గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, ఏప్రిల్ 2015, మంగళవారం

అవిశె గొప్పదిగా తెలియఁ జేసిన ఆంజనేయుఁడు.

జైశ్రీరామ్.
ఆర్యులారా! అవిసె యొక్క ప్రత్యేకతను రామ భక్తుఁడైన ఆంజనేయుడు వెలువరించిన తీరు గమనించండి.
సీతా రాములు శత కంథరాక్షస సంహారం చేసి, అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు ఏకాదశీ పర్వదినం. ఏకాదశీ వ్రతాన్నిశ్రద్ధతో నిర్వహించి, మర్నాడు ద్వాదశి పారాయణ చేశారు. ద్వాదశి ఘడియలు దాటి పోకుండా విందు భోజనానికి ఏర్పాట్లు జరిగాయి. రాముని సోదరులు, అనేక మంది రాజులూ, విభీషణుడు మున్నగు వారు, సుగ్రీవాదులు అందరు ఉచిత స్తానాల్లో భోజనాలకు కూర్చున్నారు. అందరికి బంగారు ఆకులలో వడ్డన జరిగింది. భోజనం తిన టానికి ముందు అందరు పరిశేచనం (నీటిని విస్తరి చుట్టూ మంత్ర పూతం గా తిప్పటం )చేస్తున్నారు. అప్పుడు హనుమ ఒక్క ఉదుటున శ్రీ రాముని సమీ పించి నమస్కరించి ,”రాజా రామా! భక్త పరాదీనా! ఈ దాసుడిది ఒక విన్నపం ఉంది. ఆలించు. మొదట గా మీరు భోజనం చేసిన తరువాత మా వానర జాతి అంతా మీ ప్రసాదం గా భుజించ టానికి అనుజ్ఞ నివ్వండి. ”అని ప్రార్ధించాడు. ఇందులో ఏదో అంత రార్ధం ఉండి ఉంటుందని, లేక పోతే ఇలాంటి కోరిక కోరడని గ్రహించాడు రాముడు. ”సరే అలానే కానిద్దాం ”అన్నాడు. రామాదులు, మహర్షులు తృప్తిగా భోజనం చేశారు .
హనుమ, శ్రీ రాముని బంగారు విస్తరి లో తినగా మిగిలిన పదార్ధాలతోఒక ముద్ద ను ఒక గిన్నె లో ఉంచుకొని , , దాన్ని దగ్గర లో ఉన్న ఒక అవిసె చెట్టు దగ్గరకు చేరి కింద ఉంచాడు. అవిసె పూలను కోసి, ఒక చోట చేర్చాడు. హనుమ ఎంచేస్తాడో చూడటానికి రామునితో సహా అందరు కుతూహల పడుతున్నారు. అప్పుడు మారుతి సుగ్రీవాది వానర వీరు లందరినీ తన దగ్గరకు రమ్మని ఆహ్వానించాడు. వారంతా బిల బిల లాడుతూ చేరుకొన్నారు. శ్రీ రాముని ప్రసాదం అని చెప్పి ఆ గిన్నే లోని దానిని ఒక ముద్ద గా చేసి దానితో పాటు అవిసె పువ్వును ఒక్కక్క వానరుని చేతి లో ఉంచాడు . దానిని ”రామార్పణం ” అని అనుకొంటూ కళ్ళకు అద్దుకొని ప్రసాదం గా భుజించమని కోరాడు. అందరు హనుమ చెప్పి నట్లే చేశారు. అందరు తిన్న తరువాత మారుతి, తాను కూడా దాన్ని అవిసె పువ్వు తో సహా ప్రసాదం గా కళ్ళకు అద్దు కొని తిన్నాడు. ఇంత మంది వానరులకు ఆ కాస్త ప్రసాదమే, ఆ కాసిని అవిసె పూలే అవ్యయం గా సరిపోయాయి .
అప్పుడు శ్రీ రాముడు హనుమ చెంతకు చేరి ” వాయు నందనా! ఇప్పుడు నువ్వు చేసిన ఈ కృత్యం వల్ల ద్వాదశి పారాయణ సమగ్రం గా, సంతృప్తి గా సంపూర్ణం అయింది. ద్వాదశి వ్రతానికి గొప్ప సార్ధకత లభించింది. కనుక ఇప్పటి నుడి ప్రతి నెలలో వచ్చే రెండు ద్వాదశి తిధులలో ఈ అవిసె వృక్షానికి చెందిన పూలను, కాయలను, పత్రా లను భోజన పదార్ధాలుగా ఉపయోగించిన వారికి సకల సుఖ శాంతులు లభిస్తాయి వారందరూ నాకు అత్యంత ఆత్మీయులవుతారు.”అని వరం ఇచ్చాడు. అప్పటి నుండి అవిసె చెట్టు విష్ణు ప్రీతీ కరమైనది గా భావిస్తున్నారు. దాని ఆకులు కాయలు పూలను భక్తీ తో ద్వాదశి నాడు భుజిస్తారు. అవిసె కు ”అగస్త్య” అనే పేరు ఉంది. ఆకాశం లో అగస్త్య నక్షత్ర దర్శనం నాడు అవిసె బాగా పూస్తుంది. అవిసె ను ”అగిసే” అనీ కొన్ని చోట్ల పిలుస్తారు. అవిసె చెట్టు మహాత్మ్యాన్ని అందరికి తెలియ జేసిన ఘనత ఆంజనేయునిదే.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అవిసె పువ్వుల గురించి " బంగారి మామ " పాటలొ విన్నాం గానీ ఇంత మహత్యం ఉందని తెలియదు హనుమ ద్వారా మాకందించిన చింతా వారికి ధన్య వాదములు చాలా బాగుంది

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.