గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, జూన్ 2013, బుధవారం

కవివతంస శ్రీ బులుసు వేంకటేశ్వర్లు రచించిన శివాలాపము 51 నుండి 60. 6వ భాగము.

 జైశ్రీరామ్.
జ్ఞానామృత పాన లోలులారా! కవివతంస బిరుదాంకితులు శ్రీ బులుసు వేంకటేశ్వర్లు కవి కృత శివాలాపము నారికేళ పాకమో, కదళీ పాకమో, ద్రాక్షాపాకమో చదివి మీరే నిర్ణయించండి. తాను విద్యార్థిగా ఉన్న రోజులలోనే ఈ శివాలాపము  రచన చేసిన సుకవి
 శ్రీ బులుసు వేంకటేశ్వర్లు.
ఇక చవిచూడండి ఈ శివాలాపము 6వభాగాన్ని. నమస్తే.
శివాలాపము.  51 నుండి 60.
శా:- శ్రేయో భాగ్య ధురంధరమ్ము సకల శ్రీవాసమున్ ముక్తి కాం
తా యోగామల భాసమున్ విదిత నానా దుఃఖ నిర్వాపమున్
భూయోభూయ పునః పునర్భవ దశా ప్రోత్థామ నాశంబులున్
మాయా రక్షణలై చెలంగును భవన్మాహాత్మ్య లీలల్, శివా! 51.

శా:- మౌళిం బూవులనుంచఁ గంధరమునన్మల్లీ సరంబుంచగా
లీలం భూతి నిటాలమందలుమఁ గల్పింపంగ శ్రీ గంధమున్
కేళీ లోల! వియఝ్ఝరంబు భయదక్ష్వేళోగ్రమౌ సర్పమున్
వైలక్షణ్యపుఁ గన్ను, పచ్చి పులితోల్, నన్నడ్డునయ్యా! శివా! 52.

శా:- నీవే మత్ హృదయాంతరంబునను సందీపించి యీ స్తోత్రముం
భావింపం బురి గొల్పినాఁడవు, భవన్మాహాత్మ్య మీరీతి నా
పై వర్షించి విచంచలాత్ముఁడగు నన్ బంధించి నాకిట్లు నీ
సేవా భాగ్యము నందఁ జేసితి.  నతుల్ చెల్లింతు లక్షల్, శివా! 53.

శా:- యోగాభ్యాసము లేదు ధూర్జటి వలెన్, ఓంకార నాదైక వి
ద్యా గాంభీర్యము లేదు సోమన వలెన్, తాదాత్మ్య భావప్రసూ
రాగం బింతయు లేదు పోతన వలెన్, రక్షింపవే తన్మహా
భాగుల్ తీసిన త్రోవ కెక్కితిని యప్పా! నడ్పవయ్యా! శివా! 54.

శా:- ఈ వైరాగ్యమిదెన్ని జన్మముల తండ్రీ నన్ను వెంటాడునో?
ఈవే దిక్కని యన్ని జన్మముల తండ్రీ! నిన్నె వెంటాడెదన్.
నీవే నేనని, నేనె నీవని పురా నిర్ణీతమద్వైత భా
వావిర్భూత మమత్వ బంధనల దేవా, సాగెదయ్యా! శివా! 55.

శా:- బీటల్ విచ్చిన పంట చేను గతిఁ గన్పించున్ మహా గర్వ గ్రీ
ష్మాటోపంబున నిష్ఫలంబగునొ! దేవా, నాదు పెంపెల్ల త్వ
జ్జాటాంతర్ ప్రవినిశ్రుతామర ధునీ సంభార ధారా నిరా
ఘాటైక క్రమ సత్కృపం దడుప సంకల్పింపవయ్యా! శివా! 56.

శా:- నిద్రాహారము మాని వ్రాసితిని తండ్రీ! దీని నొక్కూపునన్
భద్రాత్ముండవు భక్త రక్షణ కళా ప్రాభాసిత స్ఫార చి
న్ముద్ర స్వామివి. దీనిఁ జేకొనుము. మన్మూఢ ప్రసంగంబులన్
నిద్రం బాలుని తొక్కు పల్కులుగ మన్నింపంగ రావే! శివా! 57.

శా:- స్వర్ఘంటా పథ పాంధ భవమున నాశల్ లేని నాపైన యీ
నైర్ఘృణ్యంబు వహింప నాయమొకొ? నానా భక్త కామ్యార్త చిం
తార్ఘంబుల్ గ్రహియించు సామివి. కృపానంతార్ద్ర భావాన మ
న్నిర్ఘోషల్ చెవిఁ బెట్టి సుంత దయ రానీ, చాలునయ్యా! శివా! 58.

శా:- నీకున్ వాహనమైన నందికిని తండ్రీ మాకు సౌభ్రాతృత
శ్లోకోదంచిత బాంధవమ్ము గల దెట్లో తెల్పుదున్. మోహ వాం
ఛా కామమ్ములు కొమ్ములైన పశు సంస్కారమ్ముమాయందు ని
త్యా! కన్పించెడు, నార్పవే పశు పతీ! తద్ఘోర బాధల్ శివా! 59.

శా:- క్పంబుల్, కొఱగాని కామములు, సాకూతాలు, మిధ్యా పటా
టోపంబుల్, మరి మెచ్చుకోళ్ళు,  బహు మర్యాదల్, వృధా జీవ యా
త్రాపథ్యాగత రంగమందు నటనన్, రంజింపగా నాట్య వి
ద్యా పారీణత లేని నా బ్రతుకు నెట్లాడింతు వయ్యా! శివా! 60.

(సశేషం)
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.