గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, జూన్ 2013, శుక్రవారం

కవివతంస శ్రీ బులుసు వేంకటేశ్వర్లు రచించిన శివాలాపము 71 నుండి 80. 8వ భాగము.

జైశ్రీరామ్.
జ్ఞానామృత పాన లోలులారా! కవివతంస బిరుదాంకితులు శ్రీ బులుసు వేంకటేశ్వర్లు కవి కృత శివాలాపము నారికేళ పాకమో, కదళీ పాకమో, ద్రాక్షాపాకమో చదివి మీరే నిర్ణయించండి. తాను విద్యార్థిగా ఉన్న రోజులలోనే ఈ శివాలాపము  రచన చేసిన సుకవి
 శ్రీ బులుసు వేంకటేశ్వర్లు.
ఇక చవిచూడండి ఈ శివాలాపము 8వ భాగాన్ని. నమస్తే.
శా:- జీర్ణారణ్య పథమ్మున న్నిలువ పెంజీకట్లు కప్పం భయో
ద్గూర్ణంబౌ హృదయంబు తల్లడిల యోహో స్వామి! విశ్వ ప్రభూ
వర్ణింతున్ భవదీయ తత్వమును నిర్ద్వంద్వంబుగా, యోగిరాట్
పూర్ణానంద హృదంతర స్థిత ప్రభా మోహైక దీపా! శివా! 71.

శా:-  గూఢంబై చను శైశరానిల మహా క్రోద్శాగ్నికిం బత్ర ని
ర్వ్యూఢ శ్రీ మధు మాస దివ్య కళలం  బోకార్చు వృక్షంబునై
మూఢత్వంబున నిల్చి యుంటి నిదె సమ్మోదంబు పండించి నీ
గాఢ ప్రేమ వసంత వీచి నెదలోఁ గల్పింపవయ్యా!  శివా! 72.

శా:- రావయ్యా రజతాద్రి వాస ఇది మర్యాదా? మదిన్నిన్నె సం
భావింతు న్నిరతంబుఁ గోరుటకు  మోమోటంబు నీ వద్దనే
లా? వాంఛించితినా మహా ధనములన్ లక్షోపలక్షల్? భవత్
సేవా భాగ్య ఫలమ్ము, మోక్ష పదవిన్ జింతింతు నింతే. శివా! 73.

శా:- ఈ దంపుళ్ళివి యింత నెందులకు కానీ యొక్కటే మాట, తం
డ్రీ! దాక్షిణ్య నిధీ! యిదే వినుము దారిద్ర్యమ్ము బంధింపుమా!
లేదా దుఃఖ విమోహ కోప పదవుల్ లేనట్టి కైలాసమం
దేదో మూల వసింపనిమ్ము నను. నాకేదైన చాలున్ శివా! 74.

శా:- వీడుం జూడగ ఠింగణా మదిని భావింపంగ వైరాగ్యపుం
జాడల్ తోచును పైపయిం బలుకులే చాల్చాలునంచున్ ననున్
వీడం బోకు పరీక్షపెట్టుమిదె. రావే కష్టముల్ నష్టముల్?.
తాడో పేడొ నిజంబు తేలవలె గాదా!  తేల్చవయ్యా! శివా! 75.

శా:- నా బాబూ! నమకమ్ము నేర్చునపుడుం భావింప గ్రుడ్డెద్దు చే
లో బడ్డట్లుగ సంత చెప్పితిని, యాలో వెల్గు తత్వంబు ధా
రా బాహుళ్యము గ్రోలగాఁ దలచి, యౌరా! లౌక్య కార్యంబు లి
ట్టే బంధిపఁగ బోనులో నెలుకయట్లే చిక్కి నిల్తున్, శివా! 76.

శా:- ఎన్నో సత్కళ లన్ని సత్కళల కీవే మూల కందమ్మువౌ
యెన్నో మార్గము లన్ని మార్గముల కీవే గమ్యమం చెంచుచున్
నిన్నున్ మంజుల భావ వీచికల రాణింపంగ శయ్యా సము
త్పన్నప్రాభవ సత్ కవిత్వమున సంభావింతునయ్యా! శివా! 77.

శా:- నేత్రంబుల్ విడు సమ్మదాశ్రులు హిమానీ శైత్యమై గుండెపై
చైత్రశ్రీ మధు ధార వోలె కురియున్ స్వామీ! భవ ద్దర్శన
స్తోత్రంబుల్ ఘటియించువేళ నెడదం దూగాడు వైరాగ్యపుం
జిత్రార్చిస్సులు, పుల్కరింత లొడలం జెన్నొందునయ్యా! శివా! 78.

శా:- నీవే తండ్రి మదంతరాంతముల సందీపింతువెల్లప్ప్డు  నీ
పై విశ్వాసము శుక్ల పక్ష కళయై పాటిల్లు డెందమ్మునన్.
నీవుం జిక్కియు జిక్కనట్లుగను కన్పింతోయి, దొంగాటల
య్యా! వారింపుము, పఱ్వఁ జాల నిక నాయాసమ్ము వచ్చున్ శివా! 79.

శా:- గుండెం జీల్చెడు నట్టివౌ వ్యధలు రేగున్ దుచ్ఛ కామమ్ములన్
బండింపం జను, మోహముల్ హృదయముం బంధించు. నా స్వామి నీ
యండం జూచియె కత్తి నెత్తితిని, మోహ క్రోధ కామమ్ములన్
ఖండింపన్ విజయుండఁ జేసెదవొ నన్ కారుణ్య దృష్టిన్? శివా! 80.
(సశేషం)
జైహింద్. 
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.