జైశ్రీరాం. ఆర్యులారా! మనది అనుకొన్న తెలుగు తేజం క్రమేణా క్షీణిస్తోందన్న విషయంలో తెలుగువారి హృదయాలను కలత పడుతున్న మాట వాస్తవం.అందునా తెలుగు పద్యము మరీ నిరాదరణకు లోనౌతోంది. ఈ విషయమై కలత చెందుతున్న మహనీయులు చాలా ఆలోచించి, ఏదో ఒకటి చేయాలి, మన తెలుగు పద్యం పూర్వ వైభవాన్ని పొందాలి అనే ఆలోచనతో నిన్న సాయంత్రం శ్రీ వేము భీమేశంకరం గారి సాహితీ పీఠంలో ఒక చర్చావేదిక నిర్వహించారు. ఆంధ్ర భూమి సంపాదకులు శ్రీ ఎం.వి.ఆర్.శాస్త్రి, భక్తి టీవీ కి సంబంధించిన శ్రీ ఎం.వి.ఆర్.శర్మ, తెలుగు విశ్వ విద్యాలయం మాజీ ఉప కులపతి శ్రీ అనుమాండ్ల భూమయ్య, డా.బీ.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయం విశ్రాంత తెలుగు ఆచార్యులు శ్రీ రావికంటి వసునందన్, శ్రీ రాపాక ఏకాంబరాచారి, శ్రీ వేము భీమశంకరం, శ్రీ సాధన నరసింహాచార్యులు, ఆచార్య ఫణీంద్ర, ఇంకా పెక్కుమంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.నేను కూడా ఈ సభలో పాల్గొన్నాను.
పాల్గొన్నవారందరూ తెలుగు భాషాభివృద్ధికై అనేకమైన సూచనలు చేశారు.పద్య రచనలో సామాజిక స్పృహ పెంపొందించుకొనుట, బాల బాలికలకు మనోరంజకంగా ఉండే విధమైన పద్యాల పఠనములో శిక్షణ నిచ్చుట, టీవీ కార్యక్రమములలో తెలుగు పద్యములతో కూడిన కార్యక్రమాలను రూపొందించుట, ఆ కార్యక్రమములద్వారా విద్యార్థులలో తెలుగు పద్యముపై మక్కువ కలిగించుట, నెలకొకమారైనా సమావేశమై అభివృద్ధిని సమీక్షించుట, ఇత్యాదిగా అనేకమైన సూచనలు చేసియున్నారు.
అందు వేము భీమశంకరంగారి అభిప్రాయం లిఖిత పూర్వకంగా అందజేసినారు అది మీ ముందుంచుతున్నాను.
మీ అమూల్యమై న అభిప్రాయాలను కూడా తెలియజేయగలరు.
జైహింద్.