గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, సెప్టెంబర్ 2014, ఆదివారం

లండన్ లో దిగ్విజయంగా జరుగుచున్న నాలుగవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు.

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ వంగూరి రాజు గారు అందజేసిన వర్తమానం ప్రకారం
లండన్ లో దిగ్విజయంగా ముగిసిన నాలుగవ  ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు మొదటి రోజు
లండన్ మహా నగరంలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, స్థానిక యుక్త సంస్థల సంయుక్త నిర్వహణలో తొలి రోజు సమావేశం నిన్న ఉదయం 10 గంటలకి (సెప్టెంబర్ 27, 2014) ఎంతో ఉత్సాహంగా ప్రారంభించబడి, నిర్విరామంగా కొనసాగి సాయంత్రం ఐదు గంటల వరకూ దిగ్విజయంగా జరిగి. తెలుగు సాహిత్య చరిత్రలో మరొక అధ్యాయానికి తెర తీసింది. కళ్యాణి గేదెల శ్రావ్యంగా ఆలపించిన “మా తెలుగు తల్లికి” ప్రార్థనా గేయంతో ప్రారంభం అయిన ఈ మహా సభలకి  ఇంగ్లండ్, అమెరికా , ఫ్రాన్స్ , జర్మనీ దేశాలనుండి సుమారు 150 మంది సాహిత్యాభిలాషులు, కవులు, రచయితలూ పాల్గొనగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కే.ఇ. కృష్ణమూర్తి గారు ప్రధాన అతిథిగా విచ్చేసి తెలుగు బాషని ప్రపంచ బాషగా తీర్చిదిద్దడానికి తమ వంతు సహకారాన్ని అందజేస్తామని ప్రకటించారు. ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి ఉపాధ్యక్షులు శ్రీ మండలి బుద్ధ ప్రసాద్  ప్రారంభోపన్యాసం, కేంద్ర సాహిత్యా ఎకాడెమీ బహుమతి గ్రహీత “పద్మశ్రీ” యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్  కీలకోపన్యాసం చేయగా సుప్రసిద్ధ కవులు “సిరివెన్నెల “ సీతారామ శాస్త్రి, తనికెళ్ళ భరణి, జొన్నవిత్తుల, అశోక్ తేజ తమ అద్భుతమైన ప్రసంగాలతో ఈ సాహిత్య సభకి వన్నె తెచ్చారు. పౌరాణిక నటులు అక్కిరాజు సుందర రామకృష్ణ తన పద్యాలతో సభని రంజింప జేయగా, ఫ్రెంచ్ దేశీయుడైన డేనియల్ నేజేర్స్ తన దండక పఠనంతోనూ, సుప్రసిద్ధ అవధాని శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, పత్రికా సంపాదకురాలు కేతవరపు రాజ్యశ్రీ ఆసక్తికరమైన ప్రసంగాలు చేశారు. సినీ నటులు సునీల్, రాజా రవీంద్ర ప్రత్యేక ఆకర్షితులుగా నిలిచి సముచిత ప్రసంగాలు చేశారు. ఈ మహా సభలని ఇటీవల నిర్యాణం చెందిన బాపు గారికి అంకితం ఇస్తూ జరిగిన అంకిత సభలో వంగూరి చిట్టెన్ రాజు, తనికెళ్ళ భరణి, జొన్నవిత్తుల తమ అనుభవాలని పంచుకున్నారు. బాపు గారికి అంకితం ఇస్తూ ఈ మహా సభల సందర్భంగా వెలువరించిన సావనీర్, తనికెళ్ళ భరణి రచించిన “ప్యాసా” రాజ్యశ్రీ రచించిన “రెక్కల్లో గీతామృతం”, సుద్దాల అశోక్ తేజ కవితల ఆంగ్ల అనువాదాలు పుస్తకం, వడ్డేపల్లి కృష్ణ గారి గేయాల సీడీ మరియు ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి అధ్యక్షులు శ్రీ ఎ. చక్రపాణి గారి కుమార్తె నీరజ రేగుల రచించిన “మై డాడ్” అనే పుస్తకం ఉప ముఖ్యమంత్రి శ్రీ కే.ఇ. కృష్ణమూర్తి గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడ్డాయి. ఆచార్య కొలకలూరి ఇనాక్ తొలి ప్రతులని అందుకున్నారు.
స్వీయ రచనా పఠనం విభాగంలో డా. వ్యాకరణం అచ్యుత రామారావు, దివాకర్ అడ్డాల మొదలైన వారు పాల్గొనగా ఈ మొదటి రోజు సమావేశాన్ని అమెరికాలోని హ్యూస్టన్ నగరం నుంచి వచ్చిన వంగూరి చిట్టెన్ రాజు, యునైటెడ్ కింగ్డం వాస్తవ్యులు డా. మాదిన రామకృష్ణ, డా. వెలగపూడి బాపూజీ రావు, కృష్ణ యలమంచి వేదిక నిర్వహణ బాధ్యతలని చేపట్టారు. “యుక్త” సంస్థ అధ్యక్షులు శ్రీ జయకుమార్ గుంటుపల్లి స్వాగత వచనాలు పలికారు.  శ్రీ కిల్లి సత్య ప్రసాద్, పద్మ , నరేంద్ర మొదలైన వారు తెర వెనుక ఎంతో శ్రమ కోర్చి ఈ నాలుగవ ప్రపంచ సాహితీ సదస్సు తొలి రోజు విజయవంతంగా జరగడానికి ముఖ్య కారకులుగా అందరి ప్రశంసలనీ అందుకున్నారు.
ఈ తొలి సభా విశేషాల సుమారు వంద ఫోటోలూ ఈ క్రింద Fఅచె భూక్  లో చూడవచ్చును. కొన్ని ఇందుతో జతపరిచాం.
https://www.facebook.com/UK.TELUGU.ASSOCIATIO
సెప్టెంబర్ 28, 2014 ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 దాకా కొనసాగే రెండవ రోజు సదస్సులో అనేక సాహిత్య ప్రసంగాలూ, శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారి వారి “అచ్చ తెనుగు” అష్టావధానం జరుగుతాయి.
అవకాశమున్నవారు ఆ ఆనందాన్ని అందుకొనే సదవకాశం యిది.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.