గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, డిసెంబర్ 2018, శుక్రవారం

4వ పద్య పక్షమ్. తొలకరి చినుకులు తైతుల తలపులు. రచన. చింతా రామ కృష్ణా రావు.

జై శ్రీరామ్.
4వ పద్య పక్షమ్.  తొలకరి చినుకులు తైతుల తలపులు.
రచన. చింతా రామ కృష్ణా రావు.
1. ఆటవెలది త్రయ గర్భ సీసము. 
ఋతువులారు కలిపి వృత్తంబుగా చేసి - కాల గతిని కూర్చి కదిపినావు.
ధర్మబద్ధమయిన తరియన్నదే లేని - కాల గమనమందు కలుగు కృష్ణ!
ఋతువులందు సహజ ఋతు ధర్మముం గూర్చ - గ్రీష్మఋతువు లోని కీల చేత
భూమిమాడు చుండి బగబగల్ పుట్టించ - రైతు మనసులోన రగులు కృష్ణ.
ఆ.వె. అట్టి సమయమందు నాశలు పుట్టించ - తొలకరింపువగుచు పలుకుదీవు
ప్రకృతి రక్షకుఁడగు పరమాత్మగా నెంచి, - దానిఁ గనిన రైతి తనియు కృష్ణ!
2. ఆటవెలది త్రయ గర్భ సీసము. 
గ్రీష్మ ఋతువు తాను భీష్మ కీలల మాడ్చ - వేగుచున్న ధరణి బీడువారు.
పైరుపచ్చలవని పై నెండిపోవగా - పసరములవియెట్లు బ్రతుకు కృష్ణ?
పసుల జీవికకయి పలుపలు విధముల - యత్నములను చేసి యలసిపోవు
నంతలో తొలకరి నంతసమ్మునుఁ గూర్చ - వచ్చు రైతు జనులు మెచ్చ కృష్ణ!
అ.వె. తొలకరి పొడఁ గాంచి తుది లేని యానంద మొదవరైతు మదిని వ్యధను వీడి
భూమిదున్నుటకయి పూజలు చేయుచు పొంగిపోవునతఁడు. పూజ్య కృష్ణ!
3. ఆటవెలది త్రయ గర్భ సీసము. 
చిఱు చిఱు వడగళ్ళు చెలరేగు పెనుగాలి, కారుమబ్బుల గతి కనిన రైతు
వర్షధార తడువ పరువెత్తు హర్షంబు మిన్నుముట్ట భవిత నెన్ని కృష్ణ!
చిటపట చిఱు జల్లు కటిక నేలను పడి నంతనావిరయి, నయ పరిమళము
జగతిని వెదజల్లు, సొగసైన కలవాపి నటన చేయ వలచునచట కృష్ణ!
ఆ.వె. తొలకరింపవనిని పలకరింపఁగ కవి కలము పట్టు రయితు హలము పట్టు
కలము హలములందు కలవునీవని నమ్మ, కలిగి శుభములీయఁ గలవు కృష్ణ!
4. ఉ. నేలను బుట్టి నేలపయి నిత్యము తా కృషి చేయునే క్షుధా
పీడిత మానవాళికయి ప్రీతిని గొల్పెడి భుక్తికోసమై.
శ్రీలను గొల్పు రైతు సహ జీవనమార్గ విధాత, తొల్కరిన్
జూడఁగనే ముదంబొదవ శోభిలు నాగలి చేతఁ బట్టుచున్.
5. తేట గీతి దృతవిలంబిత గర్భ చంపక మాల. 
ముదమగు తొల్కరిన్ హలము పూజ్యమహానిధి హాలికాళికిన్
వ్యధలకు దూరమై పొలము హాయిగ బ్రోవుచు పొంగుచుంద్రుగా!
సుధను స్రవించెడున్ దొలుత సుందర తొల్కరి తోడుగానగన్!
సుధ వర తర్పణన్ పృథివి శోభిలు రైతుల స్వేదమేనుగా!
స్వస్తి.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

adbhutamu gaa nunnavi. abhinamdanalu

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.