గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, ఏప్రిల్ 2015, శుక్రవారం

చతుర్విధ కవితా ధురంధర నాదెళ్ల పురుషోత్తమ కవి1863 - 1938. మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారి ఆంధ్ర రచయితలు నుండి.

నాదెళ్ల పురుషోత్తమ కవి (1863 - 1938)
హరితసగోత్రులు. తల్లి. సుబ్బమాంబ: తండ్రి. కామయార్యుడు. జన్మస్థానము కృష్ణాతీరస్థమగు సీతారామపురాగ్రహారము. జననము:23 ఏప్రిలు1863. గురువారము. నిర్యాణము 27-11-1938. బహుధాన్యమార్గశీర్ష శుద్ధ పంచమి-ఆదిత్యవారము.
గ్రంథములు: ఆంధ్ర ప్రబంధములు:
1. అద్భుతోత్తర రామాయణము. 2. గురుభక్తి ప్రభావము 3. కృష్ణానదీ మహాత్మ్యము 4. యాదవాద్రీశోపాఖ్యానము. 5. మహేంద్ర పురాణము 6. యామినీ వినోదము 7. బభ్రువాహన చరిత్ర 8. రంగదాసీయము 9. చతుర్ముఖి కందపద్య రామాయణము. ఆంధ్ర రూపకములు: 1. అహల్యా సంక్రందన నాటకము 2. హరిశ్చంద్ర నాటకము 3. పారిజాతాపహరణము 4. సారంగధర నాటకము. ఇత్యాదులు. శతకములు: 1. సీతారామశతకము 2. పూర్వకర్మ శతకము 3. మల్లికార్జునశతకము మున్నగునవి, మరియు. స్తోత్రకృతులు, అభివర్ననములు, కీర్తనలు, నిఘంటువులు, శాస్త్ర గ్రంథములు, హిందీనాటకములు మొత్తము 112 గ్రంథములు గలవు.
శ్రీ చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారు వీరిని గూర్చి వ్రాసిన పద్యములు సరిగా దూచిన ట్లున్నవి.
అతిశాంతుం, డతిదాంతుడు
కృతకృత్యుడు, నుకవి, యెన్నియేని విషయముల్
మతినెఱిగినవిద్వాంసుడు,
స్తుతియింపదగిన పూరుషుండు సుకవులకున్.
ఒకనికి లో గని శాంతియు
సకలమ్ము నతిక్రమించు చండత, కడువై
దికకర్మ నిష్ఠయు బరో
పకృతియు బురుషోత్తముని స్వభావగుణమ్ముల్.
పురుషోత్తమకవి తొలుత రేపల్లె  లోయరు సెకండరీస్కూలులో నుపాధ్యాయుడు. ఆపదవిలో నుండగానే జ్యోతిశ్శాస్త్రము, ధర్మశాస్త్రము మున్నగువానియందు పాండిత్యము సంగ్రహించెను.
వీరు హెచ్చుగా బంధగర్భ కవిత్వాభిమానులు. చతుర్ముఖి కందపద్య రామాయణము, చిత్రకంద పద్యరత్నాకరము, మల్లికార్జున మకుటాంచ త్కందగీత గర్భితోత్సల చంపక మాలాష్టోత్తర శతకము ఇత్యాదులందుల కుదాహరణములు. చతుర్విధ కవితా ధురంధరులని వీరికి గల బిరుదము.
పురుషోత్తమకవి కంద గీత గర్భ చంపకోత్పల శతక కవితా ధోరణి యీతీరు గలయది:
చ. ఒగి నగుమోముతో ముదమునొందగ జేయును ముద్దుపాప తా
వగనగ నెట్టులే గనెడువారి నడంబడు గంటి పాప చూ
డగ దిగువ స్వడి న్నిలుకడం దగ కాడును నీటిపాప తా
బగ లెగురుంగదా మదిని బాపగ జేయకు మల్లికేశ్వరా!
క. నగు మోముతో ముదము నొం
దగ జేయును ముద్దుపాప తా వగ నగనే
దిగువ వ్వడి న్నిలుకడం
దగ కాడును నీటిపాప తాబగ లెగురున్.
గీ. ముదము నొందగ జేయును ముద్దుపాప
కనెదు వారి నడంబడు గంటిపాప
నిలుకడం దగ కాడును నీటిపాప
మదిని బాపగ జేయకు మల్లినాథ!
ఈపద్యములు మల్లికార్జున శతకములోనివి. చంపకమాలిక కడుపులో కంద - గీతములు రెండును నిమిడియున్నవి. జాగరూకతతో నీ మూడుపద్యములు చూచినచో గవిగా రెంత పరిశ్రమించిరో వెల్లడి కాగలదు. సాధారణముగా బంధకవితలు రచన రామణీయకము కొఱవడి యుండును. పురుషోత్తమకవిగారి శైలిమాత్రము మధురధారకలది-బంధకవిత్వములో నీయన యందెవేసినవా రనుట కెన్నో కృతులు తార్కాణములున్నవి.
వీరి యద్భుతోత్తరరామాయణము నందలి వివధవర్ణనాంశములు గల పద్యములు కొన్ని:
క. అసలది వసంత మాయెను
బసరంగు సరింప విడిచె బడ జల్లిన య
ట్ల సదా యలరారుగదా
మిసమిస నదృశము లయ్యె మేదిని దరుపుల్.
క.వట ఫలము చుబుక మపునవి
నటు పటు దంతములు దాడిమాంచిత బీజో
త్కటములు మౌక్తికకుంద
స్ఫుటములు విశ్శ్రేణిబోల్ప బొలుపగువళులన్.
క. మదగజముల గేరెడినో
కుదిరిక యంచరులకు గూర్పగోరెడి నోయా
పదముల యెదుగుడు గమనిక
కుదిరెడి నే నాగకవులకు స్వర్ణింపన్.
ఈ విధముగా మనోహరరీతిని చతుర్విధకవితలు సంతరించిన సుకవి పురుషోత్తములు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ఆంధ్ర ప్రబంధముల నుండి ప్రముఖులను వారి అపురూప మైన ఆణి ముత్యముల వంటి బంధ కవనములను మాకందించి నందులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.