జైశ్రీరామ్.
ఆర్యులారా! నేడు శ్రీ దాశరథి కృష్ణమాచార్యులు జయంతి సందర్భముగా వారికి నివాళి అర్పిస్తున్నాను.
దాశరథి కృష్ణమాచార్యులు
దాశరథి కృష్ణమాచార్యతెలంగాణ ప్రజల కన్నీళ్లను ‘అగ్నిధార’గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు, “దాశరధి”గా ప్రసిద్ధుడు. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి ప్రాతఃస్మరణీయుడు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్వంగా ప్రకటించి ఇప్పటి ఉద్యమానికీ ప్రేరణనందిస్తున్న కవి దాశరథి. నిజాం ప్రభువుకి వ్యతిరేకంగా గొంతెత్తి…
ఓ నిజాము పిశాచమా కానరాడు
నిన్నుబోలినరాజు మాకెన్నడేని
తీగెలను తెంపి అగ్నిలో దింపినావు
నా తెలంగాణ కోటి రత్నాలవీణ అని ఎలుగెత్తి సభలలో వినిపించాడు.
దాశరథి కృష్ణమాచార్య 1925 జూలై 22 న వరంగల్ జిల్లా గూడూరు గ్రామంలో జన్మించాడు. ప్రస్తుతం ఈ గ్రామం ఖమ్మం జిల్లాలో ఉంది. బాల్యం ఖమ్మం జిల్లా మధిరలో గడిచింది.
సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో మంచి పండితుడు. ఉపాధ్యాయుడిగా, పంచాయితీ ఇన్స్పెక్టరుగా, ఆకాశవాణి ప్రయోక్తగా ఉద్యోగాలు చేసాడు. సాహిత్యంలో దాశరథి అనేక ప్రక్రియల్లో కృషి చేసాడు. కథలు, నాటికలు, సినిమా పాటలుకవితలు రాసాడు.
నా పేరు ప్రజాకోటి
నా ఊరు ప్రజావాటి…. అంటు తెలంగాణ ప్రజల హృదయతంత్రులను మీటి ,వారిని జాగృతం చేసిన ప్రళయకవితామూర్తి.
భారతదేశ స్వాతంత్ర్య పోరాటం ఉధృతంగా సాగుతున్న కాలంలోనే,తెలంగాణలో కూడా నిజాం వ్యతిరేక ఉద్యమం జరుగుతుంది.1947లో భారతావనికి స్వాతంత్ర్యం సిద్దించింది.కాని తెలంగాణకు మాత్రం నిజాం నవాబుల పాలన నుంచి విముక్తి లభించలేదు.నిజాం పాలనలో ప్రజలు దుర్భర జీవితాలను గడిపే వారు.
నిజాం నిరంకుశ పరిపాలనలో ప్రజలకు ఎలంటి స్వేచ్ఛఉండేది కాదు.ప్రజలు తమ మనసులోని కోర్కేలను తెలుపుకొనుటకు గాని,సభలు ఏర్పాటుచేసి తమ కష్టాలను,బాధలను చేప్పుకోవడానికి వీలుండెది కాదు.ప్రజలపై అధికపన్నులు విధించడం,వారి భూములను లాక్కోవడం, వారిని నానా రకాలుగా బాధించే వారు. రజాకార్లు ప్రజల పాలిట నరభక్షకుల్ల తయారయ్యారు. వీరు ఇండ్లపై పడి ప్రజల్ని ఊచకోతకోసేవారు. ఆడవారిని ఎత్తుకెల్లి మానభంగం చేసెవారు.
ఈ విధంగా తెలంగాణ ప్రజలు నిజాం నవాబుల పరిపాలనలో స్వేచ్ఛా,స్వాతంత్ర్యాలు లేకుండా జీవచ్చవాల్లా బ్రతికేవారు. ఇలా వీరి మతోన్మాద, కిరాతక, నియంతృత్వ, నిరంకుశ పాలనను ఎదిరించి నిజాం నవాబుకు సింహస్వప్నమై నిలిచి…
ప్రాణము లొడ్డి ఘోర గహనాటవులన్ బడగొట్టి మంచి మా
గాణములన్ స్రుజించి ఎముకల్ నుసిజేసి పొలాలు దున్ని భో
షాణములన్ నవాబునకు స్వర్ణము నింపిన రైతుదే, తెలం
గాణము రైతుదే; ముసలి నక్కకు రాచరికంబు దక్కునే? అని గర్జించాడు.
దగాకోరు బటాచోరు రజాకారు పోషకుడవు,
దిగిపొమ్మని జగత్తంత నగారాలు కొడుతున్నది,
దిగిపోవోయ్, తెగిపోనోయ్ అని నిజామును సూటిగా గద్దిస్తూ రచనలు చేసాడు.
నిజాం నిరంకుశత్యాన్ని,ఆగడాలను ఖండిస్తు…..
అదె తెలంగాణలోన దావాగ్ని లేచి
చుట్టుముట్టిన భయద సంక్షోభ వేళ
అది నిజాము నృపాలుని అండదండ
చూచుకొని నిక్కినట్టి పిశాచహేల
నాడు మానవతీ నయనమ్ములందు
నాగ సర్పాలు బుసకొట్టి నాత్యమాడె
నాడు మానవతయు నవనాగరకత
తన్నులెన్నది రాక్షసర్వమ్ముచేత
అంటు ఈ పద్యంలో నాడు మానవతీ నయనమ్ములందు, నాగ సర్పాలు బుసకొట్టి నాట్యమాడె” అన్నాడు.నిజాం అనుచరుల అత్యాచారాలకు బలైన స్త్రీలు తీవ్రమైన కక్షతో అక్షుల్ని (కన్నుల్ని)కలిగి ఉన్నారు. స ర్పాలలో నాగుపాము కక్షా తత్వానికి పరాకాష్ఠ. అందుకే అతివల నయనాల్లోని ,కక్షా తత్వమంతా నాగసర్పాలుగా బుసకొడుతున్నదని,స్త్రీల హృదయాల్లోని ఉద్విగ్నబాధను కవి పై పంక్తుల్లో వివరించాడు.
దాశరథి గురించి ఇంకా,
ఆంధ్రమహాసభలో చైతన్యవంతమైన పాత్ర నిర్వహించి నిజాం ప్రభుత్వం చేత జైలు శిక్ష అనుభవించాడు.
పళ్ళు తోముకోవడానికిచ్చే బొగ్గుతో జైలు గోడల మీద పద్యాలు రాసి దెబ్బలు తిన్నాడు.
మంచి ఉపన్యాసకుడు.
భావప్రేరిత ప్రసంగాలతో ఊరూరా సాంస్కృతిక చైతన్యం రగిలించాడు.
ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్మాతల్లో ఒకడు.
1953 లో తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి అధ్యక్షుడుగా జిల్లాల్లో సాహితీ చైతన్యాన్ని నిర్మించాడు.
ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవిగా 1977 ఆగష్టు 15 నుండి 1983 వరకు పనిచేసాడు.
రాష్ట్ర, కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతులు గెల్చుకున్నాడు.
అనేక సినిమాలకు గీతాలు రచించి అభిమానుల్ని సంపాదించుకున్నాడు.
మీర్జాగాలిబ్ ఉర్దూ గజళ్ళను తెలుగులోకి గాలిబ్ గీతాలు పేర అనువదించారు.
తల్లి మీద, తల్లి తెలంగాణ మీద ఆయన రచించిన పద్యాలు ఇప్పటికీ ఎందరికో ఉత్తేజాన్ని కలిగిస్తున్నాయి.
కవితా సంపుటాలు
అగ్నిధార
మహాంధ్రోదయం
‘రుద్రవీణ’
‘మార్పు నా తీర్పు’
‘ఆలోచనాలోచనాలు’
ధ్వజమెత్తిన ప్రజ
కవితా పుష్పకం: ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత
తిమిరంతో సమరం: కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత
సినిమా రచనలు: 1961లో ఇద్దరు మిత్రులు సినిమాలో పాటలు రాయడంతో ఆయన సినీరంగ ప్రవేశం చేసాడు.
కొన్ని ప్రముఖమైన కవితలు
నైజాము సర్కరోడా, నాజీలను మించినోడా…….
గోల్కొండ ఖిల్లా కింద నీ ఘోరి కడతాం కొడుకా నైజాము సర్కరోడా
***********************************
నిన్ను గెలవాలేక రైతన్నా……
నిజాం కూలింది కూలన్న
***********************************
తెలగాణమ్మున గడ్డి పోచయును సంధించెన్ కృపాణమ్ము!రా
జ లలాముండను వానిపీచమడచన్ సాగించె యుద్ధము!భా
తిలిపోయెన్ జగమెల్లయ్యే యగునో తెమింగరాకన్! దిశాం
చలముల్ శక్రధను : పరంపరలతో సయ్యాట లాడెన్ దివిన్!
*****************************************************
నా గీతావళి ఎంత దూరము ప్రయాణంచేసేనో
అందాక ఈ భూగోళమ్మున అగ్గిపెట్టెదను….
*******************************************
మాపు సాంతము కురిసిన మంచులోన
రేపు సాంతము మంటలు రేగునంట!
కప్పుకొన దుప్పటి లేని కవి కలాన
గప్పుమని నిప్పుమంటలు క్రమ్మునంట!
*****************************************
మా నిజాము రాజు
తరతరాల బూజు
………………
……………..
పడతులమానాలు దోచి
గుడగుడమని హుక్క త్రాగి
జడియక కూర్చుండినావు
మడికట్టుక నిలిచినావు
దగాకోరు బడాచోరు
రజాకారు పోషకుడవు
వూళ్ళకూళ్ళు అగ్గిపెట్టి
తల్లిపిల్ల కడుపుకొట్టి
నిక్కిన దుర్మార్గమంత
నీ బాధ్యత నీ బాధ్యత
”కోటిన్నర” నోటివెంట
పాటలుగా మాటలుగా
దిగిపొమ్మని, దిగిపొమ్మని
ఇదే మాట అనేస్తాను
వద్దంటే గద్దె యెక్కి
పెద్దరికం చేస్తావా!
మూడుకోట్ల చేతులు నీ
మేడను పడదోస్తాయి
మేడనువిడదీస్తాయి
నీకు నిలుచు హక్కులేదు
నీ కింకా దిక్కులేదు …………..
1987 నవంబర్ 5 న దాశరథి తుది శ్వాస విడిచారు.
సాహితీ ప్రియులందరికీ కూడా కృష్ణమాచార్యులవారి దివ్యానుగ్రహం తప్పక కలగాలని ఆశిస్తున్నాను.
జైహింద్.