గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, జులై 2020, శుక్రవారం

సందేశ సంహిత...డా.ధూళిపాళ మహదేవమణి.

జైశ్రీరామ్.
సందేశ సంహిత...డా.ధూళిపాళ మహదేవమణి.
మంచిని తెలియ చెప్పడమే సందేశమంటే. ఆ మంచి ఏమిటనేదే మనల్నందరినీ ఒక త్రాటిపై నడవనియ్యడం లేదు. మంచి అనేది నిత్యసత్యం కావాలి. ఒకరికి మంచిదై మరొకరికి చెడువస్తే అది సరైన మంచి కాదు. కనుక ప్రతివ్యక్తీ తన ఆలోచనల మేరకు తాను నిర్ణయించినదే, తాను ఆచరించడమే మంచి అనుకోవడం అవివేకమే అవుతుంది. అందరికీ ఒకేలాంటి ఫలితాన్నిస్తూ అమృతమార్గాన్ని చూపించేదే అసలైన మంచి. మన ఆలోచనలన్నీ మృతమార్గంలో ఉండకూడదు. అనగా చనిపోతూ తిరిగి పుడుతూ మళ్లీమళ్లీ చావు బ్రతుకుల చక్రంలో గిర్రున తిరుగుతూ ఉండడం మృతమార్గమే అవుతుంది. అనగా తిరిగి పుట్టించేది మృతమార్గం. పుట్టుక లేకుండా చేసేది అమృతమార్గం. అలాంటి అమృత మార్గాన్ని అందించి ఈ కలియుగానికి ప్రధాన ఆచార్యస్థానం వహించిన వారు శ్రీశంకర భగవత్పాదులు. వారు చాలా చిన్నచిన్న మాటలతో సందేశాల్ని అందించిన మహనీయులు. వారి ఒక ఉపదేశం చూద్దాం.
లబ్ధావిద్యా రాజమాన్యా తతః కిమ్?
ప్రాప్తా సంపత్ ప్రాభవాఢ్యా తతః కిమ్?
భుక్తా నారీ సుందరాంగీ తతః కిమ్?
యేన స్వాత్మా నైవసాక్షాత్కరోభూత్
1. మహారాజులు గౌరవించే గొప్ప విద్యారాశి నీకు లభించింది. అయితే ఏమిటి?
2. అనేక భోగభాగ్యాల్ని అనుభవింప చేసే అఖండమైన ఐశ్వర్యం లభించింది. సరే! తర్వాతేమిటి?
3. త్రిభువన సుందరి వంటి గొప్ప అందకత్తె నీకు వశమై గొప్ప ఆనందాన్ని అనుభవించావు. అయితే ఏమిటి?
ఇవన్నీ మన తాత్కాలిక ఆనందాలు మాత్రమే. ఈ జన్మకు మాత్రమే లభించిన అదృష్టాలు. ఆయువు తీరింది. అప్పుడు కూడా మనకి పై వైభవాలు అనుసరించి వస్తాయా? మరోజన్మలో తిరిగి ఇవి లభిస్తాయని నమ్మకం ఉందా? ఒక రెండుగంటల పాటు సినిమా చూశాం. ఆ సమయం అంతా అది మంచి చిత్రం కావడంతో ఆనంద తన్మయులం అయ్యాం. తిరిగి బైట ప్రపంచంలోకి వచ్చాం. ఆ ఆనందం కొన్నిరోజుల పాటు స్మృతిలో ఉండి తరువాత కనుమరుగు ఐపోతుంది. మన ఈ జీవితమూ అంతే. మన జన్మల సముద్ర జల బిందువుల్లో ఇది ఒక్క బిందువు మాత్రమే. తిరిగి తిరిగి భవదుఃఖాలు అనుభవింపక తప్పదు. ఇదంతా మృతమార్గం. మరి చావులేని మార్గం ఏమిటి?
‘మన ఆత్మను మనం దర్శింప గలగడం.’ ఆ ఆత్మదర్శనం వల్ల ఈ జీవాత్మలన్నీ పరమాత్మ కాంతి కిరణాలే అని తెలుస్తుంది. ఆ ఎరుక కలిగితే ‘అహం బ్రహ్మాస్మి’ నేనే ఆ పరబ్రహ్మను అన్న ప్రజ్ఞానం కలుగుతుంది. దానివల్ల జీవునికి ముక్తస్థితి వస్తుంది. నిత్యవస్తువును తెలుసుకొన్న బ్రహ్మానంద స్థితి కలుగుతుంది. అప్పుడింక ముక్తితో నిత్యసత్యమైన, అమరమైన అఖండానంద బ్రహ్మంలో లీనమౌతాం. దానికోసం ఈ జన్మలో కనీసం ఒక్క అడుగు పడినా చాలు. అదే తరువాత జన్మలకీ మూలమై క్రమంగా మోక్షం అనే అమృతస్థితి వస్తుంది. కనుక ఎంత ప్రాభవాన్ని ఈ జన్మలో మనం పొందగలిగినా ఎవరైతే ఆత్మసాక్షాత్కారం పొందలేరో... అప్పుడివన్నీ నిష్ప్రయోజనాలే అంటున్నారు ఆచార్య శంకరులు. ఇది మన జీవనసాఫల్య సూత్రాల్లో ప్రధానమైన మొదటి సూత్రం.

"ఆచార్య శంకరుల"శ్లోకానికి
వ్యాఖ్యానం
స్వస్తి
ధూళిపాళ మహాదేవమణి.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.