గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, జూన్ 2013, మంగళవారం

ఎంతటి ఘోర విపత్తు!!! శివ శివా!!! తప్పెవరిది? శిక్షెవరికి?

శివ శివా!
అమ్మా! గంగమ్మ తల్లీ! ఇదేమాగ్రహమమ్మా నీకు? తప్పెవరిది? నీవు వేసిన శిక్షెవరికి?
హర హర! శంకరా! యనుచు హారతి పట్టగ నీకు నంబకున్
పరువిడి వచ్చి, భక్తతతి బాధల కోర్చి శ్రమించి నీ దయా
వరము గ్రహింప చూచు నిజ భక్తులకేమి యొసంగినావు? సు
స్థిరముగ నీ హృదాబ్జమున చేర్చఁగ గంగను పొంగఁ జేసితో?

ప్రాణము నిల్పు గంగ పొరపాటున పొంగిన పొంగ వచ్చు. నీ
ప్రాణ సమాన భక్తులను, భాగ్యమె నీవుగ నెంచు వారలన్,
దీన శరణ్య! కావుమని దీనముగా నిను కోరు వారలన్
గానక, ప్రాణ భీతులయి కానల పర్వుడఁ జేసితే? శివా!?

అమ్మా! గంగమ్మ తల్లీ!
పాపులకైన ముక్తినిడు పావనివీవని భక్తులెల్ల నీ
ప్రాపును కోరి వచ్చితిరి. భావ్యమె వారిని ముంచుటిట్టు? లే
పాప మెఱుంగనట్టి పసి పాపలు, వృద్ధులు, మాతృ మూర్తులున్
శాప ఫలంబు చేకొనిన చందమునన్ నిను చేరి పోయిరే!

ఏ దేవీ కుపితాగ్ని ఘోర కలియై యీశున్నిన్నునిర్జించెనో?
బాధాతప్తులఁ జేసి భక్తులను, సంభారాళితో ముంచెనో?
మేధావుల్, మహనీయ సాధు జనులున్, మేల్ చేయు దైవంబులున్,
నీ దారిన్ నిలువంగ నేరక వ్యధన్ నీలో లీనమై పోయిరే!

ఏమిటి నీ ప్రవాహ గతి? ఏమిటి నీయురకల్? జనంబు నీ
భూమిని, గ్రామ సీమలను, ముంచుచు ముందుకు సాగితేమి? మా
క్షేమము గూర్చు శంకరుని శీర్షముపై చెలువొందు నీవు నే
డేమిటికిట్లు చేసితివి? ఎంతటి పాపము కట్టుకొంటివో?

భక్తిగ తీర్థయాత్రలకు పర్విడి వచ్చిన భక్త కోటికిన్
భుక్తిని పాడు చేసితివి.పుట్టములన్ గొని పోయినావు. నీ
శక్తికి తాళ లేక కడు సంభ్రమమున్ వనపాళి జిక్కిరే?
భక్తుల భక్తి భావములు బాపగ చూచుట నీకు న్యాయమా?

ఇంకెప్పుడూ ఇలా భక్తులపై నీ ప్రతాపము చూపకు తల్లీ!
ఈ ఉపద్రవములో ప్రాణములు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతిని ప్రసాదించుగాక అని ఆ సదాశివుని వేడుకొంటూ వారి వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకొంటున్నాను.
శివ శివా!
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.