తేషు తే మయి.

తే.గీ.  నా వలన వచ్చుచుండెడి భావములవి,

తామసిక, రాజసికములు, తలప సాత్వి

కములు, నా లోన నుండెడున్ ఘనతరముగ,

నేను వాటిలో లేనని నీవెరుగుము.

భావము.

ఇంకా ఏవి తామసిక, రాజసిక, సాత్విక భావాలో అవన్నీ నా వలన 

వస్తాయని గ్రహించు. అయితే నేను వాటిలో లేను. అవినాలో ఉన్నాయి.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.