గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, మార్చి 2014, శనివారం

ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భముగా మహిళామణులందరికీ శుభాకాంక్షలు.

జైశ్రీరామ్.
ఆది పరాశక్తికి మారుగా సృష్టిని వర్ధిల్లఁ జేయుచున్న మాతృస్వరూపులైన స్త్రీమూర్తులందరికీ త్రికరణ శుద్ధిగా వినమ్రుఁడనై నమస్కరిస్తున్నాను.
సృష్టి మూలమైన మీ స్త్రీ జాతి ఎంతవరకూ ఆనందంతో భూమిపై ఉంటుందో అంతవరకు భూమాత ఈ సృష్టిని కాపాడుతుంది. ఎప్పుడు ఎక్కడ స్త్రీ అవమానాలపాలైతే అప్పుడు అక్కడ అనర్థాలు పుట్టుకువచ్చి సమూలంగా నాశనం చేసెస్తాయి.
మంగళ భావనాసుందర హృన్మందిరులైన స్త్రీ మూర్తులందరూ చిరంతరానంద సందోహ సుందర ముఖారవిదులై జగన్మాతలకు ప్రతిరూపాలుగా నిరంతరం వెలుగొందుచుండాలని మనసారా కోరుకొంటున్నాను.

మీ కొఱకై ఆ జగన్మాతలకు నా విన్నపము.

అమ్మా! శారద!శాంభవీ! హరిప్రియా! ఆందోళిత స్వాంతులై
సమ్మానింప మెలంగునట్టి మములన్ జంపంగ నుంకించుచున్
దమ్ముళ్ళన్నలు తండ్రి, బంధు దురితుల్ దౌష్ట్యంబుచేఁ బైకొనన్
మమ్ముంగావఁగ నెవ్వరింక యనుచున్ మ్రాన్ జెందు స్త్రీల్, కానరే!

మీ మహనీయ శక్తియును, మీ సహనంబు, దయార్ద్ర చిత్తమున్,
బ్రేమను, భక్తి తత్వమును, శ్రీకర వాగ్రమణీయ దీప్తియున్,
ధీమహితోజ్వలత్ప్రతిభ తీరుగ కల్పనఁ జేసి, ధార్తిపై
ప్రేమకు మారు రూపముగ స్త్రీల సృజించిరి మీరు. కావరే?

స్త్రీ జాతిన్ గని యేలరమ్మ మహిమన్? స్త్రీ జాతిపై దుర్మతుల్
ప్రాజాపత్యముఁ జూపుచున్, దురితులై బాధించుచున్, చంపుచున్,
నైజంబున్ వెలయించుచుండ్రి. కనరే! నశ్యంబుఁగాన్ జేయరే!
మీ జాతిన్ గని మీరె కాచిన భువిన్ మేలౌను స్త్రీ జాతికిన్.

                                                     यत्र नार्यस्तु पूज्यंतॆ रमंतॆ तत्र दॆवताः
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
మహిళా సంవత్సర సందర్భముగా పద్యములు శ్లాఘ నీయము
ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.