గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, డిసెంబర్ 2013, బుధవారం

ఓం భద్రం కర్ణేభి: శృణుయామ దేవా (మేలిమి బంగారం మన సంస్కృతి)

జైశ్రీరామ్.
ఆర్యులారా!మంచి భావన మనకున్నట్లైతే అది మన మంచి నడవడికి మూలమౌతుంది. మంచి నడవడి మనకున్నట్లైతే అది మన మంచి జీవనానికి హేతువౌతుంది. తద్వారా మన జీవితము ఆనందమయమౌతుంది. కాబట్టి మనము మంచెని ప్రసాదించమని, మనలను మంచిగా నడిపించమని మహనీయులైన దేవతలను ప్రార్థించవలసిన అవసరముంది. ఈ ప్రార్థనను మనం చేస్తున్నాము. ఐతే ఆ విషయం మనకు తెలియకపోవుట బాధాకరం.
మన గృహాలలో శుభకార్యాలు జరిపించే సందర్భాలలో మన బ్రాహ్మణులు తత్సంబంధమైన వేద మంత్రాలను పఠించడం మనం వింటుంటాము. ఐతే వాటి అర్థం తెలియని కారణంగా మనం గ్రహించ లేకపోతున్నామంతే.
ముణ్డకోపనిషత్ ఏమి చెప్పుతోందో చూడండి
ఓం భద్రం కర్ణేభి: శృణుయామ దేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రా: | స్థిరైరఙ్గైస్తుష్టువా సస్తనూభి- ర్వ్యశేమ దేవహితం యదాయు:||
భావము:- ఓం! దేవతలారా! మేమెల్లప్పుడు పవిత్ర శబ్దములనే వినుచుందుము గాక;
యజ్ఞాది సత్కర్మలనాచరించుచు పవిత్రమైన వస్తువులనే కనులతో కనుచుందుము గాక;
దృఢమైన మా శరీరములను దైవ సంకీర్తనకు నియోగించు
మేము దేవతలకు ప్రీతికరమైన జీవనమునానందింతుము గాక.
శా:-ఓంకారాశ్రిత దివ్యులార! వినగానొప్పారు సచ్ఛబ్దముల్,
ఓంకారాశ్రిత యజ్ఞకర్తల వగా, ఓంకారరూపున్ గనన్,
ఓంకారాశ్రితమైన దేహములమే మోంకారునే గొల్వగా,
ఓంకారాశ్రిత దేవతా హితముగా నొప్పారగాఁ జేయరే!
స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవా: | స్వస్తి న: పూషా విశ్వవెదా: | స్వస్తి నస్తార్ క్ష్యో అరిష్టనేమి: స్వస్తి నో బృహస్పతిర్దధాతు ||
భావము:- ఇంద్రదేవుడు మమ్ము పవిత్రీకరించుగాక. అతి సంపన్నుడగు పూష (పృథ్వి) భగవానుడు మాకు సంపదలనొసగు గాక. పాపనాశకుడగు గరుడ భగవానుడు మా పట్ల ప్రసన్నుడగుగాక. బృహస్పతి మా సంక్షేమమును సదా పర్యవేక్షించుచుండును గాక.
గీ:-మము పవిత్రులఁ జేయుత సుమతి యింద్రుఁ
డమర సంపద పూషచేనమరు గాత.
సన్నుతుఁడు గరుఁడుడుసు ప్రసన్నుడగుత     
ప్రేమగ బృహస్పతిమనదు క్షేమముఁ గను.
గుర్తుకు తెచ్చుకోండి. ఈ వేద వచనాలు మనం వింటున్నవే కదా! మరి వాటి అర్థం తెలిస్తే మన భావన స్పష్టంగా ఉంటుందికదా! అందుకే మీదృష్టికి తీసుకు వస్తే ప్రయోజనకరంగా ఉంటుందని ఇక్కడ మీ ముందుంచాను.
జైహింద్. 
Print this post

3 comments:

సురేష్ బాబు చెప్పారు...

తెల్లవారుఝామున లేచినవెంటనే ఇలాంటి పవిత్ర భావాలు గల శ్లోకాలు అర్థసహితంగా గుర్తుతెచ్చుకొంటే "లోకాస్సమస్తా సుఖినోభవంతు" అన్న వేదవచనం వాస్తవం కావడానికి దారి సుగమం అవుతుంది.

R. Sudhakar చెప్పారు...

ప్రతిరోజు ఉదయాన్నే అర్థం తెలిసిన మంచి శ్లోకములను పఠించడము వలన ఆనందంగా మరియు ఉత్సాహంగా మన పనులను మనం
నిర్వర్తించ గలము.ధన్య వాదములు

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

సుధాకర్ గారూ! ధన్యవాదములండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.