గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, జూన్ 2022, శుక్రవారం

అవ్యక్తోऽక్షర ఇత్యుక్తస్తమాహుః ..|| 8-21 || . పురుషః స పరః పార్థ .. || 8-22 ||..//.. శ్రీమద్భగవద్గీతే అష్టమోధ్యాయః - అక్షరబ్రహ్మయోగః.

 జైశ్రీరామ్.

 || 8-21 ||

శ్లో.  అవ్యక్తోऽక్షర ఇత్యుక్తస్తమాహుః పరమాం గతిమ్|

యం ప్రాప్య న నివర్తన్తే తద్ధామ పరమం మమ.

తే.గీ. ఇంద్రియాగోచరంబునై యెసగుచుండు

యరయ నవినాశమగు పరమాత్మ పథము 

జేరుటుత్తమ మది ముక్తి జీవులకిడు,

నేనె యామార్గమర్జునా! ధీనిధాన!

భావము.

ఇంద్రియాలకు గోచరం కానిదీ, నాశనం లేనిదీ, అని చెప్ప బడిన 

ఆ పరమాత్మ భావమే చేరవలసిన ఉత్తమ మార్గమని ఋషులు 

చెబుతారు. దేనిని పొందితే ప్రాణులు జన్మించరో అదే ఆ సర్వోత్తమ

 స్థానము, ఆ సర్వోత్తమ స్థానమే నేను.

 || 8-22 ||

శ్లో.  పురుషః స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా|

యస్యాన్తఃస్థాని భూతాని యేన సర్వమిదం తతమ్.

తే.గీ.  అన్ని ప్రాణులునెవ్వనియందు కలవొ,

యంతటన్ గలడెవ్వడో యట్టి దైవ

మనుపములగుభక్తులకరయగను లభ్య

మగును, గ్రహియింపుమర్జునా! యభరవినుత!

భావము.

అర్జునా ఎవనిలో అన్ని ప్రాణులు ఉన్నాయో, ఎవరు అంతటా 

వ్యాపించి ఉన్నారో ఆ పరమ పురుషుడు అనన్య భక్తి వలననే 

లభిస్తాడు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.