గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, జులై 2020, మంగళవారం

దృక్పథం మారాలి ... శ్రీ ఎన్సీహెచ్ చక్రవర్తి.

జైశ్రీరామ్.
దృక్పథం మారాలి   ...   శ్రీ ఎన్సీహెచ్ చక్రవర్తి.         
మిత్రులకు నమస్సులు.
ఇటీవల నేనున్న సాహిత్యబృందాల్లో (లేనివాట్లలోనూ) కొందరు కొన్ని ప్రశంసాపత్రాలను పోస్ట్ చేస్తున్నారు. వారి రచనా ప్రయత్నాన్ని నేను స్వాగతిస్తాను. స్వాగతిస్తూనే ఉన్నాను. కానీ ఈ ప్రశంసల పేరుతో ప్రదర్శితం అయ్యే పత్రాలు రకరకాలుగా ఉంటున్నాయి. 1. బహుమతులు గెల్చుకున్నవి.2. పోటీల్లో పాల్గొన్నందుకు ప్రశంస. 3. మూకుమ్మడి కవిసమ్మేళనాల్లో పాల్గొన్న ప్రశంస. 4. సాహిత్యకార్యక్రమాల్లో పాల్గొన్నందుకు ప్రశంస. 5.లేదా నిర్వహించిన పోటీల్లో వివిధ విభాగాల(అతిథుల్లాగానే ఆత్మీయ,గౌరవ ఇలాగ)పురస్కారాలు. ఇంకా వివిధ రూపాల్లో ఉంటున్నాయి. ప్రధాన లక్ష్యం ఏమంటే పాల్గొన్న ఎవ్వరినీ రిక్తహస్తాలతో పంపకుండా అందరిని సంతృప్తి పరచడం. వీలైతే వారి వారి అవకాశాన్ని బట్టి ఒక బిరుదును తగిలించడం. నా శిష్యుడు ఒకాయన ఆ మధ్య రెండుమూడు బిరుదులు పెట్టుకుని వ్రాస్తూండగా ఆ బిరుదులకు అర్థం అడిగాను.అందులో ఒకటి వంద లేదా వెయ్యి మందికవులకి నెచ్చెలి అని అర్థం వచ్చేది. ఆ అర్థము ఆయన చెప్పలేక పోయారు. అది ఒక విషయం. ఏమీలేదు ఒక వంద కవితలు అవి ఎలా ఉన్నా ఏవైనా (వాక్యాలైనా సరే) వాళ్లకు పంపితే  సిద్ధంగా ఉంచుకున్న సర్టిఫికెట్ ఇచ్చేస్తారు. బాగానే ఉంది. ఆ బిరుదులు చూపి మరిన్ని బిరుదులు పొందడం. వాటిద్వారా కొన్ని అవార్డులకు అర్హత పొందడం.ఇలా సాగుతున్నది.
ఈ వ్యక్తులు లేదా సంస్థలు సాహిత్య సేవ పేరుతో పరస్పరం సహకార పద్ధతిలో గౌరవాలు చేసుకుంటూ బిరుదులు ఇచ్చుకుంటూ ఉండేవి కూడా ఉన్నాయి. కొందరు కొంత పుచ్చుకుంటూ(ఖర్చులు ఉంటాయిగా) ఇస్తున్నారని ఒకరిద్దరు చెప్పారు.
  అన్ని సందర్భాల్లోనూ అన్నీ వర్తిస్తాయని కాదు. నిజాయితీగా ఉండవనీ కాదు. సమస్య ఎక్కడంటే కవిత్వం లేకున్నా రాశిని బట్టి లేదా వారివారి ప్రయోజనాలబట్టి ఇచ్చుకుంటూ పోవడం కాల మహిమ అనే చెప్పాలి. కళాకారులకు బిరుదులూ సత్కారాలపట్ల వ్యామోహం అతి అయిపోడం కూడా ఆలోచింపచేస్తున్నది. ఇది ఒక బలహీనతగా ఎవరూ భావిస్తున్నట్లు లేదు. ఇలా బిరుదుల దొంతరలను పేర్చుకొని తద్వారా లేని కవిత్వాoశను తమలో ఆపాదించుకునే వారి గురించే ఎన్ని విమర్శలు వచ్చినా!! పులిని చూచి నక్క వాతలు పెట్టుకొడమే కాదు అది పులి చేసే పని చెయ్యలనుకోడం కుదరదు కదా!!ఈ సందర్భంలో కృష్ణమాచార్యులు గారు వ్రాసిన *బిడాలమోక్షం* కావ్యం గుర్తుకు వస్తుంది.  మా చదువుల కాలంలో కాశీ కృష్ణాచార్యులు గారికి *మహామహోపాధ్యాయ* బిరుదు ఉండేది. ఇంకా ఒకరిద్దరు మాన్యులకూ ఉండడం విన్నాం. ఇప్పుడు ఆ బిరుదునూ కులసంఘాలు ఇచ్చేస్తున్నాయి.
స్థితి ఇలా ఉంది.
   యువతకు(అందరికి కాదు సుమా!) అధ్యయనం లేదు. కవిత్వ మర్మాలు తెలియవు.  భాషపై పట్టూ ఉండదు. పదాలు ఎక్కడ హ్రస్వమో ఎక్కడదీర్ఘమో ఎక్కడ మహాప్రాణమో ఎక్కడ అల్పప్రాణమో తెలియని  (అల్పప్రాణులూ)వారికీ ఒకటి రెండు బిరుదులు ఉంటాయి. అవిలేనిదే నిద్రలేని స్థితి..అలాగే పక్కవారికి ఉంటే తమకూ ఉండి తీరాలని కొందరి తాపత్రయం.
అలా బిరుదులు పొందిన వారి వ్రాతల్లో కవిత్వం అన్నది మనం వెతుక్కుంటూ కవిత్వ నిర్వచనాలు  మార్చుకోవలసిందే తప్ప వారు సుప్రతిష్ఠీతమైన కవి నిర్వచనాలకూ కవిత్వ సిద్ధాoతాలకో లొంగి రాజీపడరు.
  సాహిత్యం గుంపుల్లో కొందరు ఎప్పుడూ ఏమీ వ్రాయరు. కేవలం ఈ సమ్మాన సత్కార బిరుదాదికాల ప్రదర్శనకు పరిమితమై ఉంటారు. మా గుంపులో అలా ఉన్న ఒకరిద్దరిని ఆ విషయమే అడిగాను. ఎప్పుడు ఎక్కడ ఏమి వ్రాసారో తెలుసుకుందామని. ఆ సమాధానాలు కేవలం వారికి ఆత్మ సంతృప్తి కలిగిస్తాయి అనేది గ్రహించవచ్చు. అంతవరకూ నయమే!!కనీసం ఆత్మనైనా సంతృప్తి పరచుకుంటున్నారు.
   నన్ను పట్టిపీడించే కొన్ని ప్రశ్నలు ఇప్పటికైనా పంచుకోకపోతే బాగుండదనుకున్నాను.
అసలు ఈ బిరుదులు లేకపోతే ఏమి జరుగుతుంది?? అనర్హబిరుదులు పొందాలనుకోడం ఒక మానసిక రుగ్మత కాదా!!,దీనికి చికిత్స లేదా!! ఇచ్చేవాళ్లకు ఏమి సంతృప్తి?? ఇది ఏ కోవలోకి వచ్చే బలహీనత?? సంస్థలు కొన్ని రాశి నింపితే బిరుదులు పంచిపెట్టడం మంచికా??చెడుకా?? దీనివల్ల భాషకూ కవిత్వానికి మేలా??కీడా?? పిల్లితన మెడలో మృగరాజు అని బోర్డ్ వ్రాసుకుని తగిలించుకున్నట్లు ఈ తగిలించుకు తిరగడం లో కలిగే ఆనందాన్ని ఏమనాలి?? తమద్వారా బిరుదులకు కానీ లేదా బిరుదుల ద్వారా తమకు కానీ కలిగే అప్రతిష్ఠల గురించి ఏన్నడైనా ఆలోచించారా?? సాహిత్యలోకం, బృందాలూ చాలా ఆలోచించవలసిన సమయం వచ్చింది. కవిసమ్మేళనాలు అంటారు.ఒకపక్క స్టేజి పై కవితలు అనుకుంటూ చదువుతుంటే ఒక పక్కన శాలువాల వితరణ జరిగిపోతూనే ఉంటుంది. ఒకరిది ఒకరు వినరు. శాలువా మెమెoటో తీసుకుని వెళ్లిపోవాలి.అయినా వందలమందివి వినడానికి ఎంత దమ్ము కావాలి. ఆ మధ్య నేను (ఒకేఒకసారి)ప్రపంచస్థాయి అని జరిగిన సాహిత్య సభలకు వెళ్ళాను. 3 రోజుల కవిసమ్మేళనాల్లో నమోదుకు తొక్కిసలాట జరిగినంత పనయింది. ప్రాణనష్టం జరగకుండా పోలీసులజోక్యం తప్పదేమో అన్నంతగా!!
ఇది సిగ్గుపడవలసిన విషయం.  నిర్వహించే సంస్థలకూ పాల్గొనేవారికి కొద్దిగా ఉండాలి కద!! నిర్మొగమాటంగా చెప్తే చేతులున్న ప్రతివారూ వ్రాయాలనుకోడం ఎలాంటిదో
చెవులున్న  ప్రతివారికీ వినిపించాలనుకోడమూ అలాంటిదే!!
 పై విషయాలు బాగా వ్రాసేవారికి,వ్రాస్తున్నవారికీ,కవిత్వం పండిస్తున్నవారికీ నిజమైన కవులకూ కవయిత్రులకూ వర్తించవని సవినయంగా విన్నవించుకుంటున్నాను. అర్హులకు సత్కారసమ్మానాలు అవసరం. అది మన సంస్కృతి. అర్హులు కానివారికి చేయడమూ అంతే అపచారం. దీనివల్ల కళలకు మేలు జరగదు.
ఈ స్థితి నుండి మనం అందరం బయటపడాలి.  వర్ధిష్ణువులమైన మనం ఇంకా బాగా వ్రాసి భాషాసేవచేద్దాం. రాశి అసలు వద్దు. వాసి పై దృష్టిపెడదాం. పెద్దల సూచనలు తీసుకుందాం
 వ్రాస్తున్నవాళ్ళo అధ్యయనం బాగా పెంచి,ఈ అల్పపు జాడ్యాలనుండి బయటపడాలి. బిరుదులు పొందడంలో పోటీపడవద్దు. ప్రమాణకవిత్వం వ్రాయడంలో పోటీపడదాం. సత్కారాలూ శాలువాల లెక్క వద్దు. వ్రాసేదానిలో ప్రామాణికుల మెప్పులు పొందినవి ఎన్నో లెక్క చూచుకుందాం.
 మనలో మార్పు రావాలి. సాహిత్య బృందాల్లోనూ మార్పు రావాలి. మన దృక్పథం మారాలి.

N. CH. చక్రవర్తి
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.