గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, జులై 2020, శనివారం

కొండొండోరి సెరువుల కాడా......పాట అర్థం.

జైశ్రీరామ్.
కొండొండోరి సెరువుల కాడా......పాట అర్థం.

నిజంగా మన తెలుగు కవుల చేతి రాతలో ఎంత ఆధ్యాత్మిక భావన తొంగి చూసేదో ఈ పాట అర్థం తెలుసుకుని వింటే అర్థమవుతుంది.

మన వారు మాట్లాడిన, పాట పాడిన ఎప్పుడూ ఎరుక కలిగి పారమార్థిక చింతనతో జీవనం సాగించే వారు అనడానికి చక్కని నిదర్శనం ఈ పాట.

ఈ పాట 1983 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ సంగీత అకాడెమీ ప్రచురించిన జానపద గేయాలలో చివరిది.
సంపాదకురాలు కళాప్రపూర్ణ శ్రీమతి ఎం. అనసూయాదేవి.

ఇది ప్రధానంగా ప్రతీకాత్మకంగా చమత్కారపు బాటలో నడిచిన పాట.

11 చరణాల ఈ పాటలో మొదటి రెండు పంక్తులు ముగ్గురిని గురించి చెబుతుంటే , మిగిలిన రెండు పంక్తులు రెండింటిని గూర్చి చెబుతుంటాయి.
విచిత్రమేమిటంటే ఆఖరుగా ఉన్న రెండు పంక్తులు మొదటి మూడింటి ఫలితాలగురించి వివరిస్తుంటాయి.

1. కొండొండోరి సెరువుల కాడా
సే సిరి ముగ్గురు ఎగసాయం యొకడికి (త్రి మూర్తులు 1. బ్రహ్మ, 2. విష్ణువు, 3. మహేశ్వరుడు.)
కాడి లేదు రెండు
దూడాలేదు
అనంతకోటి బ్రహ్మాండాలలో (కొండొండోరి సెరువుల) త్రిమూర్తులు సృష్టి వ్యవసాయం మొదలుపెట్టారు.
వ్యవసాయానికి కాడి, దూడా ఉండాలి కదా ! కాని వీరి వ్యవసాయానికి అవిలేవు. (మిగతా చరణాలన్నింటిలోను ఇదేరీతిగా స మన్వ యించుకోవాలి)

2. కాడిదూడా లేనెగసాయం
పండెను మూడు పంటాలొకటి (1. సత్త్వము, 2. రజస్సు, 3. తమస్సు)
వడ్లు లేవు రెండు
గడ్డీ లేదు
పంటలకి వడ్లు , గడ్డీ ఉండాలి కదా ! కాని 1. సత్త్వము, 2. రజస్సు, 3. తమస్సు అను పంటలకు వడ్లు , గడ్డీ లేవు.

3. వడ్లు గడ్డీ లేని పంటా
ఇశాఖపట్నం సంతలో పెడితే( విశాఖ= ఔన్నత్యపు శాఖలు లేని సంసారం)
వట్టి సంతేకానీ సంతలో
జనం లేరు
(సత్వ రజస్తమోగుణాల పంటను శాఖలు లేని సంసారంలో పెట్టారు. జనం వాటిలో మునిగిపోయారు. ప్రపంచం ఉన్నది కాని ప్రపంచంలో సంసారపు ఊర్ధ్వమూలాన్ని ఆలోచించటానికి ఎవరూ లేరని భావం)
4. జనంలేని సంతలోకి
వచ్చిరి ముగ్గురు షరాబు లొకరికి( షరాబులు= కంసాలులు 1. అగ్ని, 2. వాయువు, 3. సూర్యుడు.)
కాళ్ళు లేవు రెండు
సేతుల్లేవూ

5. కాళ్ళు చేతులు లేని షరాబు
తెచ్చిరి మూడు కాసూలొకటి( త్రిదండాలు 1. వాగ్దండము (మౌనము), 2. మనోదండము (ఆశ లేకుండుట), 3. కాయదండము (స్వధర్మాచరణము))
వొలాల్లొల్లదూ రెండు
సెల్లాసెల్లవు ( త్రిదండాలకు ఈలోకంలో చెల్లుబాటు లేదని భావం)

6. ఒల్లాసెల్లని కాసులు తీసుకు
ఇజయనగరం ఊరికిబోతె
ఒట్టి ఊ రేగాని ఊళ్ళో
జనం లేరు
( విజయ అనగా మిక్కిలి గెలుపు. సహస్రార చక్ర భేదనమనే ఊరు. ఈలోకంలో చాలామంది దృష్టిలో పనికిరాని ఆ త్రిదండాలను ఆచరించి ఉత్తమ యోగాభ్యాసంతో ఆ సహస్రార చక్ర భేదనమనే ఊరుకు వెళదామని చూస్తే ఆ ఊరు చేరిన వారు లేరు. యోగులెవరు లేరని భావం)

7. జనం లేని ఊల్లోను
ఉండిరి ముగ్గురు కుమ్మల్లొకడికి(త్రికాలాలు 1. భూతకాలము, 2. భవిష్యత్కాలము, 3. వర్తమానకాలము.)
తల లేదు - రెండు కి
మొలాలేదు
(ఉత్తమ యోగాభ్యాసము చేసే వారు ఎవరూ లేకపోయినా తలా మొలా లేని- అనగా ఆకారం లేని త్రికాలాల కుమ్మర్లు వస్తూనే ఉంటారని భావం. )

8. తల మొల లేని కుమ్మర్లు
చేసిరి మూడు భాండాలొకటికి(1. భూలోకము, 2. స్వర్గలోకము, 3. పాతాళ లోకము.)
అంచులేదూ. రెంటికి
అడుగు లేదు
( కాలం సృష్టించిన లోకాలకు అంచులేదు. అడుగు లేదు.)

9. అంచు అడుగు లేని భాండాల్లో
ఉంచిరి మూడు గింజలొకటి (త్రిదోషాలు శ్లేష్మం, పిత్తం, వాతం.)
ఉడకా ఉడకదు రెండు
మిడకామిడకావూ
(ఈ లోకాలలో జీవులతో ఆడుకోవటానికి కాలం శ్లేష్మం, పిత్తం, వాతం అను మూడు గింజలను ప్రతి జీవిలోను ప్రవేశపెట్టింది)

10. ఉడకని మిడకని మెతుకులు తినుటకు
వచ్చిరి ముగ్గురు సుట్టాలొకడికి (1. మనస్సు, 2. వాక్కు, 3. కర్మ. త్రికరణాలు)
అంగుళ్లేదూ రెండు
మింగుళ్లేదూ
(శ్లేష్మం, పిత్తం, వాతం అను అనువాటిని త్రికరణాలు జీవుల చేత అనుభవింప చేస్తున్నాయి)

11. అంగుడుమింగుడు(= లోకుత్తుక) లేని సుట్టాలు
తెచ్చిరి మూడు సెల్లాలొకటి (1. ధర్మము, 2. అర్థము, 3. కామము.-త్రిగణము)
సుట్టు లేదు , రెండు
మద్దెలేదు .
(అంచుల్లేని సన్నని బట్టను సెల్లా అంటారు. 1. ధర్మము, 2. అర్థము, 3. కామము.-త్రిగణములు అటువంటివి సెల్లాలు. వీటిని తెచ్చిన వారు త్రికరణాలు. 1. ధర్మము, 2. అర్థము, 3. కామములకు చుట్టూలేదు. అనగా ఒక పరిధిలేదు. మధ్య లేదు. )
జైహింద్.

Print this post

2 comments:

అజ్ఞాత చెప్పారు...

అద్భుతం.
వారి కవిత్వాన్ని, తత్వాన్ని ఎలా అనుభూతి చేందామో తెలియజేయటానికి పదాలు దొరకడం లేదు. జానపదాలు - జ్ఞాన పదాలు

అజ్ఞాత చెప్పారు...

ఇంత గూడార్థ ప్రక్షిప్తమైన ఆ గీతిక అద్భుతం.
వెలికి తీసి వివరించిన వారికి ఎన్నెన్నో ధన్యవాదములు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.