గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, జూన్ 2013, బుధవారం

డా.మాడుగుల నాగ ఫణి శర్మగారిచే చేయబడిన సప్తోత్తరద్విశతావధానము.

జైశ్రీరామ్
సాహితీ ప్రియ బంధువులారా!
శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ మరుయు తిరుమల తిరుపతి దేవస్థానముల వారి సహాయ సహకారములతో, మరియు శ్రీ గాయత్రీబ్రాహ్మణ సంఘములో ముఖ్యులైన శ్రీ వేదుల ప్రభాకరశర్మగారి వితరణతో 30-5-2013 నుండి 03-6-2013 వరకుబర్కత్పురలో గల అవధాన సరస్వతీ పీఠమున  బ్రహ్మశ్రీ మాడుగుల నాగ ఫణిశర్మ గారు సప్తోత్తరద్విశతావధానమును చేసి ఆహుతులను అలరింపజేశారు.40సమస్యాపూరణములు40దత్తపదులు40ఆశువులు.40వర్ణనలు.40 అనువాదములు, ఇంకా అప్రస్తుత ప్రసంగము, నిషిద్ధాక్షరి మున్నగు అంశములతో పృచ్ఛకాళి అవధానిపై ప్రశ్నలు సధించుచుండగా అతి తక్కువ వ్యవధిలోనే వారికి ఆవృత్తికి రెండు పాదములు చెప్పి, పూరణానంతరము ధారణము చేసి ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యములలో ముంచెత్తారు.
ఈ కార్యక్రమమును చెన్నై గవర్నర్ శ్రీ రోశయ్యగారు అడిగిన ప్రశ్నతో ప్రారంభమైంది. 
హస్తినా పురమునుండి సంస్కృత మహా పండితులు వశిష్టగారు వెచ్చేసిఆద్యంతము సమయోచితమైన సంస్కృత సంభాషణముచేసి చాల సరళమైన భాష సంస్కృతము అని ఋజువు చేశారు.
నేను  దత్తపది పృచ్ఛకునిగా వ్యవహరించాను.
దత్త పద పృచ్ఛకునిగా నేనొసగిన అంశము.
౧)సరసము
౨)విరసము.
౩)కలుషము.
౪)పరుషము.
అను పదములతో 
అవధాన సరస్వతీ దరహాస చంద్రికా శోభను వర్ణించండి.
వారి పూరణము.
ఉత్పల మాలలో సరసముప్పతిలంగ మనోహరంబుగా
సత్పద వేదియై పరుష శబ్దములే సరళంబులై చనున్.
తత్పరమార్థ పీఠ యవధానమునం కలుషంబదేది? ధీ
మత్పరిపుష్ట కార్యమును మంజుల బావి రసంబు లూరగా.
వీరి పూరణమును విని సరసులైన కవిపండితులు కరతాళ ధ్వనులతో ప్రశంసించారు.
దూరదర్శన్ కళాకారులైన కామేశ్వరరావుగారు అవధానిగారితో చేసిన అప్రస్తుతప్రసంగము ఆద్యంతము ప్రేక్షకులను అలరింపచేసింది.
అవధానమున పూరణలు పూర్తి అయిన పిదప అవధానిగారి ధారణా పటిమ అందరినీ అబ్బురపరచింది.
అవధానికి సన్మానము ఘనంగా జరిగింది.
ముగింపు కార్యక్రమమునకు తెలుగు భాషా సంఘ అధ్యక్షులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ విచ్చేసి, అవధానిగారిపై ప్రశ్నలు సంధించి వారి సమాధానమునకు అబ్బురపడి వారిని ప్రశంసించారు.
తదనంతరము పృచ్ఛకులు తమ అభిప్రాయములను తెలుపుతూ అవధానిగారిని ప్రశంసలలో ముంచెత్తారు.
నేను అవధానిగారికి గల సాహితీ వైదుషితోపాటు సంగీతము, నాట్యశాస్త్రాభినివేశములు అంతర్లీనముగా ఉన్న విషయమ్య్ని ప్రత్యక్షముగా తెలియజేయు భావనతో కందము గీతము అంతర్లీనముగా గల చంపకమాలను వారికి అలంకరించుటద్వారా కవిపండితలోకముచే ప్రశంసితుఁడనైనాను.
కందగీత- గర్భ చంపక మాల.
తను పసి కాంతులన్ సదవధాన సరస్వతి, సౌమ్యు గాంచనా!
తను కనినన్ సుధామధుర ధారల పద్య సుమాలు విచ్చుగా!
ఘన ధిషణా నిధుల్, ఘనత గాంచి సమున్నతి కల్గు గాదె!శ్రీ
వినుత కవీ! లసత్ సరస విజ్ఞుఁడ! మాడ్గుల సత్ కవీ! శశీ!
చంపక మాల గర్భస్థ కందము.
పసి కాంతులన్ సదవధా
న సరస్వతి, సౌమ్యు గాంచనా!తను కనినన్ 
ధిషణా నిధుల్, ఘనత గాం
చి సమున్నతి కల్గు గాదె!శ్రీవినుత కవీ!
చంపక మాల గర్భస్థ గీతము.
సదవధాన సరస్వతి, సౌమ్యు గాంచ!
మధుర ధారల పద్య సుమాలు విచ్చు!
ఘనత గాంచి సమున్నతి కల్గు గాదె!
సరస విజ్ఞుఁడ! మాడ్గుల సత్ కవీశ!
తదనంతరము అవధాని శ్రీ నాగఫణిశర్మగారు పృచ్ఛకాళిని ఘనంగా సత్కరించారు.
సభ మంగళప్రదముగా పరిపూర్ణమైంది.
ఈ కార్యక్రమములో పాల్గొనుట పురాకృత సుకృతవిశేషముగా భావిస్తున్నాను. ఈ అవకాశము కలిగించినవారికందరికీ,  శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్వారికి నా ధన్యవాదములు తెలియజేసుకొనుచున్నాను.
ఈ కార్యక్రమమునకు సంబంధించిన చిత్రములను త్వరలో సేకరించి మీముందుంచే ప్రయత్నము చేయగలను.
నమస్తే.
జైహింద్.
Print this post

4 comments:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

అద్భుతం!
వీక్షించ గలిగిన వారు అదృష్ట వంతులు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఛానల్ భాగస్తులైనారంటే వీలు వెంబడి ఏ పుణ్యదినాల్లోనో ప్రసారం చేయబోతున్నారని ఆశిస్తున్నాను.

కందుల వర ప్రసాద్ చెప్పారు...

అద్భుతమైన లింక్ ను మాకందించిన శ్రీ లక్ష్మీ దేవి గారికి ధన్యవాదములు.
శ్రీ చింతా రామ కృష్ణా రావు గారు మీ కంద - గీత - గర్భ - చంపక మాల,బ్రహ్మశ్రీ మాడుగుల నాగ ఫణిశర్మ గారి కొక అద్భుతమైన కానుక.
మీ తదుపరి వివరణలకై వేచి యుంటిమి
పునః ప్రసారము మీకు ముందుగా తెలిసిన మాకు తెలియ జేయగలరు

మన తెలుగు చెప్పారు...

శ్రీ చింతావారికి నమస్సులు. ఈ కార్యక్రమం SVBC చానెల్లో ఎప్పుడు ప్రసారమవుతుందో తెలియజేయగలరా?

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

అవధాన సరస్వతి శ్రీ నాగఫణి శర్మ గారి అవధానం లో పాల్గొన గలిగిన శ్రీ చింతా వారు ధన్యులు .మాకందిం చినందుకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.